Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
విద్యార్థులకు వరం...ఎన్టీఎస్ఈ స్కాల‌ర్‌షిప్పులు
 

ప్రతిభ ఉన్న పేద‌విద్యార్థుల‌కు వ‌రం నేష‌న‌ల్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామ్ (ఎన్‌టీఎస్ఈ) ఎందుకంటే ఈ స్కాల‌ర్‌షిప్పుకి ఎంపికైతే ఎలాంటి ఆర్థిక‌ ఇబ్బందులు లేకుండా ఇంట‌ర్ నుంచి పీజీ వ‌ర‌కు హాయిగా చ‌దువుకోవ‌చ్చు. అయితే దీనికోసం రెండు ద‌శల్లో నిర్వహించే ప‌రీక్షల్లో అర్హత సాధించాలి. దేశ‌వ్యాప్తంగా వెయ్యి మందినే ఎంపిక‌చేస్తారు. ఎన్‌టీఎస్ఈ ప్రక‌ట‌న వెలువ‌డిన నేప‌థ్యంలో ఈ ప‌రీక్ష ఎలా ఉంటుందో తెలుసుకుందాం.

పదో తరగతి విద్యార్థులకు నిర్వహించే ఎన్‌టీఎస్‌ఈ రెండు స్థాయిల్లో జరుగుతోంది. ప్రాథమిక స్థాయి (లెవల్‌-1)ని రాష్ట్రప్రభుత్వం, లెవల్‌-2ను ఎన్‌సీఈఆర్‌టీ నిర్వహిస్తున్నాయి. వీటిలో అర్హత సాధించిన విద్యార్థికి చదివినంత కాలం ఉపకారవేతనం వస్తుంది. ఇది గతంలో రూ.500 ఉండేది. రెండేళ్ల నుంచి ఇంటర్‌ రెండు సంవత్సరాలు నెలకు రూ. 1250; డిగ్రీ/ పీజీ చేసేటపుడు రూ.2000 ఇస్తున్నారు. తర్వాత యూజీసీ నిబంధనల ప్రకారం ఉపకారవేతనం వస్తుంది. అంటే పదోతరగతి తర్వాత ఆర్థికంగా ఎవ‌రిపైనా ఆధార‌ప‌డ‌కుండా తమంతట తాము చదువుకోగలిగే చక్కటి అవకాశం!

ఎంపిక విధానం:
ఈ పరీక్ష రెండు దశల్లో జరుగుతుంది. మొదటిది స్టేజ్ -1. ఇది రాష్ట్ర స్థాయి పరీక్ష. విద్యార్థులు తాము పదో తరగతి చదువుతున్న రాష్ట్రంలో నిర్దేశించిన కేంద్రంలో పరీక్షకు హాజరు కావచ్చు. ఈ దశలో అర్హత సాధించిన వారికి స్టేజ్ -2 (జాతీయ స్థాయి) పరీక్ష నిర్వహిస్తారు.

స్టేజ్ -1 పరీక్ష విధానం (స్టేట్ లెవెల్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామినేషన్)
ఇది పూర్తి ఆబ్జెక్టివ్ తరహా పరీక్ష. దీన్లో మూడు విభాగాలుంటాయి. అవి...మెంట‌ల్ ఎబిలిటీ టెస్ట్‌, లాంగ్వేజ్ టెస్ట్‌, స్కాల‌స్టిక్ ఆప్టిట్యూడ్ టెస్ట్‌.

సిలబస్:
మెంటల్ ఎబిలిటీలో విద్యార్థుల రీజనింగ్ సామర్థ్యాన్ని పరిశీలించే విధంగా ప్రశ్నలు ఇస్తారు.
దీన్లో ఎనాలజీస్, క్లాసిఫికేషన్, సిరీస్, కోడింగ్ - డీ కోడింగ్, బ్లాక్ అసెంబ్లీ, ప్రాబ్లమ్ సాల్వి ంగ్ అంశాలపై ప్రశ్నల ఇస్తారు.

స్కాల‌స్టిక్ ఆప్టిట్యూడ్ టెస్ట్‌లో రాష్ట్ర ప్రభుత్వాలు పదో తరగతి విద్యార్థులకు నిర్దేశించిన సిలబస్ నుంచి ప్రశ్నలు వస్తాయి. హిస్టరీ, సివిక్స్, జాగ్రఫీ, ఎకనమిక్స్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ సబ్జెక్టుల నుంచి ప్రశ్నలను ఇస్తారు.

లాంగ్వేజ్ టెస్ట్‌లో తెలుగు భాష‌కు సంబంధించిన ప్రశ్నలు అడుగుతారు.

* ఎన్‌సీఈఆర్‌టీ సిలబస్ నుంచి ఎలాంటి ప్రశ్నలను మొదటి స్టేజ్‌లో ఇవ్వరు.

ఫలితాల వెల్లడి: స్టేజ్-1 ఫలితాలను రాష్ట్ర ప్రభుత్వ పరీక్షల విభాగం వెల్లడిస్తుంది. అర్హులైన వారికి తమ దరఖాస్తులో పేర్కొన్న చిరునామాకు వివరాలను పంపుతారు.

స్టేజ్ -2 కు రాష్ట్రం నుంచి ఎంత మందంటే: తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించే స్టేజ్-1 పరీక్షలో అర్హత సాధించిన 295 మంది విద్యార్థులకు స్టేజ్-2 (ఎన్‌టీఎస్ఈ) రాసే అవకాశం లభిస్తుంది. జ‌న‌ర‌ల్ అభ్యర్థులైతే ప్రతి పేప‌ర్‌లోనూ 40 శాతం మార్కులు సాధించాలి. ఎస్సీ, ఎస్టీలైతే 35 శాతం మార్కులు త‌ప్పనిస‌రి. తుది ఎంపిక‌లో లాంగ్వేజ్ టెస్ట్‌లో సాధించిన మార్కుల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోరు.

స్టేజ్ -2: నేషనల్ లెవెల్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామినేషన్ (జాతీయ స్థాయి పరీక్ష).

మొదటి దశలో అర్హత సాధించిన వారికి జాతీయ స్థాయిలో ఈ పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో కూడా మూడు భాగాలుంటాయి. అవి.

1) మెంటల్ ఎబిలిటీ టెస్ట్ (మ్యాట్): ఇందులో 50 ప్రశ్నలు ఉంటాయి. వీటికి 50 మార్కులు. వ్యవ‌ధి 45 నిమిషాలు.
2) లాంగ్వేజ్ టెస్ట్ (ఇంగ్లిష్‌/ హిందీ): 50 ప్రశ్నలు అడుగుతారు. వీటికి 50 మార్కులు. వ్యవ‌ధి 45 నిమిషాలు.
3) స్కాలాస్టిక్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (శాట్): వ‌ంద మార్కుల‌కు వంద ప్రశ్నలొస్తాయి. వ్యవ‌ధి 90 నిమిషాలు

సిలబస్:
దీనికి ప్రధానంగా సీబీఎస్ఈ 9, 10, 11 తరగతుల విద్యార్థులకు ఎన్‌సీఈఆర్‌టీ రూపొందించిన సోషల్ స్టడీస్ సైన్స్ సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు వస్తాయి. స్టేజ్-2 ఫలితాలను ఎన్‌సీఈఆర్‌టీ ప్రకటిస్తుంది.

తుది ఎంపిక: రాత పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తారు. మొత్తం స్కాల‌ర్‌షిప్పుల్లో 15 శాతం ఎస్సీ, 7.5 శాతం ఎస్టీ, 3 శాతం పీహెచ్ అభ్యర్థుల‌కు మంజూరు చేస్తారు.

ఆంధ్రప్రదేశ్‌లో...
పాఠశాల హెడ్ మాస్టర్ ద్వారా దరఖాస్తులు పంపడానికి చివరి తేదీ: సెప్టెంబరు 14, 2016
ఫీజు చెల్లించడానికి చివరి తేదీ: సెప్టెంబరు 17, 2016
పరీక్ష ఫీజు: రూ.200
హెడ్ మాస్టర్లు విద్యార్థుల అప్లికేషన్లు, ఇతర వివరాల జాబితాను డీఈవో కార్యాలయాలకు పంపడానికి చివరి తేదీ: సెప్టెంబరు 20, 2016
డీఈవోలు రాష్ట్ర ప్రభుత్వ పరీక్షల కార్యాలయ విభాగానికి ఈ దరఖాస్తులు పంపడానికి చివరి తేదీ: సెప్టెంబరు 26, 2016
వెబ్‌సైట్‌: http://bseap.org/

తెలంగాణ‌లో...
ప‌రీక్ష ఫీజు: రూ. వంద‌
ద‌ర‌ఖాస్తు ఫీజు చ‌లానా తీయ‌డానికి గ‌డువు తేదీ: సెప్టెంబ‌రు 6
హెడ్ మాస్టర్లు డీఈవోల‌కు ద‌ర‌ఖాస్తులు స‌మ‌ర్పించ‌డానికి చివ‌రి తేదీ: సెప్టెంబ‌రు 7
డీఈవోలు ప్రభుత్వ ప‌రీక్షల విభాగానికి వివ‌రాలు పంప‌డానికి చివ‌రి తేదీ: సెప్టెంబ‌రు 9
వెబ్‌సైట్‌: http://bsetelangana.org

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర విద్యార్థులకు స్టేజ్ 1 పరీక్ష తేదీ: నవంబరు 6
అన్ని జిల్లా కేంద్రాల్లోనూ పరీక్షను ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 వరకు నిర్వహిస్తారు. అభ్యర్థులు తెలుగు, హిందీ, ఉర్దూ, ఆంగ్ల మాధ్యమాల్లో పరీక్ష రాసుకోవచ్చు.
స్టేజ్ 2 పరీక్ష తేదీ: మే 14, 2017

దరఖాస్తు నింపడమెలా (క్లిక్)
పాత ప్రశ్నపత్రాలు-TM/ EM (క్లిక్)

నోటిఫికేష‌న్‌

posted on 30-08-2016