close

శ్రీకాకుళం జిల్లా సమాచారం


జిల్లా చరిత్ర
విద్య
నదులు - ప్రాజెక్టులు
నీటిపారుదల
ప్రధాన పంటలు

జిల్లా చరిత్ర

సుదీర్ఘ సముద్రతీరం.. అపారమైన ప్రకృతి వనరులు... కోట్ల రూపాయల విలువైన గ్రానైట్ సంపద.. క్రీస్తుపూర్వం నాటి ఘనమైన చరిత్ర.. అతి ప్రాచీన... అత్యంత అరుదైన దేవాలయాలు... బౌద్ధారామక్షేత్రాలు.. ఇదీ శ్రీకాకుళం జిల్లా స్వరూపం. ఇదో అందమైన వూటీ... పేదల వూటీ... వేసవిలోనూ చల్లదనం చూపించే జిల్లా ఇది.

వంశధార, నాగావళి, మహేంద్రతనయ, బహుదా నదుల సాగర సంగమ ప్రదేశాలు మనసును పరవశింపచేస్తాయి. మరో కోనసీమను తలపించే ఉద్దానం.. నిజంగా స్వర్గధామమే. శాలిహుండం, కళింగపట్నం, దంతవరపు కోట ఆనాటి కళింగ ప్రజల శాంతికాముకత్వానికి ప్రతీకలుగా నిలిచాయి.

శతాబ్దాల చరిత-చిక్కోలు ఘనత
ప్రాచీనకాలంలోనే శ్రీకాకుళం ఉందనడానికి ఎన్నో ఆధారాలున్నాయి. అయితే 1950లో జిల్లాలు ఏర్పడనంత వరకు ఈ ప్రాంతాన్ని కళింగ ప్రాంతంగా వ్యవహరించేవారు.
కళింగ చరిత్ర ఐతరేయ బ్రాహ్మణం, రామాయణం, మహాభారతం, కథా సరిత్సాగరం, మొదలైన గ్రంథాలలో ప్రస్తావించారు. పూర్వదశలోనే ఈ ప్రాంతంలో ఆదిమ తెగలతో కూడుకున్న జనజీవనం ఉన్నట్టుగా కంభంపాటి సత్యనారాయణ ఆంధ్రుల సంస్కృతి-చరిత్రలో పేర్కొన్నారు. శబ్దకల్ప ద్రుమంలో కలి+గయ్+డ అని కళింగ ఉత్పత్తి పేర్కొన్నారు. వివాదాలు జరిగే ప్రదేశాలు కనుక దీనికి 'కళింగ' ప్రదేశమని వచ్చిందని కళింగ చరిత్రలో వివరించారు.
'రామాయణం'లో అయోధ్యకాండలో భరతుడు కేకేయరాజును వదిలి అయోధ్యకు వచ్చేటప్పుడు కళింగనగరం మీదుగా ప్రయాణించాడని చెప్పినట్టు ప్రాచీన చరిత్ర-భూగోళంలో పేర్కొన్నారు. ఈ ప్రాంతానికి సంబంధించి అయోధ్యకు పశ్చిమంగా కళింగనగరం ఉన్నట్టు రామాయణం ద్వారా తెలుస్తోంది. భారతంలో కూడా అర్జునుడు తీర్థయాత్రలకు వెళ్లే సమయంలో భ్రాతృభిస్సహితో వీరఃకలింగాన్ ప్రతిభావతి అని చెప్పిన దాని ప్రకారం అప్పటికే ఈ కళింగ ప్రాంతం ఉన్నట్టు తెలుస్తోంది. దీర్ఘతమనుడు అనే రుషిని కాళ్ళు, చేతులు కట్టి అతని శిష్యులు గంగలో వదిలివేశారు. అతడు నీటిలో కొట్టుకురాగా 'బిలి' అనే రాజు అతనిని ఇంటికి తీసుకెళ్లి సంరక్షణ చేసి తన భార్యతో సంతానాన్ని కనాలని కోరడంతో ఆ రుషి ఆమె ద్వారా 'అంగుడు', 'వంగడు' 'కళింగుడు', 'సహ్ముడు' అనే పుత్రులను కన్నాడని ఆ పుత్రుల వల్ల వారి పేర్ల మీదుగా రాజ్యాలు ఏర్పడ్డాయని మహాభారతంలో ఉంది.
దండి రాసిన దశకుమార చరిత్రలో కళింగ దేశం, కళింగనగరం పేర్కొనబడ్డాయి. మార్కండేయ పురాణం, వాయు పురాణం, కాళిదాసు రఘువంశంలో కూడా 'కళింగం' ఉనికిని ప్రస్తావించారు. మన్మోహన్ గంగూలీ 'ఒరిస్సా దాని చిహ్నములు' అనే గ్రంథంలో కాళింగమునకు ఉత్తరమున వైతరణి నది, దక్షిణాన గోదావరి, తూర్పున సముద్రం, పశ్రిమాన ఒరిస్సా రాష్ట్రాలున్నాయని చెప్పడాన్ని బట్టి చూస్తే ఈ కళింగం అతి ప్రాచీనమైనదని చెప్పవచ్చు. కళింగ ప్రాంతాన్ని గురించి శ్రీముఖలింగంలో లభించిన శాసనాలు, శక్తివర్మ రాగోలు శాసనాలలో మనకు మరింత సమాచారం దొరుకుతుంది.
ఈ శాసనాల పరంగా పరికిస్తే జిల్లా అతిప్రాచీనమైనదని అర్థమవుతుంది. ఈ ప్రాంతంలో క్రీ.పూ. నాల్గవ శతాబ్దం నాటికే కళింగ రాజ్యం కటక్ నుంచి పిఠాపురం వరకు వ్యాపించి ఉంది. అప్పటి నుంచి 15వ శతాబ్దం వరకు అనేక మంది రాజులు, దండయాత్రలు జరిపి తమ తమ రాజ్యాలను స్థాపించారు. మహ్మదీయ పాలనలో కూడా తెలుగు భాషకు ప్రాధాన్యం ఇచ్చారు. కాలానుగుణంగా కళింగ రాజ్యం ఉత్తర భాగం ఒరిస్సాలోను, దక్షిణభాగం ఆంధ్రలోను అంతర్భాగం అయ్యాయి. క్రీ.పూ. 467 నుంచి 336 వరకు మౌర్యులు ఈ ప్రాంతాన్ని పరిపాలించారు. కళింగ దేశంపై దాడి చేసిన అశోకుడు క్రీ.పూ. 225లో పశ్చాత్తాపం పొంది బౌద్ధమతాన్ని ఈ ప్రాంతంలోనే స్వీకరించాడు. గంగరాజుల పాలనలో బౌద్ధ, జైన మతాల ప్రాబల్యం ఎక్కువగా ఉండేది. జిల్లాలో ఈ మతాలకు చెందిన చారిత్రక ప్రదేశాలు శాలిహుండం, కళింగపట్నం, మహేంద్రగిరి, దంతవరపుకోట, సంగమయ్యకొండ మొదలైన ప్రదేశాలున్నాయి.
మౌర్య సామ్రాజ్యం పతనమైన తర్వాత క్రీ.శ. 183లో భారవేలుడు ముఖలింగం రాజధానిగా కళింగ రాజ్యాన్ని స్థాపించాడు. 7వ శతాబ్దం వచ్చినంత వరకు కళింగ రాజధాని ముఖలింగంగానే పరిగణింపబడింది. భారవేలుని తరువాత ఆంధ్ర చక్రవర్తులైన శాతవాహనులు, కళింగదేశాన్ని జయించారు. శాతవాహనుల తరువాత కళింగ రాజ్యం విచ్ఛిన్నమై చిన్న చిన్న రాజ్యాలుగా మారాయి. క్రీ.శ. 343లో సముద్రగుప్తుడు దండెత్తి వచ్చిన కాలంలో కళింగదేశాన్ని నలుగురు రాజులు పరిపాలిస్తున్నారు. నాటి వాసిష్ఠులకు రాజధాని పిఠాపురమే.
శాలంకాయనుల ధాటికి తాళలేక శ్రీకాకుళం దగ్గర ఉన్న 'సింగుపురానికి' ఆ తర్వాత టెక్కలి వద్ద ఉన్న 'వర్దమానపురానికి' అక్కడ నుంచి పొందూరు వద్ద నున్న 'సిరిపురానికి' రాజధానులను మార్చుకున్నారు. క్రీ.శ. 485లో విష్ణుకుండినులు దక్షిణ కళింగాన్ని జయించారు. క్రీ.శ. 497లో గంగ వంశం వారు శ్రీకాకుళం స్టేషన్‌కు సమీపంలో ఉన్న మునగాలవలస పక్కన ఉన్న 'పురుషోత్తపురం' దగ్గరున్న దంతపురాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలించారు. అప్పటినుంచి క్రీ.శ. 1434లో ప్రతాపరుద్ర గజపతి పరిపాలనకు వచ్చినంత వరకు గంగరాజులే పరిపాలించారు.
గౌతమి బుద్ధుడు క్రీ.పూ. 483లో మరణించిన తర్వాత అంత్యక్రియలు జరిపించి ఆయన శరీర అవశేషాలను వివిధ ప్రాంతాలకు తీసుకుపోయారు. బుద్ధుని నోటిలోని ఒక దంతాన్ని ఖేమరుసి అనే వ్యక్తి తీసుకువచ్చి కళింగరాజుల్లో ఒకడైన బ్రహ్మదత్తుని కాలంలో నరేంద్రపురం కోటలో పదిలపర్చాడు. క్రమంగా ఇక్కడ ఒక స్థూపం కూడా నిర్మితమై ఎన్నో పూజలందుకుంది. ఇదే కాలక్రమంలో దంతకోట, దంతపురంగా మారిందని చెబుతారు.
గంగరాజులు కళింగాన్ని సుదీర్ఘమైన కాలం పరిపాలించారు. ఒక దశాబ్దం వరకు 'ముఖలింగం' రాజధానిగా చేసుకుని పరిపాలించిన తర్వాత కటకానికి రాజధానిని మార్చారు. వీరి హయాంలో శ్రీముఖలింగం, నగరికటకం అద్భుత నగరాలుగా ఉండేవి. శ్రీముఖలింగ ఆలయాలు వీరు నిర్మించినవే. ఆనాటి సామాజిక జీవన స్థితిగతులు ముఖలింగం శిల్పాల్లో కనిపిస్తాయి. గంగ వంశానికి చెందిన 50 మంది రాజులు పరిపాలించినట్టు చరిత్రకారులు గుర్తించారు. వీరి శాసనాలు జర్జంగి, శ్రీకాకుళం, ఉర్లాం, అచ్యుతాపురం, సంతబొమ్మాళి, ఆమదాలవలస తదితర ప్రాంతాల్లో కనిపిస్తున్నాయి. ముఖలింగం ఆలయంలోనే 149 శాసనాలున్నాయి. గంగరాజుల్లో ఒకడైన రెండవ వజ్రహస్త దేవుని శిల్పం ఇక్కడ కనిపిస్తుంది. ఈ వంశంలో చివరివాడు భానుదేవుడు.
గంగ వంశ పతనంతో ఆంధ్రదేశం మూడుభాగాలుగా విడిపోయింది. ఉత్తర కళింగాన్ని, క్రీ.శ. 1344లో పాలించిన కపిలేశ్వర గజపతికి 'కటకం' రాజధానిగా మారింది. అతని కుమారుడు పురుషోత్తమ గజపతి కళింగాన్ని జయించాడు. ఉత్తర కళింగమ్ 'ఉత్కళం'గా మారిందని భాషాశాస్త్రవేత్తలు అంటారు. ఇతని కుమారుడు ప్రతాపరుద్రుని కాలంలో శ్రీకృష్ణ దేవరాయులు దండయాత్ర చేసి కళింగ సామ్రాజ్యం హస్తగతం చేసుకున్నాడు. నేటి శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు ఆ 'నందపురం'లోనే ఉండేవి. పర్లాకిమిడి రాజులు ఈ కాలంలో శ్రీకాకుళం జిల్లాలోని టెక్కలి, మందస, నరసన్నపేట ప్రాంతాలను ఆక్రమించారు. జలంతరకోట, ఇచ్ఛాపురం, సోంపేట ప్రాంతాలు పాత్రునుల ఆధీనంలో ఉండిపోగా శ్రీకాకుళం, బొంతలకోడూరు ప్రాంతం మహ్మదీయ ప్రాబల్యంలోకి వెళ్లిపోయాయి.
నందవంశంలో క్రీ.శ.1752-58 కాలంలో లాలాకృష్ణుడు, విక్రమ్‌దేవ్‌ల మధ్యన పోరు జరిగి రాజ్యం విచ్ఛిన్నమైంది. నేటి ఒరిస్సా, విజయనగరం జిల్లాలోని కొన్ని ప్రాంతాలు 'జామీలు'గా ఏర్పడ్డాయి. పాలకొండ, వీరఘట్టాం కొత్త రాజ్యాలుగా అవతరించాయి. ఈ విభేదాలను ఆసరాగా చేసుకొని విజయనగరరాజు విజయరామరాజు విక్రమదేవునికి అండగా నిలిచి సాలూరు, కురుపాం, తదితర రాజ్యాలు పొందినట్లుగా చరిత్ర ద్వారా తెలుస్తోంది.
ఔరంగజేబు గోల్కొండ నవాబును ఓడించి, నిజాం ఉల్‌ముల్క్‌ని తన ప్రతినిధిగా నియమించగా, ఔరంగజేబు మరణానంతరం నిజాం స్వతంత్రత ప్రకటించుకున్నాడు. అతని పరిపాలనలోనే ఆంధ్రప్రాంతం అయిదు సర్కారులుగా ముక్కలైంది. నిజాం రాజు మరణానంతరం వారసత్వం కోసం చెలరేగిన అంతఃకలహాల్లో సలాబత్‌సింగ్ ఫ్రెంచ్ సేనాని బుస్సీ సహాయాన్ని కోరాడు. దీనితో శ్రీకాకుళం సర్కార్ నుంచి కొండపల్లి సర్కార్ వరకు నాలుగు సర్కారులను ఫ్రెంచివారు తమ సైనిక ఖర్చుల కింద రాయించుకున్నారు. దీనివలన నైజాం ప్రతినిధి అయిన జార్ అలీ మహారాష్ట్రుల సహాయం కోరాడు. మహారాష్ట్ర సైనికులు చికాకోల్, విశాఖ, గోదావరి ప్రాంతాలను వశం చేసుకున్నారు. వారు వెళ్లిన తరువాత నిస్సహాయుడైన జాఫర్ అలీ మరణించాడు.క్రీ.శ. 1754లో చికాకోల్ 'సుబా' ఫ్రెంచివారి ఆధీనమైంది. విజయరామరాజు కోసం బొబ్బిలినిక్రీ.శ. 1757 జనవరి 26న ఫ్రెంచి సేనలు చుట్టుముట్టాయి. ఇతని హత్య తర్వాత రాజైన ఆనందగజపతి ఇంగ్లిషు వారితో చేతులు కలిపాడు. క్రీ.శ.1758లో ఇంగ్లిషు సైన్యం వచ్చింది. క్రీ.శ.1759లో 'చికాకోల్'లో 'ఫౌజ్‌దార్'ల పాలన అంతమైంది. క్రీ.శ.1760లో ఆనందగజపతి చనిపోగా 1766లో ఈస్టిండియా పాలన ప్రారంభమైంది. అప్పటికి పాలకొండ, టెక్కలి మొదలైన జమిందారీలు ఉన్నాయి. 1778లో బ్రిటిష్‌వారితో జమిందారులు చేసుకున్న ఒప్పందం ప్రకారం క్రీ.శ.1801 నుంచి కలెక్టర్ల నియామకం ప్రారంభమైంది. 1816 నుంచి జిల్లా కలెక్టర్‌కు మెజిస్ట్రేట్ అధికారాలు లభించాయి. జమీందారీ విధానాన్ని ఎదిరించిన గంజాం, విశాఖ జిల్లాల రైతుల వల్ల 'అచ్చపువలస' దగ్గర గిరిజన పితూరీ జరిగింది. ఈ గ్రామం వీరఘట్టాం దగ్గర ఉంది.క్రీ.శ. 1834లో గిరిజన తెగలకు చెందిన పాలకొండ, మేరంగి, కురుపాం, మొండెంఖల్‌లలో జమీందార్ల దోపిడీ ఎక్కువైంది. బ్రిటిష్‌వారు శ్రీకాకుళం, కశింకోటలను విశాఖలో విలీనం చేశారు. ఇచ్ఛాపురాన్ని పాతగంజాంలో 1902లో కలిపారు.క్రీ.శ. 1902-1930 మధ్యలో జమీందారులు విపరీతంగా శిస్తులను పెంచారు. జమిందార్ల వ్యతిరేక పోరాటానికి 1940లో పలాసలో జరిగిన అఖిల భారత రైతు మహాసభ స్ఫూర్తినిచ్చింది. మందసలో జరిగిన రైతాంగ పోరాటంలో శానుమాను గున్నమ్మ వీరమరణం పొందింది.
క్రీ.శ.1948లో జమిందారీలను రద్దు చేసిన తర్వాత ఇచ్ఛాపురం, పార్వతీపురం, విజయనగరం సంస్థానాలన్నీ కలిపి విశాఖపట్నం అతిపెద్ద జిల్లాగా ఏర్పడింది. విశాఖ జిల్లా పెద్దదవడంతో పరిపాలనా పరమైన చిక్కులు ఏర్పడ్డాయి. దానితో 1950 ఆగస్టు 15న శ్రీకాకుళం రైల్వేస్టేషన్‌లో అర్ధరాత్రి జరిగిన సమావేశంలో శ్రీకాకుళం షేక్అహ్మద్ కలెక్టర్‌గా నియమితులవడంతో కొత్త జిల్లాగా రూపుదిద్దుకుంది.

ఇతర విశేషాలు....
జిల్లా ప్రధాన కేంద్రమైన శ్రీకాకుళం పట్టణం చెన్నై - కోల్‌కతా జాతీయ రహదారిపై విశాఖపట్టణానికి వంద కిలోమీటర్ల దూరంలో ఉంది. శ్రీకాకుళానికి చేరువలోనున్న విమానాశ్రయం విశాఖపట్నం. సమీపంలోని రైల్వేస్టేషన్ ఆమదాలవలస స్టేషన్. ఇది శ్రీకాకుళం పట్టణానికి సుమారు 10 కిలోమీటర్ల దూరంలో ఉంది.
శ్రీకాకుళం పట్టణంలో ప్రాచీన ఆలయాల్లో శ్రీ ఉమారుద్ర కోటేశ్వరాలయం ఒకటి. ఏకాంత గణపతి పర్వతాకారులైన నందీశ్వరునితో అలరారుతోంది. ఈ ఆలయంలో 16, 17 శతాబ్దాల శాసనాలు లభించాయి. శ్రీకోదండరామస్వామి ఆలయం, జిల్లాలో అతిపెద్దదైన జుమ్మామసీదు ప్రత్యేకంగా పేర్కొనవచ్చు.

మహాత్ముడు నడిచిన నేల
రవి అస్తమించని బ్రిటిష్ సామాజ్య్రంపై అహింసే ఆయుధంగా ఎదురొడ్డి పోరాడిన భరతమాత ముద్దుబిడ్డ, స్వాతంత్య్ర ప్రదాత మహాత్మాగాంధీ మూడు రోజుల పాటు శ్రీకాకుళం జిల్లాలో పర్యటించారు. స్వాతంత్య్ర పోరాటం కీలక దశకు చేరుకున్న కాలంలోనే పోరాటం తీరుతెన్నులు తెలుసుకొనేందుకు గాంధీ శ్రీకాకుళంలో పర్యటించారు. క్రీ.శ.1927 డిసెంబరు 2 నుంచి మూడు రోజుల పాటు ఇక్కడ గడిపారు. పర్యటన తొలిరోజు పాలకొండ రోడ్డులోని ఎంబాడ హనుమంతరావు ఇంటిలో బస చేశారు. ప్రస్తుతం ఈ ఇంటిని గాంధీజీ బస చేసిన చిహ్నంగానే ఉంచేశారు. ఇక్కడ గాంధీ ఉద్యమ సహచరులతో చర్చించడం, పోరాటంలో పాల్గొంటున్న నాయకులు, యువకుల గురించి ఆరా తీయటం చేశారు. శ్రీకాకుళం జిల్లాలో ఖాదీ పరిశ్రమ అభివృద్ధి తీరుతెన్నులు కూడా అడిగి తెలుసుకొన్నారు. ఇక్కడ నేసిన ఖద్దరు పరిశీలించి నేత కార్మికులను ప్రశంసించారు. అదే రోజు స్థానిక పురపాలక సంఘం మైదానంలో జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. దేశ సార్వభౌమాధికారం కోసం జరుగుతున్న పోరాటాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లడానికి వీలుగా భూరి విరాళాలు ఇవ్వాలని గాంధీజీ ఇచ్చిన పిలుపునకు అన్ని వర్గాల వారు పెద్దఎత్తున స్పందించారు. ప్రజాస్పందన గమనించిన గాంధీజి వారిని అభినందించారు.

విద్య

డా.బి.ఆర్.అంబేద్కర్ విశ్వవిద్యాలయం
1977లో పీజీ సెంటర్‌గా శ్రీకాకుళంలోని ఆర్ట్స్ కళాశాలలో ప్రారంభమైంది. 1985లో ఎచ్చెర్లలోని క్యాంపస్‌కు మారి 2008 జూన్ 25న విశ్వవిద్యాలయంగా రూపాంతరం చెందింది. ఎం.ఎ.(ఆర్.డి.), ఎం.ఎ.(అర్ధశాస్త్రం) కోర్సులతో 180 మంది విద్యార్థులతో ప్రారంభంకాగా 1989లో బి.ఎల్, ఎం.కాం., ఎం.ఎస్సీ (మేథ్స్), బి.ఎల్.ఐ.ఎస్.సి. కోర్సు అదనంగా వచ్చాయి. ఆ తరువాత 2002, 2006 సంవత్సరాల్లో వచ్చిన ఎంబిఎ, ఎంసిఎ, ఎమ్మెస్సీ(కెమిస్ట్రీ), ఎంఎ (ఇంగ్లీష్), ఎంఎ (సోషల్‌సైన్స్‌స్), ఎంఎస్సీ (బయోటెక్నాలజీ), ఎమ్మెస్సీ (జియోసైన్స్), స్పెషల్ బిఇడి, ఎం.ఇ.డి., ఎం.ఎ.(తెలుగు)లతో కలిపి మొత్తం 16 కోర్సులు కొనసాగుతున్నాయి.

వీటి పరిధిలో ఏడాదికి మొత్తం 1160 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. నాగావళి, వంశధార పేరుతో విద్యార్థిని విద్యార్థులకు వేర్వేరుగా వసతిగృహాలు ఉన్నాయి. అంతర్జాలం సౌకర్యంతో గ్రంథాలయం, సమావేశమందిరం, పదిఎకరాల విస్తీర్ణంలో ఆటస్థల మైదానం తదితర సౌకర్యాలు ఉన్నాయి. నూతనంగా రూ. 5 లక్షల వ్యయంతో మహిళల వెయిటింగ్‌హాల్, రూ. 56 లక్షల వ్యయంతో 8 తరగతి గదుల నిర్మాణం, పరీక్షల పనులకు రూ.7 లక్షలతో ఒక గదిని, రూ. 12 కోట్లతో భారీ బ్లాక్‌లును నిర్మించేందుకు కార్యాచరణ రూపొందించారు.

నదులు - ప్రాజెక్టులు

వంశధార
* ఒడిశా రాష్ట్రం కొరాపుట్ జిల్లాలోని మిన్నజోలా వద్ద వంశధార జన్మించింది. ఆ రాష్ట్రంలో 154 కిలోమీటర్ల మేర ప్రవహిస్తోంది. అక్కడి నుంచి సరిహద్దులో 29 కిలోమీటర్ల దూరం ప్రయాణించి భామిని మండలం కంట్రగడ వద్ద ఆంధ్ర భూభాగంలోకిప్రవేశిస్తోంది.అది మొదలుకొని జిల్లాలో ఈ నది మొత్తం 82 కిలోమీటర్ల మేర ప్రవహిస్తోంది. గార మండలం కళింగపట్నం సమీపంలో బంగాళాఖాతంలో కలుస్తోంది.వంశధార నదిపై గొట్టా బ్యారేజీ ఉంది. దీనికి కుడి, ఎడమ కాలువలు ఉన్నాయి.
* హిరమండలం మండలం గొట్ట వద్ద 1972వ సంవత్సరంలో గొట్టా బ్యారేజీ పనులు ప్రారంభించి 1977లో పూర్తి చేశారు.
* బ్యారేజీతో పాటు 1,48,230 ఎకరాలకు సాగునీరు అందించే ఉద్దేశ్యంతో 1977 సెప్టెంబరు 29న అప్పటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి ఈ బ్యారేజీని ప్రారంభించారు.
* కుడికాల్వ ద్వారా 67591 ఎకరాలకు నీరు అందించేందుకు పనులను 1983లో ప్రారంభించారు 2000 నాటికి పూర్తయ్యాయి.
* కుడి కాలువ పొడవు 56 కిలోమీటర్లు. హిరమండలం, ఎల్.ఎన్.పేట, సరుబుజ్జిలి, బూర్జ, ఆముదాలవలస, గార, శ్రీకాకుళం, మండలాల్లోని 62 వేల ఎకరాలకు దీని ద్వారా సాగునీరందుతోంది.
* ఎడమ కాల్వ పొడవు 107 కిలోమీటర్లు. దీనిద్వారా నరసన్నపేట, టెక్కలి, జలుమూరు, పలాస తదితర 13 మండలాల పరిధిలో 1,48,000 ఎకరాలకు సాగునీరందుతోంది.
* గొట్టా బ్యారేజీ సాధారణ సామర్థ్యం 34 అడుగులు. గరిష్ఠ సామర్థ్యం 38 అడుగులు.
* ఈ గొట్టా బ్యారేజీ ద్వారా 2.10 లక్షల ఎకరాలకు సాగునీరందుతోంది.
* బ్యారేజీలో 38.01 (0.10 టీఎంసీలు) మీటర్ల మేర నీటిని నిల్వ ఉంచుతున్నారు. గొట్టా బ్యారేజీ వద్ద 22 సాధారణ గేట్లతోపాటు 2 అత్యవసర గేట్లు ఉన్నాయి. బ్యారేజీ పొడవు 457 మీటర్లు

నాగావళి
నాగావళి ఒడిశాలోని రాయగడ కొండల్లో పుట్టి 90 కిలోమీటర్లు ఒరిస్సాలో ప్రవహించి జిల్లాలో వంగర మండలంలో ప్రవేశిస్తోంది. జిల్లాలో 115 కిలోమీటర్లు ప్రవహించి శ్రీకాకుళం సమీపంలోని కల్లేపల్లి వద్ద బంగాళాఖాతంలో కలుస్తోంది. దీనికి లాంగుల్యా అను మారు పేరు ఉంది. నాగావళి నదిలో నీటి ప్రవాహం 70 వేల క్యూసెక్కులు దాటితే నదీపరీవాహక ప్రాంతాలకు వరద ముప్పు వాటిల్లినట్టే. కరకట్టల నిర్మాణం పూర్తి కాకపోవడంతో నదీ తీర ప్రాంతాల గ్రామాలన్నీ ఏటా ముంపు బారిన పడుతున్నాయి. నాగావళి నదిపై విజయనగరం జిల్లాలోని తోటపల్లి వద్ద తోటపల్లి ప్రాజెక్టు నిర్మించారు. దీన్ని జలయజ్ఞంలో భాగంగా రూ. 467 కోట్లతో రెండో దశ విస్తరణ పనులు చేపట్టారు. ప్రస్తుతం కుడి, ఎడమ కాల్వల ద్వారా 60 వేల ఎకరాలకు సాగునీరు అందుతుండగా, రెండో దశ విస్తరణ పనులు పూర్తయితే మరో 1.20 లక్షల ఎకరాలకు సాగునీరందుతోంది. ప్రస్తుతం కుడికాల్వ ద్వారా వంగర మండలంలోని 3,500 ఎకరాలకు, ఎడమ కాల్వ ద్వారా 38 వేల ఎకరాలకు సాగునీరు అందుతోంది. రెండో దశ విస్తరణ పూర్తయితే జిల్లాకు అదనంగా జి.సిగడాం, రేగిడి, రాజాం, సంతకవిటి, వంగర, రణస్థలం, లావేరు మండలాల్లోని 58 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతుంది. నాగావళికి ఉపనదులు ఒట్టిగెడ్డ, జంఝావతి, సువర్ణముఖి. శ్రీకాకుళం పట్టణానికి ప్రధాన నీటివనరు నాగావళి నది. ఈ నది ద్వారా సుమారు 10 మిలియన్ లీటర్ల నీటిని రోజువారి ఉపయోగిస్తున్నారు. మనిషికి సగటున 90 లీటర్ల చొప్పున పంపిణీ చేస్తున్నారు. నాగావళి నది వలన శ్రీకాకుళం పట్టణానికి వేసవి కాలంలో తాగునీటి ఎద్దడి ఉండదు.

బాహదా
ఇచ్ఛాపురం మండలం బొడ్డబడ గ్రామం వద్ద ఒడిశా నుంచి ఆంధ్రాలోకి ప్రవేశించిన బాహుదా నది కొళిగాం, కీర్తిపురం, పాయితారి, తోటూరు, బిర్లంగి, మశాకపురం, రత్తకన్న, ఇచ్ఛాపురం, లొద్దపుట్టి, శాసనం, అరకబద్ర, టి.బరంపురం తులసిగాం, కొఠారి, ఈదుపురం, కేశుపురం, బూర్జపాడు గ్రామాల మీదుగా ప్రవహించి ఇచ్ఛాపురం మండలం డొంకూరు వద్ద బంగాళాఖాతంలో కలుస్తోంది.
* ఒడిశా జరడా కొండలలో పుట్టిన ఈ నది ఒడిశాలో 38 కిలోమీటర్లు, ఆంధ్రాలో (కేవలం ఇచ్ఛాపురం) కేవలం 16 కిలోమీటర్లు ప్రవహించి సముద్రానికి చేరుతోంది.
* ఒడిశా రాష్ట్రం ఈ నదీ జలాలను పూర్తిగా సద్వినియోగం చేసుకుంటూ ఏటా రెండు పంటలు సమృద్ధిగా సాగుచేసుకుంటోంది. అదే ఆంధ్రాలో ఈ నదిలో వచ్చిన వరద జలాలను సైతం జాగ్రత్త పరిచే చర్యలు లేవు. వరదలు వస్తే ముంపు, లేకుంటే కరవు.. ఇదీ ఆంధ్రా పరిస్థితి.
* ఇచ్ఛాపురానికి సుమారు 60 కిలోమీటర్లదూరంలో ఉన్న భగలట్టి గ్రామం వద్ద కిలోమీటరున్నర పొడవున 110 అడుగుల ఎత్తున ఒడిశా ఆనకట్టను నిర్మించింది. గత పదేళ్ళుగా ఈ ప్రాజెక్టు కోసం రూ.వందల కోట్లు వెచ్చించారు. బాహుదా జలాలన్నీ అక్కడే నిల్వ చేసుకుని ఆ రాష్ట్రంలో సగం ప్రాంతానికి ఈ నీటిని విడుదల చేస్తున్నారు.
* ఆంధ్రాలో బాహుదాజలాలపై ఆధారపడి సుమారు 7 వేల ఎకరాల పంటభూములు ఉన్నాయి. ఈ భూములను ప్రస్తుతం పరిశీలిస్తే, అన్ని చోట్లా బోర్లు వేసుకుని సాగుచేసుకోవడంకనిపిస్తుంది.
* అరకబద్రవద్ద రిజర్వాయర్ కట్టాలని 1978లో ఆంధ్రా ప్రభుత్వం సంకల్పించింది. అప్పట్లో దీనికి రూ. 40 కోట్లు అవసరమౌతాయని భావించారు. సర్వేలు, అంచనాలతో సంవత్సరాలు గడిచిపోయాయి. సర్వే కోసమే రూ. 40 కోట్లు ఖర్చు చేశారు. తీరా చివరకు తేల్చిందేమిటంటే ఈ ప్రాజెక్టుకోసం రూ. 250 కోట్లు కావాలని చెప్పారు. 7 వేల ఎకరాల కోసం అంత ఖర్చు పెట్టడం ఎందుకని ప్రభుత్వం వెనకంజ వేసింది. అదే ఈ ప్రాంత ప్రజల పాలిట శాపంగా మారింది.
* ఈ నదిపై ప్రత్యక్షంగా ఈదుపురం ఉద్దానం మంచినీటి పథకంతో పాటు, శాసనం, ఇచ్ఛాపురం పురపాలకసంఘం మంచినీటి పధకం ఆధారపడి ఉన్నాయి. రత్తకన్న ప్రాంతానికి బాహుదానదిలో వేసిన ఊటబావుల ద్వారానే మంచినీటిని సరఫరా చేస్తున్నారు. భవిష్యత్తులో పురుషోత్తపురం గ్రామంలో ఏర్పాటు చేసే మంచినీటి పథకానికి కూడా బాహదా జలాలే ఆధారం. ఇక పరోక్షంగా కొళిగాం నుంచి డొంకూరు వరకు గల గ్రామాలన్నీ ఈ నదీ జలాలకు సమీపలోనే బోర్లు వేసుకుని నీటిపథకాలను అమలు చేస్తున్నాయి.
* ఎగువనున్న ఒడిశా అంతరాష్ట్రనదీజలాల ఒపందాన్ని కాలరాస్తోంది. 1974లో అప్పటి ఆంధ్రా ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి, ఒడిశా ముఖ్యమంత్రి నీలమణి రౌత్రాయ్‌ల మధ్య భువనేశ్వర్‌లో జల ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం ఏడాది పొడునా 1.5 టి.ఎం.సి.ల నీటిని ఆంధ్రాకు విడిచి పెట్టాలి. గతంలో వరదలు వస్తే నీరు నిల్వ చేసే అవకాశం లేక నీటిని ఆంధ్రాకు విడిచి పెట్టేసేవారు. దాంతో ఆంధ్రా పంటభూములన్నీ మునిగిపోయేవి. ఇప్పుడు భగలట్టి ఆనకట్ట ఎత్తు పెరిగి పోవడంతో వరద నీరుకూడా దిగువకు విడిచి పెట్టడం లేదు. దాంతో వర్షాలు పడిన మూడు నెలలు మినహా మిగిలిన కాలమంతా బాహుదానది ఎండిపోయి కనిపించేది.
* ఆంధ్రా పరిధిలో ఉన్న ఈ నదికి 11 ఓపెన్ హెడ్ చానళ్లు ఉన్నాయి.

మహేంద్రతనయ
మహేంద్రతనయ నది ఒడిశాలోని తుంబ అటవీ ప్రాంతంలో పుట్టి రెండుపాయలుగా విడిపోయి ఆంధ్రాలో ప్రవేశిస్తోంది. ఒక పాయ మెళియాపుట్టి, పాతపట్నం మండలాల్లో ప్రవహిస్తుండగా మరొక పాయ మందస, సోంపేట మండలాల్లో ప్రవహిస్తోంది. మహేంద్రతనయపై వివిధ ప్రాంతాల్లో నిర్మించిన ప్రాజెక్టులు, ఎత్తిపోతల పథకాలు, గ్రోయిన్‌ల ద్వారా 40 వేల ఎకరాల వరకు పంట పొలాలు సాగవుతున్నాయి. మందస మండలం పెద్దకోష్ట వద్ద ఆంధ్రాలో ప్రవేశించే మహేంద్రతనయ నది 45 కిలోమీటర్ల మేర ప్రయాణం చేసి సోంపేట మండలం బారువ కొత్తూరు వద్ద బంగాళాఖాతంలో కలుస్తోంది. నదిపై పైడిగాం మధ్య తరహా నీటి పారుదల ప్రాజెక్టుతోపాటు పొత్తంగి, ఏటిబట్టి, బారువ, మూలపొలం గ్రోయిన్‌లు, పొత్రఖండ ఎత్తిపోతల పథకాల ద్వారా మందస, కంచిలి, సోంపేట మండలాల పరిధిలో 25 వేల ఎకరాల పంట పొలాలు సాగవుతున్నాయి. ఇచ్ఛాపురం, పలాస, టెక్కలి నియోజకవర్గాల పరిధిలో 300కు పైగా గ్రామాల పరిధిలో 4 లక్షల మందికి తాగునీరందుతోంది. నదిపై ఉద్దానం ప్రాజెక్టుతోపాటు 10 రక్షిత మంచినీటి పథకాలు, ఒక సమగ్ర గ్రామీణ మంచినీటి పథకం పనిచేస్తున్నాయి.

సువర్ణముఖి
ఒరిస్సాలో జన్మించిన ఈ నది వంగర మండలం కొండ శేఖరపల్లి వద్ద జిల్లాలోకి ప్రవేశిస్తోంది. జిల్లాలో మొత్తం 17 కిలోమీటర్ల మేర ప్రవహించి వంగర మండలం సంగం వద్ద నాగావళి నదిలో కలుస్తోంది. సువర్ణముఖి నదిపై మడ్డువలస ప్రాజెక్టు ఉంది. దీనికి రెండు కాలువలు ఉన్నాయి. వీటి ద్వారా 24,700 ఎకరాల ఆయకట్టుకు సాగునీరందుతోంది.కుడి కాల్వ రాజాం, వంగర, రేగిడి, సంతకవిటి, జి.సిగడాం మండలాల పరిధిలో మొత్తం 50 కిలోమీటర్ల పొడవున ఉంది.ఎడమ కాల్వ వంగర మండలం పరిధిలో 5 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది.

వేగవతి
వేగవతి నది విజయనగరం జిల్లా పాచిపెంట కొండల వద్ద ప్రారంభమై పశ్చిమ నుంచి తూర్పుగా ప్రవహించి సువర్ణముఖి, గోముఖి నదుల్లో విజయనగరం జిల్లా శిర్లాం వద్ద కలుస్తోంది. అక్కడి నుంచి సువర్ణముఖి నది ప్రవాహం వంగర మండలం మడ్డువలస జలాశయంలోకి చేరుతోంది. ఇక్కడ సామర్ధ్యానికి మించి నీరు నిండితే ప్రాజెక్టుకు ఏర్పాటు చేసిన 11 గేట్ల ద్వారా నాగావళి నదిలోకి నీటిని విడిచి పెడతారు. నాగావళి నది ద్వారా అదనపు జలాలు సముద్రంలో కలసిపోతున్నాయి.

ప్రాజెక్టులు
వంశధార
జిల్లాలో అత్యధిక శాతం సాగు అవసరాలను తీరుస్తున్నది వంశధార ప్రాజెక్టు. వంశధార నదిపై గొట్టా బ్యారేజీ ఉంది. ఈ బ్యారేజీకి కుడి, ఎడమన రెండు కాల్వలున్నాయి. కుడి కాల్వ మొత్తం పొడవు 56 కిలోమీటర్లు. హిరమండలం, ఎల్.ఎన్.పేట, సరుబుజ్జిలి, బూర్జ, ఆమదాలవలస, గార, శ్రీకాకుళం, మండలాల్లోని 62 వేల ఎకరాలకు ఈ కాల్వ ద్వారా సాగునీరందుతోంది. ఎడమ కాల్వ పొడవు 107 కిలోమీటర్లు. ఈ కాల్వ ద్వారా జిల్లాలోని నరసన్నపేట, టెక్కలి, జలుమూరు, పలాస తదితర 13 మండలాలకు సంబంధించి 1,48,000 ఎకరాల ఆయకట్టు ఉంది. గొట్టాబ్యారేజీ నీటి లెవల్ సాధారణ సామర్థ్యం 34 అడుగులు. గరిష్ఠ సామర్థ్యం 38 అడుగులు.
వంశధార నది పొడవు: 265 కిలోమీటర్లు
జిల్లాలో ప్రవహించే నది పొడవు: 85 కిలోమీటర్లు
వంశధార కాల్వ నిర్మాణం: 1971
ఎడమ కాల్వ ఆయకట్టు: 1,48,230 ఎకరాలు
కుడి కాలువ ఆయకట్టు: 62,280 ఎకరాలు
ఎడమ కాల్వ పొడవు: 104.826 కిలోమీటర్లు
కుడికాల్వ పొడవు: 55 కిలోమీటర్లు
వంశధారపై నీటిసంఘాలు: 54
డిస్ట్రిబ్యూటరీ కమిటీలు: ఎడమ కాల్వ 7, కుడికాల్వపై 1
వంశధార ప్రాజెక్టు కమిటీ ఛైర్మన్ : రాడ మోహనరావు
వంశధార ఎస్.ఇ.: రాంబాబు
డివిజన్లు: మెంటినెన్స్ డివిజన్ నరసన్నపేట, టెక్కలి
ఎడమ కాల్వ దిగువన చెరువులు: 1036
కుడికాల్వ దిగువన చెరువులు: 1518
ఎడమ కాల్వపైపై నిర్మాణాలు: 87
కుడి కాల్వపై నిర్మాణాలు: 53

హిరమండలం గొట్టబ్యారెజ్
జలయజ్ఞంలో భాగంగా వంశధార స్టేజ్, ఫేజ్-2 ప్రాజెక్టు నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 2.55 లక్షల ఎకరాలకు సాగునీరు స్థిరీకరణ కోసం రూ. 933 కోట్ల అంచనా వ్యయంతో 19 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో 2005 ఏప్రిల్ నెలలో ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అప్పటి ఒప్పందం ప్రకారం 2008 మార్చి నాటికి పనులు పూర్తి కావాల్సి ఉంది. ఆ గడువులోగా పనులు పూర్తి కాలేదు. 2009 ఏప్రిల్‌కు మరో గడువు పొడిగించారు. అయినా అప్పటికీ పూర్తి కాలేదు. 2012 మార్చి నాటికి గడువు పొడిగించారు. ఇప్పటివరకు 60 శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయి. నిధుల కొరత, ఒడిశా ప్రభుత్వం అభ్యంతరాలు, సుప్రీంకోర్టు స్టే విధించడం తదితర కారణాల వల్ల 87, 88 ప్యాకేజీల అమలు, కొత్తూరు, భామిని మండలాల్లోని సింగిడి, పారాపురం బ్యాలెన్సింగ్ మినీ రిజర్వాయర్ల నిర్మాణం, కాట్రగడ వద్ద వంశధారలో అడ్డుగోడ నిర్మించి నీటిని అంధ్రావైపు మళ్లించే పనులు, వరద కాలువ పనులు నిలిచిపోయాయి. ట్రైబ్యునల్‌లో వివాదం పరిష్కారం కానిదే ఈ ప్రాజెక్టు ఇప్పట్లో పూర్తయ్యే అవకాశం కనిపించడం లేదు. ప్రభుత్వం తాజాగా 2015 నాటికి ప్రాజెక్టును పూర్తి చేసేందుకు గడువు విధించింది. ఆ గడువు లోగా పనులు పూర్తయ్యే అవకాశం కనిపించడం లేదు.

తోటపల్లి ప్రాజెక్టు
శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల రైతాంగ ఆశాజ్యోతి 'తోటపల్లి' ప్రాజెక్టు నిర్మాణ దశలో ఉంది. ఇది పూర్తయితే ఇప్పటికే పాత బ్యారేజీ కింద ఉన్న 60 వేల ఎకరాల భూములు స్థిరీకరణతో పాటు రెండు జిల్లాల పరిధిలోని 1.20 లక్షల ఎకరాల భూములకు సాగు నీరు అందుతుంది. 1978 డిసెంబరు 15వ తేదీన ఒరిస్సాలోని భువనేశ్వర్‌లో ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా ముఖ్యమంత్రుల మధ్య కుదిరిన అంతర్రాష్ట్ర ఒప్పందం ప్రకారం ప్రాజెక్టు నిర్మాణానికి బీజం పడింది. సుమారు 16 టీఎంసీల నాగావళి నదీజలాలను ఆంధ్రప్రదేశ్‌లో వినియోగించుకునేందుకు ప్రతిపాదన అంగీకారమైంది. ప్రస్తుతం నిర్మాణం జరుగుతున్న ప్రాజెక్టుకు సమీపంలో 1807లో బ్రిటిష్ పాలకులు నిర్మించిన బ్యారేజీ జీవితకాలం ముగియడంతో ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రభుత్వం గుర్తించింది. ఇందులో భాగంగా ప్రారంభమైన ప్రక్రియలో భాగంగా అన్ని అనుమతులు పొందిన తరువాత చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2003, నవంబరు 8న విజయనగరం జిల్లా గరుగుబిల్లి మండలం తోటపల్లి గ్రామం వద్ద ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 2004లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం జలయజ్ఞంలో భాగంగా ఫాస్ట్‌ట్రాక్ కింద ఈ ప్రాజెక్టు పనులకు శ్రీకారం చుట్టారు. ఇంజినీరింగ్ ప్రొక్యూర్‌మెంట్‌కన్‌స్ట్రక్షన్ డివిజన్ (ఇ.పి.సి.) 1, 2 విభాగాలుగా విభజించి నిర్మాణం పనులు ప్రారంభించారు.

ఆఫ్‌షోర్ జలాశయం
పలాస నియోజకవర్గం పరిధిలోని పలాస, వజ్రపుకొత్తూరు మండలాలకు సాగునీరు అందించేందుకు 2008 ఏప్రిల్‌లో అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి పలాస మండలం రేగులపాడు వద్ద ఆఫ్‌షోర్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. మెళియాపుట్టి మండలం చాపర నుంచి మహేంద్రతనయ నది గుండా వెళ్లే వరద నీటిని మళ్లించి జాడుపల్లి, చీపురుపల్లి గుండా రేగులపాడు వద్ద ఏర్పాటు చేసిన రిజర్వాయర్‌లో నిల్వ చేయాల్సి ఉంది. పలాస, వజ్రపుకొత్తూరుతో పాటు మెళియాపుట్టి, నందిగాం, టెక్కలి మండలాల పరిధిలోని సుమారు 24,600 ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉంది. అంచనా వ్యయం రూ. 127 కోట్లకుగాను రూ. 123 కోట్లకు టెండరు ఖరారైంది. పనులకు శంకుస్థాపన చేసి మూడేళ్లు గడచినా ఇంత వరకు 15 శాతానికి మించి పనులు పూర్తికాలేదు. రేగులపాడు వద్ద ట్రెంచి పనులు మాత్రమే జరుగుతున్నాయి. మరో వైపు భూ సేకరణ నత్తనడకన చేపడుతున్నారు. సుమారు రూ. 15 కోట్ల విలువైన పనులు జరిగాయి. ఆఫ్‌షోర్ రిజర్వాయర్ నుంచి పలాస - కాశీబుగ్గ పురపాలక సంఘానికి శాశ్వత తాగునీటి పథకం ఏర్పాటుకు యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది. వాస్తవానికి 2010 మార్చి నాటికి ఆఫ్‌షోర్ ప్రొజెక్టు పనులు పూర్తి చేయాల్సి ఉంది. పనులు జరగనందున మరో రెండేళ్ల కాల వ్యవధిలో పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం గడువు ఇచ్చింది. దీనిని 2012లో మార్చి నాటికి పూర్తి చేయాల్సి ఉన్నా ఆ దిశగా పనులు జరగడం లేదు. దీంతో ఆఫ్‌షోర్ సాగునీటి సరఫరా ఈ ప్రాంత ప్రజానీకానికి కలగా మిగిలిపోయే పరిస్థితి ఏర్పడింది.
జలయజ్ఞం ప్రాజెక్టులో భాగంగా మహేంద్రతనయ నదిపై ఆఫ్‌షోర్ జలాశయం పనులు చేపట్టేందుకు అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి 2008 ఏప్రిల్ 4న పలాస మండలం రేగులపాడు వద్ద శంకుస్థాపన చేశారు. రూ. 127 కోట్ల అంచనాలతో మెళియాపుట్టి, టెక్కలి, పలాస, నందిగాం మండలాల్లోని 24600 ఎకరాలకు సాగునీరు అందించాలన్న ఉద్దేశ్యంతో ఈ ప్రాజెక్టును చేపట్టారు. భూసేకరణ ముందుకు సాగకపోవడం, నిధుల కొరత వెరసి పనులు నత్తనడకన సాగుతున్నాయి. మెళియాపుట్టి మండలం చాపరలో మహేంద్రతనయ నుంచి పలాస మండలం రేగులపాడు వరకు 13.54 కిలోమీటర్ల పొడవునా వరద కాలువ ద్వారా జలాశయానికి నీరు తరలించాల్సి ఉంది. ఇందుకు 2600 ఎకరాల భూసేకరణ అవసరం. ప్రభుత్వం ఇప్పటివరకు 600 ఎకరాలు మాత్రమే సేకరించగలిగింది.

మడ్డువలస ప్రాజెక్టు
* శ్రీకాకుళం జిల్లా వంగర మండలం మడ్డువలస వద్ద సువర్ణముఖి నదిపై రూ. 132 కోట్ల అంచనా వ్యయంతో మడ్డువలస ప్రాజెక్టును నిర్మించారు. సువర్ణముఖి, వేగవతి నదుల ప్రవాహం ఇందులో చేరేలా రూపకల్పన చేశారు. 2002 నవంబరు 30వ తేదీన అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు దీన్ని జాతికి అంకింత చేశారు
* ప్రస్తుతం ఇది మధ్యతరహా ప్రాజెక్టుగా ఉంది. రెండో దశ విస్తరణ పూర్తయితే జలాశయం స్థాయి పెరుగుతుంది.
* జలాశయం పూర్తి స్థాయి నీటి సామర్ధ్యం 65 మీటర్లు. రిజర్వాయరులో నీటి సామర్థ్యం పెరిగితే కింద నున్న నాగావళి నదిలోకి నీటిని విడిచిపెట్టేందుకు రిజర్వాయరుకు మొత్తం 11 గేట్లు అమర్చారు.
* రిజర్వాయరు ద్వారా వంగర, రేగిడి ఆమదాలవలస, సంతకవిటి, సి.సిగడాం, పొందూరు మండలాల్లోని 104 గ్రామాల పరిధిలో 24,700 ఎకరాల ఆయకట్టుకు సాగునీరందిస్తున్నారు. 50 కిలోమీటర్ల పొడవున్న కుడికాలువ ద్వారా 23,750 ఎకరాలు, 1.6 కిలోమీటర్ల పొడవున్న ఎడమ కాల్వ ద్వారా 950 ఎకకాల ఆయకట్టుకు అధికారికంగా సాగునీరందుతోంది.
* మడ్డువలస రెండో దశ విస్తరణ పనులకు ప్రభుత్వం రూ. 47 కోట్లతో టెండర్లు ఖరారు చేసింది. ఈ పనులు పూర్తయితే జి.సిగడాం, లావేరు, పొందూరు మండలాల పరిధిలోని 12,453 ఎకరాల ఆయకట్టుకు అదనంగా సాగునీరు అందుతుంది
* ప్రాజెక్టులోకి సరాసరి నీటిమట్టం 16 టి.ఎం.సి.లు. ప్రాజెక్టులో నీటి నిల్వ సామర్థ్యం 3.2 టి.ఎం.సి.లు.

నీటిపారుదల

* జిల్లాలో ఈశాన్య రుతు పవనాలు ద్వారా 26.47 శాతం, నైరుతీ రుతుపవనాలు ద్వారా 62.61 శాతం వర్షాలు లభిస్తాయి.
* జిల్లాలో ఈశాన్య రుతుపవనాలు ద్వారా 26.47శాతం, నైరుతీ రుతుపవనాలు ద్వారా 62.61 శాతం వర్షాలు లభిస్తాయి.
* చిన్ననీటిపారుదలశాఖ ఆధ్వర్యంలో 905 సాగునీటి చెరువులు ఉన్నాయి. వీటిద్వారా 39,024 హెక్టార్లుకు సాగునీరు అందుతోంది.
* జిల్లాలో 113 వరకు సాగునీటి కాల్వలు ఉన్నాయి. వీటిద్వారా 61,825 హెక్టార్లుకు సాగునీరు అందుతోంది.
* జిల్లావ్యాప్తంగా 1,05,693 పిల్లకాల్వలు ఉన్నాయి. వీటిద్వారా ఖరీఫ్‌లో 42,845 హెక్టార్లుకు, రబీలో 1,568 హెక్టార్లుకు సాగునీరు అందుతోంది.
* బోర్లు 3,350, సాధారణ బావులు 4467 వరకు ఉన్నాయి. వీటిద్వారా ఖరీఫ్‌లో 28,366 రబీలో 565 హెక్టార్లుకు సాగునీరు అందుతోంది.
* జిల్లాలో 31 ఎత్తిపోతల పథకాలు ఉన్నాయి. వీటిద్వారా 5137 హెక్టార్లుకు సాగునీటి వసతి కల్పించారు.
* జిల్లాలో మొత్తం ఆయకట్టు - 3,34,675 హెక్టార్లు
* వంశధార ఎడమకాల్వ కింద ఆయకట్టు: 59,986 హెక్టార్లు
* వంశధార కుడికాల్వ ఆయకట్టు: 31,552 హెక్టార్లు
* అక్కులపేట ఎత్తిపోతల ఆయకట్టు: 1744 హెక్టార్లు
* వంశధార హైలెవల్‌కెనాల్ ఆయకట్టు: 10,117 హెక్టార్లు
* తోటపల్లి బ్యారేజ్ ప్రాజెక్టు ఆయకట్టు: 23,449 హెక్టార్లు

ప్రధాన పంటలు

జిల్లాలో సాగు విస్తీర్ణం: 5,84,290 హెక్టార్లు
వరి, చెరకు, జొన్న, గంటి, మొక్కజొన్న, రాగి, పెసర, మినుము, నువ్వులు, పత్తి, గోగు, ఉలవలు, వేరుశెనగ, మిరప, ఉల్లి, పొద్దుతిరుగుడు, పొగాకు.

సాగు విస్తీర్ణం ఇలా..
వరి - 2,33,008 హెక్టార్లు
చెరకు - 8,854 హెక్టార్లు
జొన్న - 268 హెక్టార్లు
గంటి - 3251 హెక్టార్లు,
మొక్కజొన్న - 1767 హెక్టార్లు
రాగి - 1411 హెక్టార్లు
కందులు - 1409 హెక్టార్లు
పెసర - 30830 హెక్టార్లు
మినుము - 41743 హెక్టార్లు
వేరుశెనగ - 24335 హెక్టార్లు
నువ్వు - 4997 హెక్టార్లు
పొద్దుతిరుగుడు - 2668 హెక్టార్లు
ఉల్లి - 1332 హెక్టార్లు
గోగు - 10795 హెక్టార్లు
పత్తి - 1848 హెక్టార్లు

ఉద్దాన ప్రాంత జీవనాడి జీడి..
శ్రీకాకుళం జిల్లాలో ప్రధాన పంటల్లో జీడి ఒకటి.. ఉద్దాన ప్రాంత జీవనాడిగా ప్రసిద్ధి. జిల్లా వ్యాప్తంగా సుమారు 35 వేల హెక్టార్లలో సాగు ఉంది. ప్రధానంగా వజ్రపుకొత్తూరు, పలాస, మందస, సోంపేట, కంచిలి, ఇచ్ఛాపురం, కవిటి, సంతబొమ్మాళి, మెళియాపుట్టి, కొత్తూరు, బామిని మండలాల్లో పంట సాగవుతోంది. ఐదేళ్ల కాలంలో ఏటా 30 శాతం మించి దిగుబడి రావడం లేదు. ప్రధానంగా దశాబ్దాల కాలంగా ఉన్న చెట్ల నుంచి దిగుబడి పూర్తిగా తగ్గిపోయింది. కొత్త పంట ఏర్పాటుకు ప్రభుత్వపరంగా సరయిన ప్రోత్సాహం లేనందున రైతాంగం ప్రతీ ఏటా వస్తున్న నామ మాత్రపు పంటతోనే కాలం గడపాల్సి వస్తోంది. ఈ ఏడాది పంట ప్రారంభ దశలో వాతావరణం అనుకూలించకపోవడంతో చేతికందిన పంట నేలమట్టమైంది. ఉద్దానం తీర ప్రాంతంలో జీడి పంట సాగు ఎక్కువగా ఉంది. ఇక్కడ సుమారు 25 వేల హెక్టార్లలో సాగవుతోంది.

జిల్లాలో ఎగుమతులు
ధాన్యం
జిల్లా నుంచి ధాన్యం ఎక్కువగా ఎగుమతి అవుతోంది. సన్నరకం ధాన్యం పంటకు మంచి గుర్తింపు ఉంది. ఏటా జిల్లాలో 12 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుండగా, అందులో జిల్లాలో 4 లక్షల టన్నుల వరకు వినియోగమవుతోంది. మిగిలిన ధాన్యం ఇతర ప్రాంతాలకు ఎగుమతి అవుతోంది.

జీడిపప్పు
జిల్లాలో పలాస కేంద్రంగా జీడి ఉత్పత్తులు ఇతర ప్రాంతాలకు ఎగుమతి అవుతున్నాయి. ముఖ్యంగా ఇక్కడి జీడిపప్పుకు మంచి గుర్తింపు ఉంది. రోజుకు రూ. కోటి చొప్పున ఎగుమతులు అవుతున్నాయి. జీడి తొక్క కూడా వంట చెరకుగా వినియోగిస్తున్నారు.