Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
అవ‌కాశాల మిశ్ర‌మం .. ర‌సాయ‌న‌శాస్త్రం

మ‌నం వేసుకునే దుస్తులు, ఉప‌యోగించే వ‌స్తువులు, ఔష‌ధాలు, కొన్ని ర‌కాల ఆహార ప‌దార్థాలు...ఇలా ప్రతీదీ కొన్ని ర‌సాయ‌నాల స‌మ్మేళ‌న‌మే. అందుకేనేమో మాన‌వులు, ర‌సాయ‌న‌శాస్త్రం మ‌ధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. అవ‌కాశాల ప‌రంగా చూసుకుంటే ర‌సాయ‌న‌శాస్త్రం ఎప్పటికీ రారాజే. కెమిస్ట్రీ గ్రాడ్యుయేట్లు మిశ్ర‌మ అవ‌కాశాల‌ను సొంతం చేసుకోవ‌చ్చు. ఎందుకంటే బోధ‌నా రంగంతోపాటు మందులు, ఎరువులు, రంగులు...ఇలా ప‌లు ప‌రిశ్రమల్లో ఉపాధి ల‌భిస్తుంది. ఐఐటీలు, మ‌రికొన్ని ప్రముఖ సంస్థలు ర‌సాయ‌న‌శాస్త్రంలో ప‌లు కోర్సులు అందిస్తున్నాయి. ఆ వివ‌రాలు చూద్దాం...
ఇంట‌ర్ నుంచీ మొద‌లు...
ర‌సాయ‌న‌శాస్త్రంపై ప్రత్యేక అభిరుచి ఉన్నవాళ్లు ఇంట‌ర్‌లో ఒక స‌బ్జెక్టుగా కెమిస్ట్రీని ఎంచుకోవాలి. ఇంట‌ర్‌లో కెమిస్ట్రీ లేకుండా కెమిక‌ల్ ఇంజినీరింగ్‌, బీఎస్సీ కెమిస్ట్రీ, ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ కెమిస్ట్రీ కోర్సుల్లో చేర‌డం సాధ్యం కాదు. ఇంట‌ర్‌లో కెమిస్ట్రీ చ‌దివిన విద్యార్థులు కెమిక‌ల్ ఇంజినీరింగ్, బీఎస్సీ కెమిస్ట్రీ, ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ కెమిస్ట్రీ...ఈ మూడు దారుల్లో న‌చ్చిన మార్గాన్ని ఎంచుకోవ‌చ్చు. అటు ఇంజినీరింగ్‌..ఇటు డిగ్రీ రెండు మార్గాల్లోనూ ప్రవేశించే అవ‌కాశం ర‌సాయ‌న‌శాస్త్రం క‌ల్పిస్తుంది. ప‌లు ఐఐటీల్లో బీటెక్ కెమిక‌ల్ ఇంజినీరింగ్‌తోపాటు ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ కెమిస్ట్రీ కూడా అందుబాటులో ఉంది. వీటిలో ఏ కోర్సులో చేరాల‌నుకున్నప్పటికీ జేఈఈ త‌ప్పనిస‌రి. ఐఐఎస్‌సీ, టీఐఎఫ్ఆర్, ఐఐఎస్ఈఆర్‌, ఎన్ఐఎస్ఈఆర్‌, సెంట్రల్ యూనివ‌ర్సిటీల్లో వివిధ స్థాయుల్లో కెమిస్ట్రీ కోర్సులు ల‌భ్యమ‌వుతున్నాయి. అలాగే ప్రతి యూనివ‌ర్సిటీ క్యాంప‌స్‌లోనూ కెమిస్ట్రీ స‌బ్జెక్టును బోధిస్తున్నారు.
స్పెష‌లైజేష‌న్లెన్నో...
కెమిస్ట్రీలో ఉన్నన్ని స్పెష‌లైజేష‌న్లు మ‌రే ఇత‌ర స‌బ్జెక్టుల్లోనూ లేవ‌నే చెప్పుకోవ‌చ్చు. ఈ స‌బ్జెక్టు ప‌రిధి విస్తృతంగా ఉండ‌డ‌మే దీనికి కార‌ణం. ఇంట‌ర్లో ఆర్గానిక్‌, ఇనార్గానిక్ విభాగాలుగా ఉన్న ర‌సాయ‌న‌శాస్త్రం డిగ్రీకి వ‌చ్చేస‌రికి ఆర్గానిక్‌, ఇనార్గానిక్, ఫిజిక‌ల్ కెమిస్ట్రీలుగా రూపాంత‌రం చెందుతుంది. పీజీ స్థాయిలో...
ఎమ్మెస్సీ కెమిస్ట్రీ (జ‌న‌ర‌ల్ కోర్సు)
ఆర్గానిక్ కెమిస్ట్రీ
ఇనార్గానిక్ కెమిస్ట్రీ
ఫిజిక‌ల్ కెమిస్ట్రీ
ఇండ‌స్ట్రియ‌ల్ కెమిస్ట్రీ
ఎన‌లిటిక‌ల్ కెమిస్ట్రీ
ఎన్విరాన్‌మెంట‌ల్ కెమిస్ట్రీ
అప్లయిడ్ కెమిస్ట్రీ
న్యూక్లియ‌ర్ కెమిస్ట్రీ
పాలిమ‌ర్ కెమిస్ట్రీ
ఫార్మా స్యూటిక‌ల్ కెమిస్ట్రీ
మెటీరియ‌ల్స్ కెమిస్ట్రీ
న్యూరో కెమిస్ట్రీ
మెడిసిన‌ల్ కెమిస్ట్రీ
డ్రగ్ కెమిస్ట్రీ...
ఇలా విభిన్న స్పెష‌లైజేష‌న్లు అందుబాటులో ఉన్నాయి.
ఉద్యోగ అవ‌కాశాలిలా...
ప్రపంచ వ్యాప్తంగా ర‌సాయ‌న ప‌రిశ్రమ బాగా విస్తరిస్తోంది. అలాగే మందులు, ఎరువుల త‌యారీ కంపెనీలు కూడా దిన‌దినాభివృద్ధి చెందుతున్నాయి . ఔష‌ధ ప‌రిశ్రమ‌ల్లో క్వాలిటీ కంట్రోల్‌, క్వాలిటీ ఎన‌లిస్ట్ ఉద్యోగాలు పీజీ స్థాయిలో కెమిస్ట్రీ చ‌దివిన‌వారికి ద‌క్కుతాయి. ఎక్కువ మంది ర‌సాయ‌న‌శాస్త్ర ప‌ట్టభ‌ద్రుల‌కు ఉపాధి క‌ల్పిస్తున్నది ఫార్మా రంగ‌మే. ర్యాన్‌బ్యాక్సీ, గ్లాక్సో, సిప్లా, కాడిలా, అబోడ్‌, డాక్టర్ రెడ్డీస్‌, హెటిరో, అర‌బిందో...ఇలా ఎన్నో మందుల త‌యారీ ప‌రిశ్రమ‌లు ర‌సాయ‌న‌శాస్త్రంలో ప‌ట్టున్నవారికి అవ‌కాశాలు క‌ల్పిస్తున్నాయి. ప్రముఖ యూనివ‌ర్సిటీల్లో (ఐఐటీలు, సెంట్రల్ యూనివ‌ర్సిటీలు) చ‌దివిన వారికైతే క్యాంప‌స్‌లోనే కొలువులు ఖాయ‌మ‌వుతున్నాయి. బీఎస్సీ కెమిస్ట్రీ విద్యార్థుల‌ను కూడా అసిస్టెంట్ పోస్టుల‌కు తీసుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ మంది కెమిస్ట్రీ గ్రాడ్యుయేట్లు డాక్టర్ రెడ్డీస్‌, అర‌బిందో, హెటిరో, దివీస్‌..తదిత‌ర సంస్థల్లో ఉపాధి పొందుతున్నారు. హైద‌రాబాద్ ప‌రిస‌ర ప్రాంతాలు, శ్రీకాకుళం, విజ‌య‌న‌గ‌రం జిల్లాలు బ‌ల్క్ డ్రగ్స్ త‌యారీ కేంద్రాల‌గా రూపాంత‌రం చెందుతున్నాయి. అన్నిచోట్లా క‌లుపుకుంటే సుమారు వంద‌కుపైగా కంపెనీలు ఉన్నాయి. పీజీ పూర్తిచేసుకున్న విద్యార్థుల‌కు పెద్ద కంపెనీలైతే పాతిక నుంచి ముప్పై వేల వ‌ర‌కు, చిన్న కంపెనీలు ప‌ది నుంచి ప‌న్నెండు వేల వేత‌నాన్ని అందిస్తున్నాయి. ఫార్మా త‌ర్వాత ఎరువుల త‌యారీ ప‌రిశ్రమ‌ల్లో ఉద్యోగాలు ల‌భిస్తాయి. ఎన్ఏసీఎల్‌, ఎన్ఎఫ్‌సీఎల్‌, కోర‌మండ‌ల్‌ ఫెర్టిలైజ‌ర్స్‌ల్లో ఉద్యోగ అవ‌కాశాలుంటాయి. రంగుల త‌యారీలో దిగ్గజాలైన ఏషియ‌న్ పెయింట్స్‌, నెరోలాక్‌...త‌దిత‌ర సంస్థలు క్యాంప‌స్ నియామ‌కాల ద్వారా ర‌సాయ‌న‌శాస్త్ర విద్యార్థుల‌కు అవ‌కాశాలు క‌ల్పిస్తున్నాయి. టెక్స్‌టైల్ కంపెనీలు, పెట్రోలియం ఉత్పత్తుల‌ సంస్థలు, ర‌బ్బర్‌, ప్లాస్టిక్ ఉత్పత్తుల కంపెనీలు, కాస్మొటిక్స్ త‌యారీ కేంద్రాలు ఇలా ప‌లుచోట్ల కెమిస్ట్రీ చ‌దివిన‌వారికి ఉద్యోగాలుంటాయి. మెడిక‌ల్ రిప్రజెంటేటివ్ గానూ కెమిస్ట్రీ గ్రాడ్యుయేట్లు రాణించొచ్చు.
బోధ‌నా రంగంలో...
ఎమ్మెస్సీ కెమిస్ట్రీ పూర్తిచేసుకున్న త‌ర్వాత ప్రభుత్వ, ప్రైవేటు జూనియ‌ర్ క‌ళాశాల‌ల్లో లెక్చర‌ర్‌గా రాణించ‌వ‌చ్చు. ప్రభుత్వ క‌ళాశాల‌ల్లో ఖాళీల‌ను బ‌ట్టి ప్రక‌ట‌న విడుద‌ల‌చేస్తారు. రాత‌ప‌రీక్ష ద్వారా అభ్యర్థుల‌ను ఎంపిక‌చేస్తారు. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు అన్ని జూనియ‌ర్ క‌ళాశాల‌ల్లోనూ ఎంపీసీ, బైపీసీ గ్రూప్‌లు ఉన్నాయి. ఈ రెండు గ్రూప్‌ల్లో ఉమ్మడిగా ఉండే స‌బ్జెక్టు కెమిస్ట్రీ. కాబ‌ట్టి ప్రక‌ట‌న వెలువ‌డిన‌ప్పుడు కెమిస్ట్రీ పోస్టులు ఎక్కువ‌గానే ఉంటాయి. ఐఐటీ జేఈఈ ప‌రీక్ష‌కు పోటీ ప‌డేవారి సంఖ్య పెరుగుతోంది దీంతో కార్పొరేట్ క‌ళాశాల‌ల్లోనూ అవ‌కాశం ద‌క్కించుకోవ‌చ్చు. నెట్ లెక్చర‌ర్‌షిప్‌లో అర్హత సాధించ‌డం ద్వారా ప్రభుత్వ డిగ్రీ క‌ళాశాల‌ల్లో లెక్చర‌ర్‌గా, విశ్వవిద్యాల‌యాల్లో అసిస్టెంట్ ప్రొఫెస‌ర్‌గా ఉద్యోగాల‌ను సొంతం చేసుకోవ‌చ్చు. నెట్ జేఆర్ఎఫ్‌లో అర్హత సాధించిన విద్యార్థులు ర‌సాయ‌న‌శాస్త్రంలో ప‌రిశోధ‌న‌లు (పీహెచ్‌డీ) చేసుకోవ‌చ్చు. ఇలా అర్హత పొందిన‌వారు మొద‌టి రెండేళ్లు నెల‌కు రూ. 25,000 త‌ర్వాత రెండేళ్లు రూ.28,000 ఫెలోషిప్ అందుకోవ‌చ్చు. అనంత‌రం బోధ‌న‌, ప‌రిశోధ‌న‌...ఇలా న‌చ్చిన రంగంలో స్థిర‌ప‌డొచ్చు.
ప్రముఖ సంస్థలివీ...
ప‌లు ఐఐటీలు ర‌సాయ‌న‌శాస్త్రంలో భిన్న కోర్సులు అందిస్తున్నాయి. అయితే వీటిలో ఏ కోర్సులో చేరాల‌న్నా ఐఐటీలు ఉమ్మడిగా నిర్వహించే జాయింట్ అడ్మిష‌న్ టు ఎమ్మెస్సీ (జామ్‌) రాస్తే స‌రిపోతుంది.
ఐఐటీల్లో కోర్సులివీ..
ఐఐటీ బాంబే, ఢిల్లీ, కాన్పూర్‌, మ‌ద్రాస్‌, హైద‌రాబాద్‌, రూర్కీ, ఇండోర్, గువాహ‌టి, గాంధీన‌గ‌ర్‌ల్లో ఎమ్మెస్సీ కెమిస్ట్రీ కోర్సు బోధిస్తున్నారు. ఐఐటీ ఖ‌ర‌గ్‌పూర్‌, భువ‌నేశ్వర్‌ల్లో కెమిస్ట్రీలో జాయింట్ ఎమ్మెస్సీ పీహెచ్‌డీ కోర్సు అందుబాటులో ఉంది. ఐఐటీ బాంబే కెమిస్ట్రీ, ఎన్విరాన్‌మెంట‌ల్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్‌, ఎన‌ర్జీ విభాగాల్లో ఎమ్మెస్సీ పీహెచ్‌డీ డ్యూయ‌ల్ డిగ్రీ కోర్సు అందిస్తోంది. ఐఐటీ రోపార్ కూడా కెమిస్ట్రీలో ఎమ్మెస్సీ పీహెచ్‌డీ డ్యూయ‌ల్ డిగ్రీని నిర్వహిస్తోంది. ఐఐటీ జోధ్‌పూర్ ఎమ్మెస్సీ (రీసెర్చ్‌) కెమిస్ట్రీ కోర్సు నిర్వహిస్తోంది. వీటితోపాటు ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్, బెంగ‌ళూరు కెమిక‌ల్ సైన్సెస్‌లో ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీ కోర్సు అందిస్తోంది. ఈ కోర్సుకీ జామ్ ద్వారానే ప్రవేశం ల‌భిస్తుంది.
అర్హత‌: పైన తెలిపిన ఏ కోర్సులో ప్రవేశానికైనా డిగ్రీ స్థాయిలో కెమిస్ట్రీ చ‌ద‌వ‌డం త‌ప్పనిస‌రి. సాధార‌ణంగా జామ్ ప్రక‌ట‌న ఏటా సెప్టెంబ‌ర్‌లో వెలువ‌డుతుంది. ఫిబ్రవ‌రిలో ప‌రీక్ష నిర్వహిస్తారు.
వెబ్‌సైట్‌: http://www.iitg.ac.in/jam2015
ఇంటిగ్రేటెడ్ ఇక్కడ‌...
ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేష‌న్ అండ్ రీసెర్చ్ భోపాల్‌, కోల్‌క‌తా, మొహాలీ, పుణే, తిరువ‌నంత‌పురం క్యాంప‌స్‌ల్లో కెమిస్ట్రీలో ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ బీఎస్‌, ఎంఎస్ కోర్సు; ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీ కెమిస్ట్రీ కోర్సులు బోధిస్తున్నారు. బీఎస్‌, ఎంఎస్‌ కోర్సులో ప్రవేశానికి ఎంపీసీ గ్రూప్‌తో ఇంట‌ర్మీడియ‌ట్‌/ ప్ల‌స్ 2 కోర్సు చ‌దివిన‌వారు అర్హులు. ఈ ఐదు సంస్థలు ఉమ్మడిగా ప‌రీక్ష నిర్వహించి ప్రవేశం క‌ల్పిస్తాయి. ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీ కోర్సుల‌కు మాత్రం జామ్ ద్వారా ప్రవేశం ల‌భిస్తుంది.
హైద‌రాబాద్ కేంద్రీయ విద్యాల‌యం ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కెమిక‌ల్ సైన్స్ కోర్సు అందిస్తుంది. రాత‌ప‌రీక్ష లేదా జేఈఈ మెయిన్స్ స్కోర్ ద్వారా ప్రవేశం క‌ల్పిస్తారు.
ఐఐటీ ఖ‌ర‌గ్‌పూర్, కాన్పూర్‌, రూర్కీలు కెమిస్ట్రీలో ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ కోర్సు అందిస్తున్నాయి. జేఈఈ ద్వారా ప్రవేశం ల‌భిస్తుంది.
ఐఐటీ బాంబే కెమిస్ట్రీలో నాలుగేళ్ల బీఎస్ కోర్సు అందిస్తోంది.
ఐఐఎస్‌టీ, ఎస్ఎన్‌బోస్ నేష‌న‌ల్ సెంట‌ర్ ఫ‌ర్ బేసిక్ సైన్సెస్- కోల్‌క‌తా కెమిక‌ల్ సైన్సెస్‌లో ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీ అందిస్తున్నాయి.
జ‌వ‌హ‌ర్‌లాల్ నెహ్రూ సెంట‌ర్ ఫ‌ర్ అడ్వాన్స్‌డ్ సైంటిఫిక్ రీసెర్చ్‌, బెంగ‌ళూరు కెమిక‌ల్ సైన్సెస్‌లో ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీ కోర్సు అందిస్తుంది. క‌నీసం 55 శాతం మార్కుల‌తో బీఎస్సీ కెమిస్ట్రీ ఉత్తీర్ణులు ద‌రఖాస్తు చేసుకోవ‌చ్చు.
వెబ్‌సైట్‌: http://www.jncasr.ac.in/admit/

హైద‌రాబాద్ కేంద్రీయ విద్యాల‌యం
కోర్సులు: ఎమ్మెస్సీ కెమిస్ట్రీ
వెబ్‌సైట్‌: http://www.uohyd.ac.in

కొచ్చిన్ యూనివ‌ర్సిటీ ఆఫ్ సైన్సెస్ అండ్ టెక్నాల‌జీ
కోర్సులు: ఎమ్మెస్సీ అప్లయిడ్ కెమిస్ట్రీ, హైడ్రో కెమిస్ట్రీ
వెబ్‌సైట్‌: http://iraa.cusat.ac.in/courses/pgprogram.html

పాండిచ్చేరి యూనివ‌ర్సిటీ
కోర్సులు: ఎమ్మెస్సీ కెమిక‌ల్ సైన్స్, ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ కెమిస్ట్రీ
వెబ్‌సైట్‌: http://www.pondiuni.edu.in/programmes

బెనార‌స్ హిందూ యూనివ‌ర్సిటీ, వార‌ణాసి
కోర్సులు: ఎమ్మెస్సీ కెమిస్ట్రీ, అగ్రిక‌ల్చర‌ల్ కెమిస్ట్రీ
వెబ్‌సైట్‌: http://www.bhu.ac.in/

నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ, వ‌రంగ‌ల్‌
కోర్సులు: ఎమ్మెస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఎన‌లిటిక‌ల్ కెమిస్ట్రీ
వెబ్‌సైట్‌: http://www.nitw.ac.in

నిట్ దుర్గాపూర్‌, తిరుచురాప‌ల్లి, సిల్‌చార్‌, నిట్ అగ‌ర్తల (ఎమ్మెస్సీ కెమిస్ట్రీతోపాటు ఐదేళ్ల బీఎస్‌, ఎంఎస్ డ్యూయ‌ల్ డిగ్రీ కెమిస్ట్రీ), జైపూర్ ఇలా ప‌లు నిట్లలో ఎమ్మెస్సీ కెమిస్ట్రీ కోర్సు అందుబాటులో ఉంది. అయితే ఇవ‌న్నీ ఉమ్మడిగా ప్రవేశం క‌ల్పించ‌డం లేదు. వేటిక‌వే ప్రత్యేకంగా ప్రక‌ట‌న విడుద‌ల‌చేసి అభ్యర్థుల‌ను ఎంపిక‌చేస్తున్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో

ఆంధ్రా యూనివ‌ర్సిటీ
కోర్సులు: ఎమ్మెస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఇనార్గానిక్ కెమిస్ట్రీ, ఎన‌లిటిక‌ల్ కెమిస్ట్రీ, బ‌యో ఇనార్గానిక్ కెమిస్ట్రీ, ఎన్విరాన్‌మెంట‌ల్ కెమిస్ట్రీ, మెరైన్ కెమిస్ట్రీ, ఫిజిక‌ల్ కెమిస్ట్రీ, న్యూక్లియ‌ర్ కెమిస్ట్రీ, కెమిస్ట్రీ అండ్ ఎనాలిసిస్ ఆఫ్ ఫుడ్, డ్రగ్స్ అండ్ వాట‌ర్‌; అప్లయిడ్ కెమిస్ట్రీ, ఎన్విరాన్‌మెంట‌ల్ సైన్సెస్‌.
వెబ్‌సైట్‌: http://www.andhrauniversity.edu.in/courses.html

ఆచార్య నాగార్జున యూనివ‌ర్సిటీ
కోర్సులు: మూడు స్పెష‌లైజేష‌న్లతో ఎమ్మెస్సీ కెమిస్ట్రీ
వెబ్‌సైట్‌: http://www.nagarjunauniversity.ac.in/

శ్రీవెంక‌టేశ్వర యూనివ‌ర్సిటీ
కోర్సులు: ఎమ్మెస్సీ ఎన‌లిటిక్ కెమిస్ట్రీ, ఫిజిక‌ల్ కెమిస్ట్రీ, ఎన్విరాన్‌మెంట‌ల్ కెమిస్ట్రీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఇనార్గానిక్ కెమిస్ట్రీ, మెడిసిన‌ల్ కెమిస్ట్రీ, నానో మెటీరియ‌ల్ అండ్ టెక్నాల‌జీస్, ఇండ‌స్ట్రియ‌ల్ కెమిస్ట్రీ, ఎన్విరాన్‌మెంట‌ల్ సైన్స్‌
వెబ్‌సైట్‌: http://www.svuniversity.ac.in/Courses/Courses.aspx

శ్రీకృష్ణదేవ‌రాయ యూనివ‌ర్సిటీ
కోర్సులు: ఎమ్మెస్సీ కెమిస్ట్రీ
వెబ్‌సైట్‌: http://www.skuniversity.org/coursesoffered.html

ఉస్మానియా యూనివ‌ర్సిటీ
కోర్సులు: ఎమ్మెస్సీ కెమిస్ట్రీ, అప్లయిడ్ జియో కెమిస్ట్రీ
వెబ్‌సైట్‌: www.osmania.ac.in

కాక‌తీయ యూనివ‌ర్సిటీ
కోర్సులు: ఎమ్మెస్సీ అప్లయిడ్ కెమిస్ట్రీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ
వెబ్‌సైట్‌: http://kakatiya.ac.in/courses

posted on 17.12.2014