• facebook
  • whatsapp
  • telegram

అక్టోబరు 16 నుంచి ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ


కంటోన్మెంట్‌, న్యూస్‌టుడే: కంటోన్మెంట్‌ ప్రాంతంలోని 1 ఈఎంఈ సెంటర్‌లో యునిట్‌ హెడ్‌క్వార్టర్స్‌ కోటా కింద అక్టోబరు 16 నుంచి నవంబరు 24 వరకు ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ నిర్వహించనున్నట్లు రక్షణ శాఖ పౌర సంబంధాల శాఖ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. అమర వీర సైనికులు, మాజీ సైనికుద్యోగులు, సైనికుద్యోగుల పిల్లల కోసం ఈ ర్యాలీ చేపడుతున్నట్లు చెప్పారు. సోల్జర్‌ టెక్నీషియన్‌, సోల్జర్‌ జనరల్‌ డ్యూటీ, సోల్జర్‌ ట్రేడ్స్‌మేన్‌ పోస్టులకు పదో తరగతిలో ఉత్తీర్ణత సాధించినవారు అర్హులని, స్టాండర్డ్‌(హౌజ్‌కీపర్‌) పోస్టులకు 8వ తరగతిలో ఉత్తీర్ణులైనవారు అర్హులని తెలిపారు. అభ్యర్థులు ధ్రువీకరణ పత్రాలతో బొల్లారం, 1ఈఎంఈ సెంటర్‌, 1 ట్రేనింగ్‌ బెటాలియన్‌లోని మిల్కాసింగ్‌ స్టేడియానికి రావాలని వారు సూచించారు.

 

ఓయూ దూరవిద్య ప్రవేశాలకు రంగం సిద్ధం
* 15 నుంచి దరఖాస్తుల ఆహ్వానం
* ఈసారి కొత్తగా మూడు కోర్సులు
ఈనాడు, హైదరాబాద్‌: ఉస్మానియా వర్సిటీ దూరవిద్య ప్రవేశాలకు రంగం సిద్ధమైంది. జులై 15వ తేదీ నుంచి దరఖాస్తుల స్వీకరణకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ రోజున ఉస్మానియా ఉపకులపతి ప్రొ.రామచంద్రం ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నారు. అప్పట్నుంచి అక్టోబరు 31వరకు వివిధ కోర్సులకు దరఖాస్తులు స్వీకరించి.. ఆ తర్వాత నుంచి తరగతులు నిర్వహించనున్నారు. దరఖాస్తులను పూర్తిగా ఆన్‌లైన్‌లో తీసుకోనున్నారు. అభ్యర్థులు నిర్దేశిత తేదీ నుంచి వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని వర్సిటీ దూరవిద్య కేంద్రం సంచాలకులు ప్రొ.చింతా గణేష్‌ తెలిపారు. కోర్సుల వివరాలు, కాల పరిమితి, ఫీజు వివరాలనూ అందులో తెలుసుకోవచ్చని వివరించారు. వాస్తవానికి కాగితరహిత పాలనలో భాగంగా రెండేళ్ల నుంచి దూరవిద్య విధానంలో ఆన్‌లైన్‌లో దరఖాస్తు తీసుకుంటున్నారు. అభ్యర్థుల రిజిస్ట్రేషన్‌, కోర్సు, పరీక్షల ఫీజు చెల్లింపులు సైతం పూర్తిగా ఆన్‌లైన్‌లోనే జరుగుతోంది. అలాగే యూజీసీ నిబంధనల ప్రకారం యూనివర్సిటీ పరిధిలోని అభ్యర్థుల నుంచే దరఖాస్తులు స్వీకరించాల్సి ఉంది. ప్రత్యేక పరిస్థితుల్లో రాష్ట్ర పరిధి దాటకుండా కూడా దరఖాస్తులు తీసుకునేందుకు వీలుంది. ఈ నేపథ్యంలో ఉస్మానియా వర్సిటీ పరిధిలోని జిల్లాల అభ్యర్థులకు ఎక్కువగా అవకాశం దక్కనుంది.
ఈ కోర్సులకు బయట ఉద్యోగావకాశాలు ఉండటంతో..
ఈ ఏడాది నుంచి దూరవిద్య విధానంలో మరో మూడు కోర్సులను ఉస్మానియా వర్సిటీ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఎంఏ పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌, బీకామ్‌ కంప్యూటర్‌ అప్లికేషన్‌, పీజీ డిప్లొమా ఇన్‌ డాటా సైన్స్‌ను ప్రవేశపెట్టింది. విద్యార్థుల నుంచి ఉన్న డిమాండ్‌ దృష్ట్యా వీటిని మొదలుపెట్టింది. ఈ కోర్సులకు బయట ఉద్యోగావకాశాలు ఎక్కువగా ఉండటంతో విద్యార్థుల నుంచి మంచి ఆదరణ ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ఇందులో ఎంఏ కోర్సు రెండేళ్లు, బీకాం మూడేళ్లు, డిప్లొమా కోర్సు ఏడాది వ్యవధితో ఉండనున్నాయి.


బీఈడీకి ఆదరణ
దూరవిద్య కింద ఉస్మానియా వర్సిటీ ఈ ఏడాది బీఈడీ కోర్సు అందిస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రవేశాలు పూర్తయ్యాయి. జాతీయ ఉపాధ్యాయ విద్య మండలి నుంచి 500 సీట్లతో కోర్సు ప్రారంభించేందుకు అనుమతి రావడంతో దీన్ని తీసుకువచ్చింది. ఎడ్‌సెట్‌తో సంబంధం లేకుండా వర్సిటీ తరఫున ప్రత్యేకంగా ప్రవేశ పరీక్ష నిర్వహించి భర్తీ చేపట్టగా సీట్లన్నీ నిండిపోయాయి.


అందిస్తున్న కోర్సుల వివరాలు..
యూజీ, పీజీతోపాటు అయిదు రకాల డిప్లొమా సర్టిఫికెట్‌ కోర్సులను వర్సిటీ అందిస్తోంది. ఎంబీఏ(రెండేళ్లు), ఎంసీఏ(మూడేళ్లు), ఎంఏ(ఉర్దూ, హిందీ, తెలుగు, సంస్కృతం, ఆంగ్లం, ఫిలాసఫీ, సోషియాలజీ, పబ్లిక్‌ పర్సనల్‌ మేనేజ్‌మెంట్‌, ఎకానమిక్స్‌, పొలిటికల్‌ సైన్స్‌, హిస్టరీ, సైకాలజీ), ఎంకాం, ఎంఎస్సీ(గణితం, స్టాటిస్టిక్స్‌), బీఏ(గణితం, స్టాటిస్టిక్స్‌), బీకాం(జనరల్‌), బీబీఏ, పీజీ డిప్లొమా(గణితం, ఆంగ్ల భాష బోధన, బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌, బయోఇన్ఫర్మాటిక్స్‌, కంప్యూటర్‌ అప్లికేషన్స్‌).

  • Tags