• facebook
  • whatsapp
  • telegram

దేశానికి ఇంజినీరు.. అవకాశం అందుకోరూ!

* యూపీఎస్సీ ఈఎస్‌ఈ -2019
* 581 పైగా ఖాళీలు

 

కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో ఇంజినీర్‌గా కెరియర్‌ను ప్రారంభించడానికి అవకాశం కల్పించే అత్యున్నత పరీక్ష ఈఎస్‌ఈ (ఇంజినీరింగ్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌)కి ప్రకటన వెలువడింది. దీని ద్వారా ఏఈఈగా ఉద్యోగ జీవితాన్ని మొదలుపెట్టి ఉన్నతస్థాయికి చేరుకోవచ్చు. ఈఎస్‌ఈని యూపీఎస్సీ మూడంచెల్లో నిర్వహిస్తుంది. పరీక్ష కష్టంగా ఉంటుందని కొందరు అభ్యర్థులు భావిస్తుంటారు. కానీ తొలి ప్రయత్నంలోనే ఎందరో విజయాలు సాధించారని నిపుణులు చెబుతున్నారు. డిగ్రీ మూడో సంవత్సరం నుంచే ప్రిపరేషన్‌ సాగించడం మంచిదని సూచిస్తున్నారు.

ఈఎస్‌ఈ ద్వారా ఇండియన్‌ రైల్వే, సెంట్రల్‌ పబ్లిక్‌ వర్క్స్‌, మిలిటరీ ఇంజినీరింగ్‌, సెంట్రల్‌ వాటర్‌, సెంట్రల్‌ ఇంజినీరింగ్‌, నేవల్‌, సెంట్రల్‌ పవర్‌, టెలికాం, బోర్డర్‌ రోడ్డు ఇంజినీరింగ్‌ సర్వీసెస్‌, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సర్వీసెస్‌, ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీస్‌ వంటి వివిధ విభాగాల్లో నియామకాలు జరుగుతాయి. సమాజంలో మంచి గౌరవం, అత్యున్నత స్థాయికి చేరుకునే రెగ్యులర్‌ ప్రమోషన్లు, ఉద్యోగ భద్రత, సంతృప్తి ఉంటాయి. ఏడో కమిషన్‌తో మొదటి నెల జీతం రూ.70,000 నుంచి రూ.75,000 వరకు ఉండే అవకాశముంది.
సివిల్‌, ఎలక్ట్రికల్‌, మెకానికల్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ టెలికమ్యూనికేషన్స్‌ బ్రాంచిల్లో మాత్రమే ఈఎస్‌ఈని నిర్వహిస్తారు. ఏ ఇంజినీరింగ్‌ బ్రాంచి వారైనా ఈ నాలుగు బ్రాంచీల్లో ఏదైనా ఒకదానిలో ఈ పరీక్ష రాయవచ్చు!
ఈ పరీక్షలో నెగ్గటం కష్టమనో, పోటీ ఎక్కువనో చాలామంది దరఖాస్తు చేసుకోవటానికి జంకుతుంటారు. కానీ దరఖాస్తుదారులు ఎక్కువమంది ఉన్నప్పటికీ శ్రద్ధగా చదివి, గట్టి పోటీ ఇచ్చే విద్యార్థులు తక్కువమందే! పైగా దరఖాస్తు చేసుకునేవారి సంఖ్య, పరీక్ష రాసే వారి సంఖ్యలో చాలా వ్యత్యాసం ఉంటుంది.
ఇంజినీరింగ్‌ మూడో సంవత్సరం నుంచే తగిన ప్రణాళికతో చదివితే సిలబస్‌ ఎక్కువేమీ అనిపించదు. మొదటి ప్రయత్నంలోనే ఈ పరీక్షను మంచి ర్యాంకుతో నెగ్గుతున్నవారు ఎందరో ఉంటున్నారు. ఇంజినీరింగ్‌ సర్వీస్‌ కొలువులను పురుషులే చేయగలరనేది అపోహ మాత్రమే. మహిళలు కూడా ఈ పరీక్షలో ఉత్తీర్ణులై మంచి హోదాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు.
ఈఎస్‌ఈ పరీక్ష ప్రిలిమ్స్‌, మెయిన్స్‌, పర్సనాలిటీ టెస్ట్‌ అనే మూడు భాగాలుగా ఉంటుంది. సివిల్‌ సర్వీస్‌ పరీక్ష మాదిరిగా ఈఎస్‌ఈ ప్రిలిమినరీ క్వాలిఫయింగ్‌ కోసం మాత్రమే కాదు. ఇందులో సాధించిన మార్కులను తుది ఎంపికలోనూ పరిగణనలోకి తీసుకుంటారు.

 

స్టేజ్‌-1 (ప్రిలిమినరీ)

 

స్టేజ్‌-2 (మెయిన్స్‌)

 

లోతైన అధ్యయనం అవసరం
ప్రిలిమినరీ పేపర్‌-1 (జనరల్‌ స్టడీస్‌ అండ్‌ ఇంజినీరింగ్‌ ఆప్టిట్యూడ్‌): కనీస అర్హత మార్కులు సాధించాలి. టెక్నికల్‌ సబ్జెక్టుతోపాటు కీలకమైన జనరల్‌ స్టడీస్‌పై ఇప్పటి నుంచే శ్రద్ధవహించి సన్నద్ధం కావడం మంచిది. దీనిలో హిస్టరీ, జాగ్రఫీ లాంటివి కాకుండా ఆ స్థానంలో ఇంజినీరింగ్‌కు సంబంధించిన అంశాలను చేర్చారు. ఈ జనరల్‌స్టడీస్‌ను ఒక భూతంలా చూడాల్సిన అవసరం లేదు. మేథ్స్‌, ఆప్టిట్యూడ్‌, కరెంట్‌ అఫైర్స్‌తోపాటు ప్రతి ఇంజినీరింగ్‌ విద్యార్థీ తనకు సంబంధించిన విభాగంలో దృఢంగా ఉంటే కనీస మార్కులు సాధించడం సులువే. ఉదా: ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ టెలికమ్యూనికేషన్‌ విద్యార్థులు తమకు సంబంధించిన ఇన్ఫర్మేషన్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ టెక్నాలజీలో సులభంగా మార్కులు సాధించవచ్చు.
మొత్తంగా 1300 మార్కులకుగానూ జనరల్‌స్టడీస్‌కు 200 మార్కులే. కాబట్టి ఇందులో తక్కువ మార్కులు సాధించినా కంగారు అవసరం లేదు. మిగిలిన 1100 మార్కులైన టెక్నికల్‌ విభాగంలో మంచి స్కోరు సాధిస్తే ఉత్తమ ర్యాంకు రావడానికి అవకాశం ఉంటుంది. కానీ ఏ పేపర్‌నూ నిర్లక్ష్యం చేయకూడదు.
పేపర్‌-2 (సంబంధిత విభాగం): ప్రశ్నలను సాధన చేసేటపుడు బేసిక్స్‌ ముందుగా చదివి, అంశాలను లోతుగా అధ్యయనం చేయాలి. పరీక్షలో కొన్ని ప్రశ్నల సాధనకు ఎక్కువ సమయం పడుతుంది. అలాంటి ప్రశ్నలను వేగంగా సాధించాలంటే పునశ్చరణ, సాధన అవసరం.
పై రెండు పేపర్లలో కనీస క్వాలిఫయింగ్‌ మార్కులను నిర్ణయించే అధికారం యూపీఎస్‌సీకి ఉంటుంది. ఈ కన్వెన్షనల్‌ ప్రశ్నలు ఎక్కువ నిడివితో ఉంటాయి. వీటికి చదవడంతోపాటు రాయడం బాగా అలవాటు చేసుకోవాలి. క్వశ్చన్‌ కం ఆన్సర్‌ బుక్‌లెట్‌ (క్యూసీఏబీ) విధానం ప్రవేశపెట్టడం వల్ల సమాధానాలు రాయడానికి నిర్ణీత స్థలాన్ని కేటాయించారు. కాబట్టి వీలైనంత సూటిగా జవాబులు రాయడం మంచిది.
మెయిన్స్‌ ఇంజినీరింగ్‌ సిలబస్‌: దీన్ని రెండు పేపర్లుగా విభజించారు. ఇవి అభ్యర్థి సంబంధిత కోర్‌ సబ్జెక్టులకు చెందినవే. కొత్తవిధానంలో మార్కులతోపాటు సమయం కూడా పెరిగింది. కాబట్టి బేసిక్స్‌తోపాటు అడ్వాన్స్‌డ్‌ విషయాలపై పూర్తిస్థాయి అవగాహనను పరీక్షించేలా ప్రశ్నలు ఉండొచ్చు. కొత్తగా చేర్చిన కొన్ని సబ్జెక్టులు బీటెక్‌లో ఎలక్టివ్‌గా లేదా ఎంటెక్‌ ప్రథమ సంవత్సరంలో చదివే విషయాలున్నాయి. కానీ ఆందోళన అవసరం లేదు. క్రమబద్ధంగా నాలుగేళ్ల బీటెక్‌ సిలబస్‌ చదివితే సరిపోతుంది.

 

పర్సనాలిటీకి పరీక్ష
స్టేజ్‌-1, స్టేజ్‌-2ల్లో సాధించిన మార్కుల ఆధారంగా (1100 మార్కులకుగానూ) అభ్యర్థులను 1:2 నుంచి 1:2.5 నిష్పత్తిలో స్టేజ్‌-3 మౌఖిక పరీక్షకు (200 మార్కులు) అనుమతిస్తారు. మూడు స్టేజీల్లో కలిపి 1300కు గానూ అభ్యర్థి సాధించిన మార్కుల ఆధారంగా ఉన్న ఖాళీలకు అనుగుణంగా తుది జాబితాను రూపొందిస్తారు.
ఈ పర్సనాలిటీ టెస్ట్‌లో అభ్యర్థి ఆలోచనా విధానం, శక్తిసామర్థ్యాలు, నీతి నిజాయతీలను అంచనా వేస్తారు. రెండేళ్ల నుంచి ఈఎస్‌ఈ ఇంటర్వ్యూలో వ్యక్తిగత విషయాలు, హాబీలకు కొంత ప్రాముఖ్యమిస్తూ ప్రశ్నలు వేస్తున్నారు. అభ్యర్థులు ఉద్యోగం చేస్తున్నా, ఎంటెక్‌ చేస్తున్నా సంబంధిత ప్రశ్నలు అడిగే అవకాశముంది. సామాజిక, వర్తమానాంశాల గురించీ అడగొచ్చు.
ఈఎస్‌ఈ 2019 ప్రిలిమినరీ పరీక్షకు దాదాపు 3 నెలల వ్యవధి ఉంది. కాబట్టి సమయాన్ని దృష్టిలో ఉంచుకొని రోజుకు 8- 9 గంటల వరకు అధ్యయనం చేయాలి. గత సంవత్సరాల ప్రశ్నపత్రాలను సాధన చేయడం, చదివినదాన్ని పునశ్చరణ చేయడం ఈ పరీక్షలో ఎంతో ముఖ్యం.


బీఈ/బీటెక్‌ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులూ అర్హులే!

విద్యార్హతలు: ఇంజినీరింగ్‌ డిగ్రీ/ ఎంఎస్‌సీ. సివిల్‌, మెకానికల్‌, ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ టెలికమ్యూనికేషన్‌ సబ్జెక్టుల్లో ఒకదాన్ని ఎన్నుకోవాలి.

వయసు: 01.01.2019 నాటికి 21 నుంచి 30 సంవత్సరాల్లోపు ఉండాలి.

ముఖ్య తేదీలు
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరితేదీ: 22.10.2018.
ప్రిలిమ్స్‌/ స్టేజ్‌-1 తేదీ: జనవరి 6, 2019
స్టేజ్‌-2 తేదీ: తరువాత ప్రకటిస్తారు.

గేట్‌తో పాటు ఎలా?

* గేట్‌లో మంచి ర్యాంకు సాధిస్తూ ఐఈఎస్‌కు ఎలా సన్నద్ధమవ్వాలి?
గేట్‌ ఫిబ్రవరిలో జరుగుతుంది. ఐఈఎస్‌ ప్రిలిమ్స్‌ జనవరి మొదటివారంలో జరుగుతుంది. కాబట్టి మొత్తం ఈఎస్‌ఈ సిలబస్‌ (జనరల్‌ స్టడీస్‌ సంబంధిత ఇంజినీరింగ్‌ సబ్జెక్టు) ముందుగానే చదవాలి. స్టేజ్‌-1 వరకు పూర్తి కాన్సెప్టులతోపాటు ముఖ్యమైన డెరివేషన్స్‌, వివిధ రకాల ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలు, కొన్ని ఎక్కువ నిడివి గల ప్రశ్నలు సాధన చేయడం మంచిది.
జనవరి వరకు ఈఎస్‌ఈ ప్రిలిమ్స్‌ కోసం ఆన్‌లైన్‌తోపాటు ఆఫ్‌లైన్‌ టెస్ట్‌ సిరీస్‌ కూడా రాయాలి. ఈఎస్‌సీ ప్రిలిమ్స్‌ ఆబ్జెక్టివ్‌ విధానంలో ఉండటం, టెక్నికల్‌ సంబంధిత సబ్జెక్టులు కూడా ఉన్నందున ఈ సన్నద్ధత గేట్‌లో ర్యాంకుకూ తోడ్పడుతుంది.
ఈఎస్‌ఈ ప్రిలిమ్స్‌ తరువాత అందుబాటులో ఉన్న ఒక నెల సమయంలో ఆన్‌లైన్‌ పరీక్షలు రాయడానికి వెచ్చించాలి. ఈ సమయంలో ఎక్కువగా న్యూమరికల్‌ తరహా ప్రశ్నలపై ఎక్కువ దృష్టిసారించాలి. గేట్‌ సిలబస్‌నూ, విధానాన్నీ దృష్టిలో ఉంచుకుని ముందుగా చదివిన అంశాలను పునశ్చరణ చేయాలి.
ఈఎస్‌ఈకైనా, గేట్‌కైనా సన్నద్ధతలో పూర్వ ప్రశ్నపత్రాల సాధన ఎంతో కీలకం. ఈఎస్‌ఈ ప్రిలిమ్స్‌లో క్వాలిఫై అయినవారు గేట్‌ ముగిసిన తరువాత విశ్రాంతి పొందకుండా మెయిన్స్‌కు సాధన కొనసాగించాలి. గేట్‌ తరువాత దొరికిన సమయంలో ఈఎస్‌ఈ కోసం అభ్యర్థులు తమ రాత నైపుణ్యాలను మెరుగుపరచుకోవాలి. దీనికోసం ఆఫ్‌లైన్‌లో మౌఖిక పరీక్షలు రాయాలి. ప్రామాణిక పాఠ్యపుస్తకాల్లోని అన్‌సాల్వ్‌డ్‌ ప్రాబ్లమ్స్‌ సాధించాలి.

* ఇంజినీరింగ్‌ సర్వీసెస్‌ పరీక్ష కఠినత్వం ఎలా ఉంటుంది? ఎలా సాధన చేయాలి?
ఈఎస్‌ఈ సిలబస్‌ పరిధి విస్తృతంగా ఉన్నప్పటికీ ప్రశ్నలు మాత్రం మధ్యస్థం నుంచి కొంత కఠినంగా ఉంటాయి. గత రెండేళ్ల నుంచి ఆచరణాత్మక ప్రశ్నలను చేర్చడం వల్ల ప్రశ్నపత్ర కఠినత్వం పెరిగింది.
ఈఎస్‌ఈ సిలబస్‌ను వీలైనన్నిసార్లు పరిశీలించి అంశాలను క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలి. సిలబస్‌నుబట్టి ఏ అంశాల్లో బలంగా ఉన్నారో, వేటిలో బలహీనంగా ఉన్నారో తెలుసుకుని దానికి అనుగుణంగా సాధన ప్రణాళికను రూపొందించుకోవాలి. సమయపాలన అత్యంత కీలకం. ఏ రోజు సాధన చేయాల్సిన అంశాలను అదేరోజు పూర్తి చేయాలి. దీనిద్వారా పునశ్చరణకు వీలైనంత సమయం దొరుకుతుంది.
చదివిన అంశాలపై విషయ పరిజ్ఞానాన్ని తెలుసుకోవడానికి మాదిరి ప్రశ్నపత్రాలను సాధన చేయాలి. ప్రాథమికాంశాల సాధన తరువాత గత ఈఎస్‌ఈ, గేట్‌, సివిల్‌ సర్వీసెస్‌, రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ ప్రశ్నపత్రాలను సాధన చేయాలి. దీనివల్ల ఏయే అంశాలపై ఎలాంటి ప్రశ్నలు అడుగుతున్నారో అర్థమవుతుంది.
ఎన్‌పీటీఈఎల్‌ పాఠాలు విద్యార్థులకు ప్రాథమికాంశాల అవగాహనకు ఉపయోగపడతాయి. ఏవైనా సందేహాలున్నపుడు నివృత్తి చేసుకోవడానికి కూడా ఈ పాఠాలు ఉపయోగపడతాయి. విశ్లేషణాత్మక ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడంలో ఎన్‌పీటీఈఎల్‌ పాఠాలు ఎంతగానో దోహదపడతాయి.

* సగటు అభ్యర్థులు ఈఎస్‌ఈకి సన్నద్ధమవటానికి ఇప్పుడున్న వ్యవధి సరిపోతుందా?
ఈఎస్‌ఈ- 2019 రాయాలనుకునేవారు తమ నాలుగేళ్ల ఇంజినీరింగ్‌లో బేసిక్స్‌పై ఎంతోకొంత అవగాహన సాధించి ఉంటారు. సిలబస్‌ను దృష్టిలో ఉంచుకుని అంశాలవారీగా బేసిక్స్‌పై పట్టు సాధించాలి. ఏయే అంశాలతో ఎక్కువ మార్కులు సాధించగలరో గమనించి వాటిని సాధన చేసి పునశ్చరణ చేయాలి. వెయిటేజీ ఎక్కువ ఉన్న సబ్జెక్టులు, సులభంగా మార్కులు సాధించే సబ్జెక్టులు, అంశాలపై ఎక్కువ దృష్టిపెట్టాలి. కఠినమైన అంశాలను ఈ సమయంలో వదిలేయడం మంచిది.
ప్రిలిమ్స్‌లో ఇంజినీరింగ్‌ ఆప్టిట్యూడ్‌, జనరల్‌స్టడీస్‌లోని కొన్ని ముఖ్యమైన అంశాలు, సులభంగా మార్కులు సాధించగలవాటిని మాత్రమే సాధన చేయాలి. సాధ్యమైనన్ని మౌఖిక ప్రశ్నలను ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ల్లో సాధన చేయాలి. మెయిన్స్‌ రాయడానికి దొరికే సమయంలో పాఠ్యాంశాలపై విషయ పరిజ్ఞానాన్ని మెరుగుపరచుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రిలిమ్స్‌ గానీ మెయిన్స్‌ గానీ గత ప్రశ్నపత్రాలను పరిశీలించి సాధన చేస్తే ఎంతో మేలు జరుగుతుంది.

* ఈఎస్‌ఈలో చేతిరాత ఎంతవరకూ ముఖ్యం? మెరుగుపరచుకోవడానికి ఏం చేయాలి?
స్టేజ్‌-2 (కన్వెన్షనల్‌)లో చేతిరాత కీలకపాత్ర పోషిస్తుంది. కాబట్టి మెరుగుపరచుకోవడం చాలా ముఖ్యం. ప్రశ్నలు, సమాధానాలు చాలా నిడివితో ఉంటాయి. కాబట్టి సమయపాలనతో తొందరగా సమాధానాలు రాయడం ముఖ్యం. ఇందుకుగానూ సన్నద్ధత సమయంలోనే రాయడం సాధన చేయాలి. ఎంత ఎక్కువ సాధన చేస్తే అంత ఎక్కువ వేగంగా రాయగలుగుతారు. స్పెల్లింగులు, గ్రామర్‌ కూడా ముఖ్యమే. రీడింగ్‌ స్కిల్స్‌ కూడా మెరుగుపరచుకుంటే అవి త్వరగా రాయడంలో సాయపడతాయి.

 

  • Tags