సౌత్ సెంట్రల్ రైల్వేలో 2030 మ‌హిళా కానిస్టేబుల్ పోస్టులు

* విద్యార్హత ప‌దోత‌ర‌గ‌తి
* ప‌రీక్ష ఫీజు చెల్లించ‌న‌వ‌స‌రం లేదు
రైల్వే ప్రొటెక్షన్ ఫోర్సు/ రైల్వే ప్రొటెక్షన్ స్పెష‌ల్ ఫోర్సులో 2030 మ‌హిళా కానిస్టేబుల్ పోస్టుల భ‌ర్తీకి ద‌క్షిణ మ‌ధ్య రైల్వే, సికింద్రాబాద్ ప్రక‌ట‌న విడుద‌ల‌చేసింది. ప‌దోత‌ర‌గ‌తి పాసైన మ‌హిళా అభ్యర్థులంద‌రూ ఈ ఉద్యోగానికి ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. ఆన్‌లైన్‌లోనే ద‌ర‌ఖాస్తులు పూరించాలి. అయితే న‌క్సల్ ప్రభావిత ప్రాంతాల‌కు చెందిన‌వాళ్లు మాత్రం కావాల‌నుకుంటే ఆఫ్‌లైన్లోనూ ద‌ర‌ఖాస్తులు పంపుకోవ‌చ్చు. ప‌రీక్ష ఫీజు చెల్లించన‌వ‌స‌రం లేదు. రాత‌ప‌రీక్ష, ఫిజిక‌ల్ టెస్టుల ద్వారా అభ్యర్థుల‌ను ఎంపిక‌చేస్తారు.
ఖాళీలిలా...
ఆర్‌పీఎఫ్‌: మొత్తం 1827 ఖాళీలున్నాయి. వీటిలో ఎస్సీ 264, ఎస్టీ 145, ఓబీసీ 614, అన్ రిజ‌ర్వ్‌డ్ 804.
ఆర్‌పీఎస్ఎఫ్‌: మొత్తం 203 ఖాళీలున్నాయి. వీటిలో ఎస్సీ 23, ఎస్టీ 33, ఓబీసీ 52, అన్‌రిజ‌ర్వ్‌డ్ 95.
అర్హత‌: ప‌దోత‌ర‌గ‌తి ఉత్తీర్ణత‌
వ‌యోప‌రిమితి: జులై 1, 2016 నాటికి 18 ఏళ్లకు త‌గ్గకుండా ఉండాలి. అలాగే 25 ఏళ్లకు మించ‌రాదు. అంటే జులై 2, 1991- జులై 1, 1998 మ‌ధ్య జ‌న్మించిన‌వాళ్లే అర్హులు. అయితే ఎస్సీ,ఎస్టీల‌కు అయిదేళ్లు; ఓబీసీల‌కు మూడేళ్లు గ‌రిష్ఠ వ‌యోప‌రిమితిలో స‌డ‌లింపులు వ‌ర్తిస్తాయి.
ఎత్తు: ఎస్సీ, ఎస్టీలైతే క‌నీసం 152 సెం.మీ. ఓబీసీ, అన్ రిజ‌ర్వ్‌డ్ వాళ్లు 157 సెం.మీ. ఉండాలి.
ఎంపిక విధానం: రాత ప‌రీక్ష, ఫిజిక‌ల్ ఎఫిషియ‌న్సీ టెస్టు, ఫిజిక‌ల్ మెజ‌ర్‌మెంట్ టెస్టు, మెడిక‌ల్ టెస్టు, డాక్యుమెంట్ వెరిఫికేష‌న్‌ల ద్వారా.
రాత ప‌రీక్ష ఇలా...
ఇందులో 120 మ‌ల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు అడుగుతారు. ఓఎంఆర్ షీటుపై జ‌వాబులు గుర్తించాలి. ప‌రీక్ష వ్యవ‌ధి 90 నిమిషాలు. ప్రతి ప్రశ్నకు ఒక‌మార్కు. త‌ప్పు స‌మాధానం గుర్తించిన ప్రతి ప్రశ్నకు మార్కులో మూడో వంతు చొప్పున త‌గ్గిస్తారు. ప్రశ్నల‌న్నీ ప‌దోత‌ర‌గ‌తి స్థాయిలోనే ఉంటాయి. జ‌న‌ర‌ల్ అవేర్‌నెస్‌లో 50, అరిథ్‌మెటిక్ నుంచి 35, జ‌న‌ర‌ల్ ఇంటిలిజెన్స్‌, రీజ‌నింగ్ విభాగాల నుంచి 35 ప్రశ్నలు అడుగుతారు. అభ్యర్థులు తెలుగు మాధ్యమంలో ఉండే ప్రశ్నప‌త్రాన్నీ ఎంచుకోవ‌చ్చు. ఫిజిక‌ల్ టెస్టుకు ఎంపిక‌కావాలంటే రాత‌ప‌రీక్షలో అర్హత సాధించడం త‌ప్పనిస‌రి. జ‌న‌ర‌ల్‌, ఓబీసీ అభ్యర్థులు 35 శాతం మార్కులు పొందాలి. ఎస్సీ,ఎస్టీలైతే క‌నీసం 30 శాతం రావాలి. తుది నియామ‌కాలు రాత ప‌రీక్ష, ఫిజిక‌ల్ టెస్టుల్లో చూపిన ప్రతిభ‌, రిజ‌ర్వేష‌న్ ప్రాతిప‌దిక‌న చేప‌డ‌తారు.
ఫిజిక‌ల్ టెస్టు...
రాత ప‌రీక్ష‌లో అర్హత మార్కులు సాధించిన అభ్యర్థుల‌కు ఫిజిక‌ల్ టెస్టులు నిర్వహిస్తారు. ఆయా కేట‌గిరీల్లో ఉన్న ఖాళీల‌కు ప‌ది రెట్ల సంఖ్యలో అభ్యర్థుల‌కే ఫిజిక‌ల్ టెస్టులో అవ‌కాశం క‌ల్పిస్తారు. ఇందులో భాగంగా 800 మీట‌ర్ల దూరాన్ని తొలి ప్రయ‌త్నంలోనే 3 నిమిషాల 40 సెక‌న్లలో పూర్తిచేయాలి. ఇలా పూర్తిచేసిన‌వాళ్లు లాంగ్‌జంప్ 12 అడుగుల దూరం త‌గ్గకుండా చేయాలి. 2 ప్రయ‌త్నాల్లో ల‌క్ష్యాన్ని పూర్తిచేయాలి. హైజంప్‌లో 3 అడుగుల ఎత్తుకు ఎగరాలి. దీనికి కూడా 2 ప్రయ‌త్నాలు ఉన్నాయి. అనంత‌రం అభ్యర్థుల ఎత్తును కొలుస్తారు. వీటన్నింటిలోనూ అర్హత సాధించిన‌వారి ధ్రువ‌ప‌త్రాలను ప‌రిశీలిస్తారు. ధ్రువ‌ప‌త్రాల ప‌రిశీల‌న‌కు ఆయా కేటగిరీల్లో ఉన్న ఖాళీల‌కు ఒక‌టిన్నర రెట్ల సంఖ్యలో అభ్యర్థుల‌నే పిలుస్తారు. ఎన్‌సీసీ బీ స‌ర్టిఫికెట్ ఉంటే 1, ఎన్‌సీసీ సీ లేదా ఆపై స్థాయి స‌ర్టిపికెట్ ఉంటే 2 బోన‌స్ మార్కులు కేటాయిస్తారు. అలాగే గేమ్స్ అండ్ స్పోర్ట్స్ స‌ర్టిఫికెట్లు ఉంటే ఒక‌టి నుంచి 3 వ‌ర‌కు బోన‌స్ మార్కులు ఉన్నాయి. ఎత్తు 165 సెం.మీ. లేదా ఆపైన ఉంటే 3 బోన‌స్ మార్కులు ల‌భిస్తాయి. అన్ని ద‌శ‌ల్లోనూ అర్హులైన‌వారికి వైద్య ప‌రీక్షలు నిర్వహిస్తారు. అందులోనూ ఎంపికైతే ఉద్యోగం ఖాయ‌మ‌వుతుంది. వీళ్లకు శిక్షణ నిర్వహిస్తారు. శిక్షణ ముగిసిన‌ప్పుడు నిర్వహించే ప‌రీక్షలో ఉత్తీర్ణత సాధించ‌డం త‌ప్పనిస‌రి.
ఆన్‌లైన్ / ఆఫ్‌లైన్ ద‌ర‌ఖాస్తులు స్వీక‌రించ‌డానికి చివ‌రి తేదీ: మార్చి 1, 2016
ప‌రీక్ష తేదీ: త‌ర్వాత ప్రక‌టిస్తారు.
ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ఏదో ఒక విధానంలోనే ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. ఒక‌టి కంటే ఎక్కువ ద‌ర‌ఖాస్తులు పంపితే అన‌ర్హులుగా ప‌రిగణిస్తారు. ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుల‌కు ప్రింట‌వుట్ పోస్టు చేయాల్సిన అవ‌స‌రం లేదు.
వెబ్‌సైట్లు:
http://www.rpfonlinereg.in/
http://www.scr.indianrailways.gov.in/

Posted on 03-02-2016