Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
అభ్యర్థి అభిరుచుల్లో వ్యక్తిత్వం

ఇంజినీరింగ్‌ సర్వీసెస్‌ పరీక్ష రాసినవారికి త్వరలో మౌఖిక పరీక్షలు జరగబోతున్నాయి. అభ్యర్థులు ఈ దశలో సబ్జెక్టు అవగాహనపై కాకుండా తమ వ్యక్తిగత శక్తియుక్తులకు సంబంధించి మెరుగుపరుచుకోవాల్సిన అంశాలు గుర్తించి, వాటిపై దృష్టి పెట్టాలి!
యూపీఎస్‌సీ నిర్వహిస్తున్న ఇంజినీరింగ్‌ సర్వీసెస్‌ పరీక్ష (ఈఎస్‌ఈ)మెయిన్స్‌ పరీక్ష ఫలితాలు డిసెంబర్‌ 4న విడుదలయ్యాయి. దేశవ్యాప్తంగా 3.16 లక్షలమంది అభ్యర్థులు హాజరయ్యారు. మౌఖికపరీక్ష (ఇంటర్వ్యూ)కు బ్రాంచీల వారీగా అర్హత సాధించినవారి సంఖ్య ఇలా ఉంది: సివిల్‌- 717, మెకానికల్‌- 378, ఈఈఈ- 418, ఈసీఈ- 321. మొత్తం 1834 మంది ఉత్తీర్ణులయ్యారు.
యూపీఎస్‌సీ త్వరలో మౌఖిక పరీక్ష తేదీలను విడుదల చేస్తుంది. అభ్యర్థులు నింపే డీటెయిల్డ్‌ అప్లికేషన్‌ ఫార్మ్‌ (డీఏఎఫ్‌) మీద ఎక్కువగా ప్రశ్నలు అడుగుతారు. దాన్ని నింపేటపుడు అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవడం మంచిది.
అభ్యర్థికి సబ్జెక్టుపై ఎంత అవగాహన ఉందో రాతపరీక్ష ద్వారా తెలిసిపోయింది. కాబట్టి సబ్జెక్టు మీద కాకుండా వ్యక్తిగత శక్తియుక్తులకు సంబంధించి మౌఖిక పరీక్ష ఉంటుంది.
ప్రధానంగా పరిశీలించే అంశాలు:

* నాయకత్వ లక్షణాలు
* ఏదైనా కొత్త పనిచేయడంలో చూపే చొరవ, ఉత్సాహం, తెలివితేటలు
* మానసిక, శారీరక సామర్థ్యం
* తెలిసిన విషయాన్ని వాస్తవ ప్రపంచానికి ఉపయోగించే ఆచరణాత్మక ప్రయోగ సామర్థ్యం
* మంచి లక్షణాలతో కూడిన సమతూక మనస్తత్వం
ఏ అంశం ఎలా?
పర్సనల్‌ బయోడేటా (వ్యక్తిగత సమాచారం): డీఏఎఫ్‌ ఫామ్‌లోని అభ్యర్థి పేరు, తండ్రి పేరు, పుట్టిన తేదీ, పుట్టిన స్థలం, గ్రామం/ పట్టణం మీద ప్రశ్నలు వేస్తారు. పేరులో ఏదైనా ప్రత్యేకత ఉందా? అని ప్రశ్న వేయవచ్చు. పుట్టిన సంవత్సరం, తేదీల్లో ఏదైనా సంఘటన జరిగిందా? గ్రామం/ పట్టణం ప్రత్యేకతను అడగవచ్చు.
ఉద్యోగం గురించి: మీరు ఉద్యోగం చేస్తే అది ప్రభుత్వరంగ సంస్థ/ ప్రైవేటు రంగ సంస్థ, శాశ్వత/ తాత్కాలిక ఉద్యోగమా/ అడ్‌హాక్‌ ప్రాతిపదికన ఎంపికయ్యారా అనే ప్రశ్నలు వేస్తారు. ఒకవేళ ప్రభుత్వ రంగ సంస్థ అయితే ఎందుకు ఆ సంస్థను విడిచి పెట్టాలనుకున్నారనే ప్రశ్నలు అడగవచ్చు.
ప్రైవేటు రంగంలో పనిచేస్తున్నవారు తమ సంస్థ గురించి విమర్శలు చేయకూడదు. సానుకూల దృక్పథంతో సమాధానం చెప్పాలి. ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగాన్ని దాచకూడదు. నిజాయతీగా మీరు చేస్తున్న ఉద్యోగం గురించీ, ఆ ఉద్యోగ స్వభావం గురించీ చెప్పాలి. ఎక్కువ ప్రశ్నలు ఉద్యోగానుభవం మీద ఉంటాయి.
వర్తమాన అంశాలు: ప్రస్తుత దేశ, అంతర్జాతీయ వర్తమాన అంశాలపై పట్టు సాధించాలి. ఇంకా మీ సొంత రాష్ట్రంలో, సొంత గ్రామం/ మండలం/ జిల్లాలో జరిగే సంఘటనలపై కూడా ప్రశ్నలు రావొచ్చు.
సాంకేతిక సామర్థ్యం : బ్రాంచిల వారీగా ఈసీఈ, ఈఈఈ, ఎంఈ, సీఈ విద్యార్థులను తమ కోర్‌ సబ్జెక్టుల్లో ఎంత పరిజ్ఞానం, విశ్లేషణ సామర్థ్యం ఉందో పరీక్షిస్తారు. కాబట్టి అభ్యర్థి కోర్‌ సబ్జెక్టుల్లో నిపుణులైన ఫ్యాకల్టీ సలహాలు తీసుకుని ఎక్కడి నుంచి ఎలాంటి ప్రశ్నలు వస్తాయో అవగాహనతో ఉండాలి. ముఖ్యంగా సబ్జెక్టుకు సంబంధించిన ప్రాక్టికల్‌ అప్లికేషన్స్‌ మీద ప్రశ్నలు అడుగుతారు.
అభిరుచులు: గత 5 సంవత్సరాల నుంచి ఈసీఈలో ప్రతి విద్యార్థినీ దీని మీద ప్రశ్నలు అడుగుతున్నారు. విద్యార్థి ప్రవర్తన, నిజాయతీ, సామాజిక బాధ్యతలు.. ఈ అభిరుచుల్లో ప్రతిబింబిస్తాయి. ముఖ్యంగా డీఏఎఫ్‌ ఫామ్‌లో ఎంచుకున్న అభిరుచుల మీద అభ్యర్థికి పూర్తి అవగాహన ఉండాలి. ముఖ్యంగా క్రికెట్‌, సంగీతం ఎంచుకున్నవారికి వాటిపై చాలా పరిజ్ఞానం అవసరం.
వ్యక్తిగత విజయాలు: ఇప్పటివరకూ అభ్యర్థి సాధించిన పతకాలు, ఉపకార వేతనాలు, అవార్డులకు డాక్యుమెంటరీ ఆధారం ఉంటే అవి తనలో ఉన్న సామర్థ్యానికి చిహ్నం. వీటి మూలంగా అభ్యర్థి మీద అనుకూల అభిప్రాయం ఏర్పడుతుంది.
భాషా పరిజ్ఞానం: ఎన్ని భాషలపై పరిజ్ఞానం ఉంది, దేశీయ భాషలు, విదేశీ భాషలు మాట్లాడే సామర్థ్యం, ఎన్ని భాషలు రాయడం, మాట్లాడడం వచ్చు అనే అంశాలపై ప్రశ్నలు అడగవచ్చు.
పోస్టుల ప్రాముఖ్యం
డీఏఎఫ్‌ ఫామ్‌లో పోస్టు ప్రాథమ్యం (ప్రిఫరెన్స్‌) ఇచ్చేటపుడు 1, 2, 3 ఇచ్చిన పోస్టులపై అవగాహన ఉండాలి. తను ఎంచుకున్న పోస్టులు ఎందుకు ఎంచుకున్నాడు; అతని ఉద్దేశం; ఏవిధంగా ఆ పోస్టులకు న్యాయం చేయగలడు; ఆసక్తి ఎలా ఉందనే అంశాలపై ప్రశ్నలు రావొచ్చు. మౌఖిక పరీక్ష సాధారణంగా 15- 20 నిమిషాలు ఉంటుంది. ఈ వ్యవధిలోనే మంచి అభిప్రాయం ఏర్పడేలా వ్యవహరించాలి.
మౌఖికపరీక్షల్లో నాన్‌ వెర్బల్‌ కమ్యూనికేషన్‌ ప్రాముఖ్యం గుర్తించాలి. జవాబులన్నీ సరిగా చెప్పినప్పటికీ హావభావాలు సరిగా లేకపోతే ఇంటర్వ్యూ బోర్డు సభ్యులను మెప్పించటం కష్టం.
హావభావాల్లో జాగ్రత్త!
కాళ్ళు నేలపై ఉంచి నిటారుగా కూర్చోవాలి.
* ఒక కాలును వెనక్కి వంచి కూర్చోకూడదు. ఇది అసహనాన్నీ, ఆందోళననూ సూచిస్తుంది. కాళ్ళను క్రాస్‌గా పెట్టకూడదు. అది అభ్యర్థి ఆత్మస్త్థెర్యంతో లేరని భావించేలా చేస్తుంది.
తలను స్థిరంగా ఉంచిగానీ, స్వల్పంగా వంచి గానీ ఇంటర్వ్యూను ఎదుర్కోవచ్చు.
* ఇంటర్వ్యూ బోర్డు సభ్యుల ముందు తలను కిందికి దించి ఉంచకూడదు. అది వ్యతిరేక అభిప్రాయాన్ని కలుగజేస్తుంది. అంగీకార సూచకంగా తలను అతిగా వూపటం కూడా సరి కాదు.
కళ్ళతో చూడటం వీలైనంత సహజంగా ఉండాలి. ప్రశ్న అడిగిన వ్యక్తినే కాకుండా అప్పడప్పుడూ మిగిలినవారిని కూడా చూస్తూ మళ్ళీ యథాస్థితికి చూపులు మరలుస్తుండాలి.
* ఇంటర్వ్యూ బోర్డు సభ్యుల కళ్ళలోకి చూడలేకపోతే అది బిడియాన్నీ, స్త్థెర్యలేమినీ సూచిస్తుంది. అలా అని కళ్ళలోకి అదేపనిగా చూడటం సరి కాదు. నేలచూపులు కూడా కూడదు. మాట్లాడుతూ ఎటో చూడటం చేయకూడదు.
చేతులను కుర్చీ రెస్ట్‌ మీద/ మోకాళ్ళ మీద ఉంచాలి.
* చేతులు కట్టుకుని ఉండటం ఆత్మరక్షణకూ, బోర్డు సభ్యులతో అంగీకరించకపోవడానికీ చిహ్నాలు. చేతులను గట్టిగా బిగించి కూర్చోకూడదు. అది అభ్యర్థి ఒత్తిడిలో ఉన్నట్టు సూచిస్తుంది. చెవులను తాకటం, మెడను చేత్తో రుద్దుకోవటం చేయకూడదు. ఆ చర్యలు అభ్యర్థికి తన మాటలపై తనకు నమ్మకం లేదనేదానికి సంకేతాలు.

posted on 22.12.2014