Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home

న్యూ ఇండియా అష్యూరెన్స్‌లో 300 ఏవో ఉద్యోగాలు

భార‌త ప్రభుత్వానికి చెందిన సాధార‌ణ బీమా సంస్థ న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ 300 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస‌ర్ (ఏవో) పోస్టుల భ‌ర్తీకి ప్రక‌ట‌న విడుద‌ల‌చేసింది. ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులు ఈ ఉద్యోగాల‌కు పోటీ ప‌డొచ్చు. ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. స్టేజ్‌-1, స్టేజ్‌-2 ఆన్‌లైన్ ప‌రీక్షలు, ఇంట‌ర్వ్యూల ద్వారా అభ్యర్థుల‌ను ఎంపిక‌చేస్తారు. ప‌రీక్ష విధానం దాదాపు ఐబీపీఎస్ పీవోల త‌ర‌హాలోనే ఉంటుంది. కాబ‌ట్టి బ్యాంకు ప‌రీక్షల‌కు స‌న్నద్ధమ‌వుతున్నవాళ్లు ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డం ద్వారా ప్రయోజ‌నం పొంద‌వ‌చ్చు. ప్రక‌ట‌న‌కు సంబంధించిన పూర్తి స‌మాచారం తెలుసుకుందాం.

ఫేజ్-1 ప్రిలిమిన‌రీ ప‌రీక్ష:
వంద మార్కులకు ఆన్‌లైన్లో ప‌రీక్ష నిర్వహిస్తారు. ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు చొప్పున మొత్తం వంద ప్రశ్నలు వ‌స్తాయి. ప్రశ్నల‌న్నీ బ‌హుళైచ్ఛిక (ఆబ్జెక్టివ్) విధానంలో ఉంటాయి. ప‌రీక్షలో 3 విభాగాలు ఉంటాయి. ఇంగ్లిష్ లాంగ్వేజ్ 30, రీజ‌నింగ్ ఎబిలిటీ 35, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 35 ప్రశ్నలు వ‌స్తాయి. ప్రతి సెక్షన్‌లోనూ నిర్దేశిత క‌టాఫ్ మార్కులు సాధించాలి. అలాగే అన్ని సెక్షన్లూ క‌లుపుకుని కూడా నిర్దేశిత క‌టాఫ్ మార్కులు సాదించినవారే ప్రధాన ప‌రీక్షకు అర్హుల‌వుతారు. ఈ క‌టాఫ్ మార్కుల‌ను న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ నిర్ణయిస్తుంది. ఆయా కేట‌గిరీల్లో ఉన్న ఖాళీల‌కు 15 రెట్ల సంఖ్యలో అభ్యర్థుల‌ను మెయిన్ ప‌రీక్షకు ఎంపిక‌చేస్తారు. అంటే అన్ని కేటిగిరీల్లోనూ క‌లుపుకుని 4500 మందికి మెయిన్స్ రాసే అవ‌కాశం ద‌క్కుతుంది.

ఫేజ్‌-2 మెయిన్ ప‌రీక్ష:
ఇందులో 200 మార్కుల‌కు ఆబ్జెక్టివ్‌, 30 మార్కుల‌కు డిస్క్రిప్టివ్ ప‌రీక్షలు నిర్వహిస్తారు. ఈ రెండు ప‌రీక్షలూ ఆన్‌లైన్లోనే నిర్వహిస్తారు. ఆబ్జెక్టివ్ ప‌రీక్షలో 4 సెక్షన్లు ఉంటాయి. రీజ‌నింగ్‌, ఇంగ్లిష్ లాంగ్వేజ్‌, జ‌న‌ర‌ల్ అవేర్‌నెస్‌, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ ఒక్కో ఒక్కో అంశం నుంచి 50 చొప్పున మొత్తం 200 ప్రశ్నలు వ‌స్తాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు. ప‌రీక్ష వ్యవ‌ధి 2 గంట‌లు.

ఆబ్జెక్టివ్ టెస్టు పూర్తయిన వెంట‌నే కంప్యూట‌ర్‌పై డిస్క్రిప్టివ్ ప‌రీక్షను రాయాల్సి ఉంటుంది. ఈ ప‌రీక్ష వ్యవ‌ధి అర గంట‌. 30 మార్కుల‌కు నిర్వహించే ఈ ప‌రీక్షలో లేఖ రాయ‌డానికి 10, వ్యాసానికి 20 మార్కులు కేటాయించారు. ఆంగ్ల మాధ్యమంలోనే ప‌రీక్షను రాయాల్సి ఉంటుంది.

ఆబ్జెక్టివ్ ప‌రీక్షలో అభ్యర్థులు ప్రతి సెక్షన్‌లోనూ క‌నీస క‌టాఫ్ మార్కులు సాధించాలి. అలాగే అన్ని సెక్షన్లలోనూ క‌లుపుకుని క‌నీస అర్హత మార్కులు పొందాలి. ఇలా మార్కులు పొందిన అభ్యర్థుల డిస్క్రిప్టివ్ స‌మాధాన ప‌త్రాన్ని మూల్యాంక‌నం చేస్తారు. డిస్క్రిప్టివ్ ప‌రీక్షలో అర్హత సాధించ‌డం త‌ప్పనిస‌రి. అయితే ఇందులో సాధించిన మార్కుల‌ను ఇంట‌ర్వ్యూ, తుది ఎంపిక‌లో ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోరు.

ప్రిలిమ్స్‌, మెయిన్స్ రెండు ప‌రీక్షల్లోనూ రుణాత్మక మార్కులు ఉన్నాయి. ప్రతి త‌ప్పు స‌మాధానానికీ పావు మార్కు చొప్పున త‌గ్గిస్తారు.

ఇంట‌ర్వ్యూ
ఫేజ్‌-2లో అర్హుల‌కు ముఖాముఖి నిర్వహిస్తారు. ఆన్‌లైన్ ప‌రీక్ష, ఇంట‌ర్వ్యూల వెయిటేజీ 80:20 గా నిర్ణయించారు.

తుది నియామ‌కాలు
మెయిన్ ప‌రీక్ష (ఆబ్జెక్టివ్‌), ఇంట‌ర్వ్యూల్లో సాధించిన మార్కుల ద్వారా తుది నియామ‌కాలు చేప‌డ‌తారు.

ఎంపికైతే:
ఎక్కువ ఖాళీలు ముంబ‌యిలో ఉన్నాయి. అలాగే మ‌హ‌రాష్ట్ర, గుజ‌రాత్‌, గోవాల్లోనూ పోస్టులు ఉన్నాయి. ఎంపికైన అభ్యర్థులు క‌నీసం అయిదేళ్లపాటు వీటిలో ఏదోఒక చోట ప‌నిచేయాల్సి ఉంటుంది. విధుల్లోకి చేరిన‌వాళ్లు క‌నీసం నాలుగేళ్లపాటు ఉద్యోగంలో కొన‌సాగుతామ‌ని ఒప్పంద ప‌త్రాన్ని స‌మ‌ర్పించాల్సి ఉంటుంది. మ‌ధ్యలో వైదొలిగితే ఏడాది వేత‌నాన్ని చెల్లించాల్సి ఉంటుంది. ఉద్యోగంలోకి చేరిన‌వాళ్లు ఏడాది పాటు ప్రొబేష‌న్‌లో కొన‌సాగుతారు. ప్రొబేష‌న్‌లో వైదొలిగితే ఏడాది వేత‌నంతోపాటు శిక్షణ ఖ‌ర్చుల నిమిత్తం మ‌రో రూ.25 వేలు చెల్లించాలి. ప్రొబేష‌న్‌లో ఉండ‌గానే నాన్‌లైఫ్ లైసెన్సియేట్ ప‌రీక్షలో ఉత్తీర్ణత సాధించాలి. ప‌రీక్షలో అర్హత సాధించ‌నివారికి మ‌రో రెండు ప్రయ‌త్నాల వ‌ర‌కు అంటే ఏడాదిపాటు అవ‌కాశం క‌ల్పిస్తారు. అప్పటికీ అర్హత సాధించ‌లేక‌పోతే విధుల నుంచి తొల‌గిస్తారు. ఇలా ఉద్యోగాన్ని కోల్పోయిన‌వాళ్లు కూడా ఏడాది వేత‌నాన్ని చెల్లించాల్సి ఉంటుంది. విజ‌య‌వంతంగా ప్రొబేష‌న్ వ్యవ‌ధి పూర్తిచేసుకున్నవారిని శాశ్వత ఉద్యోగిగా ప‌రిగ‌ణిస్తారు. ప్రారంభ వేత‌న శ్రేణి రూ.32795-62315. అంటే నెల‌కు రూ.51 వేలు వేత‌నంగా పొంద‌వ‌చ్చు. అలాగే దీంతోపాటు ప‌లు ఇత‌ర ప్రోత్సాహ‌కాలు ఉంటాయి.

ముఖ్యమైన తేదీలు:
ఆన్‌లైన్ రిజిస్ట్రేస‌న్ ప్రారంభం: అక్టోబ‌రు 14 నుంచి
ఆన్‌లైన్ రిజిస్ట్రేష‌న్లకు చివ‌రి తేదీ: న‌వంబ‌రు 1
ప‌రీక్ష ఫీజు: ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల‌కు రూ.వంద‌, మిగిలిన అభ్యర్థులంద‌రికీ రూ.600.
ఫేజ్‌-1 ఆన్‌లైన్ ప‌రీక్ష తేదీ: డిసెంబ‌రు 17
ప‌రీక్ష కేంద్రాలు: ఆంధ్రప్రదేశ్‌లో చీరాల‌, చిత్తూరు, గుంటూరు, కాకినాడ‌, క‌ర్నూలు, నెల్లూరు, ఒంగోలు, పుత్తూరు. తెలంగాణ‌లో హైద‌రాబాద్‌, క‌రీంన‌గ‌ర్‌, ఖ‌మ్మం, వ‌రంగ‌ల్‌.
ఫేజ్‌-2 ఆన్‌లైన్ ప‌రీక్ష: జ‌న‌వ‌రిలో నిర్వహిస్తారు.
అర్హత‌: అక్టోబ‌రు 1, 2016 నాటికి ఏదైనా డిగ్రీలో క‌నీసం 60 శాతం మార్కుల‌తో ఉత్తీర్ణత సాధించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులైతే క‌నీసం 55 శాతం మార్కులు పొంద‌డం త‌ప్పనిస‌రి.
వ‌యోప‌రిమితి: అక్టోబ‌రు 1, 2016 నాటికి క‌నిష్ఠంగా 21, గ‌రిష్ఠంగా 30 ఏళ్లలోపు ఉండాలి. అంటే అక్టోబ‌రు 2, 1986 కంటే ముందు; అక్టోబ‌రు 1, 1995 త‌ర్వాత జ‌న్మించిన‌వాళ్లు అన‌ర్హులు. ఎస్సీ, ఎస్టీల‌కు అయిదేళ్లు; ఓబీసీల‌కు మూడేళ్లు, దివ్యాంగుల‌కు ప‌దేళ్లు గ‌రిష్ఠ వ‌యోప‌రిమితిలో స‌డ‌లింపులు వ‌ర్తిస్తాయి.
మొత్తం పోస్టులు: 300
విభాగాల‌వారీ ఖాళీలు: అన్ రిజ‌ర్వ్‌డ్ 158, ఓబీసీ 84, ఎస్సీ 43, ఎస్టీ 15.
వెబ్‌సైట్‌: www.newindia.co.in

Posted on 12-10-2016