• facebook
  • whatsapp
  • telegram

ఆన్‌లైన్‌లో కౌన్సెలింగ్‌ పూర్తికి కసరత్తు

* అధ్యాపకులే డిజిటల్‌ పాఠాలు రూపొందించేలా తీర్చిదిద్దుతాం
* ‘ఈనాడు-ఈటీవీ’తో సాంకేతిక, కళాశాల విద్యాశాఖ కమిషనర్‌ నవీన్‌ మిత్తల్‌
ఈనాడు, హైదరాబాద్‌: ఎంసెట్‌ సహా ఇతర ఉన్నత విద్యాకోర్సుల ప్రవేశాల కౌన్సెలింగ్‌ ప్రక్రియ మొత్తాన్ని ఆన్‌లైన్‌లోనే పూర్తి చేయాలని భావిస్తున్నట్లు రాష్ట్ర సాంకేతిక, కళాశాల విద్యాశాఖ కమిషనర్‌ నవీన్‌ మిత్తల్‌ చెప్పారు. ప్రస్తుతం ఒక్క స్టడీ సర్టిఫికెట్లు తప్ప మిగిలిన కుల, ఆదాయం తదితరాలను ఆన్‌లైన్‌లోనే రప్పించుకొంటున్నామని తెలిపారు. స్టడీ సర్టిఫికెట్లనూ ఆన్‌లైన్‌లోనే పరిశీలించి అభ్యర్థికి సీటు స్థానిక లేదా స్థానికేతర కోటాలో ఇవ్వాలా అనే దానిపై పరిశీలిస్తున్నామని వివరించారు. కరోనా ప్రబలిన నేపథ్యంలో వచ్చే విద్యాసంవత్సరంలో తీసుకురానున్న మార్పులపై ఆయన ‘ఈనాడు- ఈటీవీ’తో మాట్లాడారు. ముఖ్యాంశాలివీ..
అధ్యాపకులకు శిక్షణ
కరోనా వల్ల భవిష్యత్తులో తరగతి గది, ఆన్‌లైన్‌ బోధన కలిసి కొనసాగే అవకాశం ఉంటుంది. అధ్యాపకులు సాంకేతిక పరిజ్ఞానంతో ఆన్‌లైన్‌ ద్వారా బోధించేందుకు కొద్దిరోజులుగా అలవాటుపడ్డారు. భవిష్యత్తులో వారికి మరింత శిక్షణనిస్తాం. వారే స్వయంగా ఆన్‌లైన్‌ మెటీరియల్‌, పాఠాలు రూపొందించేలా తీర్చిదిద్దుతాం.
డిగ్రీలో అయిదారు ఆన్‌లైన్‌ సబ్జెక్టులు
వచ్చే విద్యా సంవత్సరం డిగ్రీలో అయిదారు సబ్జెక్టులను ఆన్‌లైన్‌లో బోధిస్తాం. సోషియాలజీ, జాగ్రఫీ, పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌, జర్నలిజం అండ్‌ మాస్‌ కమ్యూనికేషన్స్‌, సైకాలజీ, ఆంత్రోపాలజీ తదితరాల బోధనకు ఎక్కువ మంది అధ్యాపకులు లేరు. విద్యార్థులు తమకు నచ్చిన సబ్జెక్టును చదవాలంటే ఆ కళాశాలలో ఉండకపోవచ్చు. కొన్నింటిని ఆన్‌లైన్‌లోనూ పూర్తి చేసేలా ఏర్పాట్లు చేస్తున్నాం. కొన్ని ఆర్ట్స్‌ కోర్సుల్లో 20 శాతం క్రెడిట్లు మూక్స్‌ విధానంలో ఆన్‌లైన్‌ కోర్సుల ద్వారా పొందేందుకు రాష్ట్రీయ ఉచ్ఛతార్‌ శిక్షా అభియాన్‌(రూసా) నిధులతో కోర్సు మెటీరియల్‌ తయారు చేస్తున్నాం. పాలిటెక్నిక్‌ పరీక్షలు, విద్యా సంవత్సరం కాలపట్టికను త్వరలో ఖరారు చేస్తాం.

 

  • Tags