స్టడీ ప్లాన్‌


సెట్‌లో ఆర్థిక కోణం

       ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ఎలిజిబిలిటీ టెస్టు లో పేపర్‌ 2 కన్నా 3లో ప్రశ్నల కాఠిన్యతాస్థాయి అధికం. పరీక్ష సమీపిస్తున్న తరుణంలో సన్నద్ధత స్థాయి పెంచుకుంటూ వెళ్ళటం, గత ప్రశ్నపత్రాల అధ్యయనం ప్రయోజనకరం.అర్థశాస్త్రానికి సంబంధించిన అభ్యర్థులు సెట్‌ సిలబస్‌ను అధ్యయనం చేసి, ప్రాథమిక అంశాలపై పట్టు సాధించాలి. దానికోసం ప్రామాణిక పుస్తకాలను విశ్లేషణాత్మకంగా చదవాలి. చదివిన సిద్ధాంతాలు, వాటి ముఖ్యాంశాల్ని అనువర్తితం చేసుకుంటూ అభ్యసనం కొనసాగించాలి. పరీక్ష ఆబ్జెక్టివ్‌ విధానంలో ఉన్నప్పటికీ డిస్క్రిప్టివ్‌గా చదవటం వల్ల ప్రశ్న ఏ కోణంలో అడిగినా జవాబు గుర్తించవచ్చు. ప్రతి పాఠ్యాంశానికీ సంబంధించి విస్తృతంగా అధ్యయనం చేయాలి.
పాత ప్రశ్నపత్రాల ఆధారంగా కీలక అధ్యాయాలు గుర్తించి వాటి ప్రాధాన్యం బట్టి చదవాలి. అలా ఒక్కో అధ్యాయం పూర్తి చేసి వాటిపై పట్టు సాధించాలి. వీలైనన్నిసార్లు పునశ్చరణ చేయటం మరో ముఖ్యాంశం.
తర్వాతి దశలో మాదిరి ప్రశ్నపత్రాలు సాధన చేస్తే సమాధానం గుర్తించటంలో వేగం, కచ్చితత్వం పెంచుకోవచ్చు.
* ఆర్థిక శాస్త్రంలో అనేక అంశాలు (కొన్ని సిద్ధాంతాలు మినహా) నిరతరం మారుతుంటుంటాయి. సిలబస్‌ ఆధారంగా ఆర్థిక వ్యవస్థలో వస్తున్న నూతన మార్పులు, జాతీయ, రాష్ట్ర, అంతర్జాతీయ స్థాయి ఆర్థిక వ్యవస్థలో మార్పులు గమనించి అధ్యయనం చేయాలి. గతంలో వచ్చిన ప్రశ్నలకు సంబంధించిన అంశాలపై ఎక్కువ దృష్టి పెట్టడం అవసరం.

సబ్జెక్టువారీ విశ్లేషణ
సూక్ష్మ అర్థశాస్త్రం: డిమాండ్‌ నిర్ణయించే అంశాలు, నిర్వచనాలు, సగటు, ఉపాంత వ్యయాలు, ప్రయోజనాలు, లాభాలు, వాటి కారణాలు, వాటిని లెక్కించే పద్ధతులు తెలుసుకోవాలి. ఉదాసీనతా వక్రరేఖల లక్షణాలు, ఏకస్వామ్య మార్కెట్‌, వివిధ మార్కెట్‌ రకాలు, వాటిల్లో ధరలు నిర్ణయించే విధానాలు చదవాలి. సంక్షేమ అర్థశాస్త్రంలో ఉండే ప్రధాన సూత్రాలు కాల్డర్‌-హక్స్‌, పారిటో అభిలషణీయత వంటి విషయాలు ముఖ్యం.
స్థూల అర్థశాస్త్రం: దీనిలో ప్రధాన భాగాలైన పెట్టుబడి, ఉద్యోగిత, ద్రవ్య డిమాండ్‌ నిర్ణయించే అంశాలు, పరిమితులు చదవాలి. ముఖ్యంగా ఫిలిప్స్‌ వక్రరేఖ ఆకారం, బౌమల్‌, టాబిన్‌ల సిద్ధాంతాలు, వాటి తేడాలు ఇంకా వ్యాపార చక్రాల కారణాలు, నివారణ చర్యలు, వాటి దశలు క్రమవిధానంలో తెలుసుకోవాలి.
అభివృద్ధి-ప్రణాళిక: ఆర్థికవృద్ధి, అభివృద్ధిని నిర్ణయించే అంశాలు, వాటిని కొలిచే వివిధ సూచికలు, మానవాభివృద్ధి నివేదిక తయారీకి ఉపయోగించే అంశాలు, హెచ్‌డీఆర్‌-2015లో భారత్‌ హెచ్‌డీఐ విలువ, స్థానం తెలుసుకోవాలి. సిద్ధాంతాల వివరణలూ, వాటిమధ్య తేడాలూ గుర్తించాలి. ప్రణాళికలు లక్ష్యాలు, రకాలు విశ్లేషణాత్మకంగా చదవాలి.
ప్రభుత్వ విత్తం: ఈ విభాగంలో బడ్జెట్‌ లోట్లు, కేటాయింపులు, ఇటీవలి బడ్జెట్‌ ముఖ్యాంశాలు ప్రధానం. పన్నుల రకాలు, వాటి వాటాలు, ప్రభుత్వ ఆదాయ వ్యయాలు, వాటి ప్రభావాలు, ఆర్థిక సంఘాల చైర్మన్‌లు, ఆర్థికసంఘం సిఫార్సులు, ఆదాయ పంపిణీకి ప్రాతిపదికలు, వాటి శాతాలు శ్రద్ధపెట్టాల్సినవి.
అంతర్జాతీయ అర్థశాస్త్రం: అంతర్జాతీయ వ్యాపారం నిర్ణయించే సాంప్రదాయిక సిద్ధాంతాలైన నిరపేక్ష తులనాత్మక సిద్ధాంతాలు, ఆధునిక సిద్ధాంతం అయిన హిక్సర్‌- బహ్లిన్‌ సిద్ధాంతం, లియాంటిప్‌ వైపరీత్యం, విదేశీ చెల్లింపు శేషంలోని ఖాతాలు, వివిధ రకాల వర్తక నిబంధనలు, విదేశీ మారకం రేటు రకాలు, వాటి లాభ నష్టాలు అధ్యయనం చేయాలి.
భారత ఆర్థిక వ్యవస్థ: వ్యవసాయ ప్రాధాన్యతాంశాలు, వ్యవసాయ విప్లవ ప్రాధాన్యం, నూతన ఆర్థిక సంస్కరణలు, వివిధ పారిశ్రామిక తీర్మానాలు, రిజర్వ్‌ బ్యాంక్‌ ద్రవ్య విధానం అమలుకు రెపో, సీఆర్‌ఆర్‌, ఎస్‌ఎల్‌ఆర్‌లు మార్పు చేసే విధానం, ద్రవ్యం, ద్రవ్యోల్బణం కారణాలు, నివారణ చర్యలు, దేశంలో ప్రధాన సామాజిక ఆర్థిక సమస్యలయిన పేదరికం, నిరుద్యోగం, ఆదాయ అసమానతలు, జనాభా-2011 సంబంధించిన అంశాలు, అమలులో ఉన్న వివిధ అభివృద్ధి పథకాలు చదవాలి.
స్టాటిస్టిక్స్‌: గణాంక శాస్త్రంలో భాగంగా సగటులు, కేంద్ర విస్తరణ మాపనాలు, నమూనాలు, సహసంబంధ అంశాలు మొదలైనవాటి నుంచి సుమారు 5 లోపు ప్రశ్నలు రావటానికి అవకాశం ఉంది. దీన్ని అభ్యర్థులు నిర్లక్ష్యం చేయకూడదు.

ముఖ్యాంశాలు పట్టికగా...
అన్ని ప్రధాన విభాగాల్లోని ముఖ్యాంశాలు ఒక పట్టిక రూపంలో రాసుకుంటే పునశ్చరణ తేలిక అవుతుంది. ముఖ్యంగా ఆర్థిక సిద్ధాంతాలు - ఆర్థికవేత్తలు, అభివృద్ధి సిద్ధాంతాలు- రూపకర్తలు, ద్రవ్యం, జాతీయాదాయం, బడ్జెట్లు, నిర్వచనాలు, ప్రణాళికల లక్ష్యాలు, ప్రాధాన్యాలు, భారీపరిశ్రమలు-స్థాపించిన సం॥లు, వాటి ప్రదేశాలు, అభివృద్ధి పథకాలు- సం॥లు, ఆర్థిక సంఘాల చైర్మన్లు, అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు ఏర్పాటుచేసిన సం॥లు, అవి ఉండే ప్రదేశాలు, ఆర్థిక రంగానికి సంబంధించిన వివిధ కమిటీలు- చైర్మన్‌లు మొదలైనవి తప్పనిసరిగా చదవటం వల్ల వాటి భావనలు, సిద్ధాంతాలు, ప్రాథమిక అంశాలపై పట్టు ఏర్పడుతుంది. ఇలా ప్రణాళికబద్ధంగా, విశ్లేషణాత్మకంగా చదివితే విజయం మీదే.

వాణిజ్య శాస్త్రంలో...


కొద్దిఏళ్ళుగా నెట్‌/సెట్‌ పరీక్షల్లో జ్ఞానాత్మక ప్రశ్నల సంఖ్య తగ్గి అవగాహన, అనువర్తిత సామర్థ్యాలను మదింపు వేసే ప్రశ్నల సంఖ్య పెరిగింది.
* వ్యాపార పర్యావరణం: ఇందులోని అంశాలు, వినియోగదారు రక్షణ, ఆర్థిక విధానాలు, పారిశ్రామిక విధానాలు, పర్యావరణ పరిరక్షణ తెలుసుకోవాలి.
* ఆర్థిక, నిర్వహణ అకౌంటింగ్‌: భావనలు, భాగస్వామ్య ప్రవేశం, విరమణ, రద్దు, వాటాల జారీ, జప్తు, నిష్పత్తి విశ్లేషణ, మార్జినల్‌ కాస్టింగ్‌, బ్రేక్‌ ఈవెన్‌ పాయింట్‌, ప్రామాణిక కాస్టింగ్‌ అధ్యయనం చేయాలి.
* వ్యాపార అర్థశాస్త్రం: డిమాండ్‌ నిర్ణయించే అంశాలు, నిర్వచనాలు, వాటిని నిర్ణయించే అంశాలు, సగటు, ఉపాంత వ్యయాలు తెలుసుకోవాలి. ఉదాసీనతా వక్రరేఖల లక్షణాలు, వాటి రేఖల లక్షణాలు ముఖ్యం. మార్కెట్ల రకాలు, వాటి లక్షణాలు, ఏకస్వామ్య మార్కెట్‌ వంటి వాటిల్లో ధరల నిర్ణయ విధానాలు అధ్యయనం చేయాలి. ఆర్థిక సంఘాల చైర్మన్‌లు, ఆర్థిక సంఘం సిఫార్సులు చదవాలి. ఇటీవలి బడ్జెట్‌ ముఖ్యాంశాలు, అమలులో ఉన్న వివిధ అభివృద్ధి పథకాలు, ప్రణాళికలు, లక్ష్యాలు ప్రధానమైనవి.
* వ్యాపార గణాంకశాస్త్రం: సహసంబంధ, ప్రతిగమన అంశాలు, t, F, Chi square పరీక్షలు మొదలైనవి ముఖ్యం.
* వ్యాపార నిర్వహణ: నిర్వహణ సూత్రాలు, వాటి అంశాలు చదవాలి.
* మార్కెటింగ్‌ నిర్వహణ: మార్కెటింగ్‌ మిశ్రమం- అంశాలు, వినియోగదారు ప్రవర్తన అధ్యయనం చేయాలి.
* విత్త నిర్వహణ: మూలధన నిర్మాణం, లివరేజ్‌లు, మూలధన బడ్జెటింగ్‌, డివిడెండ్‌ విధానాలు గణనీయమైనవి.
* మానవ వనరుల నిర్వహణ: పాత్ర, విధులు, ప్రణాళిక, ఎంపిక, భారత దేశంలో పారిశ్రామిక సంబంధాలు అధ్యయనం చేయాలి.
* బ్యాంకింగ్‌, ఆర్థిక సంస్థలు: బ్యాంకుల రకాలు, విధులు, సంస్కరణలు, అభివృద్ధి బ్యాంకులు, రిజర్వ్‌ బ్యాంక్‌ ద్రవ్య విధానం వంటివి ముఖ్యం.
* ఆదాయపు పన్ను చట్టం, పన్ను ప్రణాళిక: నివాస ప్రతిపత్తి, పన్ను మినహాయింపులు, రిటర్నుల సమర్పణ, వివిధ రకాల అసెస్‌మెంట్‌ వంటవి అధ్యయనం చేయాలి.

Posting on 22.08.2016

ఏపీ సెట్ - 2017 వివరాలు

  • నోటిఫికేషన్
  • ఆన్‌లైన్ అప్లికేష‌న్‌
  • సబ్జెక్టులు
  • పాత ప్రశ్నపత్రాలు
  • నమూనా ప్రశ్నపత్రాలు