Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
ఐఐటీల్లో పీజీ అవకాశం!
 
ఐఐటీలు అనగానే చాలామంది విద్యార్థులు బీటెక్‌ లేదా ఎంటెక్‌లకు సంబంధించినవిగా భావిస్తారు. కానీ బీఎస్‌సీ పూర్తిచేసినవారికి కూడా ఈ ప్రతిష్ఠాత్మక సంస్థల్లో చదివే అవకాశం ఉంది. ‘జామ్‌’ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి వివిధ ఐఐటీల్లో ఎంఎస్‌సీ, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశం పొందవచ్చు. ఈ పరీక్ష తీరుతెన్నులూ, దీనిలో నెగ్గేదెలాగో తెలుసుకుందామా?
జాయింట్‌ అడ్మిషన్‌ ఫర్‌ ఎంఎస్సీ (జామ్‌)ను 14 ఐఐటీల్లో పీజీ అడ్మిషన్ల కోసం నిర్వహిస్తున్నారు. జామ్‌ ర్యాంకు, ఇంటర్వ్యూ ఆధారంగా బెంగళూరు ఐఐఎస్‌సీలో ఇంటిగ్రేటెడ్‌ పీహెచ్‌డీలో ప్రవేశం లభిస్తుంది. 2016 నుంచి జామ్‌ ర్యాంకు ఆధారంగా ఎన్‌ఐటీల్లో కూడా ప్రవేశం కల్పిస్తున్నారు... Read more..
 
జామ్‌తో ఐఐటీల్లో ఎమ్మెస్సీ, పీహెచ్‌డీ కోర్సులు
 

* ఫిబ్రవ‌రిలో ప‌రీక్ష
* ప్రక‌ట‌న‌ జారీ!

ఐఐటీల్లో చ‌ద‌వాల‌నుకునే ఆశావ‌హుల‌కు ఓ చ‌క్కని అవ‌కాశం జామ్‌. ఎమ్మెస్సీ చేయాల‌నుకునే బీఎస్సీ విద్యార్థులు జామ్‌తో ఐఐటీల్లో పీజీ పూర్తిచేసుకోవ‌చ్చు. కొన్ని స‌బ్జెక్టుల్లో పీజీ, పీహెచ్‌డీ రెండూ ఇంటిగ్రేటెడ్ విధానంలో చ‌దువుకోవ‌చ్చు. సాధార‌ణ డిగ్రీ విద్యార్థులు సైతం ఐఐటీల మెట్లెక్కే అవ‌కాశం జామ్‌తో ల‌భిస్తుంది. జాయింట్‌ అడ్మిషన్‌ టెస్ట్‌ ఫర్ ఎమ్మెస్సీనే సంగ్రహంగా జామ్‌ అంటారు. ఈ పరీక్ష ర్యాంకుతో 14 ఐఐటీల‌తోపాటు ఐఐఎస్సీ-బెంగ‌ళూరులో పీజీ, ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశం పొంద‌వ‌చ్చు.

పోటీ ప‌రిమిత‌మే...ప్రయోజ‌నాలే అధికం
సాధారణ (రాష్ట్రస్థాయి) యూనివ‌ర్సిటీల్లో పీజీ చ‌దివిన‌వారితో పోలిస్తే ఐఐటీల్లో పీజీ, ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీ కోర్సులు చ‌దివిన‌వాళ్లకి ఉద్యోగావ‌కాశాలు మెరుగ్గా ఉంటాయి. ఆయా విభాగాల‌కు సంబంధించిన ప‌రిశోధ‌నా సంస్థల్లోనూ ఉద్యోగాలు పొంద‌వ‌చ్చు. బోధ‌న రంగంలోనైతే విశేషంగా రాణించ‌వ‌చ్చు. ప్రాథ‌మికాంశాల నుంచి ప్రారంభించి, స‌బ్జెక్టును పూర్తిస్థాయిలో బోధిస్తారు. ఆధునిక‌త‌కు ప్రాధాన్యమిస్తారు. విశేష అనుభ‌వం ఉన్న సిబ్బంది, అన్ని వ‌స‌తుల‌తో కూడిన ప్రయోగ‌శాల‌లు, గ్రంథాల‌యాలు, ప్రోత్సాహ‌క‌ర‌మైన వాతావ‌ర‌ణం, ప్రస్తుత అవ‌స‌రాల‌( ఇండ‌స్ట్రీ రెడీ)కు అనుగుణంగా క‌రిక్యుల‌మ్‌, ప‌రిశోధ‌నా సంస్థల‌తో అవ‌గాహ‌న‌...ఇవ‌న్నీ ఐఐటీల సొంతం. అలాఅని చెప్పి పోటీ మ‌రీ జేఈఈ స్థాయిలో ఉండ‌దు. 60 శాతం మార్కులు సాధిస్తే ఏదో ఒక ఐఐటీలో సీటు సొంత‌మ‌వుతుంది. అందువ‌ల్ల స‌గ‌టు విద్యార్థి సైతం సీటు కోసం ప్రయ‌త్నించి స‌ఫ‌లం కావ‌చ్చు. ఎందుకంటే ఈ ప‌రీక్షకు జాతీయ‌స్థాయిలో ఆశావ‌హులు త‌క్కువ సంఖ్యలో ఉంటారు. స్టేట్ యూనివ‌ర్సిటీల్లో ఉన్నట్లు స్థానిక రిజ‌ర్వేష‌న్లు(లోక‌ల్ కోటా) వ‌ర్తించ‌దు. డిగ్రీ అనంత‌రం విద్యార్థులు వివిధ కోర్సుల‌వైపు (ఎంబీఏ, ఎంసీఏ) వెళ్లడం, ఉద్యోగ ప్రయ‌త్నాలు...ఇలా ప‌లు కార‌ణాల‌వ‌ల్ల ఐఐటీ జామ్‌కు ప్రస్తుతం ఉండాల్సిన స్థాయిలో పోటీ లేదు. కాబ‌ట్టి సైన్స్ స‌బ్జెక్టుల్లో పీజీ కోర్సుల‌వైపు గురిపెట్టిన‌వాళ్లు ఐఐటీ జామ్ ల‌క్ష్యంగా ప్రయ‌త్నించి విజ‌యం సాధించ‌వ‌చ్చు. జామ్‌ద్వారా ల‌భించే మ‌రో వెసులుబాటు ఏమిటంటే... ఒకే ప‌రీక్షతో అన్ని ఐఐటీల్లోనూ ప్రవేశానికి పోటీ ప‌డ‌వ‌చ్చు. అదే రాష్ట్ర స్థాయి యూనివ‌ర్సిటీల‌కైతే విడిగా ప‌రీక్ష రాయాల్సిందే.

ప్రవేశాలు ఈ ఐఐటీల్లో
ఐఐటీ...

దిల్లీ www.iitd.ac.in
బాంబే www.iitb.ac.in
మ‌ద్రాస్ www.iitm.ac.in
కాన్పూర్ www.iitk.ac.in
ఖ‌ర‌గ్‌పూర్ www.iitkgp.ac.in
హైద‌రాబాద్ www.iith.ac.in
రూర్కీ www.iitr.ac.in
భువ‌నేశ్వ‌ర్ www.iitbbs.ac.in
గాంధీన‌గ‌ర్ www.iitgn.ac.in
గువాహ‌టి www.iitg.ac.in
ఇండోర్ www.iiti.ac.in
జోధ్‌పూర్ www.iitj.ac.in
ప‌ట్నా www.iitp.ac.in
రోప‌ర్ www.iitrpr.ac.in
ఐఐఎస్సీ- బెంగ‌ళూరు www.iisc.ernet.in

అర్హత‌లు:
ప్రవేశం కోరుకుంటున్న కోర్సును బట్టి ప్రవేశపరీక్షలో రాయవలసిన టెస్ట్‌ పేపర్లుంటాయి. ఐఐటీల్లో బయోటెక్నాలజీ, కెమిస్ట్రీ, జియాలజీ, మేథమేటిక్స్‌, ఫిజిక్స్‌, స్టాటిస్టిక్స్‌ సబ్జెక్టుల్లో వైవిధ్యమైన పీజీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఖరగ్‌పూర్‌, కాన్పూర్‌, బాంబే, దిల్లీ, చెన్నై, రూర్కీ, హైదరాబాద్‌, భువనేశ్వర్‌, గాంధీనగర్‌, రూపర్‌ ఐఐటీల్లో ప్రవేశానికి జనరల్‌ కేటగిరీ, ఓబీసీ విద్యార్థులైతే బీఎస్సీలో 55 శాతం మార్కులు సాధించాలి. ఎస్సీ, ఎస్టీలైతే 50% ఉంటే స‌రిపోతుంది. ఐఐఎస్‌సీలో ప్రవేశానికి జనరల్‌ కేటగిరీ, ఓబీసీ విద్యార్థులు బీఎస్సీలో 60% మార్కులు సాధించాలి. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులైతే 50 శాతం. ఎమ్మెస్సీ బయోటెక్నాలజీ పరీక్షకు ఏదైనా సైన్స్‌ గ్రాడ్యుయేట్‌ విద్యార్థులతోపాటు అగ్రికల్చర్‌, ఫార్మసీ, ఇంజినీరింగ్‌, మెడిసిన్‌ విద్యార్థులు కూడా అర్హులు. ఎమ్మెస్సీ- కెమిస్ట్రీ పరీక్షకు బీఎస్సీలో కెమిస్ట్రీతోపాటు 10+2లో మ్యాథ్స్ చ‌దివిన విద్యార్థులు మాత్రమే అర్హులు. బీఎస్సీలో మ్యాథ్స్ చ‌దివిన‌వాళ్లు ఎమ్మెస్సీ మ్యాథ్స్‌, బీఎస్సీలో ఫిజిక్స్ చ‌దివిన‌వాళ్లు ఎమ్మెస్సీ ఫిజిక్స్ కోర్సుల‌కు అర్హులు.

పరీక్ష విధానం
పరీక్ష 7 టెస్ట్‌ పేపర్లలో నిర్వహిస్తున్నారు. అవి:
1. బయలాజికల్‌ సైన్స్‌ (బీఎల్‌)
2. బయోటెక్నాలజీ (బీటీ)
3. కెమిస్ట్రీ (సీవై)
4. జియాలజీ (జీజీ)
5. మేథమేటిక్స్‌ (ఎంఏ)
6. మేథమేటికల్‌ స్టాటిస్టిక్స్‌ (ఎంఎస్‌)
7. ఫిజిక్స్‌ (పీహెచ్‌)
ఒక్కో అభ్యర్థి గ‌రిష్ఠంగా రెండు పేప‌ర్లలో ప‌రీక్ష రాసుకోవ‌చ్చు. ఉద‌యం 3 పేప‌ర్లు, మ‌ధ్యాహ్నం 4 పేప‌ర్లకు ప‌రీక్షలు నిర్వహిస్తారు. కాబ‌ట్టి అర్హత‌ల‌కు అనుగుణంగా ఉద‌యం ఒక‌టి, మ‌ధ్యాహ్నం మ‌రొక‌టి రాసుకోవ‌డానికి అవ‌కాశం ఉంది.
ప్రశ్నపత్రం ఆంగ్ల మాధ్యమంలోనే ఉంటుంది. ఒక్కో టెస్ట్‌ పేపర్‌ రాయడానికి 3 గంటల సమయం కేటాయిస్తారు. ఒక్కో టెస్ట్‌ పేపర్‌లో మొత్తం 60 ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. ఛాయిస్‌ ఉండదు. ఈ 60 ప్రశ్నలకు 100 మార్కుల వెయిటేజీ ఉంది. ఒక్కో టెస్ట్‌ పేపర్‌లో ప్రశ్నలను మూడు విభాగాలుగా విభజించారు. అవి...
1. మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలు
2. మల్టిపుల్‌ సెలెక్ట్‌ ప్రశ్నలు
3. న్యూమరికల్‌ సమాధాన ప్రశ్నలు
ఒక్కో టెస్ట్‌ పేపర్‌లో ఎ, బి, సి అనే మూడు సెక్షన్లు ఉంటాయి.
* సెక్షన్‌-ఎ: ఈ సెక్షన్‌లో మొత్తం 30 మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలుంటాయి. ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం రాయాలి. ఈ ప్రశ్నల్లోని నాలుగు ఆప్షన్లలో ఒకటి మాత్రమే సరైనది ఉంటుంది. ఈ విభాగంలో ఒక్కో ప్రశ్నకు 1 లేదా 2 మార్కుల వెయిటేజీ ఉండవచ్చు. తప్పు సమాధానాలకు రుణాత్మక మార్కులున్నాయి. ఒక మార్కుల వెయిటేజీ ఉన్న ప్రశ్నలకు 1/3, రెండు మార్కుల ప్రశ్నలకు 2/3 రుణాత్మక మార్కులున్నాయి.
* సెక్షన్‌-బి: ఈ సెక్షన్‌లో మొత్తం 10 మల్టిపుల్‌ సెలక్ట్‌ ప్రశ్నలుంటాయి. ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం రాయాలి. ఈ ప్రశ్నల్లోని 4 ఆప్షన్లలో ఒకటి కంటే ఎక్కువ సరైన సమాధానాలుంటాయి. అందువ‌ల్ల సరైన సమాధానాలన్నింటినీ సెలెక్ట్ చేసుకోవాలి. ఈ విభాగంలో ఒక్కో ప్రశ్నకు రెండు మార్కుల వెయిటేజీ ఉంటుంది. ఈ ప్రశ్నలకు రుణాత్మక మార్కులు, పాక్షిక మార్కులు ఉండవు.
* సెక్షన్‌-సి: మొత్తం 20 న్యూమరికల్‌ సమాధాన ప్రశ్నలుంటాయి. ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం రాయాలి. ఈ విభాగంలో ఒక్కో ప్రశ్నకు ఒకటి లేదా రెండు మార్కుల వెయిటేజీ ఉండవచ్చు. ఈ ప్రశ్నలకు సమాధానాలను వాస్తవ సంఖ్యల రూపంలో కంప్యూటర్‌లో నమోదు చేయాలి. ఈ ప్రశ్నలకు రుణాత్మక మార్కులుండవు.

సన్నద్ధత ఇలా...
ప్రశ్నలన్నీ విద్యార్థుల విశ్లేషణ, తార్కిక సామర్థ్యాలను పరీక్షించేలా ఉండడం జామ్‌ ప్రత్యేకత. బీఎస్సీ ఆన‌ర్స్ (నాలుగేళ్ల డిగ్రీ) కోర్సు చ‌దివిన విద్యార్థులు ఎక్కువ‌గా ప్రవేశాలు పొందుతున్నారు. కాబట్టి తెలుగు రాష్ట్రాల విద్యార్థులు వాళ్లను దృష్టిలో ఉంచుకుని, సంబంధిత సబ్జెక్టును క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి.
సంబంధిత స‌బ్జెక్టులో ఇంట‌ర్ నుంచి స‌న్నద్ధత మొద‌లు పెట్టాలి. ముందుగా ప్రాథ‌మికాంశాల‌ను బాగా చ‌ద‌వాలి. ఇంట‌ర్‌, డిగ్రీ తెలుగు అకాడెమీ పుస్తకాల‌ను అధిక‌ప్రాధాన్యంతో చ‌దువుకోవాలి.
గ‌తంలో నిర్వహించిన జామ్ ప్రశ్నప‌త్రాలు ఐఐటీల వెబ్‌సైట్ల‌లో అందుబాటులో ఉన్నాయి. వాటిని బాగా అధ్యయ‌నం చేయాలి.
ఆయా పేప‌ర్లకు సంబంధించి జామ్ సిల‌బ‌స్‌ను పూర్తిగా తెలుసుకోవాలి. డిగ్రీ పుస్తకాలు బాగా చ‌దివిన త‌ర్వాత రిఫ‌రెన్స్ కోసం ఒక‌ట్రెండు ప్రామాణిక పుస్తకాల‌ను చదివితే ప్రయోజ‌నం.

స‌బ్జెక్టుల‌వారీ...
* బయలాజికల్‌ సైన్స్‌: సిలబస్‌లో ఎక్కువశాతం బయాలజీ, కొంత మేథమేటిక్స్‌ ఉంది. ముఖ్యంగా జనరల్‌ బయాలజీ, బేసిక్స్‌ ఆఫ్‌ బయోకెమిస్ట్రీ, బయోఫిజిక్స్‌, మాలిక్యులార్‌ బయాలజీ, మైక్రో బయాలజీ, సెల్‌ బయాలజీ, ఇమ్యునాలజీ, మేథమేటికల్‌ సైన్సెస్‌, మేథమెటికల్‌ ఫంక్షన్స్‌ చ‌దువుకోవాలి.
* బయోటెక్నాలజీ: ఈ ప్రవేశపరీక్షలో ఎక్కువ సీట్లను ఎంపీసీ విద్యార్థులు కైవసం చేసుకుంటున్నారు. కాబట్టి బైపీసీ విద్యార్థులు బయాలజీ, కెమిస్ట్రీతోపాటు మేథమేటిక్స్‌, ఫిజిక్స్‌ల మీద ఎక్కువ దృష్టి కేంద్రీకరించాలి. బీఎస్‌సీ సిలబస్‌ అంశాలవారీగా రిఫరెన్స్‌ పుస్తకాల ద్వారా సబ్జెక్టును క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి. బీఎస్‌సీలో మోడరన్‌ బయాలజీ గ్రూపులను కలిగిన విద్యార్థులు బోటనీ, జువాలజీ సిలబస్‌ను కూడా బాగా అధ్యయనం చేయాలి.
బయోకెమిస్ట్రీ సిలబస్‌లో అమైనో ఆసిడ్స్‌- ప్రోటీన్స్‌, కార్బోహైడ్రేట్‌ మెటబాలిజం, ఎంజైమ్స్‌, బయోకెమికల్‌ టెక్నిక్స్‌, సెల్‌- సిగ్నలింగ్‌ మొదలైన టాపిక్స్‌ నుంచి ఎక్కువ ప్రశ్నలను అడుగుతున్నారు. కాబట్టి ఈ వీటిపై అధిక దృష్టి అవసరం. జెనెటిక్స్‌, మాలిక్యులార్‌ బయాలజీ సిలబస్‌లో డీఎన్‌ఏ ధర్మాలు, ఆర్‌డీఎన్‌ఏ టెక్నాలజీ, ట్రాన్స్‌లేషన్‌, ట్రాన్స్‌క్రిప్షన్‌ మొదలైనవి ముఖ్యమైనవి.
ఆర్గానిక్‌ కెమిస్ట్రీలో రియాక్షన్‌ మెకానిజం, స్టీరియో కెమిస్ట్రీ, నెమెడ్‌ రియాక్షన్స్‌, ఫిజికల్‌ కెమిస్ట్రీలో కెమికల్‌ కైనటిక్స్‌, థర్మోడైనమిక్స్‌ సంబంధిత అంశాలను చదవాలి. ఇనార్గానిక్‌ కెమిస్ట్రీలో సంశ్లిష్ట సమ్మేళనాలు, ఎనలిటికల్‌ కెమిస్ట్రీ మొదలైన అంశాలు ప్రధానం.
ఈ విద్యార్థులు మేథమేటిక్స్‌ మ్యాట్రిక్స్‌, డెరివేటివ్స్‌, కాలిక్యులస్‌, వెక్టార్స్‌, త్రికోణమితి, కోర్డానేట్‌ జామెట్రీ సబ్జెక్టులను క్షుణ్ణంగా సాధన చేయాలి.
* ఎంఎస్‌సీ- కెమిస్ట్రీ: ముఖ్యంగా ఫిజికల్‌ కెమిస్ట్రీ, ఆర్గానిక్‌ కెమిస్ట్రీ మీద ఎక్కువ దృష్టి కేంద్రీకరించాలి. మేథ్స్‌లో పేర్కొన్న బేసిక్‌ సిలబస్‌ను కూడా అధ్యయనం చేయాలి. ఆర్గానిక్‌ కెమిస్ట్రీలో జనరల్‌ ఆర్గానిక్‌ కెమిస్ట్రీ, రియాక్షన్‌ మెకానిజం, స్టీరియో కెమిస్ట్రీ, నెమెడ్‌ రియాక్షన్స్‌, రియోజెంట్స్‌, ఫిజికల్‌ కెమిస్ట్రీలో థర్మోడైనమిక్స్‌, కెమికల్‌ కైనటిక్స్‌, క్వాంటమ్‌ కెమిస్ట్రీ, ఎలక్ట్రో కెమిస్ట్రీ సంబంధిత అంశాలను క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి. ఇనార్గానిక్‌ కెమిస్ట్రీ సంశ్లిష్ట సమ్మేళనాలు, ఎనలిటికల్‌ కెమిస్ట్రీ మొదలైన అంశాలమీద ఎక్కువ దృష్టి పెట్టాలి.
* ఫిజిక్స్‌: ఫిజికల్‌ ఆప్టిక్స్‌, క్వాంటమ్‌ మెకానిక్స్‌, థర్మోడైనమిక్స్‌, ఎలక్ట్రానిక్స్‌- ఆసిలెషన్స్‌, వేవ్స్‌- ఆసిలెషన్స్‌, క్వాంటమ్‌, స్పెక్ట్రోస్కోపి, నూక్లియర్‌- అటామిక్‌ ఫిజిక్స్‌ హీట్‌, ఆప్టిక్స్‌, మోడరన్‌ ఫిజిక్స్‌ సంబంధిత సిలబస్‌ను అనువర్తిత ధోరణిలో అధ్యయనం చేయాలి.
* మేథమేటిక్స్‌: మ్యాట్రిక్స్‌, డెరివేటివ్స్‌, కాల్‌క్యులస్‌, వెక్టర్స్‌, ట్రిగొనామెట్రి, కోర్డానేట్‌ జామెట్రీ సబ్జెక్టులను క్షుణ్ణంగా సాధన చేయాలి.

జామ్‌-2017: ముఖ్యాంశాలు
* ఈ సంవత్సరం జామ్‌ను ఐఐటీ-దిల్లీ నిర్వహిస్తోంది.
* ఆన్‌లైన్‌లోనే ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. ప‌రీక్షలు కూడా ఆన్‌లైన్‌లోనే ఉంటాయి.
ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుల ప్రారంభం: సెప్టెంబ‌రు 5
ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ‌కు చివ‌రి తేదీ: అక్టోబ‌రు 6
ప‌రీక్ష తేదీ: ఫిబ్రవ‌రి 12, 2017 (ఆదివారం)
సెష‌న్ 1 ఉద‌యం 9 నుంచి మ‌ధ్యాహ్నం 12 వ‌ర‌కు (బీఎల్‌, ఎంఏ, పీహెచ్ పేప‌ర్లు)
సెష‌న్ 2 మ‌ధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 వ‌ర‌కు (బీటీ, సీవై, జీజీ, ఎంఎస్‌)
తెలుగు రాష్ట్రాల్లో ప‌రీక్ష కేంద్రాలు: హైద‌రాబాద్‌, విజ‌య‌వాడ‌, విశాఖ‌ప‌ట్నం, వ‌రంగ‌ల్‌
ప‌రీక్ష ఫీజు: మ‌హిళ‌లు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల‌కు రూ.750. రెండు పేప‌ర్లకు రూ.1050. జ‌న‌ర‌ల్‌, ఓబీసీ అభ్యర్థుల‌కు రూ.1500. రెండు పేప‌ర్లక‌యితే రూ.2100.
వెబ్‌సైట్‌: http://jam.iitd.ac.in/


posted on 28-06-2016