బ్యాంకు కొలువులకు ఆహ్వానం

ఉద్యోగార్థులకు సంతోషం కలిగిస్తూ ఆర్‌బీఐ, ఐడీబీఐలు ఇటీవల నియామక ప్రకటనలు జారీ చేశాయి. ఈ రెండూ డిగ్రీ అర్హతగా ఉన్నవారికి సంబంధించినవే. దరఖాస్తుదారులు సమగ్ర సన్నద్ధతపై దృష్టి కేంద్రీకరించటానికి ఇదే తరుణం!
రిజర్వు బ్యాంకు ప్రకటించిన 525 అసిస్టెంట్‌ ఉద్యోగాల రాతపరీక్ష జులై 20, 21, 27, 28 తేదీల్లో జరగబోతోంది. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ (జూన్‌ 20) ముగిసింది. ఆబ్జెక్టివ్‌ ఆన్‌లైన్‌ పరీక్ష, ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక జరుగుతుంది. మొత్తం 200 మార్కులతో 5 సబ్జెక్టులతో ఆన్‌లైన్‌ పరీక్ష ఉంటుంది.
పీజీ డిప్లొమా
500 ఖాళీలతో ఐడీబీఐ అసిస్టెంట్‌ మేనేజర్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అయితే ఈ ఉద్యోగాలకు నేరుగా కాకుండా ఒక సంవత్సరంపాటు 'పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ బ్యాంకింగ్‌ అండ్‌ ఫైనాన్స్‌' (పీజీడీబీఎఫ్‌) కోర్సు చేసినవారు మాత్రమే అర్హులవుతారు. కోర్సు ఫీజు రూ. 3,50,000.
ఈ కోర్సు కూడా మణిపాల్‌ స్కూల్‌ ఆఫ్‌ బ్యాంకింగ్‌ బెంగళూరు సంస్థ ద్వారా మాత్రమే చేయవలసి ఉంటుంది. ఈ సంస్థలో ఈ కోర్సు పూర్తిచేసినవారికి మణిపాల్‌ యూనివర్సిటీ ద్వారా డిగ్రీ వస్తుంది. తర్వాత ఐడీబీఐలో అసిస్టెంట్‌ మేనేజర్‌గా ఉద్యోగంలో చేర్చవచ్చు. కోర్సు ఫీజు సొంతంగా కట్టలేనివారికి బ్యాంకు రుణ సదుపాయం కల్పిస్తుంది.
మణిపాల్‌ స్కూల్‌ ఆఫ్‌ బ్యాంకింగ్‌లో పీజీడీబీఎఫ్‌ కోర్సులో ప్రవేశానికి 20 నుంచి 23 సంవత్సరాల మధ్య వయస్కులు అర్హులు. వీరు ఏదైనా డిగ్రీ పాస్‌ అయి ఉండాలి.
దరఖాస్తు ఆన్‌లైన్‌లో మాత్రమే చెయ్యాలి. దరఖాస్తు చేయడానికి చివరి తేదీ జూన్‌ 24. ఆన్‌లైన్‌ పరీక్ష తేదీ ఆగస్టు 2.
ఐడీబీఐ ఎంపిక విధానం
ఆన్‌లైన్‌ పరీక్ష, ఇంటర్వ్యూల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 200 మార్కులతో 4 సబ్జెక్టులతో ఆన్‌లైన్‌ ఆబ్జెక్టివ్‌ పరీక్ష ఉంటుంది.
సన్నద్ధత ఎలా?
స్థూలంగా రెండు పరీక్షలకు ఆబ్జెక్టివ్‌ విధానంలో ఒకే సబ్జెక్టులు ఉన్నాయి. ఆర్‌బీఐ అసిస్టెంట్‌ పరీక్షకు కంప్యూటర్‌ నాలెడ్జ్‌ పేపర్‌ అదనం.
ప్రాథమికంగా ఐడీబీఐ పరీక్ష పీజీడీబీఎఫ్‌లో ప్రవేశానికి కాబట్టి పరీక్ష కొంత సులువుగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఆర్‌బీఐ అసిస్టెంట్‌ పరీక్ష స్థాయి కూడా అంత కఠినంగా ఉండకపోవచ్చు.
రీజనింగ్‌: ఈ సబ్జెక్టులో ప్రాథమిక అంశాలపైనే ఎక్కువ ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. అనాలజీ, క్లాసిఫికేషన్‌, సిరీస్‌, సీటింగ్‌ అరేంజ్‌మెంట్‌, డైరెక్షన్స్‌ వంటి ప్రాథమిక అంశాలతోపాటు ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌ వంటి అంశాల నుంచి ప్రశ్నలు రావొచ్చు. పాత ప్రశ్నపత్రాలు, మాదిరి ప్రశ్నపత్రాల సాధన ద్వారా అభ్యర్థికి ప్రయోజనం ఉంటుంది.
క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌/ న్యూమరికల్‌ ఎబిలిటీ: ఈ విభాగానికి సంబంధించి మౌలికాంశాల సాధనపై దృష్టిపెట్టాలి. ఎక్కాలు, వర్గాలు, ఘనాలు మొదలైన వాటితోపాటు ప్రాథమిక అంశాలైన శాతాలు, సరాసరి, నిష్పత్తి, లాభనష్టాలు, వడ్డీ మొదలైనవాటిపై పట్టు సాధించాలి. పాత ప్రశ్నపత్రాలు, మాదిరి ప్రశ్నపత్రాల సాధన ఉపకరిస్తుంది.
ఇంగ్లిష్‌: దీని విషయంలో వ్యాకరణం, కాంప్రహెన్షన్‌లదే ప్రధాన పాత్ర. ఏదైనా ప్రామాణిక గ్రామర్‌ పుస్తకాన్ని సాధన చేస్తే సరిపోతుంది.
జనరల్‌ అవేర్‌నెస్‌: దీనిలో గత ఆరు నెలల బ్యాంకింగ్‌, ఆర్థిక అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. ప్రతిరోజూ దినపత్రికలోని వ్యాపార వార్తలను చూసుకోవడం ద్వారా ఈ విభాగాన్ని సమర్థంగా చేయవచ్చు.
కంప్యూటర్‌ నాలెడ్జ్‌: కొత్తగా వచ్చే మార్పులు, బ్యాంకింగ్‌ రంగంలో కంప్యూటర్‌ వినియోగానికి సంబంధించిన ప్రశ్నలు ఎక్కువగా వచ్చే వీలుంది. మౌలిక అంశాలు, కంప్యూటర్‌ పరిభాషకు సంబంధించి పుస్తకాలు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. ఈ రంగంలో తాజాగా చోటు చేసుకునే మార్పులను దినపత్రికల్లో చదువుతుండడం ద్వారా పరిజ్ఞానం పెంచుకోవచ్చు.
ఇంటర్వ్యూకు స్పష్టమైన, నిజాయతీతో కూడిన భావప్రకటన అత్యంత అవసరం. అడిగిన ప్రశ్నకు సమాధానం తెలియకపోతే ఆ విషయాన్ని స్పష్టంగా అంగీకరించాలి. తెలియని సమాధానాన్ని అసమగ్ర సమాచారంతో తెలిసినట్లుగా చెప్పాలన్న ప్రయత్నం చేయకూడదు.
చాలినంత సమయం ఉన్నందునా, ఐబీపీఎస్‌ నుంచి క్లర్కు, ఆఫీసర్‌ ఉద్యోగాలకు ప్రకటనలు వస్తున్న ఈ తరుణంలో అభ్యర్థులు సన్నద్ధతపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం ఎంతో ముఖ్యం.

posted on 23.6.2015