• facebook
  • whatsapp
  • telegram

పీజీ డిప్లొమా సీట్ల అప్పగింత నిలిపివేత

* ఈ ఏడాదికి చెల్లదంటూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు
ఈనాడు, హైదరాబాద్‌: వైద్యవిద్యలో పీజీ మెడికల్‌ సీట్ల కోసం వైద్యకళాశాలలు పీజీ డిప్లొమా సీట్లు అప్పగించడాన్ని నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. 2020-21 విద్యాసంవత్సరానికి రెండేళ్ల డిప్లొమా సీట్లను అప్పగించి మూడేళ్ల పీజీ సీట్లను పొందడం చెల్లదని స్పష్టం చేసింది. పీజీ డిప్లొమా సీట్ల అప్పగింతకు అవకాశమిచ్చే నిబంధనలను సవాలు చేస్తూ డాక్టర్‌ పి.భావన పిటిషన్‌ దాఖలు చేశారు. డిప్లొమా కోర్సు సీట్లలో 50శాతం పొందేందుకు గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ వైద్యశాలల్లో పనిచేసేవారికి అవకాశం ఉందని, ప్రస్తుతం ఆ సీట్లను అప్పగించి కాలేజీలు డిగ్రీ కోర్సులను తీసుకోవడం వల్ల తనకు అవకాశం దక్కలేదని ఆమె పేర్కొన్నారు. దీనిపై జస్టిస్‌ ఎం.ఎస్‌.రామచంద్రరావు, జస్టిస్‌ టి.అమర్‌నాథ్‌గౌడ్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టి మే 7న‌ ఉత్తర్వులు జారీచేసింది. గ్రామాల్లో పనిచేసే వారికి డిప్లొమా సీట్లు అనుకూలంగా ఉన్నా, వాటిని వెనక్కి అప్పగించాలన్న ప్రభుత్వ, భారతీయ వైద్యమండలి(ఎంసీఐ) నిర్ణయం ప్రజాప్రయోజనాలకు విరుద్ధమని వ్యాఖ్యానించింది. కరోనా నేపథ్యంలో దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో మౌలిక వసతులు, వెంటిలేటర్లు, మందుల లేమితో పాటు పేదలకు సేవలందించే నిపుణులైన వైద్యుల కొరతా ఉందని పేర్కొంది. అందువల్లనే లాక్‌డౌన్‌ను రెండు నెలలకు పైగా పొడిగించాల్సి వచ్చిందని ప్రస్తావించింది. గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసేవారు పీజీ డిప్లొమాతో నైపుణ్యాలను పెంచుకుని ప్రభుత్వ వైద్యరంగ బలోపేతానికి కృషిచేస్తారన్న విషయాన్ని ఎంసీఐ, ప్రభుత్వం విస్మరించినట్లున్నాయని వ్యాఖ్యానించింది. కరోనా నేపథ్యంలో ప్రభుత్వ వైద్యరంగాన్ని పటిష్ఠం చేయాలని భావిస్తే పీజీ మెడికల్‌ సీట్ల కోసం డిప్లొమా సీట్లను అప్పగించాలన్న నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం, ఎంసీఐ అనుమతించి ఉండేవి కావంది. ప్రైవేటు కాలేజీల లబ్ధికే ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లుందని వ్యాఖ్యానించింది. సీట్ల మార్పిడికి అవకాశం ఏర్పడటంతో 6 ప్రైవేటు, ప్రభుత్వ కళాశాలల్లో ఉన్న 18 పీజీ డిప్లొమా సీట్లను ప్రభుత్వానికి అప్పగించి మెడికల్‌ సీట్లు పొందాయని, ఈ చర్యను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు కాకతీయ వైద్యకళాశాల, కామినేని, ప్రతిమ, ఎంఎన్‌ఆర్‌, గాంధీ మెడికల్‌ కాలేజీలను ప్రతివాదులుగా చేర్చి నోటీసులు జారీచేసింది. తదుపరి విచారణను జూన్‌ ఒకటికి వాయిదా వేసింది.

 

  • Tags