• facebook
  • whatsapp
  • telegram

డిగ్రీ స్పాట్‌ ప్రవేశాల్లో చేరేవాళ్లకూ బోధనా రుసుం

* కరోనా నేపథ్యంలో అవకాశం ఇవ్వాలని ప్రతిపాదించనున్న విద్యామండలి
ఈనాడు, హైదరాబాద్‌: ప్రైవేట్‌ డిగ్రీ కళాశాలల్లో స్పాట్‌ ద్వారా ప్రవేశాలు పొందే విద్యార్థులకు వచ్చే విద్యా సంవత్సరం(2020-21)లో బోధనా రుసుం పొందేందుకు అర్హత కల్పించాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి భావిస్తోంది. ఈ మేరకు ప్రభుత్వానికి త్వరలో ప్రతిపాదించనుంది. ఛాయిస్‌ బేస్డ్‌ క్రెడిట్‌ సిస్టమ్‌(సీబీసీఎస్‌) కారణంగా డిగ్రీలోనూ సెమిస్టర్‌ విధానం అమల్లోకి వచ్చింది. ఈ విద్యా సంవత్సరం(2019-20) దోస్త్‌ ద్వారా డిగ్రీలో ప్రవేశాలకు 5 విడతల్లో కౌన్సెలింగ్‌ నిర్వహించారు. దాంతో విద్యా సంవత్సరం ప్రారంభం ఆలస్యమైంది. ఈ నేపథ్యంలో వచ్చే విద్యా సంవత్సరం(2020-21)లో మూడు విడతల్లోనే దోస్త్‌ కౌన్సెలింగ్‌ జరపాలని జనవరిలో నిర్ణయించారు. కరోనా మహమ్మారి కారణంగా ప్రవేశాలు మరింత జాప్యమయ్యే అవకాశాలు ఉండటంతో కౌన్సెలింగ్‌ను రెండు విడతలకే పరిమితం చేయాలని భావిస్తున్నారు. దానికితోడు ప్రైవేట్‌ డిగ్రీ కళాశాలలకు 30 శాతం యాజమాన్య కోటా ఇవ్వాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. దీనిపై జీవో జారీ కావాల్సి ఉంది. అయితే రెండు విడతల్లో కౌన్సెలింగ్‌ నిర్వహిస్తే 70 శాతం కన్వీనర్‌ కోటాకు సంబంధించి మిగిలిపోయే సీట్లకు స్పాట్‌ ద్వారా ప్రవేశాలు కల్పించాలని కళాశాలల యాజమాన్యాలు ఇప్పటికే ఉన్నత విద్యామండలికి విన్నవించాయి. ఆ విధానంలో చేరేవారికీ ఫీజు రీఎంబర్స్‌మెంట్‌ సైతం వర్తింపజేయాలని కోరాయి. ఈక్రమంలో దానిపై త్వరలో ఉన్నత విద్యామండలి చర్చించి సర్కారుకు ప్రతిపాదన పంపనుంది. తుది నిర్ణయం తీసుకోవాల్సింది రాష్ట్ర ప్రభుత్వమేనని విద్యామండలి ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

 

  • Tags