RRC Group - D Notification

రా రమ్మంటున్నాయ్‌... రైల్వే ఉద్యోగాలు!

దేశవ్యాప్తంగా 62,907 గ్రూప్‌-సి పోస్టుల్లో చేరే అద్భుత అవకాశాన్ని భారతీయ రైల్వేశాఖ కల్పిస్తోంది. 18 నుంచి 33 సంవత్సరాల మధ్య వయసుండి, పదోతరగతితో ఈ ఉద్యోగాలకు పోటీపడవచ్చు. వీటిలో చేరితే రూ.18,000 నెల వేతనంతోపాటు ఎన్నో సౌకర్యాలు లభిస్తాయి. మొత్తం పోస్టుల్లో 6523 పోస్టులు కేవలం సికింద్రాబాద్‌ రైల్వేడివిజన్‌లో భర్తీ చేయనున్నారు.
ఈ నియామక ప్రక్రియలో కంప్యూటర్‌ ఆధారిత రాతపరీక్ష నిర్వహిస్తారు. అందులో అర్హత మార్కులు సాధించినవారికి శారీరక దార్ఢ్య పరీక్ష ఉంటుంది. రాతపరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా పోస్టులు భర్తీ చేయనున్నారు. 12.03.2018 లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు పూర్తి చేసుకోవాలి.
* కంప్యూటర్‌ ఆధారిత ఆన్‌లైన్‌ పరీక్షలో 100 ప్రశ్నలను పూర్తి చేయడానికి 90 నిమిషాల సమయాన్ని కేటాయించారు. జనరల్‌ కేటగిరీ అభ్యర్థులు 40%, ఓబీసీ, ఎస్‌సీ, ఎస్‌టీ కేటగిరీ వారు 30% కనీస అర్హత మార్కులు పొందాలి.
*అరిథ్‌మెటిక్‌, మేథమేటిక్స్‌, జనరల్‌ ఇంటెలిజెన్స్‌, రీజనింగ్‌, జనరల్‌ సైన్స్‌, జనరల్‌ అవేర్‌నెస్‌, కరెంట్‌ అఫైర్స్‌ల నుంచి ప్రశ్నలు వస్తాయి. ప్రతి తప్పు సమాధానానికి 1/3 వంతు రుణాత్మక మార్కులున్నాయి.
అరిథ్‌మెటిక్‌, మేథమేటిక్స్‌
వ్యాపార గణితంలోని ప్రశ్నలు రోజువారీ దినచర్యలో భాగంగా మనం చేసే పనికి వర్తించుకుంటూ ఆలోచిస్తే సమాధానాలు తక్కువ సమయంలో పూర్తి చేయవచ్చు. నంబర్‌ సిస్టమ్స్‌పై అవగాహన పెంచుకుని, ఇంటీజర్లు, భిన్నాలు, డెసిమల్‌ నంబర్లకు బాడ్‌మాస్‌, పెడ్‌మాస్‌ సూత్రాలను అప్లై చేయడం నేర్చుకోవాలి. వర్గాలు, వర్గమూలాలు, ఘనాలు, ఘనమూలాలు చేయడం సాధన చేయాలి. కసాగు, గసాభా, నిష్పత్తి-అనుపాతం, శాతాలు, వ్యాపార భాగస్వామ్యం, లాభనష్టాలు, చక్రవడ్డీ, బారువడ్డీ, కాలం-పని, కాలం-దూరం, వైశాల్యాలు, ఘన పరిమాణాలకు సన్నద్ధమవ్వాలి. తక్కువ సమయంలో షార్ట్‌కట్‌ ఫార్ములాలను వాడుతూ సమాధానాలు గుర్తించడం సాధన చేయాలి.
క్యాలెండర్‌, గడియారాలకు సంబంధించిన ప్రశ్నలనూ సాధన చేయాలి. బీజీయ సమాసం, రేఖాగణితం, త్రికోణమితి, సాంఖ్యకశాస్త్రాలకు సంబంధించిన సమాధానాలను గుర్తించాలంటే ఫార్ములాలను ఉపయోగించడం తెలియాలి. వీటి ఫార్ములాలను ఒక పట్టిక రూపంలో తయారు చేసుకుని, ప్రతిరోజూ 10 నిమిషాలు వెచ్చించాలి. రోజూ ఇలా మననం చేసుకోవడం ద్వారా ఎక్కువ ప్రశ్నలకు సమాధానాలను గుర్తించవచ్చు.
జనరల్‌ ఇంటెలిజెన్స్‌, రీజనింగ్‌
రీజనింగ్‌లో లాజికల్‌ రీజనింగ్‌ నుంచి నంబర్‌ సిరీస్‌, కోడింగ్‌-డీకోడింగ్‌, ఆడ్‌మాన్‌ అవుట్‌, సింబల్స్‌, నొటేషన్స్‌, వెన్‌ చిత్రాలు, రక్తసంబంధాలు తదితర అంశాలపై ప్రశ్నలు వస్తాయి. సీటింగ్‌ అరేంజ్‌మెంట్‌ నుంచి గ్రూప్‌గా 2-3 ప్రశ్నలు వస్తాయి. డైరెక్షన్స్‌, స్టేట్‌మెంట్‌-కన్‌క్లూజన్‌, స్టేట్‌మెంట్‌-అసంప్షన్‌, డెసిషన్‌ మేకింగ్‌, సిలాజిజం నుంచీ ప్రశ్నలు వస్తాయి.
ప్రశ్నలో ఉన్న తర్కం (లాజిక్‌) ఆధారంగా నంబర్లు ఎలా మారుతున్నాయో గమనించి, సమాధానాన్ని గుర్తించాలి. గుర్తించేప్పుడు పూర్తి సమాచారాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. ఇంగ్లిష్‌ భాషపై పట్టు సాధిస్తే సిలాజిజం, స్టేట్‌మెంట్‌-కన్‌క్లూజన్స్‌, స్టేట్‌మెంట్‌-అసంప్షన్స్‌ ప్రశ్నలకు సమాధానాలను కచ్చితంగా గుర్తించవచ్చు. ఎక్కువ ప్రశ్నలు సాధన చేసి ఎన్ని మోడల్స్‌ ఉన్నాయో వాటిని నోట్స్‌ రూపంలో రాసుకోవాలి. పరీక్షలోపు వీలైనన్ని ఎక్కువ ప్రశ్నలు సాధన చేయాలి.
జనరల్‌ ఇంటెలిజెన్స్‌ అంశాల్లో నంబర్‌ పజిల్స్‌, సిమిలారిటీ, డిఫరెన్సెస్‌, మిర్రర్‌ ఇమేజ్‌, వాటర్‌ ఇమేజ్‌ అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. అలాగే డేటా సఫిషియన్సీ, డేటా ఇంటర్‌ప్రిటేషన్‌ నుంచీ ప్రశ్నలుంటాయి. ఎంత ఎక్కువ సాధన చేస్తే అన్ని ప్రశ్నలకు సమాధానాలు గుర్తించవచ్చు. సులభంగా మార్కులు తెచ్చుకుని స్కోర్‌ పెంచుకోవడానికి అవకాశం ఉన్న సెక్షన్‌ ఇది.
జనరల్‌ సైన్స్‌
పదోతరగతి స్థాయిలో ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. ఆబ్జెక్టివ్‌ విధానంలో అడగడానికి అవకాశం ఉన్న ప్రశ్నలకు సంబంధించిన మెటీరియల్‌ సేకరించాలి. దానికి ఎక్కువ సమయం కేటాయించి సమాచారాన్ని గుర్తుంచుకునేలా చదవడం అలవాటు చేసుకోవాలి. ఎప్పటికప్పుడు పునశ్చరణ (రివిజన్‌) చేస్తే చదివిన సమాచారం ఎక్కువ రోజులు గుర్తుంచుకోవచ్చు.
జనరల్‌ అవేర్‌నెస్‌, కరెంట్‌ అఫైర్స్‌
పదోతరగతి స్థాయిలో ఉండే చరిత్ర, భౌగోళిక, ఆర్థిక, రాజనీతి శాస్త్రాలపై అవగాహన ఉండాలి. శాస్త్రీయ, సాంకేతిక అంశాలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మార్పులు గమనించాలి. రోజువారీ దినపత్రికలు చదువుతూ వాటి సమాచారాన్ని సేకరించాలి. కేంద్రప్రభుత్వ పథకాలు, ఇతర దేశాలతో కుదుర్చుకున్న సంబంధాలు, దేశాధినేతలు, కరెన్సీ, రాజధానులు, వార్తల్లోని వ్యక్తులు, ప్రదేశాల ప్రాముఖ్యం, పుస్తకాలు-రచయితలు, అవార్డులు, ఆటలకు సంబంధించిన విషయాలు తదితర అంశాలపై సన్నద్ధమవ్వాలి.
పీఈటీ ఇలా...
కంప్యూట‌ర్ బేస్డ్ టెస్టు (సీబీటీ)లో ప్ర‌తిభ చూపిన అభ్య‌ర్థుల నుంచి ఆయా విభాగాల‌వారీ ఖాళీల‌కు రెండు రెట్ల సంఖ్య‌లో అభ్య‌ర్థుల‌ను పీఈటీ కి ఎంపిక చేస్తారు. ఇందులో భాగంగా పురుష అభ్య‌ర్థులు 35 కేజీల బ‌రువును ఒకే ప్ర‌య‌త్నంలో రెండు నిమిషాల వ్య‌వ‌ధిలో వంద మీట‌ర్ల దూరం వ‌ర‌కు మోసుకువెళ్ల‌గ‌ల‌గాలి. అలాగే తొలి ప్ర‌య‌త్నంలోనే ఒక కిలోమీట‌ర్ దూరాన్ని 4 నిమిషాల 15 సెకెన్ల వ్య‌వ‌ధిలో చేరుకోవాలి. అదే మ‌హిళ‌లైతే తొలి ప్ర‌య‌త్నంలోనే 20 కేజీల బ‌రువుని రెండు నిమిషాల్లో వంద మీట‌ర్ల దూరానికి మోసుకెళ్లాలి. అలాగే మొద‌టి ప్ర‌య‌త్నంలోనే కిలో మీట‌ర్ దూరాన్ని 5 నిమిషాల 40 సెకెన్ల వ్య‌వ‌ధిలో చేరుకోవాలి.
కంప్యూట‌ర్ బేస్డ్ టెస్టు, పీఈటీలో చూపిన ప్ర‌తిభ ద్వారా ఆయా కేట‌గిరీల వారీ రిజ‌ర్వేష‌న్లు, ఖాళీల ప్ర‌కారం తుది నియామ‌కాలు చేప‌డ‌తారు.
విద్యార్హ‌త‌: ప‌దోత‌ర‌గ‌తి ఉత్తీర్ణ‌త‌.
వ‌యోప‌రిమితి: జులై 1, 2018 నాటికి 18 నుంచి 33 ఏళ్లు (ఎస్సీ, ఎస్టీల‌కు అయిదేళ్లు; ఓబీసీల‌కు మూడేళ్లు గ‌రిష్ఠ వ‌యోప‌రిమితిలో స‌డ‌లింపులు వ‌ర్తిస్తాయి)
ఎంపిక విధానం: ఆన్‌లైన్‌లో నిర్వ‌హించే ప‌రీక్ష ద్వారా
వేత‌నం: ఎంపికైన‌వారికి రూ.18,000 మూల‌వేత‌నంగా చెల్లిస్తారు. దీంతోపాటు ఇత‌ర ఆల‌వెన్సులు ఉంటాయి.
ప‌రీక్ష ఫీజు: ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మ‌హిళ‌ల‌కు రూ. 250; జ‌న‌ర‌ల్‌, ఓబీసీ అభ్య‌ర్థుల‌కు రూ.500
మ‌హిళ‌లు, దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీ అభ్య‌ర్థులు / ఆర్థికంగా వెనుక‌బ‌డిన వ‌ర్గాల‌కు చెంది త‌ల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.50 వేల‌లోపు ఉన్న‌వారు చెల్లించిన‌ ప‌రీక్ష ఫీజు రూ.250 మ‌ళ్లీ వెన‌క్కి ఇచ్చేస్తారు. అయితే వీరు ప‌రీక్ష‌కు హాజ‌రైతేనే ఫీజు తిరిగి చెల్లిస్తారు. ఏ అకౌంట్‌లో ఫీజు జ‌మ‌చేయాలో వివ‌రాలు ద‌ర‌ఖాస్తులో పేర్కోవాలి.
ద‌ర‌ఖాస్తులు: ఆన్‌లైన్ విధానంలో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుల ప్రారంభ తేదీ: ఫిబ్ర‌వ‌రి 10 ఉద‌యం 10 గంట‌ల నుంచి
ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేదీ: మార్చి 31.

- సుధీర్ చ‌క్ర‌వ‌ర్తి చాగంటి, Sreedhar's CCE
Posted on 12-02-2018

Notification Info.
  • Notificaion
  • Apply Online