RRB NoTIFICATION

కొలువుల కూత!

* లక్షా ముప్పైవేల రైల్వే పోస్టులు

భారతీయ రైల్వే చరిత్రలో తొలిసారిగా లక్షా 30 వేల మంది సిబ్బందిని కొత్తగా నియమించబోతున్నారు. నాలుగు రోజుల వ్యవధిలోనే నాలుగు కేటగిరీ రైల్వే ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు అధికారిక షెడ్యూల్‌ విడుదలయింది. ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. పోటీ పరీక్షలకు తయారయ్యే అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, కేంద్రప్రభుత్వ ఉద్యోగం చేజిక్కించుకోవచ్చు!
కాపలా లేని రైలు గేట్లను పూర్తిగా తొలగించి, ప్రత్యామ్నాయ మార్గాలను ఏర్పరిచిన కారణంగా 2019 సంవత్సరాన్ని ‘సురక్షిత సంవత్సరం’గా భారతీయ రైల్వేలు ప్రకటించాయి. మరో పక్క అంతర్జాతీయ ప్రమాణాలను అందుకునే రీతిలో అత్యంత వేగంగా నడిచే ఎక్స్‌ప్రెస్‌లను ప్రవేశపెట్టనుండటంతో రైల్వేలకు భారీ ఎత్తున సిబ్బంది అవసరం అవుతోంది. ఈ కారణంవల్లనే తాజా నియామకాలకు రైల్వే మంత్రిత్వశాఖ సిద్ధమయింది.
ఫిబ్రవరి 28వ తేదీ నుంచి ప్రతి నాలుగు రోజుల విరామంతో ఒక్కో కేటగిరీ పోస్టుల దరఖాస్తుకు రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. లక్ష పోస్టులు గ్రూపు-డి కేటగిరీగా గతంలో పిలిచే లెవల్‌-1 విభాగంలో; 30 వేల నాన్‌ టెక్నికల్‌, పారామెడికల్‌, కార్యాలయ ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నారు.
నాలుగు కేటగిరీ పోస్టుల్లో రెండు కేటగిరీలకు చెందిన వైద్య, వైద్య అనుబంధ పోస్టులు, కొన్ని అరుదైన హిందీ అనువాదకులు, లా అధికారులు లాంటి పోస్టులు పరిమిత సంఖ్యలోనే ఉంటాయి.
30 వేల ఖాళీల్లో సాంకేతికేతర సిబ్బంది (నాన్‌ టెక్నికల్‌ పాపులర్‌ కేటగిరీ - ఎన్‌టీపీసీ) సంఖ్యనే అధికం. వీటికి డిగ్రీ అర్హతగా ఉంటంది. జూనియర్‌ క్లర్క్‌ కమ్‌ టైపిస్టులు, అకౌంట్స్‌ కమ్‌ టైపిస్టులు, ట్రెయిన్స్‌ క్లర్క్‌లు, కమర్షియల్‌ కమ్‌ టికెట్‌ క్లర్క్స్‌, ట్రాఫిక్‌ అసిస్టెంట్స్‌, గూడ్స్‌ గార్డ్‌, సీనియర్‌ కమర్షియల్‌ టికెట్‌ క్లర్క్స్‌, సీనియర్‌ క్లర్క్‌ కమ్‌ టైపిస్టు, జూనియర్‌ అకౌంటెంట్‌ అసిస్టెంట్‌ కమ్‌ టైపిస్ట్‌, కమర్షియల్‌ అప్రంటిస్‌, స్టేషన్‌ మాస్టర్‌ పోస్టులన్నీ కూడా దాదాపు సాంకేతికేతర ఖాళీలే. వీటిని భర్తీ చేసి చాలా ఏళ్లయిన కారణంగా, పదవీ విరమణలు, కొత్త రైళ్లు ఏర్పడిన రీత్యా అన్ని జోన్లకూ కలిపి దాదాపు 30 వేల వరకు భర్తీకి వచ్చాయి.
ఇటీవలి సంవత్సరాల్లో బ్యాంకింగ్‌ రంగంలో ఖాళీల భర్తీ తగ్గుముఖం పట్టింది. వీటి ఎంపిక విధానం నానాటికీ పదునెక్కుతోంది. నిజానికి బ్యాంకు పరీక్షలకు అవసరమైన నైపుణ్యాలు, బ్యాంకు పరీక్షలకు సన్నద్ధమయ్యే సబ్జెక్టులతో వాటికంటే కఠినత్వం తక్కువగానే పరిగణించే రైల్వే పరీక్షలు ఉద్యోగార్థులకు వరప్రసాదమే.
దరఖాస్తులు అధిక సంఖ్యలో రావడంతో రైల్వే పరీక్షలను రెండు అంచెలలో నిర్వహించే అవకాశం ఉంది. కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్టులో ఉండే వివిధ విభాగాలపై సమగ్రంగా పట్టు సాధించేలా అభ్యర్థులు కృషిచేయాలి.

అరిథ్‌మెటిక్‌ ఎబిలిటీ: సాధన ముఖ్యం
ఈ విభాగాన్ని రెండు కోణాల నుంచి చూడాలి.
1. సంఖ్యా వ్యవస్థ
2. గణితం.
వీటిలో సంఖ్యా వ్యవస్థను గణితంపై ఏమాత్రం పట్టులేని వారైనా సులభంగా అవగాహన చేసుకోవచ్చు. గణితంలో మాత్రం రెండు మూడు అధ్యాయాలే క్లిష్టం. అయితే వీటిపై ప్రశ్నలు పరిమితంగానే ఉంటాయి.
ఈ విభాగంలో ప్రశ్నలు ప్రాథమిక స్థాయిలోనే ఉంటాయి. అరిథ్‌మెటిక్‌పై పట్టు సాధించాలంటే సంఖ్యా వ్యవస్థ (నంబర్‌ సిస్టమ్‌)తో శ్రీకారం చుట్టాలి. వాస్తవ సంఖ్యలు, ప్రధాన సంఖ్యలు, సరిసంఖ్య, బేసి సంఖ్యలు మొదలైనవాటి గురించి తెలుసుకోవాలి. సంఖ్యా వ్యవస్థకు అనుగుణంగా ఉండే కసాగు, గసాభా, నిష్పత్తి, అనులోమానుపాతం, సగటు, శాతాల సమస్యలు, సాధారణ వడ్డీ, బారు వడ్డీ, పని - కాలం, కాలం - దూరం, రైలు వేగంపై లెక్కలు సాధన చేయాలి.
రైల్వే పరీక్షలకు 10వ తరగతి, ఇంటర్‌, డిగ్రీ విద్యార్హతలుగా ఉన్నందువల్ల టెన్త్‌, ఇంటర్‌ స్థాయులనే గణిత ప్రశ్నలుంటాయి. వాటిలో క్షేత్రగణితం, త్రికోణమితి, ఎత్తులు, దూరాలు నుంచి ప్రశ్నలు వస్తాయి. క్షేత్రగణితంలో ఘనపరిమాణం, వైశాల్యం (ఏరియా) ఉపరితల అంశాలపై సూత్రాలను నేర్చుకుంటే ఎక్కువ ప్రశ్నలకు జవాబులు గుర్తించగలుగుతాము. సాధారణంగా రైల్వే పరీక్షలలో అరిథ్‌మెటిక్‌, మ్యాథ్స్‌ నుంచి ఇచ్చే ప్రశ్నలు నేరుగా ఉంటాయి.
ఇంటర్‌, డిగ్రీలలో గణితం నేపథ్యంలేని అభ్యర్థుల దృష్ట్యా ప్రశ్నలు ఎక్కువగా మౌలిక అంశాల ఆధారంగానే ఉంటాయి. కాబట్టి అభ్యర్థులు అరిథ్‌మెటిక్‌, గణితం ప్రశ్నల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అయితే ఈ విభాగంలో సాధనే మంచి ఫలితాలు ఇస్తుంది.

జనరల్‌ అవేర్‌నెస్‌: నేపథ్యాలూ అవసరమే
జనరల్‌ అవేర్‌నెస్‌ నుంచి వచ్చే ప్రశ్నలు వర్తమాన సంఘటనలు, విశేషాల గురించి ఉంటాయి. కేంద్రప్రభుత్వం ఇటీవల ప్రకటించిన భారతరత్న, పద్మ అవార్డుల గురించి తెలుసుకుంటూ అవార్డు గ్రహీతల నేపథ్యాలపై అవగాహన ఏర్పరుచుకోవాలి. ఇటీవల జరిగిన సంఘటనలు ఉదాహరణకు కశ్మీర్‌లో సీఆర్‌పీఎఫ్‌ దళంపై జరిగిన ఉగ్రదాడి, దానికి కారణమైన ఉగ్రవాద సంస్థ, ఆ సంస్థను ఎవరు నడుపుతున్నారు? వంటి విషయాలు తెలుసుకోవాలి. ఈ అంశంపై అవగాహన అంటే ఉగ్రవాద సంస్థల స్థాపన, వాటికి ఆశ్రయమిచ్చే దేశాలు, అంతర్జాతీయ ఉగ్రవాదులు వంటి అంశాలు తెలుసుకోవడం అన్నమాట.
అదేవిధంగా జాతీయ, అంతర్జాతీయ, క్రీడలు, అవార్డులు, వార్తల్లో వ్యక్తులు, సంస్థలు, దేశాధినేతలు, ప్రపంచ దేశాల కరెన్సీలు, అంతర్జాతీయ సంస్థలు (యుఎన్‌ఓ, డబ్ల్యూహెచ్‌ఓ మొదలైనవి), భారతీయ రైల్వే వ్యవస్థ, రోడ్డు రవాణా వ్యవస్థ, బేసిక్‌ కంప్యూటర్‌ పరిజ్ఞానం, పర్యావరణంపై అవగాహన, ఇటీవల సంభవించిన విపత్తులు, వాటికి ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు వంటివి నేర్చుకోవాలి. దేశంలో వారసత్వ నిర్మాణాలు, ప్రదేశాలు, భారత రాజ్యాంగంలో ప్రాథమిక అంశాలు, స్వాతంత్య్ర ఉద్యమ నేపథ్యం, భారతదేశ చరిత్ర, భౌగోళిక పరిస్థితులు, ఆర్థిక వ్యవస్థపై అవగాహన ఏర్పరుచుకోవాలి.

ప్రశ్నలు సరళంగానే ఉంటాయ్‌!
బ్యాంకు పరీక్షలు, స్టాఫ్‌ సెలక్షన్‌ పరీక్షలకు భిన్నంగా రైల్వే ప్రశ్నపత్రాలలో అడిగే ప్రశ్నలు కాస్త సరళంగానే ఉంటాయి. ఈ విభాగంలో అడిగే ప్రశ్నలు అభ్యర్థుల చురుకుదనాన్నీ, అవగాహననూ, ఏదైనా సమస్య వస్తే ఆలోచించే సామర్థ్యాన్నీ పరీక్షించేలా రూపొందిస్తారు. సులువైన ప్రశ్నల మోడల్స్‌ నుంచి కఠినంగా ఉండే మోడల్స్‌ స్థాయి వరకు సాధన చేస్తూ అభ్యర్థులు సర్వసన్నద్ధం కావాలి.
గ్రూప్స్‌ అభ్యర్థులకు అనుకోని అవకాశం
ఆంధ్రప్రదేశ్‌లో ఏపీపీఎస్‌సీ వివిధ నోటిఫికేషన్లు విడుదల చేసినందున అన్నింటికీ కలిపి దాదాపు ఐదారు లక్షల మంది సన్నద్ధమవుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలోనూ నిన్న మొన్నటివరకు వివిధ టీఎస్‌పీఎస్సీ పరీక్షలు రాసి ఒకపక్క ఫలితాల కోసం, మరోపక్క కొత్త నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తున్నారు. రెండు రాష్ట్రాల్లోనూ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌, కానిస్టేబుల్‌ పరీక్షలు రాసిన అనుభవమున్న అభ్యర్థులు ఇతర అవకాశాల కోసం నిరీక్షిస్తున్నారు. వీరందరికీ భారతీయ రైల్వేలు ప్రకటించిన సాంకేతికేతర సిబ్బంది (నాన్‌ టెక్నికల్‌ పాపులర్‌ కేటగిరి-ఎన్‌టీపీసీ) నోటిఫికేషన్‌ కోరుకోని వరం.
గ్రూప్స్‌ అభ్యర్థులు అనివార్యంగా జనరల్‌ స్టడీస్‌, మెంటల్‌ ఎబిలిటీలలో సన్నద్ధమవుతున్నారు. ఎన్‌టీపీసీ పరీక్షలో ఉండే విభాగాలు అరిథ్‌మెటిక్‌, రీజనింగ్‌ (మెంటల్‌ ఎబిలిటీ), జనరల్‌ నాలెడ్జ్‌లలో 100 లేదా 120 మార్కులకు పరీక్షిస్తారు. నూతన ధోరణులను అనుసరించి ఈసారి ఒక వేళ పర్యావరణ అంశాలు, కంప్యూటర్‌ పరిజ్ఞానాన్ని చేర్చినా గ్రూప్స్‌లో ఇవి జనరల్‌ స్టడీస్‌లో కవర్‌ అవుతున్నాయి. అంటే ఈ అభ్యర్థులు ఇప్పటికే చేసిన సన్నద్ధతతో కేంద్రప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేయవచ్చు. పోస్టులు ఎక్కువైనందున విజయావకాశాలు ఎక్కువే!
బ్యాంకు ఉద్యోగాలకు అవసరమైన సబ్జెక్టులూ, నైపుణ్యాలూ రైల్వే ఉద్యోగాల రాతపరీక్షకు కూడా ఉపయోగపడతాయి. బ్యాంకు పరీక్షలతో పోలిస్తే వీటి కఠినత్వం తక్కువ!

జనరల్‌ సైన్స్‌: మౌలిక అంశాలు
జనరల్‌ సైన్స్‌ నుంచి వచ్చే ప్రశ్నలు భౌతికశాస్త్రం, రసాయనిక శాస్త్రం, జీవశాస్త్రాల నుంచి ఉంటాయి. ఇవి కూడా 9వ తరగతి, టెన్త్‌, ఇంటర్‌ స్థాయిలో ఉంటాయి. సాధారణంగా సైన్స్‌, టెక్నికల్‌ నేపథ్యం ఉండే అభ్యర్థులకే ఈ అంశంపై అవగాహన ఎక్కువనుకోవడం అపోహ మాత్రమే. సామాజిక, ఆర్థికశాస్త్ర నేపథ్యం ఉన్న అభ్యర్థులు కూడా ఈ అంశంపై వచ్చిన ప్రశ్నలు, సమాధానాలు గుర్తించవచ్చు. ఎందుకంటే మొత్తం ప్రశ్నలన్నీ మౌలిక (బేసిక్‌) అంశాలతో రూపొందిస్తారు.
9, 10 తరగతుల భౌతికశాస్త్రం, రసాయనిక శాస్త్రం, జీవశాస్త్రం, అకాడమీ పుస్తకాలను చదివితే మంచి మార్కులు సాధించవచ్చు. అదేవిధంగా వర్తమానంలో సైన్స్‌ అండ్‌ టెక్నాలజీలో వచ్చే మార్పులు, కొత్త ఆవిష్కరణలపై అవగాహన పెంచుకోవాలి. నాసా, ఇస్రో చేపట్టే ప్రయోగాలు, గుర్తించే నక్షత్రాలను గుర్తుపెట్టుకోవాలి.

లాజికల్‌ ఎబిలిటీ: అధిక స్కోరు
ఉద్యోగార్థికి విశ్లేషణాత్మకంగా, తార్కికంగా ఆలోచించే సామర్థ్యం ఉందా? లేదా? అని పరీక్షించే విభాగం. ‘దిగితేగాని లోతెంతో తెలియద’న్నట్టుగా తొలిసారి పోటీపడే అభ్యర్థులకు చూడగానే గందరగోళంగా అన్పించవచ్చు. కానీ, ప్రశాంతంగా, శాస్త్రీయ ఆలోచనా రీతిలో పరిశీలిస్తే ఈ విభాగంలోని సమస్యలను పజిల్స్‌లా, ఫన్‌గా భావించవచ్చు. అందుకే దీన్ని ఎక్కువ మార్కులు సంపాదించే అవకాశం ఉన్న విభాగంగా పరిగణించవచ్చు. రక్తసంబంధాలు, దిశలు, కోడింగ్‌, డీకోడింగ్‌, సిట్టింగ్‌ అరేంజ్‌మెంట్స్‌, ర్యాంకింగ్స్‌, వెన్‌చిత్రాలు, పజిల్‌ టెస్ట్‌ మొదలైన అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి.

- యస్‌.వి. సురేష్‌, ఎడిటర్‌, ఉద్యోగ సోపానం


రైల్వేలో 1.3 లక్షల ఉద్యోగాలు

నిరుద్యోగులకు శుభవార్త.... రైల్వే శాఖ 1.3 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయనుంది. ఇందుకు సంబంధించి ఫిబ్ర‌వ‌రి 23 ఎంప్లాయిమెంట్‌ న్యూస్‌ పత్రికలో ‘సూచన ప్రకటన' వెలువరించింది. వీటికి దరఖాస్తులు చేసుకునే ప్రక్రియ కూడా వెంటనే ప్రారంభం కానుంది. కేవలం ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.
నాలుగు ప్ర‌క‌ట‌న‌లు... ల‌క్ష‌కు పైగా ఉద్యోగాలు
మొత్తం నాలుగు ప్ర‌క‌ట‌న‌ల ద్వారా రైల్వే శాఖ‌ దాదాపు 1.3 ల‌క్ష‌ల ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేయ‌నుంది. వీటిలో లెవెల్‌-1 (గ‌తంలో గ్రూప్ డి) పోస్టులే ల‌క్ష ఉన్నాయి. మిగిలిన‌వి నాన్‌టెక్నిక‌ల్, పారామెడిక‌ల్‌, మినిస్టీరియ‌ల్ అండ్ ఐసోలేటెడ్ క్యాట‌గిరీల పోస్టులు.
ఆర్ఆర్‌బీ, ఆర్ఆర్‌సీల ద్వారా భ‌ర్తీ
లెవెల్‌-1 (గ్రూప్ డి) పోస్టుల‌ను రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ (ఆర్ఆర్‌సీ) ల ద్వారా భ‌ర్తీ చేయ‌గా.... మిగిలిన‌వాటిని రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (ఆర్ఆర్‌బీ) ల ద్వారా భ‌ర్తీ చేయ‌నున్నారు.
28 నుంచి నాన్‌టెక్నికల్‌ ఉద్యోగాలకు...
నాన్‌ టెక్నికల్‌ పోస్టులకు ఫిబ్ర‌వ‌రి 28 నుంచి ఆన్‌లైన్‌లో పేర్లను రిజిస్టర్‌ చేసుకోవచ్చు. ఈ విభాగంలో జూనియర్‌ క్లర్క్‌ కమ్‌ టైపిస్ట్‌, అకౌంట్స్‌ క్లర్క్‌ కమ్‌ టైపిస్ట్‌, ట్రైన్స్‌ క్లర్క్‌, కమర్షియల్‌ కమ్‌ టికెట్‌ క్లర్క్‌, ట్రాఫిక్‌ అసిస్టెంట్‌, గూడ్స్‌ గార్డ్‌, సీనియర్‌ కమర్షియల్‌ కమ్‌ టికెట్‌ క్లర్క్‌, సీనియర్‌ క్లర్క్‌ కమ్‌ టైపిస్ట్‌, జూనియర్‌ అకౌంట్‌ అసిస్టెంట్‌ కమ్‌ టైపిస్ట్‌, కమర్షియల్‌ అప్రెంటిస్‌, స్టేషన్‌ మాస్టర్‌ తదితర ఉద్యోగాలు ఉన్నాయి.
మార్చి 4 నుంచి పారామెడికల్‌ ఉద్యోగాలకు...
వైద్య విభాగంలోని పారామెడికల్‌ ఉద్యోగాలకు మార్చి 4 నుంచి ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. ఈ విభాగంలో నర్సు, హెల్త్‌ ఇన్‌స్పెక్టర్‌, మలేరియా ఇన్‌స్పెక్టర్‌, ఫార్మాసిస్టు, ఈసీజీ టెక్నీషియన్‌, ల్యాబ్‌ అసిస్టెంట్‌, ల్యాబ్‌ సూపరింటెండెంట్‌ వంటి ఉద్యోగాలు ఉన్నాయి.
మార్చి 8 నుంచి కార్యాలయ ఉద్యోగాలకు...
కార్యాలయ ఉద్యోగాలకు మార్చి 8 నుంచి ఆన్‌లైన్‌లో పేర్లు రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. ఈ విభాగంలో స్టెనోగ్రాఫర్‌, చీఫ్‌ అసిస్టెంట్‌, జూనియర్‌ అనువాదకుడు (హిందీ) వంటి ఉద్యోగాలు ఉన్నాయి. మొత్తం ఈ మూడు విభాగాల్లో 30 వేల ఉద్యోగాలు భర్తీ చేసే అవకాశం ఉంది.
మార్చి 12 నుంచి లెవల్‌-1 ఉద్యోగాలకు...
లెవల్‌-1 (గతంలో గ్రూపు-డి కేటగిరీ అని పిలిచేవారు) ఉద్యోగాలకు మార్చి 12 నుంచి ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. ఈ విభాగంలో లక్ష ఉద్యోగాలు భర్తీ అవుతాయి. ఈ ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఆర్థికంగా వెనకబడిన వర్గాలు, దివ్యాంగులు, మాజీ సైనికులకు రిజర్వేషన్లు ఉంటాయి.

Indicative Notificaion
ఆర్ఆర్‌బీ సికింద్రాబాద్‌ ఆర్ఆర్‌బీ భువ‌నేశ్వ‌ర్‌ ఆర్ఆర్‌బీ చెన్నై ఆర్ఆర్‌బీ బెంగ‌ళూరు

Posted on 23-02-2019