ఆంధ్రప్రదేశ్ అటవీశాఖ ఉద్యోగాల పరీక్ష స్పెషల్

జీకే సవాల్‌ అందుకునేదెలా?
మహాసముద్రంలాంటి జనరల్ నాలెడ్జ్ ని ప్రిపేర్ కావడం కత్తి మీద సాము లాంటిదే.

Read more

అటవీశాఖ పరీక్షకు తుది సన్నద్ధత ఎలా?
తుది సన్నద్ధతలో పునశ్చరణతోపాటు పాటించాల్సిన మెలకువలు, జాగ్రత్తలు

Read more

అటవీ కొలువు... ఎంతో సులువు !

* పోలీస్‌ 'మార్క్‌' ఉద్యోగాలతో అభ్యర్థుల్లో ఆశలు
* తక్కువ విద్యార్హతలతో అవకాశాలు
జనారణ్యంలో, కాలుష్యపరిసరాల్లో అందరిలాగా విధులు నిర్వహించటం కొందరికి ఇష్టం ఉండదు. ఇలాంటివారు ప్రకృతి ఒడిలో ఉద్యోగం చేసుకునే అవకాశాన్ని అటవీశాఖ కల్పిస్తోంది. త్వరలో నిర్వహించే నియామక రాతపరీక్షలో ప్రతిభ చూపితే అది సాధ్యమవుతుంది. అందుకు వ్యూహాత్మకంగా ఎలా సంసిద్ధం కావాలో, ఏ మెలకువలు పాటించాలో తెలుసుకుందాం!
పర్యావరణానికీ, సహజ వనరులకూ నిలయాలైన అడవుల పరిరక్షణ కోసం వివిధ రాష్ట్రప్రభుత్వాల్లో శాఖలున్నాయి. మన రాష్ట్రంలో అడవుల సంరక్షణ, విస్తరణ, నిర్వహణ బాధ్యతలను అటవీశాఖ నిర్వర్తిస్తోంది. రాష్ట్రంలోని మొత్తం అటవీ ప్రాంతాన్ని 12 ప్రాంతీయ (టెరిటోరియల్‌) సర్కిళ్ళు, 43 డివిజన్లుగా విభజించారు.
వీటిలో ఫారెస్ట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌కు బోటనీ/ ఫారెస్ట్రీ/ హార్టికల్చర్‌/ జువాలజీ/ ఫిజిక్స్‌/ కెమిస్ట్రీ/ మేథమేటిక్స్‌/ స్టాటిస్టిక్స్‌/ జియాలజీ/ అగ్రికల్చర్‌లో డిగ్రీ పాసై ఉండాలి. (లేదా)
కెమికల్‌/ మెకానికల్‌/ సివిల్‌ ఇంజినీరింగ్‌ల్లో డిగ్రీ పాసై ఉండాలి.
ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్‌ పోస్టులకు ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణత అవసరం. అసిస్టెంట్‌ బీట్‌ ఆఫీసర్‌, బంగ్లా వాచర్‌, థానాదార్‌ పోస్టులకు పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. టెక్నికల్‌ అసిస్టెంట్‌ పోస్టులకు డ్రాఫ్ట్‌మెన్‌ (సివిల్‌) ట్రేడ్‌ అంటే ఐటీఐ/ దీనికి సమాన పరీక్ష పాసై ఉండాలి.
ఈ పోస్టుల్లో ఎక్కువమంది దరఖాస్తు చేస్తున్న పోస్టులు ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్‌, ఫారెస్ట్‌ అసిస్టెంట్‌ బీట్‌ ఆఫీసర్‌. మిగిలినవాటితో పోల్చుకుంటే ఈ రెండు పోస్టులే ఎక్కువ. ఇంటర్‌, పదోతరగతి అర్హతతోనే దరఖాస్తు చేసుకోగలగటం మరో కారణం.
                   
* పరీక్ష విధానం
ఈ పోస్టులకు పరీక్ష విధానం రెండు దశల్లో ఉంటుంది. అవి: 1. రాతపరీక్ష 2. వాకింగ్‌ టెస్ట్‌, మెడికల్‌ ఎగ్జామినేషన్‌
రాతపరీక్ష టెక్నికల్‌ అసిస్టెంట్‌ మినహా మిగిలిన అన్ని పోస్టులకూ ఈ విధంగా ఉంటుంది. మొత్తం మూడు పేపర్లుంటాయి.
పేపర్‌-1: జనరల్‌ ఎస్సే : ఈ పేపర్‌లో ఇచ్చిన మూడు అంశాల్లో ఏదైనా ఒక అంశంపై 250 పదాలతో వ్యాసం రాయాలి. మార్కులు- 20, సమయం- 60 నిమిషాలు
పేపర్‌-2: జనరల్‌ నాలెడ్జ్‌ : ఈ పేపర్‌లో వివిధ విభాగాల నుంచి 50 ప్రశ్నలుంటాయి. ప్రతి ప్రశ్నకూ 2 మార్కులు. మొత్తం మార్కులు 100, సమయం- 90 నిమిషాలు.
పేపర్‌-3: జనరల్‌ మేథమేటిక్స్‌ : ఈ పేపర్‌లో 50 ప్రశ్నలుంటాయి. మొత్తం 100 మార్కులు, సమయం 90 నిమిషాలు.
టెక్నికల్‌ అసిస్టెంటు పోస్టుకు పేపర్‌-1గా జనరల్‌ ఎస్సే స్థానంలో డ్రాఫ్ట్‌మన్‌ (సివిల్‌) ట్రేడ్‌ పేపర్‌ ఉంటుంది. పేపర్‌- 2 జనరల్‌ నాలెడ్జ్‌, పేపర్‌- 3 జనరల్‌ మాథమేటిక్స్‌ ఇతర పోస్టులకు ఉన్న విధంగానే ఉంటాయి.
* ఇలా కావాలి సంసిద్ధం
ఈ పోస్టులకు రాత పరీక్ష ఏప్రిల్‌ మొదటి వారంలో జరిగే అవకాశముంది. అంటే 30- 40 రోజుల సమయమే ఉంది. ఈ తక్కువ సమయాన్ని గరిష్ఠంగా సద్వినియోగం చేసుకోవాలి.
2 మార్చి, 2014లోగా ఫీజు చెల్లించినవారు వ్యక్తిగత వివరాలతోపాటు అవసరమైన డాక్యుమెంట్లు అప్‌లోడ్‌ చేయడానికి చివరితేదీ: 3 మార్చి, 2014
పేపర్‌-1: జనరల్‌ ఎస్సే
ఇందులో పేపర్‌-1కు 250 పదాల్లో వ్యాసం రాయాలి. దీన్ని ఇంగ్లిష్‌/ తెలుగు/ ఉర్దూ భాషల్లో రాయవచ్చు. సరళమైన భాషలో తప్పులు లేకుండా వ్యాకరణయుక్తంగా రాయడం అలవరచుకోవాలి. చదివేవారికి సులభంగా అర్థమయ్యేవిధంగా (తెలుగులో రాసేవారు) తేటతెలుగు పదాలతో, చక్కటి నుడికారాలతో రాయడం సాధన చేయాలి. సందర్భోచితంగా జాతీయాలు, సామెతలను ఉపయోగించాలి.
సమకాలీన సమాజంలోని వివిధ అంశాలపట్ల అవగాహనతోపాటు విశ్లేషణతో సమస్యలకు పరిష్కారాలూ సూచించగలగాలి. సామాజిక, విజ్ఞానశాస్త్ర, రాజకీయ, ఆర్థికపరమైన ముఖ్యమైన వ్యాసాలు తయారు చేసుకోవాలి.
ఉదాహరణకు- పెరుగుతున్న ఉగ్రవాద ముప్పు, ఉచితవిద్య హక్కు, జనాభా పెరుగుదల, అవినీతి సమస్య మొదలైనవి. చక్కని శైలితో రాయడం అభ్యసించాలి. ప్రారంభం నుంచి ముగింపు వరకూ చెప్పదలచుకున్న విషయాలను క్రమపద్ధతిలో స్పష్టంగా వ్యక్తపరుస్తూ రాయాలి. రాస్తున్న అంశాన్ని విశ్లేషిస్తూ వివరించగలిగితే అత్యధిక మార్కులు సంపాదించవచ్చు. దీనికి విస్తృత పఠనంతోపాటు రాయడం సాధన చాలా అవసరం.
పేపర్‌-2: జనరల్‌ నాలెడ్జ్‌
దీన్నే జనరల్‌స్టడీస్‌ అనీ వ్యవహరిస్తారు. పోటీ పరీక్షల్లో- ముఖ్యంగా ఏపీపీఎస్‌సీ నిర్వహించే వివిధ పరీక్షల్లో జనరల్‌ స్టడీస్‌ సిలబస్‌, ఈ జనరల్‌ నాలెడ్జ్‌ సిలబస్‌ దాదాపు ఒకే విధంగా ఉంది. ఇందులో మొత్తం 6 విభాగాలు:
1. జనరల్‌సైన్స్‌ 2. వర్తమాన అంశాలు 3. భౌగోళిక వ్యవస్థ 4. భారతదేశ చరిత్ర 5. భారత రాజకీయ ఆర్థిక వ్యవస్థ 6. మెంటల్‌ ఎబిలిటీ
* జనరల్‌సైన్స్‌లో భాగంగా సమకాలీన శాస్త్ర, సాంకేతిక పరిణామాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. నూతన విజ్ఞాన ఆవిష్కరణలు, అంతరిక్ష ప్రయోగాలు వంటివి ముఖ్యం.
* వర్తమాన అంశాలకోసం- పరీక్ష జరిగే తేదీనాటికి కనీసం 6 నెలల ముందు జరిగిన పరిణామాలను సమగ్రంగా చూసుకోవాలి. జాతీయ, అంతర్జాతీయ సమావేశాలు, వివిధ కమిషన్లు, ప్రముఖుల పర్యటనలు, వార్తల్లో ప్రముఖంగా వచ్చిన వ్యక్తులు, ప్రదేశాలు, అవార్డులు, క్రీడాంశాలు, 2011 జనాభా లెక్కలు మొదలైనవి.
* భారతదేశ చరిత్రలో కేవలం తేదీలపైనే దృష్టి పెట్టకుండా ప్రాచీనకాలం నుంచి చారిత్రకంగా జరిగిన సాంఘిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక పరిస్థితులు అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా భారత జాతీయోద్యమం ప్రాముఖ్యం గ్రహించాలి. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి కూడా ప్రత్యేకంగా సన్నద్ధమవాలి.
* భౌగోళిక వ్యవస్థను మ్యాప్‌ ఉపయోగిస్తూ చదివితే ఫలితం ఉంటుంది. ఒక అంశాన్ని ప్రపంచ, భారత్‌, ఆంధ్రప్రదేశ్‌లకు సంబంధించి వెంటనే చదివితే బాగా గుర్తుంటుంది.
* భారత రాజకీయ ఆర్థిక వ్యవస్థలో భాగంగా స్వాతంత్య్ర పూర్వం నాటి బ్రిటిష్‌ చట్టాలు, రాజ్యాంగ ముఖ్య లక్షణాలు, రాష్ట్రపతి, ప్రధానమంత్రి పార్లమెంటు, కేంద్ర రాష్ట్ర సంబంధాలు, రాజ్యాంగ అధికరణాలు, పంచాయతీరాజ్‌ వంటివి ప్రధానం.
* ఆర్థికవ్యవస్థలో ద్రవ్యోల్బణం, బ్యాంకింగ్‌ రంగం, బడ్జెట్‌, పన్నులు, ద్రవ్యలోటు, వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం, పేదరిక నిర్మూలన పథకాలు, ప్రణాళికలు, ఆర్థిక సంస్కరణలు, ప్రైవేటీకరణ, విదేశీ పెట్టుబడులకు ప్రోత్సాహకాలు ప్రాముఖ్యమున్న అంశాలు.
జనరల్‌ మెంటల్‌ ఎబిలిటీలో రీజనింగ్‌ను 1. వెర్బల్‌ 2. నాన్‌ వెర్బల్‌గా అడిగే అవకాశముంది. ఈ విభాగంలోని ప్రశ్నలకు సమాధానాలు గుర్తించటానికి విస్తృత సాధన అవసరం. వీటిలో కొన్నిటిని సాధారణ తర్కాన్ని ఉపయోగించే పరిష్కరించవచ్చు. ఇటువంటివి 2-3కు మించి ఉండవు. మిగిలిన ప్రశ్నలన్నింటికీ సాధన అవసరం. అది కూడా నిర్ణీత సమయాన్ని పెట్టుకుని సాధన చేస్తేనే ప్రయోజనం.
పేపర్‌- 3: జనరల్‌ మేథమేటిక్స్‌
దీనిలో 50 ప్రశ్నలుంటాయి. వీటిలో 1- 10 వరకు ప్రతి ప్రశ్నకూ 1 మార్కు, 11- నుంచి 40 వరకు ప్రతి ప్రశ్నకూ 2 మార్కులు, 41 నుంచి 50 వరకు ప్రతి ప్రశ్నకూ 3 మార్కులు కేటాయించారు. గంటన్నర వ్యవధి కేటాయించారు. ఈ విభాగంలో ప్రశ్నలు పదో తరగతి స్థాయి గణిత పాఠ్యాంశాల నుంచి వస్తాయి. ఒక మార్కు ప్రశ్నలు తేలికగా, 2 మార్కుల ప్రశ్నలు కొంచెం కఠినంగా, 3 మార్కుల ప్రశ్నలు ఇంకా కఠినంగా ఉండే అవకాశముంది.
అటవీశాఖ విడుదల చేసిన నమూనా ప్రశ్నపత్రాలను అనుసరించి ఈ విభాగంలో వ్యాపారగణితం, క్షేత్రగణితం, రేఖాగణితం, వాస్తవ సంఖ్యల నుంచి ఎక్కువ ప్రశ్నలు రావొచ్చు. ఈ పాఠ్యాంశాల నుంచి వచ్చే ప్రశ్నలు కఠినంగా కనిపించినప్పటికీ సాధన ద్వారా సులువుగా జవాబులు గుర్తించవచ్చు. నిజజీవితంలో అన్వయించే ప్రశ్నలు ఎక్కువగా వస్తాయి. ఈ పాఠ్యాంశాల నుంచి వచ్చే ప్రశ్నలకు షార్ట్‌కట్‌ పద్ధతులు పాటిస్తే తక్కువ సమయమే పడుతుంది. ఎన్ని ఎక్కువ ప్రశ్నలు సాధన చేయగలిగితే అంత త్వరగా జవాబులు గుర్తించే వీలుంది.
దీర్ఘచతురస్రం, చతురస్రం, స్తూపం, వృత్తం, చుట్టుకొలత, వైశాల్యం, ఘనపరిమాణాలకు సంబంధించిన అన్ని సూత్రాలూ వచ్చివుండాలి. అరిథ్‌మెటిక్‌ నుంచి వచ్చే ప్రశ్నలు కూడా కఠినంగా కనిపిస్తాయి గానీ తేలిగ్గానే జవాబులు గుర్తించవచ్చు. ఈ విభాగంలో ఎక్కువ మార్కులు తెచ్చుకోవడానికి అధిక సాధన తప్పనిసరి.

back