• facebook
  • whatsapp
  • telegram

నీట్‌ నిర్వహణ ఎలా?

* కేంద్ర సర్కారుకు వైద్యశాఖ ప్రతిపాదనలు
ఈనాడు,  హైదరాబాద్‌: దాదాపు డెబ్బయి వేల మంది హాజరయ్యే నీట్‌ పరీక్ష నిర్వహణ అధికారులకు ఒక సవాల్‌గా మారింది. మే 3న జరగాల్సిన నీట్‌ను కరోనా ఉధ్ధృతి నేపథ్యంలో వాయిదా వేసిన కేంద్రం జులై 26న దేశవ్యాప్తంగా నిర్వహిస్తామని తాజాగా వెల్లడించింది. పరీక్ష నిర్వహణ విషయంలో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. జులై నాటికి కరోనా తీవ్రత తగ్గుతుందని కచ్చితంగా చెప్పలేని పరిస్థితి. అప్పటికి లాక్‌డౌన్‌ ఎత్తేసే అవకాశాలుండడంతో.. కేసుల సంఖ్య మరింతగా పెరిగే ప్రమాదముందనే ఆందోళన నెలకొంది. ఇంత భారీగా విద్యార్థులు హాజరవుతుంటే.. కేవలం ఐదు (హైదరాబాద్‌, కరీంనగర్‌, ఖమ్మం, రంగారెడ్డి, వరంగల్‌) జిల్లాల్లోని పరీక్ష కేంద్రాల్లో దూరంగా కూర్చోబెట్టడం ఎలా సాధ్యమవుతుందనే సందేహాలు నెలకొన్నాయి. వ్యక్తిగత దూరం, మాస్కులు, శానిటైజర్లు తదితర కనీస జాగ్రత్తలు పాటించడం జులైలోనూ తప్పనిసరేనని వైద్యవర్గాలు చెబుతున్నాయి. కొన్ని ప్రతిపాదనలను త్వరలో కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ దృష్టికి తీసుకెళ్లనున్నట్లు వైద్యవర్గాలు తెలిపాయి.
ప్రత్యామ్నాయ ప్రతిపాదనలు
* ఈ పరీక్షను నిర్వహించడానికి అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలి.
* ప్రతి విద్యార్థికి ప్రత్యేక కోడ్‌ నెంబరు, పాస్‌వర్డు ఇవ్వడం ద్వారా ఆన్‌లైన్‌లో పరీక్షలను నిర్వహించాలి. రెండు నెలలకు పైగా సమయం ఉంది కాబట్టి.. ఏర్పాట్లు చేసుకోవడానికి అవకాశాలున్నాయి.
* నీట్‌ను దేశవ్యాప్తంగా ఒకే సమయంలో నిర్వహించాల్సి ఉంటుంది. అన్ని రాష్ట్రాల్లోనూ కంప్యూటర్‌ ల్యాబ్‌లు అందుబాటులో లేకపోవచ్చు. అప్పుడు ఆన్‌లైన్‌లో అన్ని రాష్ట్రాల్లోని విద్యార్థులకు నిర్వహించడం కష్టంగా మారుతుంది.
* ఇలాంటప్పుడు పరీక్ష కేంద్రాల సంఖ్య పెంచాలి. అన్ని జిల్లాల్లోనూ కేంద్రాలను ఏర్పాటు చేయాలి. తద్వారా విద్యార్థులు ఎక్కడికక్కడే పరీక్ష రాయడానికి అవకాశాలుంటాయి.
* పరీక్ష కేంద్రాన్ని మార్చుకోవడానికి మే 3 వరకు కేంద్రం గడువిచ్చింది. పరీక్ష కేంద్రాల సంఖ్యను పెంచాల్సి వస్తే మరోమారు సవరణకు విద్యార్థులకు అవకాశమివ్వాలి.

 

  • Tags