Latest News

ఒక్కో పోస్టుకు 250 మందికిపైనే పోటీ

* ద.మ.రైల్వే జోన్ నుంచే 20 లక్షల దరఖాస్తులు
* ఖరారు కాని పరీక్ష విధానం, తేదీలు

ఈనాడు-హైదరాబాద్: భారతీయ రైల్వేలో అతిపెద్ద నియామక ప్రక్రియకు నిరుద్యోగుల నుంచి పెద్దఎత్తున స్పందన వచ్చింది. దరఖాస్తు గడువు మార్చి 31తో ముగియగా..జోన్లు, ఉద్యోగాల వారీగా వచ్చిన దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను రైల్వేశాఖ ఆరంభించింది. ఒక్క దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధి నుంచే ఏకంగా 20 లక్షల వరకు దరఖాస్తులు వచ్చాయి. జోన్ పరిధిలో గ్రూప్ 'సి', గ్రూప్ 'డి' కలిపి దాదాపు తొమ్మిది వేల ఉద్యోగాలు ఉండగా..సగటున ఒక్కో ఉద్యోగానికి రెండొందల యాభై మంది వరకు పోటీపడుతున్నారు. దేశవ్యాప్తంగా అన్ని జోన్లలో దాదాపు లక్ష ఉద్యోగాలకు ప్రకటనలు వెలువడగా.. సుమారు రెండు కోట్ల దరఖాస్తులు వచ్చినట్లు రైల్వేవర్గాలు చెబుతున్నాయి.
గ్రూప్ సీ ఉద్యోగాలకు భారీ పోటీ
గ్రూప్-సి ఉద్యోగాలు దేశవ్యాప్తంగా మొత్తం 68 వేలు, ద.మ.రైల్వే పరిధిలో 2,500 ఉన్నాయి. రైలు బయల్దేరడానికి ముందు చక్రాల స్థితి, రెండు కోచ్‌ల మధ్య అనుసంధానాన్ని పరీక్షించే పాయింట్‌మన్.. రైలు పట్టాల వెంట తిరుగుతూ భద్రతను పరిశీలించే ట్రాక్‌మన్‌తో పాటు.. మెకానికల్, సిగ్నలింగ్, టెలికాం విభాగాల్లో సహాయకుల వంటి గ్రూప్-డి ఉద్యోగాలు 6,700 వరకు ఉన్నాయి.
డిగ్రీ, పీజీలు ఉన్నవారే
రైల్వేలో 2013లో ఉద్యోగ నియామకాల ప్రకటన వెలువడింది. 2014లో పరీక్షలు నిర్వహించి 2,800 గ్రూప్-డి పోస్టులను భర్తీ చేశారు. వీటికి పదో తరగతి విద్యార్హత అయినప్పటికీ 2,500కుపైగా ఉద్యోగాలను డిగ్రీ, పీజీ విద్యార్హత కలిగిన వారే దక్కించుకున్నారు. ఈసారి జోన్ పరిధిలో 2500 గ్రూప్-డి ఉద్యోగాలున్నాయి. 'దరఖాస్తుదారుల విద్యార్హతల పరిశీలన ప్రక్రియ పూర్తయితే దరఖాస్తుదారుల్లో కేవలం పదోతరగతి అర్హత ఉన్నవారు ఎందరు, ఇంటర్, డిగ్రీ, పీజీ విద్యార్హత కలిగిన వారు ఎంతమంది అనేది తెలుస్తుంది. పరీక్షల తేదీలు ఎప్పుడన్నది కూడా తేలడానికి మరికొంత సమయం పడుతుంది అని రైల్వే అధికారులు చెబుతున్నారు.
పరీక్ష విధానంపై మల్లగుల్లాలు
ప్రస్తుతం గ్రూప్-సి ఉద్యోగాలను రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్(ఆర్ఆర్‌సీ) ద్వారా, గ్రూప్- డి ఉద్యోగాలను రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (ఆర్ఆర్‌బీ) ద్వారా భర్తీ చేస్తున్నారు. గ్రూప్-సీ పోస్టులకు ఆన్‌లైన్ విధానంలో పరీక్షలు నిర్వహించనున్నట్లు రైల్వేవర్గాలు చెబుతుండగా.. గ్రూప్-డీ పోస్టులకు రాత పరీక్ష విధానమా? ఆన్‌లైన్‌లో పరీక్ష నిర్వహిస్తారా? అన్నదానిపై ఇంకా స్పష్టత రాలేదు. కేవలం పదో తరగతి అర్హత ఉన్న వారు ఆన్‌లైన్‌లో పరీక్ష రాయగలరా? లేదా? అన్న సాధ్యాసాధ్యాల ఆధారంగా ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సమాచారం.

Posted on 15.04.2018