• facebook
  • whatsapp
  • telegram

వ్య‌క్తిత్వాన్ని స‌రిగా వ్య‌క్తీక‌రిస్తే విజ‌యం

గ్రూప్‌-1 ఇంట‌ర్వ్యూల‌కు హాజ‌ర‌వుతున్న అభ్య‌ర్థుల‌కు నిపుణుల సూచ‌న‌లు

 

 

రాతపరీక్షలో ఆకాశమే హద్దుగా ప్రతిభ చూపినవారు కూడా మౌఖిక పరీక్ష అనగానే ఎంతో కొంత తడబడటం సహజం. తగిన మెలకువలు గ్రహించి ఆత్మవిశ్వాసంతో వాటిని ఆచరిస్తే.. ఈ తుది ఘట్టంలోనూ తిరుగులేని ముద్ర వేయొచ్చు. ఉద్యోగ సాధన కలను సాకారం చేసుకోవచ్చు!  గ్రూప్‌-1కే కాకుండా ఇతర నియామక పరీక్షలకూ ఇంటర్వ్యూ మెలకువలు ఆవశ్యకమే!  

 

హోదా రీత్యా, ప్రజా సేవల ప్రాధాన్యం దృష్ట్యా గ్రూప్‌-1 ఉద్యోగాలు అఖిల భారత సర్వీసు ఉద్యోగాల తర్వాత అత్యంత ప్రాముఖ్యమైనవి. ఆర్డీఓ, డీఎస్‌పీ, సీటీఓ, మునిసిపల్‌ కమిషనర్‌ లాంటి ఉద్యోగాలకు ఐఏఎస్‌/ ఐపీఎస్‌ హోదా పొందే అవకాశాలూ ఉంటాయి. వివిధ హెచ్‌ఓడీ కార్యాలయాలకు గ్రూప్‌-1 ఉద్యోగులు అధిపతులుగా మారే అవకాశం కూడా ఉంది. కీలక ప్రభుత్వ నిర్ణయాల్లో భాగస్వామ్యంతో పాటు నిర్ణయాల అమలు విషయంలో వీరు ప్రధాన పాత్రను పోషిస్తారు. ఇలాంటి పోస్టులకు   అర్హులను ఎంపిక చేసేటప్పుడు అభ్యర్థి జ్ఞాన స్థాయితో పాటు మూర్తిమత్వ లక్షణాలకు అధిక ప్రాధాన్యం ఇస్తారు. పైగా ప్రిలిమ్స్‌ మెయిన్స్‌ దశలలో పరిజ్ఞాన పరీక్ష ముగిసినందువలన గ్రూప్‌-1 ఇంటర్వ్యూలు ప్రధానంగా అభ్యర్థి మూర్తిమత్వ లక్షణాల్ని పరిశీలిస్తాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని రాబోయే ఇంటర్వ్యూలకు సిద్ధమైతే మంచి ఫలితాలను సాధించవచ్చు.

 

ఇంటర్వ్యూలో..

1. మూర్తిమత్వ లక్షణాలకే మొగ్గు: ప్రజా పరిపాలన లోకి ప్రవేశించే వ్యక్తి సానుకూల ధోరణులతో ఉండాలి. నాయకత్వం, ప్రసార నిపుణత, ప్రేరణ శక్తి, సమన్వయం, నిర్ణయ సామర్థ్యం, సమయపాలన, నైతిక విలువలు మొదలైనవి అభ్యర్థుల్లో ఏ విధంగా, ఏ స్థాయిలో ఉన్నాయో పరిశీలించటానికి ఇంటర్వ్యూ బోర్డు  ప్రాధాన్యం ఇస్తుంది. అందువల్ల అభ్యర్థులు ఆయా విషయాల్లో లోపాలు ఏమైనా ఉంటే సవరించుకోవాలి. సందర్భోచితంగా ఆయా విషయాల్ని బోర్డు ముందు ప్రదర్శించాలి. సరైన జాగ్రత్తలు తీసుకుంటే ప్రతికూల మూర్తిమత్వ లక్షణాల్ని కూడా తటస్థ పరిచి బోర్డు ముందు అభిప్రాయాల్ని వ్యక్తం చేయవచ్చు. దానితో ఇంటర్వ్యూలో మంచి మార్కులతో ఉద్యోగం సాధించవచ్చు.

 

2. సామాజిక అంశాల పట్ల బాధ్యత: కాబోయే గ్రూపు-1 ఉద్యోగులు తమకు సంక్రమించిన అధికారాన్ని సమాజ పురోగతికి వినియోగించాలి. ఆ దిశగా పక్షపాతం, బంధు ప్రీతి, వర్గ తత్వం, ప్రాంతీయ తత్వం లాంటి అవలక్షణాలు లేకుండా నిష్పక్షపాతంగా విధులు నిర్వహించగలరా అని బోర్డు పరిశీలిస్తుంది. ఇలాంటి విషయాల్లో ఏదైనా ఫలితాలు సాధించేందుకు భారతదేశ సామాజిక వ్యవస్థ, సామాజిక సంస్థలు- వాటి పరిణామం, సంబంధిత తాజా ధోరణులు, పరిపాలన సంబంధిత విషయాలు తప్పనిసరిగా అవగాహన కలిగివుండాలి. పరిపక్వతతో సమాధానాలు చెప్పగలగాలి. ఆయా విషయాల పట్ల సహానుభూతితో స్పందించాలి. అప్పుడే బోర్డు అభ్యర్థి మీద మంచి అభిప్రాయాన్ని ఏర్పరచుకుంటుంది. అందువల్ల అభ్యర్థులు సరైన విధానంలో ఈ అంశాల మీద పట్టు సాధించాల్సి ఉంటుంది.

 

3. పాలన విషయాల్లో సానుకూల ధోరణి: ఉద్యోగులుగా ప్రవేశించబోయేవారికి ప్రభుత్వ పాలనలో జరుగుతున్న పరిణామాలపై సానుకూల ఆలోచనలు, తాత్వికతా అవసరం. ప్రస్తుత ప్రభుత్వ విధానాల్లో, కార్యక్రమాల్లో లోపాలు ఉంటాయి. అయితే వాటిని ఏ విధంగా బోర్డు ముందు ప్రదర్శించాలనేదే ప్రధానమైన మెలకువ.
కొవిడ్‌ రెండో వేవ్‌లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలు కనిపిస్తున్నాయి. ప్రజా వైఫల్యమూ ఉంది. అయితే అభ్యర్థులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను మాత్రమే విమర్శించే ధోరణి పనికిరాదు. బోర్డు వ్యూహాత్మకంగానే ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రస్తావించవచ్చు. అయితే అటువంటి సందర్భాల్లో ఎంత తెలివిగా మాట్లాడుతున్నారనేది బోర్డు పరిశీలిస్తుంది.ఆర్థిక సంస్కరణలు, నీతి అయోగ్, దేశంలో బలపడుతున్న సామాజిక మాధ్యమాలు, పౌర సమాజం, బలమైన ప్రభుత్వరంగ సంస్థల విక్రయం, వన్‌ నేషన్‌ భావన, బలహీనపడుతున్న ఉద్యోగ స్వామ్య వ్యవస్థ లక్షణాలు, గత రెండు సంవత్సరాల్లో తీసుకొచ్చిన కీలక చట్టాలు, రాజ్యాంగ సవరణలు, విపత్తు నిర్వహణ, హరించుకుపోతున్న రాష్ట్రాల హక్కులు... ఇలా అనేక పాలనా అంశాలు, తాజా పరిణామాలు, ఆశిస్తున్న ఫలితాలు, చేయదగిన సిఫార్సులు అనే కోణాలతో అధ్యయనం చేస్తే ఇంటర్వ్యూని సులభంగా ఎదుర్కోవచ్చు.

 

4. భావవ్యక్తీకరణ- బాడీ లాంగ్వేజ్‌: బోర్డు సభ్యుల నుంచి మార్కులు పొందటంలో సరైన భావవ్యక్తీకరణ, బాడీ లాంగ్వేజ్‌ అనేవి చాలా ప్రధానమైనవి. అభ్యర్థులు టన్నుల పుస్తకాల పరిజ్ఞానంతో ప్రిలిమ్స్, మెయిన్స్‌లో అద్భుతమైన మార్కులు సాధించి ఉండవచ్చు. అయితే ఆ పరిజ్ఞానాన్ని బోర్డుకి తేలిగ్గా, స్పష్టంగా ప్రసారం చేయగలిగినప్పుడే బోర్డు ఆ స్థాయిని అంచనా వేస్తుంది. అందుకే సమాధానాలు చెప్పేటప్పుడు భాషలో సరళత, స్పష్టత, సహజత్వం ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. భాషకు తగిన హావభావాలను ప్రదర్శించాలి. ప్రసన్నమైన ముఖం బోర్డు సభ్యుల్లో సానుకూలతను తెస్తుంది. బోర్డు రూమ్‌ లోకి ప్రవేశించేటప్పుడూ, వారి ముందు కూర్చున్న 15- 20 నిమిషాల సమయంలో శరీర కదలికలు బోర్డుకు ఒక అభిప్రాయం ఏర్పరుస్తాయి. అందువల్ల అనుభవజ్ఞులతో సంప్రదింపులు చేసి బాడీ లాంగ్వేజ్‌లో ఉండే సమస్యలు పరిష్కరించకుంటే సత్ఫలితాలు పొందవచ్చు.

 

5. విషయ పరిజ్ఞానం పరిధి: ఇంటర్వ్యూ అనేది మూర్తిమత్వ లక్షణాల పరీక్ష అయినా వాటిని పసిగట్టేందుకు బోర్డు వివిధ సందర్భాల్లో కొన్ని విషయ సంబంధిత ప్రశ్నలు అడగటం ఆనవాయితీ. ముఖ్యంగా అభ్యర్థి గ్రాడ్యుయేషన్‌ సబ్జెక్టుల్లో ప్రాథమికాంశాలూ,  తాజా పరిణామాలూ, ప్రస్తుత గ్రూప్‌-1 సిలబస్‌ అంశాల పరిజ్ఞానం పరిశీలనలోకి తీసుకోవచ్చు. ఇంటర్వ్యూ సన్నద్ధతకు సమయం దొరికినందువల్ల అభ్యర్థులు రోజూ 2, 3 గంటల సమయం ఈ విభాగానికి కేటాయిస్తే ప్రిపరేషన్‌ సంపూర్ణత్వానికి దారితీస్తుంది.

 

6. వర్తమాన అంశాల వారధి: బోర్డు సభ్యులందరికీ అభ్యర్థిని అవగాహన చేసుకునేందుకు అవకాశమిచ్చే ఉమ్మడి వేదిక -వర్తమానాంశాలు. ఇటీవల జరిగిన పాలిటెక్నిక్‌ లెక్చరర్ల ఇంటర్వ్యూలో కూడా కొంతమంది అభ్యర్థులను అంతర్జాతీయ విషయాలపై ప్రశ్నలు అడిగారు. సాంకేతిక లెక్చరర్‌ పోస్టులకు అంతర్జాతీయ రాజకీయ వ్యవహారాలతో పెద్ద సంబంధం లేదు. అయినా ఎందుకు అడిగినట్లు? విషయ సంబంధిత సభ్యులు బోర్డులో లేనప్పుడు ఇలా అనేక విషయాలపై ప్రశ్నలు అడుగుతారు. అందులోనూ గ్రూప్‌-1 అభ్యర్థులకు అంతర్జాతీయ, జాతీయ, ప్రాంతీయ, వర్తమాన అంశాలు సిలబస్‌లో కూడా ఉన్నాయి. పైగా అభ్యర్థుల అవగాహన స్థాయిని పరిశీలించడానికి ఈ తరహా ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. అందుకని వర్తమాన అంశాలను పూర్వ రంగంతో సహా మరలా ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే ఇంటర్వ్యూకి ఉపకరించవచ్చు. దినపత్రికల అధ్యయనం ద్వారా బోర్డు సభ్యులు అడిగే అంశాలకు దగ్గరగా వెళ్ళవచ్చు. వివాదాస్పద అంశాలు- రాజ్యాంగ పరమైనవి, ఆర్థికపరమైనవి, శాస్త్ర సాంకేతికపరమైనవి, సామాజిక పరమైనవి అని విభజించుకుని అధ్యయనం చేస్తే పట్టు సాధించవచ్చు.

 

7. మీ గురించి మీకు తెలుసా: అటుఇటుగా 30 సంవత్సరాల వయసుండే అభ్యర్థులకు వారి జీవితంపై అవగాహన ఏమిటి? ఇది గ్రహించేందుకు బోర్డు బయోడేటా సంబంధిత అంశాలపై ప్రశ్నలు అడుగుతుంది. కుటుంబం, చదువులు, అలవాట్లు, ఆశయాలు, బలాలు, బలహీనతలు, విజయాలు, వైఫల్యాలు మొదలైనవన్నీ వ్యక్తిగత కోణంలో అభ్యర్థులు అర్థం చేసుకుంటే బోర్డుకు చెప్పగలుగుతారు. బయోడేటా సంబంధిత విషయాల్ని క్రమబద్ధంగా వ్యక్తపరచాలి. ఈ విషయాల వ్యక్తీకరణంలో ఏదైనా లోపం ఉంటే మాత్రం ఇంటర్వ్యూలో తక్కువ మార్కులు పడే అవకాశం ఉంది. మొత్తమ్మీద బయోడేటాను శాస్త్రీయంగా విశ్లేషించుకుని ఎటువంటి ప్రశ్నలు వస్తాయో అంచనా వేసుకుని సిద్ధమైతే మంచి ఫలితాలు ఉంటాయి!  

 

Posted Date : 03-05-2021
 

పాత ప్రశ్నప‌త్రాలు

నమూనా ప్రశ్నపత్రాలు