• facebook
  • whatsapp
  • telegram

నెలాఖరులో ‘పది’ పరీక్షలు ప్రారంభం!

* త్వరలో హైకోర్టులో అఫిడవిట్‌ సమర్పించనున్న ప్రభుత్వం
* అనుమతిస్తే పరీక్షల నిర్వహణ
ఈనాడు, హైదరాబాద్‌: హైకోర్టు అనుమతి ఇస్తే పదో తరగతిలో మిగిలిపోయిన పరీక్షల నిర్వహణను మే నెలాఖరులో ప్రారంభించాలని విద్యాశాఖ భావిస్తోంది. కరోనా వైరస్‌ ప్రబలిన నేపథ్యంలో హైకోర్టు ఆదేశాల మేరకు మూడు పరీక్షల తర్వాత నిలిపివేసిన సంగతి తెలిసిందే. మిగిలిన పరీక్షలను తిరిగి నిర్వహించేందుకు తీసుకునే ముందు జాగ్రత్తలు వివరిస్తూ ప్రభుత్వం త్వరలో హైకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేయనుంది. పరీక్షలు నిర్వహించుకోవడానికి అనుమతి లభిస్తే విద్యార్థులు సన్నద్ధమయ్యేందుకు 7 నుంచి 10 రోజుల వ్యవధి ఇస్తామని అధికారి ఒకరు తెలిపారు. మొత్తానికి మే నెలాఖరులో పరీక్షలు మొదలుపెట్టి జూన్‌ మొదటి వారంలోగా పూర్తి చేయాలన్నది ప్రణాళికగా చెబుతున్నారు. ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు సత్యనారాయణరెడ్డి, ఎస్‌ఎస్‌ఏ అదనపు రాష్ట్ర ప్రాజెక్టు సంచాలకుడు శ్రీహరి, అదనపు సంచాలకుడు రమణారావు తదితరులతో మే 6న విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్‌ పదో తరగతి పరీక్షల నిర్వహణపై సమీక్షించారు. డీఈఓలతో కూడా వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి సూచనలు చేశారు. విద్యార్థులు భౌతిక దూరం పాటించేందుకు వీలుగా పరీక్ష కేంద్రాల సంఖ్యను రెట్టింపు చేయాలని యోచిస్తున్నారు.

 

  • Tags