• facebook
  • whatsapp
  • telegram

పని కల్పించని డిగ్రీలెందుకు?

* ఉద్యోగం పొందే సామర్థ్యం చదువులోనే ఉండాలి
సాధారణ డిగ్రీ కోర్సుల్లోనూ వృత్తి విద్య తప్పనిసరి
నైపుణ్య విద్య దిశగా కేంద్రం యోచన

దిల్లీ: మన కళాశాలలు డిగ్రీల ఫ్యాక్టరీలుగా మారాయి. ఏటా వేలమంది విద్యార్థులను విద్యావంతులుగా తీర్చిదిద్ది బయటికి పంపిస్తున్నాయి. కళాశాలలో కష్టపడి చదివి పట్టా చేతపట్టుకుని ‘విద్యార్థి' హోదా నుంచి.. సమాజంలోకి అడుగుపెడితే ‘నిరుద్యోగి' కిరీటం ఎదురు చూస్తోంది. డిగ్రీ హోదా పట్టాకే పరిమితమవుతోంది.. చేతుల్లో మాత్రం చిన్నపాటి ఉద్యోగానికి అవసరమైన నైపుణ్యమూ ఉండటం లేదు. ఇలాంటి పరిస్థితుల్ని మార్చాలని కేంద్ర సర్కారు భావిస్తోంది.
ప్రస్తుతం డిగ్రీ కోర్సుల్లో ఉద్యోగిత నైపుణ్యాలు కొరవడటంతో నిరుద్యోగుల సంఖ్య భారీగా పేరుకుపోతున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. నైపుణ్యాలు, డిగ్రీ పట్టాదారుల మధ్య భారీ అంతరం ఉన్నట్లు ‘విద్యా నాణ్యత ఉన్నతీకరణ, సమ్మిళిత కార్యక్రమం (ఎక్విప్‌)'లో భాగంగా రూపొందించిన నివేదిక స్పష్టం చేస్తోంది. దేశంలో ఉన్నత విద్యలో నాణ్యతను, కోర్సుల అందుబాటును మెరుగుపరచాలనే లక్ష్యంతో ‘ఎక్విప్‌' కార్యక్రమాన్ని రూపొందించారు. ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు, విశ్లేషించేందుకు కేంద్ర ప్రభుత్వ హెచ్‌ఆర్‌డీ శాఖ పలువురు నిపుణుల్ని బృందాలుగా రంగంలోకి దించింది. కోర్సుల అందుబాటు, పాలనపరమైన సంస్కరణలు, బోధన, పరిశోధన, ఆర్థిక వెసులుబాటు తదితర కీలక అంశాలపై దృష్టిసారించిన ఈ బృందాలు పలు అంశాల్ని సూచించాయి. ఐదేళ్ల దార్శనిక ప్రణాళికతో రూపొందించిన ఎక్విప్‌ ప్రతిపాదనలు ప్రస్తుతం వివిధ శాఖల పరిశీలనలో ఉన్నాయి. ఆ తర్వాత కేంద్రమంత్రివర్గ ఆమోదానికి పంపనున్నారు. ఉన్నత విద్యలో పెద్ద ఎత్తున వృత్తి నైపుణ్య శిక్షణ అంశాల్ని చేర్చాల్సిన అవసరం ఉందని, బీఏ, బీఎస్సీ, బీకాం వంటి సాంకేతికేతర కోర్సుల్లో 20-35 శాతం ఒకేషనల్‌ అంశాలు ఉండాలని ఓ ఎక్విప్‌ బృందానికి నేతృత్వం వహిస్తున్న గుజరాత్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ ఛాన్స్‌లర్‌ హస్ముఖ్‌ అధియా సూచించారు.

 

ప్రపంచ ర్యాంకుల్లో మన వర్సిటీలు ముందుకెలా!
 ప్రపంచవ్యాప్తంగా విద్యా సంస్థల స్థాయిని నిర్ధరించే ప్రఖ్యాత ‘క్వాక్వరెల్లి సిమండ్స్‌ (క్యూఎస్‌)' ర్యాంకుల్లో భారత ప్రముఖ విశ్వవిద్యాలయాలు వెనకబాట పట్టడం వెనక కారణాలపై కేంద్ర మానవ వనరుల అభివృద్ధి (హెచ్‌ఆర్‌డీ) మంత్రిత్వ ఆరా తీస్తోంది. జేఎన్‌యూ, హెచ్‌సీయూ వంటి వర్సిటీలకూ ఇందులో చోటు దక్కకపోవడంపై సమీక్షిస్తోంది. ఈ అంశంపై చర్చించేందుకు ఇటీవల ఓ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. భారత అగ్రస్థాయి విశ్వవిద్యాలయాలు నాణ్యత, విశ్వసనీయత ప్రమాణాల్ని అందుకుంటున్నా, క్యూఎస్‌ ర్యాంకుల్లో సరైన స్థానాన్ని పొందడం లేదని సమావేశానికి నేతృత్వం వహించిన హెచ్‌ఆర్‌డీ మంత్రి రమేష్‌ పోఖ్రియాల్‌ పేర్కొన్నారు. దీనికిగల కారణాలను వెదకాలని, హాజరైన ఐఐటీల ఉన్నతాధికారులు, వర్సిటీల ఉపకులపతులు తదితరులకు సూచించారు. తాము నిర్వహిస్తున్న డిగ్రీ కోర్సులపై సరైన దృష్టి సారించకపోవడం వల్ల క్యూఎస్‌ ర్యాంకుల్లో తాము స్థానం కోల్పోయినట్లు హెచ్‌సీయూ వీసీ అప్పారావు పొదిలె పేర్కొన్నారు. తమకు మంచి బోధకులు ఉన్నా, ర్యాంకుల విషయంలో విదేశీ బోధకుల్ని నియమించుకునే అంశానికి అధిక వెయిటేజీ ఉంటోందని దిల్లీ ఐఐటీ సంచాలకులు రామగోపాలరావు అభిప్రాయపడ్డారు. క్యూఎస్‌ న్యాయనిర్ణేతల బృందంలో భారతీయులూ ఉండాలని హెచ్‌ఆర్‌డీ అధికారులు సూచించారు.

 

ఎక్విప్‌ బృందం సూచనలివీ..
* బీఏ, ఎంఏ పట్టాలు చైతన్యవంతులైన పౌరులను తయారు చేస్తున్నా.. ఆర్థిక వ్యవస్థ అవసరాలకు వారందించే భాగస్వామ్యం చాలా తక్కువగా ఉంటోంది. ఫలితంగా గ్రాడ్యుయేట్లు, పోస్ట్‌గ్రాడ్యుయేట్ల సంఖ్య భారీ స్థాయిలో పెరిగిపోతోంది.
* తాము చదువుకున్న విద్య నుంచి ఆర్థిక పరమైన ప్రతిఫలాలు అందకపోవడంతో నిరుద్యోగుల్లో సామాజిక అసంతృప్తి పెరిగిపోతోంది. ఉన్నత విద్యా వ్యవస్థను ప్రస్తుత కాలపు యువత ఆర్థిక ఆకాంక్షలకు తగినట్లుగా పూర్తిస్థాయిలో తీర్చిదిద్దకపోతే ఫలితం ఉండదు. ప్రతి డిగ్రీ కోర్సులోనూ పెద్ద ఎత్తున వృత్తి, నైపుణ్య విద్యను చేర్చాల్సిన అవసరం ఉంది.
* సామాజికంగా వెనకబడిన తరగతులు ప్రయోజనం పొందేలా దేశంలో వొకేషనల్‌ విద్య పాఠ్యాంశాల్ని వికేంద్రీకరించాల్సిన అవసరం తీవ్రస్థాయిలో ఉంది.
* సాంకేతికేతర, వృత్తివిద్యేతర సంప్రదాయ డిగ్రీ కోర్సుల్లో 20-35 శాతం వరకు ఒకేషనల్‌ అంశాలు ఉండాలి.
* ఉన్నత విద్య, నైపుణ్యాల్ని పెంపొందించే వ్యవస్థ మధ్య సరైన అనుసంధానం అవసరం.
* భారీస్థాయిలో ఓపెన్‌ ఆన్‌లైన్‌ కోర్సుల్ని ప్రవేశపెట్టడం, స్థానికంగా చేతివృత్తి నిపుణుల సేవల్ని ఒప్పంద పద్ధతిలో స్వీకరించాలి.
* స్థానిక అవసరాలకు తగినట్లుగా వికేంద్రీకరించడం ద్వారా ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు నైపుణ్య విద్యను మరింతగా అందుబాటులోకి తీసుకురావాలి.
* పాఠశాల స్థాయి నుంచే వృత్తివిద్యా కోర్సుల్ని ఎంచుకునే విద్యార్థులకు విశ్వవిద్యాలయ స్థాయిలోనూ అవి అందుబాటులో ఉండేలా రాష్ట్రాలు చర్యలు తీసుకొనేలా కేంద్రం కృషి చేయాలి.
* ప్రస్తుతమున్న కళాశాలలు, విద్యాసంస్థల్లో అందుబాటులో ఉన్న మౌలిక సదుపాయాలను గరిష్ఠంగా ఉపయోగించుకోవాలి.

Posted Date : 23-10-2020 .