బ్యాంకులో పాగా

ఐడీబీఐ, ఎస్‌బీఐ... ఈ రెండు బ్యాంకుల నుంచీ నియామక ప్రకటనలు విడుదలయ్యాయి. మొదటిది... కోర్సులో చేర్చుకుని, అనుభవం సంపాదించే వీలు కల్పిస్తుంది. రెండోది ఇప్పటికే అనుభవం ఉన్నవారికి ప్రత్యేకించినది! ఈ నియామకాల కీలకాంశాలను తెలుసుకుందామా?
అసిస్టెంట్‌ మేనేజర్‌ గ్రేడ్‌ ‘ఏ’ పోస్టుల భర్తీ కోసం పీజీడీబీఎఫ్‌ కోర్సు నిర్వహణకు ఐడీబీఐ బ్యాంకు ప్రకటన విడుదల చేసింది. వెయ్యి సీట్లున్న ఈ కోర్సుకు ఎంపికైనవారికి మణిపాల్‌ స్కూల్‌ ఆఫ్‌ బ్యాంకింగ్‌, బెంగళూరులో బ్యాంకింగ్‌ &ఫైనాన్స్‌లో 9 నెలలపాటు తరగతి గది శిక్షణ, ఐడీబీఐ బ్యాంకు శాఖల్లో 3 నెలల పాటు ఇంటర్న్‌షిప్‌ వుంటుంది. కోర్సును విజయవంతంగా పూర్తిచేస్తే మణిపాల్‌ యూనివర్సిటీ పీజీ డిప్లొమా ఇన్‌ బ్యాంకింగ్‌ &ఫైనాన్స్‌ను ప్రదానం చేస్తుంది. అదేవిధంగా ఐ.డి.బి.ఐ. బ్యాంకులో అసిస్టెంట్‌ మేనేజర్‌ గ్రేడ్‌ ‘ఎ’గా నియమిస్తారు.
స్టేట్‌బ్యాంకు ఆఫ్‌ ఇండియా వెల్త్‌ మేనేజ్‌మెంట్‌లో వివిధ హోదాల్లో 103 ప్రత్యేక స్థానాల భర్తీకి (స్పెషలైజెడ్‌ పొజిషన్స్‌) ఒక ప్రకటన విడుదలయింది. ఈ అభ్యర్థులకు 2 నుంచి 10 సం॥ల ఉద్యోగానుభవం ఉండాలి.
కోర్సు ఎందుకు?
ప్రవేశ పరీక్షల ద్వారా నేరుగా బ్యాంకులో అధికారులుగా చేరిన అభ్యర్థులకు బ్యాంకు వ్యవహారాలు తెల్సుకోవడానికి కొంత సమయం పడుతుంది. ఈ సమయాన్ని ఆదా చేయడం కోసం అభ్యర్థులకు ముందుగా ఒక సం॥పాటు బ్యాంకింగ్‌ &ఫైనాన్స్‌లో శిక్షణనిస్తారు. దీనిలో 9 నెలల పాటు తరగతి గది శిక్షణనిచ్చి 3 నెలల పాటు బ్యాంకులో పని చేస్తూ శిక్షణపొందే ఇంటర్న్‌షిప్‌ ఉంటుంది. దీనివల్ల అధికారులుగా చేరే సమయానికే బ్యాంకింగ్‌ వ్యవహారాల పట్ల పూర్తి అవగాహన వస్తుంది.
ఈ కోర్సు కోసం ఫీజు చెల్లిస్తూ 3 సం॥ల కాల వ్యవధిలో బాండ్‌ కూడా ఇవ్వాల్సి వుంటుంది. కాబట్టి అభ్యర్థులు మెరుగైన అవకాశాలు వెతుక్కుంటూ ఈ బ్యాంకులను వదిలివేసే అవకాశాలు బాగా తగ్గిపోతాయి. అందుచేతనే గత 3, 4 సంవత్సరాలుగా వివిధ బ్యాంకులు ఈ తరహా నియామకాలు చేపడుతున్నాయి.
ఎంపిక విధానం: ఐ.డి.బి.ఐ. బ్యాంకులో అభ్యర్థుల ఎంపిక ఆబ్జెక్టివ్‌ పద్ధతిలో నిర్వహించే ఆన్‌లైన్‌ రాతపరీక్ష, ఇంటర్వ్యూల ద్వారా జరుగుతుంది.
ఎస్‌బీఐలో షార్ట్‌లిస్ట్‌ అయిన అభ్యర్థులకు మౌఖిక పరీక్షను నిర్వహించడం ద్వారా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.
రాత పరీక్ష విధానం: ఐ.డి.బి.ఐ.లో ఆబ్జెక్టివ్‌ తరహాలో నిర్వహించే ఆన్‌లైన్‌ రాత పరీక్షలో ఒక్కొక్కదానిలో 50 ప్రశ్నలు 50 మార్కులతో కూడిన నాలుగు విభాగాలు (రీజనింగ్‌, ఇంగ్లిష్‌ లాంగ్వేజి, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌, జనరల్‌ అవేర్‌నెస్‌) ఉంటాయి. మొత్తం 200 ప్రశ్నలు 2 గంటల సమయంలో పూర్తి చేయాలి. సాధారణంగా బ్యాంకు పరీక్షలో ఉండే విభాగాల వారీ ఉత్తీర్ణత, రుణాత్మక మార్కుల గురించి ప్రకటనలో పేర్కొనలేదు.
క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌: ఈ విభాగంలో సింప్లికేషన్స్‌, నంబర్‌ సిరీస్‌, డేటా సఫిషియన్సీ, క్వాడ్రాటిక్‌ ఈక్వేషన్స్‌, అరిథ్‌మెటిక్‌, డేటా ఇంటర్‌ ప్రెటేషన్‌ మొ॥ వాటినుంచి ప్రశ్నలుంటాయి. అరిథిమెటిక్‌లో, నిష్పత్తులు, శాతాలు, లాభ నష్టాలు, బారువడ్డీ- చక్రవడ్డీ, కాలం-పని, కాలం-దూరం, ట్రెయిన్లు, బోట్లు, మెన్సురేషన్‌, ప్రస్తారాలు-సంయోగాలు, సంభావ్యతల నుంచి కనీసం ఒక ప్రశ్న వచ్చే అవకాశం ఉంది. డేటా ఇంటర్‌ ప్రెటేషన్‌ నుంచి 20-25 ప్రశ్నలు వస్తాయి. వాటిని బాగా సాధన చేయాల్సి వుంటుంది. కాల్‌క్యులేషన్లు వేగంగా చేయగలిగేలా సాధన చేయాలి.
రీజనింగ్‌: ఆసక్తిని కల్గించేదీ, నాన్‌-మేథ్స్‌ అభ్యర్థులు కూడా తేలికగా చేయగలిగేదీ అయిన విభాగమిది. కోడింగ్‌-డీ కోడింగ్‌, బ్లడ్‌ రిలేషన్స్‌, డైరెక్షన్స్‌, సీటింగ్‌ అరేంజ్‌మెంట్‌, సిలాజిజమ్‌, పజిల్‌ టెస్ట్‌, ఇన్‌పుట్‌-అవుట్‌పుట్‌, ఎలిజిబిలిటీ టెస్ట్‌, డేటా సఫిషియన్సీ, స్టేట్‌మెంట్‌-అసమ్షన్స్‌/ఆర్గ్యుమెంట్స్‌/ కోర్సెస్‌ ఆఫ్‌ యాక్షన్‌/ ఇన్‌ఫరెన్స్‌ మె॥గు వాటి నుంచి తప్పనిసరిగా ప్రశ్నలుంటాయి. అభ్యర్ధులు వీటన్నింటినీ బాగా అవగాహన చేసుకుని వీలైనన్ని ప్రశ్నలు సాధన చేయాలి.
ఇంగ్లిష్‌ లాంగ్వేజి: వీటిలోని ప్రశ్నలు రీడింగ్‌ కాంప్రహెన్షన్‌, గ్రామర్‌, ఒకాబులరీలపై ఉంటాయి. ఫైండింగ్‌ ఎర్రర్స్‌, సెంటెన్స్‌ కంప్లీషన్‌, ఫిల్‌ ఇన్‌ ద బ్లాంక్స్‌, రీ అరేంజ్‌మెంట్‌ ఆఫ్‌ సెంటెన్సెస్‌, క్లోజ్‌టెస్ట్‌, సిననిమ్స్‌- యాంటనిమ్స్‌లపై ప్రశ్నలు వస్తాయి. గ్రామర్‌పై మంచి పట్టు వుంటే వీటన్నింటినీ సులభంగా చేయవచ్చు.
జనరల్‌ అవేర్‌నెస్‌: వర్తమానాంశాలకు సంబంధించిన ప్రశ్నలు ఎక్కువ సంఖ్యలో ఇస్తారు. బ్యాంకింగ్‌, ఆర్థిక సంబంధ విషయాలు కేంద్రీకరిస్తూ ప్రశ్నలుంటాయి. భారతదేశ బ్యాంకింగ్‌ వ్యవస్థ, ఆర్థిక సంస్థలు, రిజర్వ్‌ బ్యాంక్‌ స్టాక్‌ మార్కెట్‌, కేంద్రప్రభుత్వ పథకాలు, ఐ.ఎమ్‌.ఎఫ్‌., ఆసియా డెవలప్‌ మెంట్‌ బ్యాంక్‌, బ్రిక్స్‌, వరల్డ్‌ బ్యాంక్‌ మొ॥ వాటిపై ప్రశ్నలుంటాయి. పెద్ద కరెన్సీనోట్ల ఉపసంహరణ, ఆర్ధిక వ్యవస్థపై దాని ప్రభావం లాంటి తాజా అంశాలపై ప్రశ్నలు తప్పనిసరి. దినపత్రికలు చదువుతూ పరీక్షకు సంబంధించిన విషయాలన్నింటినీ కవర్‌ చేస్తూ నోట్సు తయారుచేసుకుంటే మేలు.
పరీక్షకు సన్నద్ధత
ఫిబ్రవరి 3వ తారీఖున నిర్వహించే ఆన్‌లైన్‌ రాత పరీక్షకు దాదాపు 2 నెలల సమయం వుంది. ఈ సమయాన్ని అభ్యర్ధులు పూర్తిగా వినియోగం చేసుకోవాలి. పరీక్ష ఐబీపీఎస్‌ పీఓ స్థాయిలో ఉంటుంది. ఇంతకు ముందునుంచి బ్యాంకు పరీక్షలు రాస్తున్న అభ్యర్థులు వారి సన్నద్ధతను అదేవిధంగా కొనసాగించాలి. తొలిసారి రాస్తున్నవారు మాత్రం సబ్జెక్టులు నేర్చుకోవడానికీ, సాధనకూ సమయాన్ని విభజించుకోవాలి.
మొదటి నెలరోజుల సమయంలోనే అన్ని సబ్జెక్టులు, వాటి టాపిక్స్‌ బాగా నేర్చుకొని మిగిలిన సమయం వివిధ రకాల ప్రశ్నలు, మాదిరి ప్రశ్నపత్రాలు సాధన చేయాలి. వీలైతే ప్రతిరోజూ ఒక మాదిరి ప్రశ్నపత్రం సమయాన్ని నిర్దేశించుకొని సాధన చేయాలి.
ప్రోగ్రామ్‌ ఫీజు: ఈ ప్రోగామ్‌కు ఎంపికైన అభ్యర్థులు కోర్సు ఫీజు, భోజన వసతి కోసం రూ॥ 3.50 లక్షలు+ సర్వీస్‌ టాక్స్‌ను ఒక సం॥లో వివిధ విడతలలో చెల్లించాల్సి వుంటుంది. అయితే అభ్యర్థులపై ఆర్థికభారం లేకుండా ఐ.డి.బి.ఐ. బ్యాంకు విద్యారుణాన్ని మంజూరు చేస్తుంది.
స్టైపెండ్‌: ఎంపికైనవారికి శిక్షణ కాలంలో మొదటి 9 నెలలకు నెలకు రూ॥ 2500 చొప్పున, ఇంటర్న్‌షిప్‌ కాలంలోని 3 నెలలకు నెలకు రూ॥ 10,000 చొప్పున స్టైపెండ్‌ లభిస్తుంది.

posted on 05-12-2016

Back

»   Reasoning
»   English Language
»   Quantitative Aptitude
»   General Awareness