Latest News

100 ప్రశ్నలు..90 నిమిషాలు!

* రైల్వే పరీక్షలు కఠినతరం చేసే యోచనలో అధికారులు
న్యూదిల్లీ: ప్రపంచంలోనే అత్యధిక ఉద్యోగాల భర్తీతో రిక్రూట్‌మెంట్‌ డ్రైవ్‌ ప్రకటించిన భారత రైల్వేకు ఊహకు మించిన స్పందనే లభించింది. మొత్తం లక్ష ఉద్యోగాల భర్తీకి విడుదల చేసిన నోటిఫికేషన్‌కు భారీ స్థాయిలో దరఖాస్తులు వచ్చాయి. సుమారు 24మిలియన్ల మంది ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. దీంతో పరీక్షల నిర్వహణలో కఠిన వైఖరిని అవలంభించనున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది డిసెంబరులో జరిగే ఈ ఆన్‌లైన్‌ పరీక్షకు కావల్సిన ఏర్పాట్లను ఇప్పటికే ప్రారంభించించారు.
దీనిపై రైల్వే అధికారి మాట్లాడుతూ...‘ఒకే సారి ఎక్కువ మొత్తంలో ఉద్యోగాల భర్తీ చేయనుండటంతో కొంత ఒత్తిడి ఏర్పడింది. అయితే ఎంపిక విధానంలో మాత్రం కొంత కఠిన వైఖరిని అవలంబించాలనే యోచనలో ఉన్నాం. దరఖాస్తులను పరిశీలించడానికి 40మంది అధికారులతో కూడిన బృందాన్ని ఏర్పాటు చేశాం. ఏడాది నవంబర్‌-డిసెంబరులో జరిగే ఈ పరీక్షకు సంబంధించిన ఫలితాలను వచ్చే ఏడాది మొదట్లో వెల్లడిస్తాం. పరీక్షలో అడగాల్సిన ప్రశ్నలను రూపొంచించడానికి అత్యంత అనుభవం కలిగిన నిపుణుల సహాయం తీసుకుంటాం. నియామకాల్లో ఎటువంటి అక్రమాలకూ తావు లేకుండా కఠిన చర్యలు తీసుకుంటున్నాం’ అని తెలిపారు.
కేంద్రమంత్రి పియూష్‌ గోయెల్‌ మాట్లాడుతూ...‘ ప్రకటనలో తెలిపిన లక్ష ఉద్యోగాలకు గానూ 20శాతం పోస్టులను కోర్సు పూర్తి చేసిన అప్రెంటీస్‌లకు కేటాయిస్తాం. వీరికి జులైలో పరీక్షలు మొదలవుతాయి. దేశవ్యాప్తంగా 500 పరీక్షాకేంద్రాల్లో పరీక్షలు జరుగుతాయి’ అని తెలిపారు.
మిగతా విభాగాల అభ్యర్థులకు ఈ ఏడాది చివర్లో పరీక్షలుంటాయి. గణితం‌,, జనరల్‌‌ ఇంటెలిజెన్స్‌, రీజనింగ్‌, జనరల్‌ సైన్స్‌, జనరల్‌ అవేర్నెస్‌ విభాగాల నుంచి మొత్తం 100 ప్రశ్నలుంటాయి. 90 నిమిషాల సమయం కేటాయిస్తారు. దేశవ్యాప్తంగా 500 కేంద్రాల్లో జరిగే ఈ పరీక్షలను 15 భాషల్లో నిర్వహించనున్నారు. దరఖాస్తు చేసుకునే సమయంలో అభ్యర్థులు చెల్లించిన పరీక్ష రుసుం రూ. 500లో రూ. 400లను పరీక్ష అనంతరం తిరిగి అభ్యర్థులకు చెల్లిస్తారు.

Posted on 09.05.2018