• facebook
  • whatsapp
  • telegram

నవ కల్పన విద్యతోనే మంచి భవిష్యత్తు

* నీతి ఆయోగ్‌ సభ్యుడు వీకే సారస్వత్‌ 
* ఇంజినీరింగ్‌, మెడిసన్‌ మాత్రమే చదువు కాదు 
* పిల్లల్లో ప్రశ్నించే తత్వాన్ని చంపవద్దు: మంత్రి జగదీశ్‌రెడ్డి


ఈనాడు, హైదరాబాద్‌: విజ్ఞాన సమాజాన్ని తయారు చేయడంతోపాటు విద్యలో నవ కల్పనకు పెద్దపీట వేయాలని, అప్పుడు దేశానికి మంచి భవిష్యత్తు ఉంటుందని నీతి ఆయోగ్‌ సభ్యుడు వీకే సారస్వత్‌ అన్నారు. ‘ఉన్నత విద్యాసంస్థల్లో గుర్తింపు, నాణ్యతాభివృద్ధి, ర్యాంకింగ్‌' అనే అంశంపై తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి, కళాశాల విద్యాశాఖ సంయుక్తంగా నిర్వహిస్తున్న రెండు రోజుల జాతీయ సదస్సు జులై 8న‌ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఈ సదస్సులో విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొనగా సారస్వత్‌ కీలక ఉపన్యాసం చేశారు. నవ కల్పన దిశగా దేశం సాగాలంటే పాఠశాల దశలోనే ఫౌండేషన్‌ శిక్షణపై అధిక దృష్టి పెట్టాలన్నారు. అభ్యాసన సామర్థ్యాలపైనా ప్రధానంగా దృష్టి కేంద్రీకరించాలన్నారు. ఉద్యోగాలకు పనికొచ్చేలా తీర్చిదిద్దాలంటే విద్యలో కమ్యూనికేషన్‌, కొలాబరేషన్‌, క్రిటికల్‌ థింకింగ్‌, క్రియేటివిటీ అనే ‘4సీ'లను విద్యార్థులు కలిగి ఉండాలన్నారు. అంతకుముందు సారస్వత్‌ విలేకరులతో మాట్లాడుతూ.. ప్రస్తుతం నిరుద్యోగుల్లో ఎక్కువ మంది బీటెక్‌ విద్యార్థులే ఉన్నారని, సేవల రంగం శరవేగంగా వృద్ధి చెందుతుండటంతో సాధారణ డిగ్రీ, లిబరల్‌ ఆర్ట్స్‌ విద్యార్థులకు ఉద్యోగావకాశాలు బాగా పెరిగాయని చెప్పారు.


అలాగైతే పరిశోధన ఎవరు చేస్తారు ? 
తమ పిల్లలను కంప్యూటర్‌ సైన్స్‌ చదివించాలి - అమెరికా పంపించాలి, వైద్య విద్య పూర్తి చేయించాలి - ఆసుపత్రి కట్టించాలి అని అధిక శాతం తల్లిదండ్రులు ఆలోచిస్తున్నారు. పరిశోధన చేయి...శాస్త్రవేత్త కండి అని ఎవరైనా తల్లిదండ్రులు పిల్లలకు ప్రాథమిక విద్య నుంచి చెబుతున్నారా?・Eఅని మంత్రి జగదీశ్‌రెడ్డి ప్రశ్నించారు. ఇలాంటి పరిస్థితుల్లో మరి ఎవరు పరిశోధన చేస్తారు. ప్రపంచ స్థాయి ర్యాంకింగ్‌లో మన విశ్వవిద్యాలయాలకు చోటు ఎందుకు దక్కుతుంది? అని అన్నారు. ఉద్యోగం కోసం చదువు అన్నట్లు పరిస్థితి మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రశ్నించే తత్వాన్ని పిల్లల్లో చంపవద్దని సూచించారు. విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి మాట్లాడుతూ.. విద్యా సంస్థల్లో ఎన్ని సౌకర్యాలు కల్పించినా విద్యార్థులు తరగతులకు రాకుంటే ఉపయోగం లేదని, అందుకే హాజరుపై పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టనున్నామన్నారు. కళాశాల విద్యాశాఖ కమిషనర్‌ నవీన్‌ మిత్తల్‌ మాట్లాడుతూ తెలంగాణ ఆవిర్భావం నాటికి 25 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలకు న్యాక్‌ గుర్తింపు ఉండగా...ఇప్పుడు ఆ సంఖ్య 60కి చేరిందన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ తుమ్మల పాపిరెడ్డి, ఉపాధ్యక్షులు ఆర్‌.లింబాద్రి, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.

  • Tags