RRB RPF Preparation Plan

పదివేల పోస్టుల రైలొచ్చింది!

* అమ్మాయిలకే ఐదువేల ఉద్యోగాలు
* పదితోనూ కొలువు కొట్టొచ్చు

కేంద్రప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించాలనుకునేవారికి రైల్వేశాఖ అవకాశాన్ని మోసుకొచ్చింది. రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌, రైల్వే ప్రొటెక్షన్‌ స్పెషల్‌ ఫోర్స్‌లో 8619 కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీకీ, 1120 సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టుల భర్తీకీ ప్రకటన విడుదల చేసింది. కానిస్టేబుల్‌ పోస్టులకు విద్యార్హత కేవలం పదోతరగతే! ఎస్‌ఐ పోస్టులకు డిగ్రీ! కానిస్టేబుల్‌ పోస్టుల్లో దాదాపు సగం పోస్టులను మహిళలకు కేటాయించటం విశేషం. పైగా వచ్చిన ఏ భాషలోనైనా పరీక్షను రాయగలిగే అవకాశం. అర్హతలున్నవారు దరఖాస్తు చేసి, పరీక్షకు సిద్ధమైతే ఆశించిన కొలువును చేజిక్కించుకోవచ్చు.
తగిన శారీరక ప్రమాణాలున్న అభ్యర్థులు పదోతరగతి విద్యార్హతతో రైల్వే కానిస్టేబుల్‌ ఉద్యోగం, డిగ్రీ ఉత్తీర్ణతతో ఎస్‌ఐ ఉద్యోగంలో ప్రవేశించే అవకాశాన్ని తాజా నోటిఫికేషన్‌ అందిస్తోంది. కానిస్టేబుల్‌ పోస్టుకు రూ.21,700, ఎస్‌.ఐ. పోస్టులకు రూ. 35,400 జీతం లభిస్తుంది.
కానిస్టేబుల్‌ కొలువులకు 01.07.2018 నాటికి 18 నుంచి 25 ఏళ్ళలోపు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్‌ఐ పోస్టులకు 20 నుంచి 25 ఏళ్ళలోపు వయసు ఉన్నవారు పోటీపడవచ్చు. 4,216 కానిస్టేబుల్‌ పోస్టులనూ, 301 ఎస్‌ఐ పోస్టులనూ మహిళలకు కేటాయించారు. ప్రణాళికబద్ధంగా 3 నెలల కాలాన్ని సక్రమంగా వినియోగించుకుంటే ఈ ఉద్యోగ సాధన కష్టమేమీ కాదు.
పరీక్షకు దరఖాస్తు చేయాలనుకునేవారు రైల్వేశాఖ అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌ దరఖాస్తు పూర్తిచేయాలి. దరఖాస్తు చేసే సమయంలో ఏ జోన్‌కు దరఖాస్తు చేయాలనుకున్నారో ‘పోస్ట్‌ ప్రిఫరెన్స్‌’లో వివరాలు నమోదు చేయాలి. తమకు నచ్చిన ఏ జోన్‌కైనా అభ్యర్థులు దరఖాస్తు చేయవచ్చు.
రాతపరీక్షలో 120 ప్రశ్నలను 3 విభాగాలుగా విభజించారు. 90 నిమిషాల్లో పూర్తిచేయాల్సి ఉంటుంది.
జనరల్‌ అవేర్‌నెస్‌ - 50 మార్కులు
అరిథ్‌మెటిక్‌ - 35 మార్కులు
జనరల్‌ ఇంటెలిజెన్స్‌, రీజనింగ్‌ - 35 మార్కులు.
ప్రతి సరైన సమాధానానికీ ఒక మార్కు, తప్పు సమాధానానికి 1/3 వంతు రుణాత్మక మార్కులున్నాయి. ప్రశ్నపత్రం ఇంగ్లిష్‌, హిందీ, తెలుగు, ఇతర రాష్ట్ర భాషల్లోనూ ఉంటుంది. పరీక్ష సమయంలో అభ్యర్థులు ఏదైనా ఒక భాషను ఎంచుకోవాలి. వారికి ప్రశ్నలన్నీ ఆ భాషలోనే ఇస్తారు.
దేన్ని ఎలా చదవాలి?
జనరల్‌ అవేర్‌నెస్‌: దీని నుంచి 50 మార్కులకు ప్రశ్నలు వస్తాయి. తక్కువ సమయంలో ఎక్కువ మార్కులు తెచ్చుకునే వీలున్న విభాగమిది. ప్రశ్న చదివి వెంటనే సమాధానం గుర్తించేలా ఉంటాయి. 8, 9, 10 తరగతుల్లో చదివిన సైన్స్‌, సోషల్‌ సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు వస్తాయి. దేశవ్యాప్తంగా జరిగే పరీక్ష కాబట్టి రాష్ట్రస్థాయిలో జరిగే అంశాలకే ప్రాధాన్యమివ్వకుండా దేశంలో జరిగిన, జరుగుతున్న అంశాలపై దృష్టిపెట్టాలి.
భారతదేశ చరిత్ర, భౌగోళికాంశాలు, రాజనీతి శాస్త్రం, ఎకానమీ, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, బయాలజీ అంశాలతోపాటు కరెంట్‌ అఫైర్స్‌ నేర్చుకోవాలి. సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ అంశాలకు సన్నద్ధమవ్వాలి. జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వ పథకాలు, పొరుగు దేశాలతో సంబంధాలు, ఇతర దేశాల ప్రధాన మంత్రులు, రాష్ట్రపతులు, దేశాధ్యక్షులు, కరెన్సీ, రాజధానులు, పొడవైన నదులు, స్పోర్ట్స్‌ అంశాలు, అవార్డులు, వార్తల్లోని వ్యక్తులు, కార్పోరెట్‌ సంస్థల అధిపతులు, ఉపగ్రహ ప్రయోగాల వివరాలు, వ్యాక్సిన్లు, దేశాధ్యక్షుల సమావేశాలు వంటి అంశాలను రోజువారీ దినపత్రికలు చదువుతూ నోట్స్‌ తయారు చేసుకోవాలి.
జనరల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ రీజనింగ్‌: ఈ విభాగం నుంచి 35 మార్కులకు ప్రశ్నలు వస్తాయి. అభ్యర్థుల్లో ఉన్న సృజనాత్మకతను ఈ విభాగంలో పరీక్షించేలా ప్రశ్నలు వస్తాయి. బొమ్మల్లో నంబర్లను ఇచ్చి వాటి మధ్య ఉండే లాజిక్‌ను కనుక్కొని, దాని ద్వారా సమాధానాన్ని రాబట్టాలి. నంబర్లు, లెటర్లు, బొమ్మలపై ప్రశ్నలుంటాయి. వెన్‌ డయాగ్రమ్‌, గడియారాలు, క్యాలెండర్‌, నంబర్‌ సిరీస్‌, అనాలజీ, కోడింగ్‌-డీకోడింగ్‌, రక్తసంబంధాలు, సీటింగ్‌ అరేంజ్‌మెంట్‌, అడ్రస్‌ మ్యాచింగ్‌, నంబర్‌ మ్యాచింగ్‌ అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. ఒక లాజిక్‌ ఆధారంగా సమాధానాలు రాకపోతే వెంటనే వేరే దానితో ప్రశ్నలను పూర్తిచేయాలి. లేదంటే దానిని వదిలేసి మరో ప్రశ్నను ఎంచుకోవాలి.
అరిథ్‌మెటిక్‌: 35 మార్కులకు ప్రశ్నలు వస్తాయి. వ్యాపార గణితంలోని అంశాల నుంచి ప్రశ్నలుంటాయి. తక్కువ సమయంలో సమాధానాలను గుర్తించడానికి సింప్లిఫికేషన్‌పై దృష్టిపెట్టాలి. రోజువారీ దినచర్యల్లో చేసే పనిలో భాగంగా ప్రశ్నలను ఉదాహరించుకుంటే తక్కువ సమయంలో జవాబులను గుర్తించవచ్చు. ఒక ప్రశ్నకు 4 రకాలుగా మెథడ్స్‌ మార్చి సమాధానాన్ని గుర్తించవచ్చు. ఏ విధానంలో తక్కువ సమయంలో జవాబు రాబట్టగలరో తెలుసుకోవాలి. లాజిక్‌ను ఆధారం చేసుకుంటూ ఒక చాప్టర్‌ను ఇంకోదానితో లింకు చేసుకోవాలి.
అభ్యర్థులు మొదటగా షార్ట్‌కట్‌ విధానంలో +, -, ×, ÷ నేర్చుకోవాలి. సంప్రదాయ పద్ధతిని వీడి తక్కువ సమయంలో సమాధానాన్ని గుర్తించడం అలవాటు చేసుకోవాలి. శాతాలు, నిష్పత్తి, లాభనష్టాలు, వడ్డీ ప్రశ్నలు, కాలం-పని, కాలం-దూరం, డేటా అనాలిసిస్‌ అతి ముఖ్యమైన అంశాలు.
రోజుకు 6-8 గంటల ప్రణాళిక వేసుకుని, ప్రతి సెక్షన్‌ నుంచీ ఒక్కో అంశాన్ని చదివి, వీలైనన్ని ఎక్కువ ప్రశ్నలు సాధన చేయాలి. రోజూ దినపత్రిక చదువుతూ నోట్సు తయారుచేసుకుంటే సమయాన్ని సద్వినియోగపరచుకోవచ్చు.
ముఖ్యమైన తేదీలు
* ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభం: 01.06.2018
* ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరితేదీ: 30.06.2018
* కంప్యూటర్‌ బేస్‌డ్‌ ఆన్‌లైన్‌ పరీక్ష: సెప్టెంబరు- అక్టోబరు 2018
వెబ్‌సైట్‌: http://www.indianrailways.gov.in/
పోలీసు ఉద్యోగాభిలాషులకు వరం
రైల్లో ప్రయాణిస్తున్నపుడు మన బోగీలోనో, పక్కదానిలోనో ఖాకీ దుస్తులతో సాయుధులైన సిబ్బంది కనిపిస్తుంటారు. పరీక్షగా చూస్తే వారి టోపీపై ఆర్‌పీఎఫ్‌ అనో ఆర్‌పీఎస్‌ అన్న అక్షరాలో కనిపిస్తాయి. రైల్వే ప్లాట్‌ఫాంపై వెళుతుంటే కాస్త చివరగా చిన్నపాటి పోలీస్‌ స్టేషన్‌ వంటిది కూడా కనిపిస్తుంటుంది. అక్కడా సాయుధులైన కానిస్టేబుళ్లు, సబ్‌ ఇన్‌స్పెక్టర్లు కనిపిస్తారు. ఈ రెండుచోట్లా ప్రయాణికులకు తారసపడినవారు రైల్వే భద్రతా దళానికి చెందిన సిబ్బందే. రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ (ఆర్‌పీఎఫ్‌), రైల్వే ప్రొటెక్షన్‌ స్పెషల్‌ ఫోర్స్‌ (ఆర్‌పీఎస్‌ఎఫ్‌). ఆర్‌పీఎఫ్‌ కానిస్టేబుల్‌, సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఇద్దరూ క్షేత్రస్థాయిలో కీలక బాధ్యతలు నిర్వహించే ఉద్యోగులు.
విధులేంటి?
* నిత్యం వేలాది రైళ్లలో దేశం నలుమూలలా ప్రయాణించే రెండు కోట్ల ప్రయాణికులకు రక్షణ కవచంలా నిలవడం, రైల్వే ఆస్తులకు భద్రత కల్పించడం వీరి ప్రధాన విధి.
* రైళ్లలోనూ, రైల్వేస్టేషన్‌ పరిసర ప్రాంతాల్లోనూ సంచరించే అసాంఘిక శక్తులను ఎప్పటికప్పుడు గుర్తించి పట్టుకుంటారు.
* మహిళలు, చిన్నారుల అక్రమ రవాణాను నిరోధించి, రైల్వేస్టేషన్లలో సంచరించే అనాథ పిల్లలను బాలల ఆశ్రమాలకు చేరవేస్తుంటారు.
నాలుగు దశలు: ఎంపికలో నాలుగు దశలుంటాయి. 1. కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష (సీబీటీ) సెప్టెంబరు లేదా అక్టోబరులో జరిగే అవకాశముంది. మొత్తం ఎంపికలో ఇదే రాతపరీక్ష. అయితే ఆన్‌లైన్‌ విధానంలో రాయాల్సి ఉంటుంది. 2. శారీరక సామర్థ్య పరీక్ష (పీఈటీ). ప్రతి కేటగిరీలో ఉన్న పోస్టులకు పదిరెట్ల అభ్యర్థులను రాతపరీక్ష నుంచి ఎంపిక చేస్తారు. 3. దేహప్రమాణాల పరీక్ష (పీఎంటీ) 4. ధ్రువపత్రాల పరిశీలన (డీవీ)
రాతపరీక్ష సరిపోదు
రైల్వే భద్రతా సిబ్బంది- కానిస్టేబుల్‌, సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ రెండు పోస్టులు కూడా కేవలం రాతపరీక్షలో ప్రతిభ చూపినంత మాత్రాన ఎంపికయ్యేవి కావని అభ్యర్థులు గుర్తుంచుకోవాలి. నిర్దిష్ట శారీరక ప్రమాణాలు, శారీరక సామర్థ్య పరీక్షలో పటిమ చూపడం కూడా అవసరం. అందువల్ల ఈ పోస్టులను ఆశిస్తున్న యువతీయువకులు కనీస అర్హతలు అందుకోవాల్సిన ప్రమాణాలను రైల్వే వెబ్‌సైట్‌ నుంచి తెలుసుకుని తమకు ఆ యోగ్యతలు ఉన్నాయనుకుంటేనే దరఖాస్తుకు ఉపక్రమించాలి.
రాతపరీక్షను తెలుగులో రాసే అవకాశం ఉన్నప్పటికీ దరఖాస్తును మాత్రం ఇంగ్లిష్‌లోనే పూరించాలి.
రాతపరీక్షలో రుణాత్మక మార్కులున్నాయి. ఈ విషయాన్ని దరఖాస్తు సమయంలోనే గుర్తించాలి. బహుళైచ్ఛిక ప్రశ్నలు కాబట్టి లాటరీ విధానంలో జవాబులు గుర్తించవచ్చన్న వైఖరికి ఆస్కారం లేదు. సరైన జవాబుకు ఒక మార్కు, తప్పు సమాధానానికి 1/3 మార్కు తీసేస్తారు.
అదనపు అవకాశం
తెలుగు రాష్ట్రాల్లోని పోలీస్‌ కానిస్టేబుల్స్‌, సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఉద్యోగాభిలాషులకు ఆర్‌పీఎఫ్‌ నోటిఫికేషన్‌ అదనంగా వచ్చిన అరుదైన అవకాశం. 8619 ఆర్‌పీఎఫ్‌, ఆర్‌పీఎస్‌ఎఫ్‌ కానిస్టేబుల్స్‌, 1120 సబ్‌ ఇన్‌స్పెక్టర్స్‌ ఖాళీలు ఏకరూప దుస్తుల (యూనిఫాం) పోస్టులు ఆశించేవారికి మంచి అవకాశం. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల్లో 18-25 ఏళ్ల వయసు, నిర్దిష్ట శారీరక ప్రమాణాలున్న యువతీయువకులు గత కొన్ని నెలలుగా పోలీసు శాఖ నుంచి వెలువడే కానిస్టేబుల్‌, ఎస్‌ఐ పోస్టుల ప్రకటనల కోసం ఎదురుచూస్తూ సిద్ధమవుతున్నారు. శారీరక సామర్థ్య పరీక్షకు ‘ఫిట్‌నెస్‌’ పెంచుకునే పనిలో ఉన్నారు. రాతపరీక్ష సిలబస్‌కు సన్నద్ధమవుతున్నారు.
రెండు రాష్ట్రాల నుంచి ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ నోటిఫికేషన్లు వెలువడనున్నాయి. ఇలాంటి సమయంలో దాదాపుగా అన్నివిధాలా అవే అర్హతలతో ఆర్‌పీఎఫ్‌ నోటిఫికేషన్‌ వెలువడింది. రాతపరీక్ష విషయంలోనూ రాష్ట్ర ప్రభుత్వాల కంటే కాస్త తేలిక ప్రక్రియ కావడం విశేషం.
ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ పోలీసుశాఖ కానిస్టేబుల్‌, ఎస్‌ఐ ఎంపికకు రాతపరీక్షలు స్క్రీనింగ్‌, మెయిన్స్‌గా రెండు దశల్లో ఎదుర్కోవాల్సి ఉండగా ఆర్‌పీఎఫ్‌కు రాతపరీక్ష ఒక్కటే. సిలబస్‌ కూడా రాష్ట్ర ప్రభుత్వాలతో పోలిస్తే తక్కువే. జనరల్‌ నాలెడ్జ్‌, అరిథ్‌మెటిక్‌, రీజనింగ్‌ విభాగాల్లో 120 ప్రశ్నలను ఆర్‌పీఎఫ్‌ రాతపరీక్షలో ఎదుర్కోవాలి. వీటిలోని దాదాపు అన్ని అంశాలను రాష్ట్రాల పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌లోనూ అధ్యయనం చేస్తారు. పైగా ఆర్‌పీఎఫ్‌ పరీక్షను కూడా తెలుగులో రాయగలిగే అవకాశం ఉండటం అభ్యర్థులకు కలిసొచ్చే అంశం.

Posted on 21-05-2017