• facebook
  • whatsapp
  • telegram

సార్‌లే ఎక్కువ!

* అధ్యాపకులపై సర్వేలో వెల్లడి

దిల్లీ: మనదేశంలోని ఉన్నత విద్యాసంస్థల్లో మహిళల కంటే పురుష అధ్యాపకుల సంఖ్యే ఎక్కువగా ఉంది. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ నిర్వహించిన దేశవ్యాప్త సర్వేలో ఈ విషయం వెల్లడైంది. అయితే, కేరళ, పంజాబ్, హరియాణా, మేఘాలయ, నాగాలాండ్, గోవా తదితర కొన్ని రాష్ట్రాలు, దిల్లీ, చండీగఢ్‌లలో మహిళా అధ్యాపకులే అధికంగా ఉన్న విషయం గమనార్హం.
విశ్వవిద్యాలయాలు, కళాశాలలు, స్వతంత్ర విద్యా సంస్థలంటూ మూడు కేటగిరీలుగా విభజించి సర్వే నిర్వహించారు. 2018-19 సంవత్సరానికి గాను మొత్తం 962 విశ్వవిద్యాలయాలు, 38,179 కళాశాలలు, 9190 స్వతంత్ర విద్యాసంస్థల్లో అధ్యయనం జరిగింది. అఖిల భారత స్థాయిలో చూస్తే ప్రతి వందమంది పురుష అధ్యాపకులకు..73 మంది మహిళా బోధకులుంటున్నారు. ముస్లిం మైనారిటీ వర్గాల అధ్యాపకుల విషయానికి వస్తే మహిళా టీచర్ల సంఖ్య 57గా ఉంది. దివ్యాంగులైన ఉపాధ్యాయినుల సంఖ్య కేవలం 37 ఉండటం గమనార్హం. బిహార్, ఝార్ఖండ్‌లలో ఈ వ్యత్యాసం అధికంగా ఉంది.


నర్సింగ్‌ కోర్సుల్లో మాత్రం....
నర్సింగ్‌ కోర్సుల్లో బోధనా సిబ్బంది విషయానికి వస్తే మహిళల సంఖ్య అత్యధికంగా ఉంది. వంద మంది పురుష అధ్యాపకులుంటే నర్సింగ్‌ కోర్సులు బోధిస్తున్న మహిళల సంఖ్య 330గా ఉంది.


లక్ష టీచరు పోస్టులు ఖాళీ
దేశవ్యాప్తంగా దాదాపు లక్ష టీచరు పోస్టులు ఖాళీగా ఉన్నట్లు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ ‘ట్వీట్‌' చేసింది. వీటిలో రాష్ట్రాల ప్రభుత్వ బడుల్లో ఖాళీల సంఖ్య 84 వేలు. ఈ పోస్టుల్లో నియామకాలకు సంబంధించిన వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారు.


దేశవ్యాప్తంగా అధ్యాపకుల ముఖచిత్రం!
మొత్తం అధ్యాపకులు: 14,16,299
పురుషులు: 57.8%
మహిళలు: 42.2%


బిహార్‌లో..
పురుషులు: 78.97%
మహిళలు: 21.03%


ఝార్ఖండ్‌లో..
పురుషులు: 69.8%
మహిళలు: 30.2%


దేశంలోబోధనేతర సిబ్బంది...
పురుషులు: 67.11%
మహిళలు: 32.89%

  • Tags