Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
గ‌ణితం...అవ‌కాశాల గుణింతం!
 

సైన్స్ విద్యార్థుల‌కు ఎంతో ఇష్టమైన స‌బ్జెక్టుల్లో గ‌ణితం ముందు వ‌రుస‌లో ఉంటుంది. భార‌త్‌లో ఎక్కువ మంది ఇంట‌ర్‌, డిగ్రీ స్థాయి విద్యార్థులు చ‌దివే కోర్సు లెక్కలే. ముఖ్యంగా ద‌క్షిణ భార‌త‌దేశంలో గ‌ణితశాస్త్రం చ‌దివే విద్యార్థుల సంఖ్య చాలా ఎక్కువ‌. ఆర్యభ‌ట్ట‌, శ్రీనివాస రామానుజన్‌ ద్వారా లెక్కల్లో భార‌తీయుల ప్రతిభ జ‌గ‌ద్విఖ్యాత‌మైంది. పూర్వ ప్రతిష్ఠకు కొన‌సాగింపుగా గ‌ణితంలో విద్య, ప‌రిశోధ‌న‌ల‌ను ప్రోత్సహించే ల‌క్ష్యంతో ఎన్నో ప్రసిద్ధ సంస్థల‌ను దేశంలో నెల‌కొల్పారు. ఐఐటీలు, ఐఐఎస్సీతోపాటు సీఎంఐ, టీఐఎఫ్ఆర్‌, ఐఎంఎస్‌, ఐఎస్ఐ, ఐఐఎస్ఈఆర్‌, ఎన్ఐఎస్ఈఆర్‌...ఇలా ప్రముఖ సంస్థల్లో డిగ్రీ, ఇంటిగ్రేటెడ్ పీజీ, పీజీ, ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీ, పీహెచ్‌డీ స్థాయుల్లో మ్యాథ్స్ కోర్సు అందుబాటులో ఉంది. ఈ స‌బ్జెక్టులో పీజీ పూర్తిచేసిన‌వారికి ఉపాధి అవ‌కాశాల‌కు ఎలాంటి ఢోకాలేదు. మ్యాథ్స్‌ కోర్సు అందించే సంస్థలు, చ‌దివిన‌వారికి ఉండే అవ‌కాశాలు తెలుసుకుందాం...
ఇంట‌ర్ నుంచి మొద‌లు...
ఐసీఎస్ఈ విధానంలో త‌ప్ప ఇత‌ర ఏ బోర్డు ద్వారా విద్య అభ్యసించిన‌ప్పటికీ ప‌దోత‌ర‌గ‌తి వ‌ర‌కు మ్యాథ్స్ ఒక స‌బ్జెక్టుగా చ‌దువుకోవ‌డం భార‌త్‌లో త‌ప్పనిస‌రి. విద్యార్థి అభిరుచి మేర‌కు ప్రత్యేక స‌బ్జెక్టుగా గ‌ణితం చ‌దివే అవ‌కాశం ఇంట‌ర్మీడియ‌ట్ (ప్లస్ వ‌న్‌) నుంచే వ‌స్తుంది. ఇంట‌ర్‌లో ఈ స‌బ్జెక్టు చ‌దివితేనే ఇంజినీరింగ్, బీఎస్సీ/ బీఏ మ్యాథ్స్, ఇంటిగ్రేటెడ్ పీజీ (మ్యాథ్స్‌) కోర్సుల్లో ప్రవేశం ల‌భిస్తుంది. డిగ్రీలో మ్యాథ్స్ చ‌దివిన‌వాళ్లే పీజీ, ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీ స్థాయుల్లో మ్యాథ్స్ చ‌ద‌వ‌డానికి అర్హుల‌వుతారు. అంటే మ్యాథ్స్ స‌బ్జెక్టుపై ఆస‌క్తి ఉన్నవాళ్లు ఇంట‌ర్ నుంచే దీన్ని ఒక స‌బ్జెక్టుగా చ‌ద‌వ‌డం త‌ప్పనిస‌రి. మారుతున్న అవ‌స‌రాల‌ను దృష్టిలో ఉంచుకుని కొన్ని ఐఐటీలు, మ‌రికొన్ని సెంట్రల్ యూనివ‌ర్సిటీలు, రాష్ట్ర స్థాయి యూనివ‌ర్సిటీల్లో సైతం ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ కోర్సును రూపొందించారు. ఇంట‌ర్‌లో మ్యాథ్స్ చ‌దివిన‌వాళ్లు ఈ కోర్సులో చేరొచ్చు. అలాగే డిగ్రీలో మ్యాథ్స్ చ‌దివిన‌వాళ్లకు ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ పీహెచ్‌డీ కోర్సు కూడా ఐఐటీలు, సెంట్రల్ యూనివ‌ర్సిటీల్లో అందుబాటులో ఉంది. ఐఐఎస్ఈఆర్‌, ఎన్ఐఎస్ఈఆర్‌, ఐఎంఎస్‌...ఇలా ప్రముఖ సంస్థల్లో ఈ కోర్సులను బోధిస్తున్నారు. అయితే ప్రముఖ సంస్థల్లో ప్రవేశానికి గ‌ణిత స‌బ్జెక్టులో గ‌ట్టి ప‌ట్టుండ‌డం త‌ప్పనిస‌రి. దేశంలో దాదాపు అన్ని విశ్వవిద్యాయాల ప్రాంగ‌ణాల్లోనూ గ‌ణితం కోర్సును బోధిస్తున్నారు.
అవ‌కాశాలిలా...
పీజీలో మ్యాథ్స్ చ‌దివిన‌వారికి ఇంజినీరింగ్ క‌ళాశాల‌లు అవ‌కాశాలు క‌ల్పిస్తున్నాయి. ఎందుకంటే ఇంజినీరింగ్ ఏ బ్రాంచ్‌లో చేరిన‌ప్పటికీ మొద‌టి సంవ‌త్సరం రెండు సెమిస్టర్లలోనూ మ్యాథ్స్ త‌ప్పనిస‌రి స‌బ్జెక్టు. అలాగే ఐఐటీ-జేఈఈ, ఎంసెట్ ఇలా ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే రాత ప‌రీక్షలో మ్యాథ్సే కీల‌కం. స‌గం ప్రశ్నలు గ‌ణిత‌శాస్త్రం నుంచే అడుగుతారు. సీటు కోసం పోటీ ప‌డే విద్యార్థుల‌ సంఖ్య ల‌క్షల్లో ఉంటోంది. దీంతో నాణ్యమైన శిక్షకుల అవ‌స‌రం పెరిగింది. స‌బ్జెక్టుపై ప‌ట్టు, బోధ‌నా సామ‌ర్థ్యం ఉంటే కార్పొరేట్ క‌ళాశాల‌లు ల‌క్షల్లో వేత‌నాల‌ను అందిస్తున్నాయి. రాజ‌స్థాన్‌ (కోట‌), ఢిల్లీ, బెంగ‌ళూరు, ముంబైల్లో ఐఐటీ జేఈఈ మ్యాథ్స్ శిక్షకుల‌కు నెల‌కు రూ.5 ల‌క్షల వేత‌నాన్ని చెల్లించే సంస్థలు కూడా ఉన్నాయంటే ఆశ్చర్య ప‌డాల్సిన ప‌నిలేదు. తెలుగు రాష్ట్రాల్లోనూ రూ. 3 ల‌క్షల వేత‌నాన్ని అందుకునే మ్యాథ్స్ కోచ్‌ల సంఖ్య త‌క్కువేమీ కాదు. అయితే ఇంత మొత్తంలో వేత‌నం కొత్తవారి (ఫ్రెష‌ర్స్‌)కి మాత్రం ల‌భించ‌దు. స‌బ్జెక్టుపై ప‌ట్టు, క్షణాల్లో స‌మ‌స్యను ప‌రిష్కరించ‌గ‌లిగే స‌త్తా, బోధ‌న‌లో అనుభ‌వం, సులువుగా అర్థమ‌య్యేలా చెప్పగ‌ల‌గ‌డం, భిన్న కోణాల్లో అంశాన్ని విశ్లేషించ‌డం ఇవ‌న్నీ వేత‌నానికి ప్రామాణికంగా తీసుకుంటారు. ప్రముఖ సంస్థల నుంచి పీజీ పూర్తిచేస్తే ప్రారంభంలోనే నెల‌కు రూ.25 వేల నుంచి 50 వేల వ‌ర‌కు వేత‌నాన్ని కార్పొరేట్ క‌ళాశాల‌లు అందిస్తున్నాయి. మేనేజ్‌మెంట్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే జీమ్యాట్‌, క్యాట్‌, మ్యాట్‌, ఐసెట్‌..ఇలా ప్రతి ప‌రీక్షలోనూ రీజ‌నింగ్‌, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ విభాగాలు ఉంటాయి. ఆయా ప‌రీక్షల్లో ఈ రెండే కీల‌క‌మైన అంశాలు. ఎందుకంటే వీటిలో ఎక్కువ మార్కులు స్కోర్‌చేస్తేనే మంచి బీ స్కూల్‌/ క‌ళాశాల‌లో సీటు సాధించ‌డం వీల‌వుతుంది. ఈ అంశాల్లో శిక్షణ ఇవ్వడానికి మ్యాథ్స్ బ్యాక్ గ్రౌండ్ ఉంటేనే సాధ్యం. అలాగే బ్యాంక్ పీవో, క్లరిక‌ల్‌, ఎస్ఎస్‌సీ, రైల్వేలు, సీశాట్, సీడీఎస్‌, ఎన్‌డీఏ...ఇలా అన్ని పోటీ ప‌రీక్షల్లోనూ మ్యాథ్స్ ఒక అంత‌ర్భాగం. దీంతో ఈ ప‌రీక్షల‌కు శిక్షణ ఇచ్చే సంస్థల్లో ఫ్యాక‌ల్టీగా రాణించ‌వ‌చ్చు. ప్రస్తుతం న‌గ‌రాలు, ప‌ట్టణాల్లో హోం ట్యూష‌న్ కోసం డిమాండ్ పెరుగుతోంది. ఎక్కువ మంది విద్యార్థులు, త‌ల్లిదండ్రులు మ్యాథ్స్ ట్యూట‌ర్ల‌నే నియ‌మించుకుంటున్నారు. ఇలా హోం ట్యూష‌న్లు చెప్పుకుంటూ హైద‌రాబాద్‌లో నెల‌కు రూ.20,000 ఆపైన సంపాదించ‌డం విశేష‌మేమీ కాదు. వీట‌న్నింటితోపాటు మిగిలిన స‌బ్జెక్టులు చ‌దివిన‌వారితో పోల్చుకుంటే మ్యాథ్స్ చ‌దివిన విద్యార్థులు పోటీ ప‌రీక్షల్లో రాణించ‌డానికీ ఎక్కువ అవ‌కాశాలున్నాయి. ఎందుకంటే ఆయా ప‌రీక్షల్లో సింహ‌భాగం ప్రశ్నలు మ్యాథ్స్ బ్యాక్ గ్రౌండ్‌పైనే ఆధార‌ప‌డి ఉంటాయి. ప‌రీక్ష ఏదైన‌ప్పటికీ అర్థమెటిక్‌, రీజ‌నింగ్‌, న్యూమ‌రిక‌ల్ ఎబిలిటీ, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్‌...ఈ పేర్లు లేకుండా ఉండ‌దు. ఈ అంశాల‌న్నీ గ‌ణిత గ్రాడ్యుయేట్లకు లాభం చేకూర్చేవే.
ప్రభుత్వ కళాశాల‌ల్లో...
ఎంపీసీ గ్రూప్‌లేని ప్రభుత్వ జూనియ‌ర్ క‌ళాశాల తెలుగు రాష్ట్రాల్లో దాదాపు లేద‌నే చెప్పుకోవ‌చ్చు. పీజీ పూర్తి చేసిన అభ్యర్థులు వీటిలో ఖాళీలున్నప్పుడు ఆయా రాష్ట్రాల ప‌బ్లిక్ సర్వీస్ క‌మిష‌న్లు నిర్వహించే ప‌రీక్ష ద్వారా మ్యాథ్స్ జేఎల్ ఉద్యోగాన్ని సొంతం చేసుకోవ‌చ్చు. యూజీసీ నెట్ లెక్చర‌ర్‌షిప్‌లో అర్హత సాధించిన మ్యాథ్స్ అభ్యర్థులు ప్రభుత్వ డిగ్రీ క‌ళాశాల‌ల్లో మ్యాథ్స్ లెక్చర‌ర్ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. యూనివ‌ర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ పోస్టుల‌కు కూడా వీరు అర్హులే. నెట్ జేఆర్ఎఫ్‌కు ఎంపికైన‌వాళ్లు నెల‌కు రూ.25,000 ఫెలోషిప్ అందుకుంటూ పీహెచ్‌డీ పూర్తిచేయొచ్చు. మ్యాథ్స్‌లో డిగ్రీ పూర్తిచేసిన‌వాళ్లు బీఎడ్ ద్వారా స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ పోస్టుల‌కు పోటీప‌డొచ్చు. ఇలా మ్యాథ్స్ అభ్యర్థులు బోధ‌న‌రంగంలో అపార అవ‌కాశాలు సొంతం చేసుకునే అవ‌కాశం ఉంది.
సాఫ్ట్‌వేర్‌లోనూ...
సాఫ్ట్‌వేర్ సంస్థలు ప్రముఖ యూనివ‌ర్సిటీల్లో మ్యాథ్స్ చ‌దివిన విద్యార్థుల‌ను ఉద్యోగులుగా తీసుకుంటున్నాయి. వీరు సాఫ్ట్‌వేర్ రంగంలో ఆప‌రేష‌న్స్ రీసెర్చ్ ఎన‌లిస్ట్‌, కంప్యూట‌ర్ సిస్టం ఎన‌లిస్ట్ త‌దిత‌ర హోదాల‌తో రాణించ‌వ‌చ్చు. ప్రాంగ‌ణ నియామకాల్లో అవ‌కాశం ద‌క్కనివాళ్లు పీజీ అనంత‌రం ఏవైనా సాఫ్ట్‌వేర్ కోర్సులు ముఖ్యంగా టెస్టింగ్ టూల్స్ లాంటివి నేర్చుకుని రాణించ‌డం క‌ష్టమేమీ కాదు. ప‌లు ఆర్థిక, బీమా సంస్థలు సైతం మ్యాథ్స్‌లో పీజీ పూర్తిచేసిన‌వారిని డేటా ఎన‌లిస్ట్ ఉద్యోగానికి తీసుకుంటున్నాయి. ఈ సంస్థల్లో వేత‌నాలు కూడా పెద్ద మొత్తంలోనే ఉంటాయి.
ఇంటిగ్రేటెడ్ ఇక్కడ‌...
ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ మ్యాథ్స్ కోర్సులు ఐఐటీ కాన్పూర్‌, బాంబేల్లో నిర్వహిస్తున్నారు. ఐఐటీ జేఈఈ ద్వారా ప్రవేశం ల‌భిస్తుంది. వీటితోపాటు యూనివ‌ర్సిటీ ఆఫ్ హైద‌రాబాద్‌, పాండిచ్చేరి సెంట్రల్ యూనివ‌ర్సిటీ, ఐఐఎస్ఈఆర్‌, ఎన్ఐఎస్ఈఆర్ ల్లోనూ ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ మ్యాథ్స్ కోర్సు ఉంది. ఐఐఎస్సీ బీఎస్‌+ఎంఎస్ (మ్యాథ్స్‌) కోర్సును 2012లో ప్రారంభించింది. ఇంట‌ర్‌లో మ్యాథ్స్ చ‌దివిన‌వాళ్లకు ప్రవేశ ప‌రీక్ష ద్వారా కోర్సులో అవ‌కాశం క‌ల్పిస్తారు. కొన్ని సంస్థలు మ్యాథ్స్‌లో ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీ కోర్సులు అందిస్తున్నాయి. వీటికి బీఎస్సీ మ్యాథ్స్ ఉత్తీర్ణులు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.
ఎంఏ/ ఎమ్మెస్సీ మ్యాథ్స్ ఏమిటా తేడా?
కొంత‌మందికి ఎంఏ మ్యాథ్స్ మ‌రికొంద‌రికి ఎమ్మెస్సీ మ్యాథ్స్ అని డిగ్రీలు ప్రధానం చేస్తారు. ఎందుకంటే బీఎస్సీలో మ్యాథ్స్ అభ్యర్థుల‌కు ఎమ్మెస్సీ, బీఏలో మ్యాథ్స్ చ‌దివిన‌వారికి ఎంఏ మ్యాథ్స్ ప్రదానం చేస్తారు. ఆర్ట్స్ గ్రూప్ విద్యార్థులు ఇంట‌ర్‌లో ఎంఈసీ గ్రూప్ చ‌దివి, డిగ్రీలోనూ మ్యాథ్స్‌, ఎక‌నామిక్స్ క‌ల‌యిక‌తో ఏదో ఒక కోర్సులో చేరతారు. ఇలాంటివారు పీజీలో మ్యాథ్స్ చ‌దివితే వీరికి ఎంఏ మ్యాథ్స్ డిగ్రీని అందిస్తారు. సైన్స్‌, నాన్ సైన్స్ అభ్యర్థులిద్దరికీ ఒకేర‌క‌మైన మ్యాథ్స్ కోర్సు పీజీ స్థాయిలో బోధిస్తారు. విద్యార్థులు డిగ్రీ స్థాయిలో చ‌దివిన గ్రూప్ ఆధారంగా ఎంఏ/ఎమ్మెస్సీ మ్యాథ్స్‌ డిగ్రీలు ప్రదానం చేస్తారు.
స్పెష‌లైజేష‌న్లు
పీజీ స్థాయిలో కొన్ని సంస్థల్లో గ‌ణితంలోనూ స్పెష‌లైజేష‌న్లు అందుబాటులో ఉన్నాయి. అవి..
అప్లయిడ్ మ్యాథ్స్
కంప్యుటేష‌న‌ల్ మ్యాథ‌మెటిక్స్ (కంప్యూట‌ర్ అప్లికేష‌న్స్‌)
మ్యాథ‌మెటిక‌ల్ స్టాటిస్టిక్స్‌
మ్యాథ‌మెటిక‌ల్ ఎక‌నామిక్స్‌
ఇండ‌స్ట్రియ‌ల్ మ్యాథ‌మెటిక్స్‌
ఫంక్షన‌ల్ మ్యాథ‌మెటిక్స్‌
మ్యాథ‌మెటిక‌ల్ ట్రైనింగ్ అండ్ టాలెంట్ సెర్చ్ ప్రోగ్రాం
డిగ్రీ, పీజీ స్థాయి విద్యార్థుల‌కు గ‌ణితంలో ప్రతిభ‌ను ప్రోత్సహించి, వారిని మ‌రింత‌గా సాన‌బెట్టే ల‌క్ష్యంతో మ్యాథ‌మెటిక‌ల్ ట్రైనింగ్ అండ్ టాలెంట్ సెర్చ్ ప్రోగ్రాంను ఏర్పాటుచేశారు. ఎంపికైన అభ్యర్థుల‌కు ఉచితంగా శిక్షణ అందిస్తారు. ఈ శిక్షణ‌ను నేష‌న‌ల్ బోర్డ్ ఆఫ్ హ‌య్యర్ మ్యాథ‌మెటిక్స్ (ఎన్‌బీహెచ్ఎం) ప‌ర్యవేక్షిస్తుంది. గ‌ణితాన్ని ప్రోత్సహించ‌డానికి డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్ ఎన‌ర్జీ (డీఏఈ) ఆధ్వర్యంలో (ఎన్‌బీహెచ్ఎం) ఆవిర్భవించింది.
వెబ్‌సైట్లు:
http://www.mtts.org.in/
http://www.nbhm.dae.gov.in/

ప్రముఖ సంస్థలివీ...
చెన్నై మ్యాథ‌మెటిక‌ల్ ఇన్‌స్టిట్యూట్, చెన్నై
కోర్సులు: బీఎస్సీ, ఎమ్మెస్సీ, పీహెచ్‌డీ
వెబ్‌సైట్‌: http://www.cmi.ac.in/admissions/

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మ్యాథ‌మెటిక‌ల్ సైన్సెస్‌, చెన్నై
కోర్సులు: ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీ, పీహెచ్‌డీ
వెబ్‌సైట్‌: http://www.imsc.res.in/phd_programme_mathematics

ఐఐటీ ఢిల్లీ, గాంధీన‌గ‌ర్‌, హైద‌రాబాద్‌, కాన్సూర్‌, ఖ‌ర‌గ్‌పూర్‌, మ‌ద్రాస్‌, రూర్కీ, రోపార్‌
కోర్సు: రెండేళ్ల ఎమ్మెస్సీ మ్యాథ్స్ కోర్సు
ప్రవేశం: ఐఐటీలు ఉమ్మడిగా నిర్వహించే జామ్ ద్వారా
వెబ్‌సైట్‌: https://jam.iitg.ernet.in/

ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్‌, బెంగ‌ళూరు
కోర్సులు: ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీ, పీహెచ్‌డీ
వెబ్‌సైట్‌: http://www.math.iisc.ernet.in/degprog.htm

టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండ‌మెంట‌ల్ రీసెర్చ్ (టీఐఎఫ్ఆర్), ముంబై
కోర్సులు: ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీ, పీహెచ్‌డీ
వెబ్‌సైట్‌: http://univ.tifr.res.in

హ‌రీశ్ చంద్ర రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్, అల‌హాబాద్‌
కోర్సులు: ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీ, పీహెచ్‌డీ
వెబ్‌సైట్‌: http://www.hri.res.in/

ఇండియ‌న్ స్టాటిస్టిక‌ల్ ఇన్‌స్టిట్యూట్ (ఐఎస్ఐ) కోల్‌క‌తా, బెంగ‌ళూరు క్యాంప‌స్‌లు
కోర్సు: మాస్టర్ ఆఫ్ మ్యాథ‌మెటిక్స్
వెబ్‌సైట్‌: http://www.isical.ac.in/academicprogramme.php

ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేష‌న్ అండ్ రీసెర్చ్ (ఐఐఎస్ఈఆర్‌), భోపాల్‌, కోల్‌క‌తా, మొహాలీ, పుణే, తిరువ‌నంత‌పురం
కోర్సులు: బీఎస్‌, ఎంఎస్ (డ్యూయ‌ల్‌); ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీ, పీహెచ్‌డీ
వెబ్‌సైట్‌: www.iiserb.ac.in

నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేష‌న్ అండ్ రీసెర్చ్‌, భువ‌నేశ్వర్‌
కోర్సులు: ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ, పీహెచ్‌డీ
వెబ్‌సైట్‌: http://sms.niser.ac.in/

హైద‌రాబాద్ సెంట్రల్ యూనివ‌ర్సిటీ
కోర్సులు: ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ/ఎంఏ మ్యాథ్స్‌, రెండేళ్ల ఎమ్మెస్సీ మ్యాథ్స్‌, పీహెచ్‌డీ
వెబ్‌సైట్‌: http://www.uohyd.ac.in/

గ‌మ‌నిక‌: పైన పేర్కొన్న సంస్థల్లో డిగ్రీ, ఇంటిగ్రేటెడ్ పీజీ, పీజీ కోర్సుల్లో చేరిన‌వారికి ప్రతి నెలా సుమారు రూ.5 వేలు ఉప‌కార‌వేత‌నం కూడా ల‌భిస్తుంది. పీహెచ్‌డీ అభ్యర్థుల‌కు నెల‌కు రూ.25,000 చొప్పున చెల్లిస్తారు.

తెలుగు రాష్ట్రాల్లో...
ఆంధ్రా యూనివ‌ర్సిటీ, విశాఖ‌ప‌ట్నం,
కోర్సులు: ఎమ్మెస్సీ అప్లయిడ్ మ్యాథ్స్‌, మ్యాథ్స్‌
వెబ్‌సైట్‌: http://www.andhrauniversity.edu.in/courses.html

ఉస్మానియా యూనివ‌ర్సిటీ, హైద‌రాబాద్‌
కోర్సులు: ఎంఏ/ ఎమ్మెస్సీ మ్యాథ్స్‌

శ్రీవెంక‌టేశ్వర యూనివ‌ర్సిటీ, తిరుప‌తి
కోర్సులు: ఎమ్మెస్సీ మ్యాథ్స్‌, అప్లైడ్ మ్యాథ్స్‌
వెబ్‌సైట్‌: http://www.svuniversity.ac.in/Courses/Courses.aspx

ఆచార్య నాగార్జున యూనివ‌ర్సిటీ, గుంటూరు
కోర్సులు: మ‌్యాథ్స్‌, అప్లైడ్ మ్యాథ్స్‌
వెబ్‌సైట్‌: http://www.nagarjunauniversity.ac.in/sciencesyllabus.php

శ్రీకృష్ణదేవ‌రాయ యూనివ‌ర్సిటీ, అనంత‌పురం
కోర్సులు: ఎంఏ అప్లయిడ్ మ్యాథ్స్‌, ఎమ్మెస్సీ మ్యాథ్స్‌
వెబ్‌సైట్‌: http://www.skuniversity.org/coursesoffered.html

కాక‌తీయ యూనివ‌ర్సిటీ, వ‌రంగ‌ల్‌
కోర్సులు: ఎంఏ మ్యాథ్స్‌, ఎమ్మెస్సీ మ్యాథ్స్‌
వెబ్‌సైట్‌: http://kakatiya.ac.in/courses

బీఆర్ అంబేడ్కర్ యూనివ‌ర్సిటీ, శ్రీకాకుళం
కోర్సు: ఎమ్మెస్సీ మ్యాథ్స్‌
వెబ్‌సైట్‌: http://www.brau.in/coursesoffered.shtml

శ్రీ స‌త్యసాయి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ‌య్యర్ లెర్నింగ్‌, అనంత‌పురం
కోర్సు: ఎమ్మెస్సీ మ్యాథ్స్‌
వెబ్‌సైట్‌: http://sssihl.edu.in

వీటితోపాటు రాష్ట్రంలో దాదాపు అన్ని యూనివ‌ర్సిటీల క్యాంప‌స్ క‌ళాశాల‌ల్లోనూ ఎమ్మెస్సీ/ ఎంఏ మ్యాథ్స్ కోర్సు అందుబాటులో ఉంది. అలాగే ఆయా యూనివ‌ర్సిటీల అనుబంధ క‌ళాశాల‌ల్లోనూ మ్యాథ్స్‌ కోర్సు నిర్వహిస్తున్నారు. పెద్ద క‌ళాశాల‌ల్లో సీటు దక్కనివారు అంత‌ర్జాలం(వికీపీడియా, యూట్యూబ్‌) లాంటి మాద్యమాల ద్వారా స‌బ్జెక్టు ప‌రిజ్ఞానాన్ని పెంచుకోవ‌డం క‌ష్టమేమీ కాదు. స‌బ్జెక్టుతోపాటు క‌మ్యూనికేష‌న్ స్కిల్స్ పెంపొందించుకుంటే బోధ‌నారంగంలో దూసుకుపోవ‌చ్చు. సులువుగా విద్యార్థికి అర్థమ‌య్యేలా చెప్పగ‌లిగేవారికి కార్పొరేట్ బోధ‌నా సంస్థలు, శిక్షణ కేంద్రాలు ఎర్రతివాచీ ప‌రుస్తాయ‌న‌డంలో సందేహం లేదు.