Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
ఐఐటీల్లో చ‌దువు, పీఎస్‌యూల్లో కొలువుకి 'గేట్' వే
 

-బీటెక్‌, ఎమ్మెస్సీ విద్యార్థుల‌కు అద్భుత అవ‌కాశం
బీటెక్, సైన్స్ స‌బ్జెక్టుల్లో పీజీ చ‌దువుతున్న విద్యార్థుల భ‌విష్యత్తుకు బంగారుబాట వేసే గేట్ ప్రక‌ట‌న వెలువ‌డింది. మంచి స్కోర్ సాధించిన‌వారికి ఐఐటీల్లో ఎంటెక్ చ‌దివే అవ‌కాశం రావ‌డంతోపాటు అత్యున్నత ప్రతిభ క‌న‌బ‌ర్చిన‌వారు పీఎస్‌యూల్లో ఉద్యోగం పొందే సౌల‌భ్యం ఉండ‌డం గేట్ ప్రత్యేక‌త‌. బీటెక్‌లో ఐఐటీల గ‌డ‌పతొక్కే అవ‌కాశం ద‌క్కనివాళ్లు, ప‌బ్లిక్ సెక్టార్ యూనిట్లలో ఉన్నత స్థానాన్ని కోరుకునే ఆశావ‌హులు, నెల‌కు రూ.13 వేల స్టైపెండ్‌తో ఎలాంటి ఒడిదొడుకుల‌కు లోనుకాకుండా విజ‌య‌వంతంగా ఎంటెక్ పూర్తిచేయాల‌నుకుంటున్న విద్యార్థులంతా గేట్ రాయ‌డం ద్వారా క‌ల‌ల‌ను సాకారం చేసుకోవ‌చ్చు.

ఈ ఏడాది తాజా మార్పులు
* ప‌రీక్షలో ఆన్‌లైన్ విర్చువ‌ల్ కాలిక్యులేట‌ర్ అందుబాటులో ఉంచుతారు. దీంతో కాలిక్యులేట‌ర్లను ప‌రీక్ష హాల్‌లోకి అనుమ‌తించ‌రు. ఈ విర్చువ‌ల్ కాలిక్యులేట‌ర్‌పై ప్రాక్టీస్ చేసుకునేందుకు వీలుగా గేట్ 2016 వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతారు.
* ప‌రీక్ష అనంత‌రం స్వల్ప వ్యవ‌ధిలోనే ప్రతి ప్రశ్నకు కీ అందుబాటులో ఉంచుతారు. అభ్యర్థులు సందేహాలుంటే అంటే స‌మాధానం త‌ప్పుగా అనిపిస్తే నిర్వహ‌కుల‌కు ఫిర్యాదు చేయ‌వ‌చ్చు. అయితే దీనికోసం కొంత‌మొత్తం చెల్లించాల్సి ఉంటుంది.

* పెట్రోలియం ఇంజినీరింగ్లో ప్రవేశానికి ప్రత్యేక‌ ప్రశ్నప‌త్రాన్ని ఈ ఏడాది నుంచి ప్రారంభిస్తున్నారు. దీంతో మొత్తం 23 ఇంజినీరింగ్ విభాగాల‌కు సంబంధించిన‌ పేప‌ర్లు గేట్ ప‌రీక్షలో ఉంటాయి.

ప‌రీక్షకు సంబంధించి విభాగం/ బ్రాంచ్‌ల వారీ మొత్తం సిల‌బ‌స్‌ను గేట్ 2016 వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. వెబ్‌సైట్‌: http://www.gate.iisc.ernet.in/

ఈ ఏడాది గేట్ ప‌రీక్షను ఐఐఎస్సీ బెంగ‌ళూరు నిర్వహిస్తోంది.
ప‌రీక్ష తేదీలు: జ‌న‌వ‌రి 30,31; ఫిబ్రవ‌రి 6,7 (2016లో) రెండు సెష‌న్లలో (ఉద‌యం 9 నుంచి మ‌ధ్యాహ్నం 12 వ‌ర‌కు; మ‌ధ్యాహ్నం 2 నుంచి సాంయ‌త్రం 5 వ‌ర‌కు) నిర్వహిస్తారు.
ఆన్‌లైన్ అప్లికేష‌న్ ప్రారంభ తేదీ: సెప్టెంబ‌ర్ 1
ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేదీ: అక్టోబ‌ర్ 1
అడ్మిట్ కార్డులు: డిసెంబ‌ర్ 17 నుంచి డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు
ప‌రీక్ష కేంద్రాలు: తెలుగు రాష్ట్రాల్లో హైద‌రాబాద్‌, సికింద్రాబాద్‌, క‌ర్నూలు, బాప‌ట్ల, చిత్తూరు, గూడూరు, గుంటూరు, క‌డ‌ప‌, క‌రీంన‌గ‌ర్‌, ఖ‌మ్మం, న‌ల్గొండ‌, నెల్లూరు, ఒంగోలు, తిరుప‌తి, వ‌రంగ‌ల్‌, భీమ‌వ‌రం, ఏలూరు, కాకినాడ‌, రాజ‌మండ్రి, తాడేప‌ల్లిగూడెం, విజ‌య‌వాడ‌, విశాఖ‌ప‌ట్నం, విజ‌య‌న‌గ‌రం.
ప‌రీక్ష ఫీజు: ఎస్సీ, ఎస్టీలు, మ‌హిళ‌లు, పీడ‌బ్ల్యుడీలకు రూ.750; ఇత‌ర అన్ని వ‌ర్గాల వారికి రూ.1500
ఫ‌లితాలు: మార్చి 19న సాయంత్రం 5 గంట‌ల‌కు ప్రక‌టిస్తారు. ఈ స్కోర్ అప్పటి నుంచి మూడేళ్ల వ‌ర‌కు చెల్లుబాట‌వుతుంది.

ప్రశ్నప‌త్రం ఇలా...
ప్రశ్నప‌త్రం వంద మార్కుల‌కు ఉంటుంది. ప‌రీక్ష వ్యవ‌ధి 3 గంట‌లు. 65 ప్రశ్నలు అడుగుతారు. ఇంజినీరింగ్ విభాగాల‌కు సంబంధించిన ప్రశ్నప‌త్రంలోజ‌న‌ర‌ల్ ఆప్టిట్యూడ్‌లో 10 ప్రశ్నలు ఉంటాయి.. వీటికి 15 మార్కులు కేటాయించారు. మ్యాథ్స్‌కు సంబంధించి 15 మార్కులు ఉంటాయి. మిగిలిన 70 మార్కుల‌కు చెందిన ప్రశ్నలు అభ్యర్థి ఎంచుకున్న బ్రాంచ్‌/ సెక్షన్‌ నుంచి అడుగుతారు. రీకాల్‌, కాంప్రహెన్సన్‌, అప్లికేష‌న్‌, ఎనాల‌సిస్ అండ్ సింధ‌సిస్ త‌ర‌హా ప్రశ్నలుంటాయి. ఆ ప్రశ్న బ‌ట్టి దానికి ఒక‌టి లేదా రెండు మార్కులు కేటాయిస్తారు. ఒక మార్కు ప్రశ్నల‌కు స‌మాధానం త‌ప్పుగా గుర్తిస్తే అందులో మూడోవంతు మార్కు త‌గ్గిస్తారు. రెండు మార్కుల ప్రశ్నల‌కు స‌రికాని జ‌వాబు ఎంపిక‌చేసుకుంటే అందులో 2/3 వంతు మార్కు కోత ఉంటుంది. న్యూమ‌రిక‌ల్ ఆన్సర్ త‌ర‌హా ప్రశ్నల‌కు రుణాత్మక మార్కులు ఉండ‌వు.

విభాగాల‌వారీ ప్రశ్నలిలా...
జ‌న‌ర‌ల్ ఆప్టిట్యూడ్‌లో అడిగే 10 ప్రశ్నల్లో ఒక మార్కువి 5కాగా మ‌రో అయిదు రెండు మార్కుల‌వి. మొత్తం 10 మార్కులు. మ్యాథ్స్ విభాగంలో 11 ప్రశ్నలు వ‌స్తాయి. ఇందులో ఒక మార్కు ప్రశ్నలు 7 మిగిలిన 4 రెండు మార్కుల ప్రశ్నలు. మొత్తం 15 మార్కులు.
ఇంజినీరింగ్ విభాగానికి సంబంధించి అభ్యర్థి 5 సెక్షన్ల నుంచి రెండు సెక్షన్లను ఎంచుకుని వాటికి జ‌వాబులు గుర్తించాలి. ఈ రెండు సెక్షన్లకు మొత్తం 70 మార్కులు. అంటే ఒక్కో సెక్షన్‌కు 35 మార్కులు. ఒక్కో సెక్షన్ నుంచి 22 ప్రశ్నలుంటాయి. వీటిలో ఒక మార్కు ప్రశ్నలు 9 కాగా మిగిలిన 13 రెండు మార్కుల ప్రశ్నలు. రెండు సెక్షన్ల నుంచి 44 ప్రశ్నలు. వీటిలో ఒక మార్కువి 18. రెండు మార్కుల‌వి 26.

గేట్ స్కోర్‌తో ఉద్యోగాలిక్కడ‌...
దేశాభివృద్ధిలో కీల‌క‌పాత్ర వ‌హించే మ‌హార‌త్న, మినీర‌త్న, న‌వ‌ర‌త్న కంపెనీల్లో గేట్ స్కోర్ ద్వారా ఉన్నతోద్యోగాలు పొంద‌వ‌చ్చు. భార‌త్ పెట్రోలియం కార్పొరేష‌న్ లిమిటెడ్‌, ఇండియ‌న్ ఆయిల్ కార్పొరేష‌న్ లిమిటెడ్‌, సెంట్రల్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్‌, నేష‌న‌ల్ హైడ్రో ఎల‌క్ట్రిక్ ప‌వ‌ర్ కార్పొరేష‌న్‌, కోల్ ఇండియా లిమిటెడ్‌, ఆయిల్ అండ్ నేచుర‌ల్ గ్యాస్ లిమిటెడ్‌, నేష‌న‌ల్ థ‌ర్మల్ ప‌వ‌ర్ కార్పొరేష‌న్‌, ప‌వ‌ర్ గ్రిడ్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా...ఇలా మ‌రెన్నో సంస్థలు గేట్ స్కోర్ ద్వారా చ‌క్కని ఉద్యోగావ‌కాశాలు క‌ల్పిస్తున్నాయి. కంపెనీని బ‌ట్టి రూ.6 లక్షల నుంచి రూ.16 ల‌క్షల వ‌ర‌కు వార్షిక వేత‌నాన్ని అందిస్తున్నాయి. గేట్ స్కోర్‌తో కేంద్ర ప్రభుత్వ విభాగాలైన టెలికాం, సైన్స్ అండ్ టెక్నాల‌జీ డిపార్ట్‌మెంట్లలో గ్రూప్‌-ఎ లెవెల్ పోస్టులైన సీనియ‌ర్ ఫీల్డ్ ఆఫీస‌ర్ (ఎస్ఎఫ్ఓ), సీనియ‌ర్ రీసెర్చ్ ఆఫీస‌ర్ (ఎస్ఆర్‌వో) ఉద్యోగం ల‌భిస్తుంది.

posted on 07-08-2015