Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 

రక్షణ దళాల్లో ఉద్యోగం అంటే అందరిలో ఒక రకమైన గౌరవం, చిన్నపాటి ఆరాధన కనిపిస్తాయి. ఆర్మీ, నేవీ, ఏర్‌ఫోర్స్‌ ఈ పేర్లు వినగానే ఎవరికైనా గుండెల్లో దేశభక్తి పొంగి ఛాతీలు కొద్దిగా పెద్దవవుతాయి. ఈ మూడు దళాల్లో చేరడం చాలామందికి ఒక కల. వీరి కోసమే యూపీఎస్సీ ప్రకటన విడుదల చేసింది. ఉత్తమమైన ఉచిత చదువుతోపాటు ఉన్నతస్థాయి ఉద్యోగాన్ని కూడా అందుకోవడానికి వీలున్న చక్కటి అవకాశం ఇది.

ఇంటర్‌ విద్యార్హతతో ఉన్నత స్థాయి ఉద్యోగాన్ని అందించే ఎన్‌డీఏ & ఎన్‌ఏ పరీక్షకు 415 ఖాళీలతో యూపీఎస్సీ ప్రకటన విడుదల చేసింది. ఈ పరీక్షల్లో ఎంపికైనవాళ్లని ఉచితంగా డిగ్రీ చదివిస్తారు. తర్వాత రక్షణ దళాల్లో ఉన్నత స్థాయి ఉద్యోగంలో చేర్చుకుంటారు. భవిష్యత్తులో ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌ల్లో కీలక హోదాలకు చేరుకోవచ్చు. ఆబ్జెక్టివ్‌ పరీక్ష, ఇంటెలిజెన్స్‌, పర్సనాలిటీ టెస్టు, ఫిజికల్‌, మెడికల్‌ టెస్టుల ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తారు.

నేషనల్‌ డిఫెన్స్‌ అకాడెమీ & నేవల్‌ అకాడెమీ ( ఎన్‌డీఏ ఖీ ఎన్‌ఏ) పరీక్షను ఏడాదికి రెండుసార్లు యూపీఎస్సీ నిర్వహిస్తుంది. జనవరి, మే నెలల్లో ప్రకటనలు విడుదలవుతాయి. జనవరిలో వచ్చే నోటిఫికేషన్‌కు ఏప్రిల్‌లో, మేలో విడుదలయ్యే ప్రకటనకు ఆగస్టులో పరీక్షలు నిర్వహిస్తారు. ఎన్‌డీఏకు ఎంపికైనవారు మూడేళ్లపాటు పుణెలోని నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీలో బీఏ, బీఎస్సీ కోర్సులు చదువుతారు. నేవల్‌ అకాడమీకి ఎంపికైనవారు నాలుగేళ్లపాటు కేరళలోని ఎజిమాలలో బీటెక్‌ విద్యను అభ్యసిస్తారు. రెండు చోట్లా విద్యార్థులకు అన్నీ ఉచితంగా సమకూరుస్తారు. డిగ్రీలను న్యూదిల్లీలోని ప్రఖ్యాత జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) ప్రదానం చేస్తుంది.

ఇంటర్‌ చివరి సంవత్సరంవారు అర్హులే!
ఆర్మీ వింగ్‌ (ఎన్‌డీఏ)కు బాలురు మాత్రమే దరఖాస్తు చేయాలి. వీరు ఏదైనా గ్రూప్‌తో ఇంటర్‌ ఉత్తీర్ణులై ఉండాలి. ఎయిర్‌ ఫోర్స్‌, నేవల్‌ వింగ్స్‌ (ఎన్‌డీఏ), 10+2 క్యాడెట్‌ ఎంట్రీ స్కీమ్‌ (ఇండియన్‌ నేవల్‌ అకాడమీ)కు దరఖాస్తు చేయాలనుకుంటే ఫిజిక్స్‌, మ్యాథ్స్‌ సబ్జెక్టులతో ఇంటర్‌ ఉత్తీర్ణులై ఉండాలి. అన్ని విభాగాలకు ఇంటర్‌ చివరి సంవత్సరం చదువుతున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
వయసు: పరీక్ష రాసే సమయానికి 16 నుంచి 18 సంవత్సరాల మధ్య ఉండాలి. జులై 2, 1999 తర్వాత; జులై 1, 2002 కంటే ముందు జన్మించినవాళ్లు అర్హులు.
శారీరక ప్రమాణాలు: అభ్యర్థుల కనీస ఎత్తు 157 సెం.మీ. ఉండాలి. ఎయిర్‌ఫోర్స్‌కు 162.5 సెం.మీ. ఉండాలి. ఎత్తుకు తగిన బరువు అవసరం.

రెండు దశల్లో ఎంపిక
అభ్యర్థుల ఎంపిక రెండు దశల్లో జరుగుతుంది. అవి: రాత పరీక్ష (ఆబ్జెక్టివ్‌ తరహా), ఇంటెలిజెన్స్‌ - పర్సనాలిటీ టెస్ట్‌. రాత పరీక్షలో మొత్తం 900 మార్కులకు ప్రశ్నపత్రం ఉంటుంది. ఇందులో రెండు పేపర్లు ఉంటాయి. పేపర్‌-1లో మ్యాథ్స్‌ నుంచి 300 మార్కులకు ప్రశ్నలు ఇస్తారు. పరీక్ష వ్యవధి రెండున్నర గంటలు. పేపర్‌-2లో 600 మార్కులకు జనరల్‌ ఎబిలిటీ విభాగం నుంచి ప్రశ్నలు ఉంటాయి. దీనికి వ్యవధి రెండున్నర గంటలు. ఇందులో ఇంగ్లిష్‌కు 200, జనరల్‌ నాలెడ్జ్‌కి 400 మార్కులు కేటాయించారు. జనరల్‌ నాలెడ్జ్‌ విభాగానికి సంబంధించి సెక్షన్‌-ఎలో ఫిజిక్స్‌, సెక్షన్‌-బిలో కెమిస్ట్రీ, సెక్షన్‌-సిలో జనరల్‌ సైన్స్‌, సెక్షన్‌-డిలో చరిత్ర, సెక్షన్‌-ఇ లో భూగోళశాస్త్రం, సెక్షన్‌-ఎఫ్‌ లో వర్తమానాంశాలపై ప్రశ్నలుంటాయి. ఫిజిక్స్‌ నుంచి వంద, కెమిస్ట్రీ నుంచి అరవై, జనరల్‌ సైన్స్‌ నుంచి నలభై, చరిత్ర, స్వాతంత్య్రోద్యమాలు తదితరాల నుంచి ఎనభై, భూగోళశాస్త్రం నుంచి ఎనభై, వర్తమానాంశాల నుంచి నలభై మార్కులకు ప్రశ్నలడుగుతారు. ఇంటర్‌ పాఠ్యాంశాల నుంచే ప్రశ్నలు వస్తాయి. ఆబ్జెక్టివ్‌ పరీక్షలో రుణాత్మక మార్కులు ఉన్నాయి.

రాత పరీక్షలో అర్హత పొందిన వారికి సర్వీస్‌ సెలక్షన్‌ బోర్డ్‌ (ఎస్‌ఎస్‌బీ) ఆధ్వర్యంలో యూపీఎస్సీ ఇంటెలిజెన్స్‌ అండ్‌ పర్సనాలిటీ టెస్టులు నిర్వహిస్తుంది. ఈ విభాగానికి 900 మార్కులు కేటాయించారు. ఇందులో భాగంగా గ్రూప్‌ టెస్టులు, గ్రూప్‌ డిస్కషన్‌, గ్రూప్‌ ప్లానింగ్‌, అవుట్‌డోర్‌ గ్రూప్‌ టాస్క్‌లు ఉంటాయి. స్టేజ్‌-1లో అర్హత సాధించినవారినే స్టేజ్‌-2కి అనుమతిస్తారు.

తుది ఎంపిక
రాత పరీక్ష, సర్వీస్‌ సెలక్షన్‌ బోర్డు నిర్వహించిన పరీక్షల్లో వచ్చిన మొత్తం మార్కుల ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది. వైద్య పరీక్షలు, అభ్యర్థి ప్రాధాన్యాలను పరిగణనలోకి తీసుకుని ప్రతిభ ఆధారంగా సంబంధిత విభాగాలకు ఎంపిక చేస్తారు.

శిక్షణ విధానం
మొదటి రెండున్నర సంవత్సరాల శిక్షణ అందరికీ ఒకేవిధంగా ఉంటుంది. ఆర్మీని ఎంచుకున్న వారికి బీఎస్సీ/ బీఎస్సీ (కంప్యూటర్‌)/ బీఏ డిగ్రీ సర్టిఫికెట్లను న్యూదిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) అందజేస్తుంది. నేవీ, ఎయిర్‌ఫోర్స్‌, నావెల్‌ అకాడమీ అభ్యర్థులకు బీటెక్‌ డిగ్రీని ప్రదానం చేస్తారు.

ఎన్‌డీఏలో మూడేళ్ల శిక్షణ, చదువు అనంతరం ఆర్మీ క్యాడెట్లను డెహ్రాడూన్‌లోని ఇండియన్‌ మిలిటరీ అకాడమీకి; నేవల్‌ క్యాడెట్లను ఎజిమాలలోని ఇండియన్‌ నేవల్‌ అకాడమీకి; ఎయిర్‌ఫోర్స్‌ క్యాడెట్లను హైదరాబాద్‌లోని ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ అకాడమీకి శిక్షణ కోసం పంపుతారు. అభ్యర్థి ఎంపికైన విభాగాన్ని బట్టి ఈ శిక్షణ ఏడాది నుంచి 18 నెలల వరకు ఉంటుంది. ఈ సమయంలో స్టైపెండ్‌ (మూల వేతనం రూ.56,100) చెల్లిస్తారు.

శిక్షణ అనంతరం ఉద్యోగంలోకి తీసుకుంటారు. ఈ సమయంలో రూ. లక్ష వరకు వేతనం ఉంటుంది. ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌ వీటిలో ఏ సర్వీస్‌కి ఎంపికైనప్పటికీ వేతనం, హోదాలు సమానంగానే ఉంటాయి. ప్రోత్సాహకాలపరంగా కొద్దిపాటి వ్యత్యాసాలు ఉంటాయి.
ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీలు 415. వీటిలో నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీకి 360 ఉన్నాయి. వాటిలో ఆర్మీ 208, నేవీ 60, ఎయిర్‌ఫోర్స్‌ 92 ఖాళీలు ఉన్నాయి. నేవల్‌ అకాడమీలో 55 ఖాళీలు ఉన్నాయి.
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో చేసుకోవాలి.
చివరి తేదీ: ఫిబ్రవరి 5 సాయంత్రం 6 గంటల వరకు.
పరీక్ష తేదీ: ఏప్రిల్‌ 22 తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్‌, విశాఖపట్నం, తిరుపతి
వెబ్‌సైట్‌: www.upsc.gov.in

Posted on 23-01-2018