ఎంబీఏ, ఎంసీఏ - కోర్సు, క‌ళాశాల‌ ఎంపిక ఇలా...

ఐసెట్ - 2014 ర్యాంక‌ర్ల స‌ర్టిఫికెట్ వెరిఫికేష‌న్ ఈ నెల (సెప్టెంబ‌ర్‌) 17వ తేదీ నుంచి ప్రారంభం కాబోతోంది. స‌ర్టిఫికెట్ల ప‌రిశీల‌న పూర్త‌యిన వెంట‌నే అంటే 20వ తేదీ నుంచే అభ్య‌ర్థులు వెబ్ ఆప్ష‌న్ల‌ను న‌మోదుచేసుకోవాలి. 24వ తేదీతో ఈ గ‌డువు ముగుస్తుంది. ఈ నేప‌థ్యంలో ఐసెట్ ర్యాంక‌ర్లు త‌మ ఆస‌క్తులు, అభిరుచి, ప్రావీణ్యానికి అనుగుణంగా ఎంబీఏ, ఎంసీఏల్లో ఏదో ఒక కోర్సును ఎంచుకోవాలి. ఆ త‌ర్వాత న‌చ్చిన కోర్సుకు సంబంధించి మేటి క‌ళాశాల‌ల జాబితాను స‌రైన‌ క్ర‌మంలో రాసుకుని వెబ్ ఆప్ష‌న్ల‌లో చేర్చ‌డం ఎంతో కీల‌కం. ఈ ప్ర‌క్రియ అంతా స‌జావుగా జ‌ర‌గాలంటే కోర్సు, క‌ళాశాల ఎంపికలో క‌స‌ర‌త్తు త‌ప్ప‌నిస‌రి. అదెలాగో మ‌న‌మిప్పుడు తెలుసుకుందాం...
కోర్సు ఎంపిక...
ఎంబీఏ, ఎంసీఏల్లో ఏ కోర్సు ఎంచుకున్న‌ప్ప‌టికీ అది వ్య‌క్తిగ‌త‌ అభిరుచికి అనుగుణంగా జ‌ర‌గాలి. ప్ర‌స్తుత మార్కెట్ ప‌రిస్థితుల‌ను ప్రామాణికంగా తీసుకుని ముందుకెళ్ల‌డం స‌రికాదు. ఎందుకంటే జాబ్ మార్కెట్ కొన్ని సంవ‌త్స‌రాలు ఒక విభాగానికి అనుకూలంగా ఉంటే మ‌రికొన్నాళ్లు మ‌రో విభాగంలో బాగుంటుంది. కాబ‌ట్టి ట్రెండ్‌కి అనుగుణంగా కాకుండా టాలెంట్ అనుస‌రించి కోర్సువైపు అడుగేయ‌డం మంచిది. సంబంధిత కోర్సులో స‌త్తా చాట‌గ‌లిగితే మార్కెట్‌ గ‌డ్డు ప‌రిస్థితుల్లో సైతం ఉద్యోగాన్ని సొంతం చేసుకోవ‌చ్చు.
ఎంసీఏ...
కోడింగ్‌లో మంచి ప్రావీణ్యం ఉండి, ప్రొగ్రామింగ్ ప‌రిజ్ఞానం ఉంటే ఎంసీఏ తీసుకోవ‌డం తెవివైన నిర్ణ‌యమే.
ఈ కోర్సులో చేరాల‌నుకునే అభ్య‌ర్థులు ఇంజినీరింగ్ తోపాటు ఎంసీఏ ఉన్న‌ క‌ళాశాల‌ల‌కు తొలి ప్రాధాన్యం ఇవ్వ‌డం మంచిది. ఎందుకంటే ఇంజినీరింగ్ కోర్సు ఉంది కాబ‌ట్టి ఇలాంటి కాలేజీల్లో మంచి ఫాక‌ల్టీ ఉండ‌డానికి అవ‌కాశాలెక్క‌వ. అలాగే ఇంజినీరింగ్ విద్యార్థుల కోసం క్యాంప‌స్‌ ప్లేస్‌మెంట్లు కూడా ఇలాంటి కాలేజీల్లో జ‌రుగుతాయి. దీంతో ప్లేస్‌మెంట్లో ఎంసీఏ విద్యార్థులు కూడా పాల్గొనే అవ‌కాశం ద‌క్కుతుంది. అదే కేవ‌లం ఎంసీఏ కోర్సు మాత్ర‌మే అందించే క‌ళాశాల‌ల్లో మంచి ఫ్యాక‌ల్టీ, ప్లేస్‌మెంట్లు జ‌రిగే అవ‌కాశం రెండూ త‌క్కువే.
ఎంబీఏ
క‌మ్యూనికేష‌న్ స్కిల్స్ ఎక్కువ‌గా ఉన్న‌వాళ్లకు ఎంబీఏ మంచిద‌నే చెప్పుకోవాలి.
చొర‌వ తీసుకుని న‌లుగురిలోనూ స్వేచ్ఛ‌గా మాట్లాడ‌గ‌లిగేవాళ్ల‌కు ఎంబీఏ న‌ప్పుతుంది.
వ్యాపార రంగం, వాణిజ్య ఉత్ప‌త్తులపై అవ‌గాహ‌న‌, ఆ రంగంలో ప‌నిచేయాల‌నే త‌పన ఉంటే ఎంబీఏవైపు అడుగులేయ‌డం మంచిదే.
ఇత‌రుల‌ను మెప్పించ‌గ‌లిగే సామ‌ర్థ్యం, నాయ‌క‌త్వ ల‌క్ష‌ణాలు మెండుగా ఉన్న‌వారు ఎంబీఏలోకి ప్ర‌వేశించ‌వ‌చ్చు.
ఫైనాన్స్‌, అకౌంటింగ్‌, మార్కెటింగ్ స‌బ్జెక్టుల్లో ప‌రిజ్ఞానం ఎక్క‌వగా ఉన్న‌వాళ్లు ఎంబీఏలో చేర‌డ‌మే మంచిది.
కాలేజీ ఎంపిక‌లో…
మంచి కాలేజీని ఎంచుకోవాలంటే దానికి చాలా ప్ర‌మాణాలే ఉన్నాయి. అయితే వాటిలో ముఖ్య‌మైన‌వి గుర్తించి, అనుగుణంగా నిర్ణ‌యం తీసుకోవ‌చ్చు. అవేంటంటే..
బోధ‌నా సిబ్బంది:
మ‌నిషికి హృద‌యం ఎలాంటిదో కాలేజీకి బోధ‌నా సిబ్బంది అంత కీల‌కం. కాబ‌ట్టి అనుభ‌వ‌జ్ఞులైన‌, విష‌య‌ప‌రిజ్ఞానం మెండుగా ఉన్న ఫ్యాక‌ల్టీ స‌భ్యులు ఎక్క‌వ‌గా ఏ క‌ళాశాల‌లో ఉన్నారో తెలుసుకుని దానికి ప్రాధాన్య‌మివ్వాలి. ఫ్యాక‌ల్టీ స‌భ్యుల‌ గురించి స‌మాచారం తెలుసుకోవ‌డానికి కాలేజీ వెబ్‌సైట్లు స‌హాయ‌ప‌డ‌తాయి. ప్ర‌స్తుతం ప్ర‌తి కాలేజీకి వైబ్‌సైట్ ఉంది. అందులో బోధ‌నా సిబ్బంది స‌మాచారం ఉంటుంది. వాళ్లేం చ‌దువుకున్నారు, ఎక్క‌డ చ‌దివారు, ఎన్నాళ్ల అనుభ‌వం ఉంది...ఈ వివ‌రాల‌న్నీ ల‌భిస్తాయి. దీనిద్వారా ఆ క‌ళాశాల‌పై అవ‌గాహ‌న‌కు రావ‌చ్చు. ఒక‌వేళ ఫ్యాక‌ల్టీ వివ‌రాలు స‌రిగా లేకుంటే మాత్రం ఆ క‌ళాశాల‌లో చేర‌క‌పోవ‌డ‌మే మంచిది.
ప్లేస్‌మెంట్స్‌:
ప్ర‌తి క‌శాశాల‌లోనూ ప్లేస్‌మెంట్ విభాగం ఉంటుంది. ఆ క‌ళాశాల‌లో గ‌త మూడేళ్ల‌గా ప్లేస్‌మెంట్స్ ఎలా ఉన్నాయో తెలుసుకోవాలి. ఈ వివ‌రాలు కూడా కాలేజీ వెబ్‌సైట్‌లో ఉంటాయి. ప్లేస్‌మెంట్ ట్ర‌యినింగ్ సెల్, క్యాంప‌స్ ప్లేస్‌మెంట్ ఆఫీస‌ర్ ఉన్నారో లేరో తెలుసుకోవాలి. అలాగే ఆ కాలేజీలో జేకేసీ ఉందో లేదో చూడాలి.
పూర్వ, ప్ర‌స్తుత‌ విద్యార్థులు:
ఏ కాలేజీ గురించైనా బాగా చెప్ప‌గ‌లిగేది అందులో చ‌దివిన విద్యార్థులు మాత్ర‌మే. అందుకే చేరాల‌నుకుంటున్న కాలేజీ గురించి పూర్వ విద్యార్థుల వ‌ద్ద విచార‌ణ జ‌ర‌పాలి. కేవ‌లం ఒక‌రిద్ద‌రితో మాట్లాడి నిర్ణ‌యం తీసుకోకుండా క‌నీసం ప‌దిమంది అభిప్రాయం తీసుకోండి. వాళ్ల‌లో మెజార్టీ స‌భ్యులు చెప్పిన‌దాన్ని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవడం మంచిది. విద్యార్థుల‌ను ఆక‌ర్షించ‌డానికి కొన్ని క‌ళాశాల‌లు వెబ్‌సైట్ల‌లో త‌ప్పుడు వివ‌రాలు న‌మోదు చేయ‌డానికి అవ‌కాశం లేక‌పోలేదు. ప్లేస్‌మెంట్లు, ఫ్యాక‌ల్టీ విష‌యంలో అబ‌ద్ధం చెప్ప‌డానికి అవ‌కాశం ఉంది. అయితే ఆ క‌ళాశాల‌లో ప్ర‌స్తుతం చ‌దువుతున్న‌, ఇటీవ‌ల కాలంలో చ‌దువు పూర్తి చేసుకున్న‌వాళ్ల‌తో మాట్లాడితే ఈ వివ‌రాలు ఎంత వ‌ర‌కు వాస్త‌వ‌మో తెలుస్తుంది.
గ‌త సంవ‌త్స‌ర క్లోజింగ్ ర్యాంక్‌:
క‌ళాశాల ఎంపిక‌లో ఇది కూడా ఒక స‌హేతుక ప్ర‌మాణంగానే చెప్పుకోవ‌చ్చు. ఎందుకంటే ఎక్కువ మంది విద్యార్థులు చేర‌డానికి మొగ్గుచూపిన క‌ళాశాలల్లో సీట్లు తొంద‌ర‌గా నిండుతాయి. అన్ని విధాలా ఆ క‌ళాశాల మెరుగైన‌దేన‌ని భావించ‌వ‌చ్చు. ఓసీ బాలుర విభాగంలో క్లోజింగ్ ర్యాంకు ఆధారంగా క‌ళాశాల‌ల ప్రాధాన్యాన్ని నిర్ణ‌యించుకోవ‌చ్చు.
మాక్ కౌన్సెలింగ్‌:
గ‌త సంవ‌త్స‌రం అంటే 2013 ఐసెట్‌లో ఏ ర్యాంకు వ‌చ్చిన‌వాళ్ల‌కు ఎక్క‌డ సీటు వ‌చ్చిందో తెలుసుకోవ‌డానికి మాక్ కౌన్సెలింగ్ తోడ్ప‌డుతుంది. దీనిద్వారా మీ ర్యాంకుకు సీటువ‌చ్చే క‌ళాశాల‌ల జాబితా ల‌భిస్తుంది. దీని ఆధారంగా ఒక అంచ‌నాకు రావొచ్చు. ఐసెట్ మాక్ కౌన్సెలింగ్ 2013 వివ‌రాల కోసం www.eenadupratibha.net లో ఉన్నాయి. ఒక‌సారి మీ ర్యాంకు ఎంట‌ర్‌చేసి చూసుకోండి. కోర్సు, యూనివ‌ర్సిటీ, కేట‌గిరీ, జండ‌ర్ వారీ పూర్తి స‌మాచారం ఎంట‌ర్‌చేసి క్లిక్ చేయండి. క‌ళాశాల‌ల జాబితా క్ష‌ణాల్లో ప్ర‌త్య‌క్ష‌మ‌వుతుంది. ఆ స‌మాచారం మీకు దిక్సూచిలా ఉప‌యోగ‌ప‌డుతుంది.
ల్యాబ్‌, లైబ్ర‌రీ:
మంచి క‌ళాశాల అంటే కేవ‌లం సువిశాల‌మైన క్యాంప‌స్‌లో ఆకాశాన్ని తాకే బిల్డింగులు కావు. స‌మ‌ర్థ‌ ఫ్యాక‌ల్టీతోపాటు మంచి ల్యాబ్‌, విద్యార్థుల అవ‌స‌రాల‌ను తీర్చే లైబ్రరీ, ఆంగ్ల భాష‌లో ప్రావీణ్యానికి ఇంగ్లిష్ లాంగ్వేజ్ లైబ్ర‌రీ...ఇవ‌న్నీ ఉండాలి. మీరు చేర‌బోతోన్న క‌ళాశాల‌లో ఈ వ‌స‌తులు ఉన్నాయో లేదో ప‌రిశీలించండి.
ట్రాన్స్‌పోర్టు, వ‌స‌తి:
కాలేజీకి వెళ్ల‌డానికి ర‌వాణా వ్య‌వ‌స్థ (కాలేజీ బ‌స్ ఉంటే మంచిదే. లేని సంద‌ర్భంలో ఆ రూట్‌లో క‌నీసం ఆర్టీసీ బ‌స్సులైనా వెళ్లే సౌక‌ర్యం) ఉండాలి. అలాగే దూర‌ప్రాంతాల‌వారు హాస్ట‌ల్‌లో ఉంటూ చ‌దువుకోవ‌డానికి త‌గిన ఏర్పాట్లు, భ‌ద్ర‌త ఉండ‌డం కూడా కీల‌మే.
నేరుగా సంద‌ర్శించ‌డం:
చేరాల‌నుకున్న కాలేజీని నేరుగా సంద‌ర్శించాలి. రెండు/ మూడేళ్ల పాటు చ‌దివే కాలేజీ గురించి పూర్తిగా తెలుసుకోవ‌డానికి, త‌ర్వాత బాధ ప‌డ‌కుండా ఉండ‌డానికి దాన్ని సంద‌ర్శించ‌డం అనేది ఎంతో విలువైన ప‌ని.
గ‌త ఫ‌లితాలు:
చేర‌బోయే కోర్సుకు సంబంధించి గ‌త రెండుమూడేళ్ల‌గా ఆ క‌ళాశాలలో ఉత్తీర్ణ‌త శాతం ఎలా ఉందో చూడాలి. దీనిద్వారా విద్యార్థులపై బోధ‌న సిబ్బంది, యాజ‌మాన్యం ఎంత శ్ర‌ద్ధ చూపుతున్నాయో తెలుస్తుంది. పాస్ ప‌ర్సంటేజీ వివ‌రాలు కూడా కాలేజీ వెబ్‌సైట్ల‌లో ల‌భిస్తాయి.
గాలి, వెలుతురు వ‌చ్చేలా మంచి త‌ర‌గ‌తి గదులు, స‌మావేశ మందిరం, తాగ‌డానికి మంచినీళ్లు, వైఫై సౌక‌ర్యం, ర్యాగింగ్ ర‌హిత వాతావర‌ణం, గెస్ట్ లెక్చ‌ర్లు, క‌ర్మాగారాలు, బ‌హుళ‌జాతి కంపెనీల‌తో ఒప్పందాలు, ఇండ‌స్ట్రీ ఇంట‌రాక్ష‌న్‌, సాఫ్ట్‌స్కిల్స్‌పై శిక్ష‌ణ‌, ప్లే గ్రౌండ్‌...ఇలాంటివ‌న్నీ ప‌రిశీలించి అంచ‌నాకు రావాలి.
ఇలా చేయొద్దు...
మిత్రులు, తెలిసిన‌వాళ్లు చ‌దువుతున్నార‌ని చెప్పి వాళ్లుచేరే కోర్సు, వారు చ‌దివే క‌ళాశాల‌లోనే చేరొద్దు. ఆస‌క్తికే తొలి ప్రాధాన్యం ఇవ్వాలి. ఇంటికి ద‌గ్గ‌ర‌గా ఉంద‌ని చెప్పి అంత‌గా పేరులేని కాలేజీలో చేరే బ‌దులు కొంచెం దూర‌మైనాస‌రే మంచి కాలేజీలోనే చేర‌డానికి ప్రాధాన్యం ఇవ్వాలి. దీనివ‌ల్ల చ‌దువులో లాభ‌ప‌డ‌డంతోపాటు ఇత‌ర‌త్రా ప్ర‌యోజ‌నాలూ (కొత్త వాతావ‌ర‌ణానికి అల‌వాటు ప‌డ‌డం, కొత్త మిత్రుల ప‌రిచ‌యం, కుటుంబ స‌భ్యుల‌కు దూరంగా ఉండ‌డానికి అల‌వాటు ప‌డ‌డం..) ఉన్నాయి.
కోడింగ్‌పై ఆస‌క్తి త‌క్కువ‌గా ఉండి, కేవ‌లం సాఫ్ట్‌వేర్ రంగంపై ఆస‌క్తితో ఎంసీఏ తీసుకోవ‌డం వ‌ల్ల పెద్ద‌గా ప్ర‌యోజ‌నం ద‌క్క‌దు. కోర్సులో చేరిన‌త‌ర్వాత నుంచైనా ప్రొగ్రామింగ్ నేర్చుకోవ‌డానికి ఇష్టం చూప‌గ‌లిగితేనే ఎంసీఏలో చేరాలి.
న‌లుగురిలోనూ ఒక‌రిగా క‌లిసిపోవ‌డానికి ఆస‌క్తి లేనివాళ్లు ఎంబీఏ (మార్కెటింగ్‌) జోలికి వెళ్ల‌క‌పోవ‌డ‌మే మంచిది.