Latest News

రైల్వే ఉద్యోగాలకు వయసు సడలింపు

* గరిష్ఠ వయోపరిమితి రెండేళ్లు పొడిగింపు
* గ్రూప్-సి లోని అన్ని పోస్టులకూ వర్తింపు

ఈనాడు, దిల్లీ: ప్రభుత్వ ఉద్యోగాలు సాధించుకోవటానికి వయసు దాటిపోయిందని నిరాశ చెందుతున్న నిరుద్యోగులకు శుభవార్త. రైల్వేల్లో భారీ సంఖ్యలో భర్తీ చేయనున్న పోస్టులకు అవకాశం కల్పించేలా కేంద్ర ప్రభుత్వం వయోపరిమితిని సడలించింది. ఇప్పటి వరకు నిర్ణయించిన వయసు అర్హతల్లో గరిష్ఠ పరిమితిని మరో రెండేళ్లు పొడిగించింది. రైల్వేశాఖ ఇటీవల 90వేల పోస్టుల భర్తీకి ప్రకటన వెలువరించిన విషయం తెలిసిందే. గ్రూప్ సి లెవెల్-1 పోస్టులయిన ట్రాక్ మెయింటెయినర్, పాయింట్స్‌మెన్, హెల్పర్, గేట్‌మెన్, పోర్టర్, గ్రూప్ సీ లెవెల్-2 పోస్టులైన అసిస్టెంట్ లోకో పైలట్స్, టెక్నీషియన్స్ (ఫిట్టర్, క్రేన్‌డ్రైవర్, బ్లాక్‌స్మిత్, కార్పెంటర్) పోస్టులను ఆర్ఆర్‌బీ ద్వారా భర్తీచేయడానికి ఆన్‌లైన్ ద్వారా ఇప్పటికే దరఖాస్తులు ఆహ్వానించింది. వయోపరిమితిలో మార్పు చేసినందున దరఖాస్తు చేసుకొనే చివరి తేదీనీ పొడిగించనున్నట్లు ఆర్ఆర్‌బి పేర్కొంది. తెలుగు, తమిళం, మళయాళం, కన్నడ, ఒడియాలాంటి ప్రాంతీయ భాషల్లోనూ అభ్యర్థులు పరీక్షలు రాయొచ్చని తెలిపింది. ఇందుకు సంబంధించిన సవరణ ప్రకటనను ఆర్ఆర్‌బీ వెబ్‌సైట్‌లో త్వరలో జారీచేయనున్నట్లు వెల్లడించింది.
తాజాగా సవరించిన గరిష్ఠ వయోపరిమితి వివరాలు ఇలా...
అసిస్టెంట్ లోకోపైలట్, టెక్నీషియన్స్
అన్‌రిజర్వ్‌డ్ (యూఆర్) - 30
ఓబీసీ - 33
ఎస్సీ, ఎస్టీ - 35
లెవెల్-1 పోస్టులు
అన్‌రిజర్వ్‌డ్ - 33
ఓబీసీ - 36
ఎస్సీ, ఎస్టీ - 38

Posted on 19.02.2018