NIMCET - 2014

(NIT MCA Common Entrance Test - 2014)

ఐఐటీల తర్వాత సాంకేతిక విద్యకు మనదేశంలో ప్రతిష్ఠాత్మక సంస్థలు ఎన్ఐటీలు (నేషనల్ ఇనిస్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ). ఎన్ఐటీల్లో ఇంజినీరింగ్‌తోపాటు ఎంసీఏ (మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్) కూడా అందుబాటులో ఉంది. దీనిలో ప్రవేశానికి నిర్వహిస్తోన్న ఉమ్మడి పరీక్ష ఎన్ఐటీ ఎంసీఏ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (నిమ్‌సెట్). ఈ పరీక్షలో ర్యాంకుల ఆధారంగా 11 ఎన్ఐటీల్లో ఎంసీఏలో ప్రవేశం కల్పిస్తారు. ఉత్తమ విద్యాప్రమాణాలు పాటిస్తోన్న ఈ సంస్థల్లో ఎంసీఏ చేసినవారికి మంచి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి.

గ్రాడ్యుయేషన్ తర్వాత ఎంసీఏ చేయాలనుకునే విద్యార్థులు ఎన్ఐటీలకు మొదటి ప్రాధాన్యం ఇవ్వడం మంచిది. సాఫ్ట్‌వేర్, ఐటీ కంపెనీల అవసరాలను దృష్టిలో ఉంచుకొని కోర్సును రూపొందించడంలో ఎన్ఐటీలు సాధారణ కాలేజీల కంటే ముందుంటాయి. ఐసెట్ ద్వారా ఎంసీఏ చేయాలనుకునే రాష్ట్ర విద్యార్థులు జాతీయస్థాయిలో మంచి పేరున్న ఎన్ఐటీలకు మొదటి ప్రాధాన్యం ఇవ్వడం మంచిది.

ఏ ఎన్‌.ఐ.టి.లో ఎన్ని ఎంసీఏ సీట్లు?

అగర్తలా(40), అలహాబాద్‌(93), భోపాల్‌(92), కాలికట్‌(46), దుర్గాపూర్‌(92), జంషెడ్‌పూర్‌(92), కురుక్షేత్ర (60), రాయ్‌పూర్‌(92), సూరత్‌కల్‌(92), తిరుచిరాపల్లి(92), వరంగల్‌(46), కురుక్షేత్ర-సెల్ఫ్‌ ఫైనాన్సింగ్‌ (30), మొత్తం: 867
ఈ విద్యాసంస్థల్లో కేవలం నిమ్‌సెట్‌ 2014లోని ప్రతిభ ప్రాతిపదికన ప్రవేశాలు జరుగుతాయి. అంటే డిగ్రీలో సంపాదించిన మార్కులను గణనలోకి తీసుకోరన్నమాట. బి.ఎస్‌.సి/ బి.ఎస్‌.సి (ఆనర్స్‌)/ బి.సి.ఎ/ బి.ఐ.టి లేదా బి.ఇ/ బి.టెక్‌లో ఫుల్‌టైమ్‌లో 60% ఆపైన లేదా 6.5/10 గ్రేడ్‌ తెచ్చుకున్న విద్యార్థులు అర్హులు. ఈ పై కోర్సుల్లో ఆఖరి సంవత్సరం చదువుతున్నవారు ఎం.సి.ఎ. కోర్సు మొదలయ్యేనాటికి డిగ్రీ పాస్‌ అవ్వగలిగితే అర్హులే. తిరుచిరాపల్లిలోని ఎన్ఐటీలో మాత్రం సగం సీట్లు (23) తమిళనాడు విద్యార్థులకు, మిగతా సీట్లను ఇతర రాష్ట్రాల అభ్యర్థులకు కేటాయిస్తారు.

పరీక్ష స్వరూప స్వభావాలు

జాతీయ స్థాయిలో నిర్వహించే నిమ్‌సెట్ పరీక్ష పూర్తిగా ఆబ్జెక్టివ్ మల్టిపుల్ చాయిస్ పద్ధతిలో ఉంటుంది. ప్రశ్నపత్రంలో మొత్తం 120 ప్రశ్నలుంటాయి. ఒక్కో ప్రశ్నకు నాలుగు మార్కులు కేటాయిస్తారు. దీని ప్రకారం మొత్తం ప్రశ్నపత్రం 480 మార్కులకు ఉంటుంది. కనీసం 75-80 శాతం మార్కులు సాధించిన విద్యార్థులకు మంచి ఎన్ఐటీలో ఎంసీఏ సీటు లభించే అవకాశం ఉంటుంది. నిమ్‌సెట్ స్కోరుకు ఏడాది వరకు విలువ ఉంటుంది.

¤ నిమ్‌సెట్‌లో నెగటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. తప్పుగా గుర్తించిన ప్రతీ సమాధానానికి ఒక మార్కు తీసేస్తారు. పరీక్ష సమయం 2 గంటలు. ప్రశ్నపత్రం ఇంగ్లిష్‌లో మాత్రమే ఉంటుంది.

నిమ్‌సెట్ ప్రశ్నపత్రంలో మొత్తం నాలుగు విభాగాలు ఉంటాయి. అవి...
1. మ్యాథ్స్‌: 50 ప్రశ్నలు
2. అనలిటికల్‌ ఎబిలిటీ అండ్‌ లాజికల్‌ రీజినింగ్‌: 40
3. కంప్యూటర్‌ అవేర్‌నెస్‌: 10 ప్రశ్నలు
4. ఇంగ్లిష్‌: 20 ప్రశ్నలు
మొత్తం: 120 ప్రశ్నలు.

ఏ అంశాల నుంచి ప్రశ్నలు?

నిమ్‌సెట్‌లో మేథమేటిక్స్ విభాగం చాలా కీలకమైనది. మిగిలిన విభాగాలకంటే దీనికి ఎక్కువగా వెయిటేజీ ఉంటుంది. ఇందులో అడిగే ప్రశ్నలు సాధారణంగా ఇంటర్మీడియట్ స్థాయిలో ఉంటాయి. Sets, Probability and Statistics, Quadratic Equations, Functions, Progressions, Matrices, Straight lines, Circles, Trigonometry, Vectors, Calculus తదితర అంశాల నుంచి ప్రశ్నలు రావచ్చు.

¤ Analytical Ability and Logical Reasoning విభాగంలో ప్రశ్నలు క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, ప్యాసేజ్ ఆధారంగా ఉంటాయి.

¤ కంప్యూటర్ అవేర్‌నెస్ విభాగంలో అడిగే ప్రశ్నలు ముఖ్యంగా కంప్యూటర్లకు సంబంధించిన ప్రాథమిక అంశాల నుంచి ఉంటాయి. Computer basics, binary, octa and hexa decimal representation, 2's compliment, floating point representation of numbers, boolean algebra and flow charts ,మొదలైన అంశాల నుంచి ప్రశ్నలడుగుతారు. సాధారణ కంప్యూటర్ పరిజ్ఞానం కోసం బేసిక్ పుస్తకాలు చదవచ్చు.

¤ జనరల్ ఇంగ్లిష్ విభాగంలో అడిగే ప్రశ్నలు కూడా ప్రాథమిక స్థాయిలో ఉంటాయి. టెన్త్, ఇంటర్/ బేసిక్ గ్రామర్ పుస్తకాలను రిఫర్ చేస్తే సరిపోతుంది. ఇందులో ప్రశ్నలు ముఖ్యంగా comprehension, vocabularly, basic English grammar, word power, synonyms, antonyms, meanings of words and phrases అంశాల నుంచి అడుగుతారు.

ఎలా దరఖాస్తు చేసుకోవాలి?

నిమ్‌సెట్‌-2014కి ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకోవాలి.
1. అభ్యర్థిగా నమోదు చేసుకోవడం: మొట్టమొదట http://nimcet2014.nita.ac.in అనే వెబ్‌సైట్‌లో పేరు నమోదు చేసుకోవాలి. దీనికి ఆఖరు తేదీ 03-04-2014. లాగిన్‌కి వాడే పేరులో కనీసం ఆరు అక్షరాలుండాలి. ఇందులో మొదటి రెండు, చివరి రెండు తప్పనిసరిగా అక్షరాలు ఉండాలి. #, @, _ వంటి ప్రత్యేక అక్షరాలను అనుమతించరు. పాస్‌వర్డ్‌ కూడా కనీసం ఆరు అక్షరాల నిడివి గలదై ఉండాలి. ప్రత్యేక అక్షరాలను అనుమతించరు. ఒకసారి రిజిస్టర్‌ చేసుకున్న తరువాత మార్పు చెయ్యడం కుదరదు. దానికి సంబంధించిన అధికారి ప్రత్యేక అనుమతి కావాలి.
2. రుసుము ఎలా కట్టాలి: ఓపెన్‌ కేటగిరి/ ఓబీసీ కేటగిరివారు రూ.1800/-, ఎస్‌సీ,ఎస్‌టీ అభ్యర్థులు రూ.900/- ప్రవేశ రుసుము చెల్లించవలసి ఉంటుంది. దీనికోసం https://www.onlinesbi.com/ అనే వెబ్‌సైట్‌లో నిర్దేశించిన ప్రకారం 'స్టేట్‌ బ్యాంక్‌ కలెక్ట్‌' అనే పద్ధతిలో కట్టాలి. వెబ్‌సైట్‌లో స్టేట్‌ బ్యాంక్‌ కలెక్ట్‌ అనే ట్యాబ్‌ని నొక్కాలి. ఈ ట్యాబ్‌ పేరు నమోదు చేసుకున్న తరువాతనే లభ్యమౌతుంది. అక్కడ ఇచ్చిన పద్ధతి ప్రకారం ఫీజు జమ చేశాక ఒక నంబర్‌ను ఇస్తారు. దరఖాస్తు నింపేటప్పుడు ఈ నంబర్‌ రాయాల్సివుంటుంది. కోర్సులో ప్రవేశం పూర్తిఅయ్యేంతవరకు దీన్ని భద్రపరుచుకోవాలి.
3. ఆన్‌లైన్‌లో దరఖాస్తు నింపడం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు కంటే ముందు స్కాన్‌ చేసిన పాస్‌పోర్ట్‌ సైజు ఫోటో, స్కాన్‌ చేసిన సంతకం సిద్ధంగా ఉంచుకోవాలి. ఇవి జెపెగ్‌/ పి.ఎన్‌.జి. ప్రత్యేకంగా ఫైళ్ళుగా భద్రపర్చుకోవాలి. ఎలక్ట్రానిక్‌ రసీదు కూడా దగ్గర ఉంచుకోవాలి. నిర్దేశించిన విధంగా దరఖాస్తు పూర్తిచేసి ఫోటో, సంతకం అప్‌లోడ్‌ చెయ్యాలి. ఆ తరువాత పూర్తయిన దరఖాస్తులో తప్పులు ఏవైనా ఉంటే సరిదిద్దాలి.
అంతా సరిగా ఉందని రూఢి చేసుకున్న తరువాత సబ్‌మిట్‌ అన్న ట్యాబ్‌ నొక్కాలి. అప్పుడు మూడు పేజీల దరఖాస్తు ఒక నంబర్‌తో సహా కంప్యూటర్‌పై కనిపిస్తుంది. దీనిని భద్రపరచుకుని, ఒక కాపీ తీసుకుని ప్రతి పేజీపై సంతకం పెట్టాలి. దాన్ని అగర్తలా కార్యాలయానికి రిజిస్టర్డ్‌/స్పీడు పోస్టులో 17-04-2014 లోపల పంపాలి. ఒక ప్రతి భద్రపరుచుకోవాలి. దరఖాస్తుతో బ్యాంకు రసీదు, అన్ని మార్కుల నకలు కాపీలు, కుల ధ్రువీకరణ పత్రం కూడా జతపరచాలి.
4. హాల్‌టికెట్‌: అర్హులైన అభ్యర్థుల హాల్‌టికెట్లను వెబ్‌సైట్‌లో పెడతారు. అభ్యర్థులు వాటిని డౌన్‌లోడ్‌ చేసుకుని తమకు కేటాయించిన కేంద్రంలో పరీక్ష రాయవచ్చు.

కొన్ని ముఖ్యమైన తేదీలు

* వెబ్‌సైట్‌లో పేరు నమోదు చేసుకోవడం: 03.04.2014 సాయంత్రం 5.00 వరకు
* అన్నివిధాలా నింపిన దరఖాస్తు ప్రతి పంపవలసిన తేదీ: 17.04.2014 (సెక్రెటరి, నిమ్‌సెట్‌-2014, నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అగర్తలా, బర్జాలా, జిరనియా-799046)
Email: nimcet2014@nita.ac.in or nimcet2014@gmail.com
* ప్రవేశపరీక్ష తేదీ: 25.05.2014 ఉ. 10.00 నుంచి మ. 12.00 వరకు
* ర్యాంకుల ప్రకటన : 11.06.2014
* ఆన్‌లైన్‌లో కళాశాలల ఆప్షన్లను నింపడం: 16.06.2014 నుంచి 23.06.2014 వరకు
* మొదటి విడత కౌన్సిలింగ్‌ విద్యార్థులు హాజరు ఇవ్వడం: 30.06.2014 నుండి 01.07.2014 వరకు
* రెండో విడత కౌన్సిలింగ్‌ విద్యార్థులు హాజరు ఇవ్వడం: 07.07.2014 నుండి 08.07.2014 వరకు
* సీట్లు మిగిలితే- వివరాలు: 25.07.2014
* స్పాట్‌ అడ్మిషన్లు: 28.07.2014
(సిలబస్‌ వివరాలు... eenadupratibha.net లో) .

ఉపయోగపడే పుస్తకాలు

1. The Pearson MAT Super Course
2. Test of Reasoning - R.S. Agarwal
3. Magical Book on Quicker Maths - M.Tyra
4. Upkar's MCA
5. General Intelligence Tests - S.L. Gulati
6. Objective Arithmetic - R.S. Agarwal or S.L.Gulati
7. Intermediate English Grammar - Raymond Murfi
8. ABC of Common Error - Macmillan publishers
9. Word Power Made Easy - Norman Lewis.