• facebook
  • whatsapp
  • telegram

ఇంటర్‌ మూల్యాంకనంలో జోక్యం చేసుకోలేం

* స్పష్టం చేసిన హైకోర్టు
ఈనాడు, హైదరాబాద్‌: ఇంటర్‌ మూల్యాంకనం ప్రక్రియలో జోక్యం చేసుకోవడానికి హైకోర్టు నిరాకరించింది. మాస్క్‌లు, శానిటైజేషన్‌, సామాజిక దూరం వంటి జాగ్రత్తలతో కొనసాగించవచ్చని పేర్కొంది. లాక్‌డౌన్‌ పూర్తయ్యే దాకా మూల్యాంకనం వాయిదా వేయాలంటూ సామాజిక కార్యకర్త కె.ఓంప్రకాష్‌ మే 12న‌ అత్యవసరంగా భోజన విరామ సమయం (లంచ్‌ మోషన్‌)లో విచారణ చేపట్టాలని ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై జస్టిస్‌ ఎం.ఎస్‌.రామచంద్రరావు, జస్టిస్‌ కె.లక్ష్మణ్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్‌ తరఫు న్యాయవాది పి.వి.కృష్ణయ్య వాదనలు వినిపిస్తూ మే 12 నుంచే మూల్యాంకనం మొదలైందని, దీనివల్ల కరోనా వైరస్‌ వ్యాప్తికి అవకాశం ఉందన్నారు. మూల్యాంకనం కొనసాగించాలనుకుంటే లెక్చరర్లకు, సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించి అనుమతించాలని కోరారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ  ఇన్ని రోజులు లాక్‌డౌన్‌ ఉన్నా పరిస్థితి పూర్తిగా నియంత్రణలోకి రాలేదని, వెలువడుతున్న అభిప్రాయాలను చూస్తుంటే కరోనా ఇప్పుడిప్పుడే తగ్గేలా లేదంది. ఈ నేపథ్యంలో జాగ్రత్తలతో ముందుకు సాగాల్సిందేనని, లేదంటే కరోనా చావుల కంటే ఆకలి చావులు ఎక్కువయ్యే అవకాశం ఉందని పేర్కొంది. ఇతర కోర్సుల్లో ప్రవేశాలు, పోటీ పరీక్షలు తదితరాల కోసం ఫలితాలు వెల్లడించకపోతే విద్యార్థులకు ఇబ్బందులెదురవుతాయంది. అడ్వొకేట్‌ జనరల్‌ బి.ఎస్‌.ప్రసాద్‌ సమాధానమిస్తూ లెక్చరర్లకు ప్రత్యేక బస్సులు, భోజన సదుపాయాలు ఏర్పాటు చేశామని, మూల్యాంకనం నిర్వహించే భవనాలను శానిటైజ్‌ చేశామన్నారు. తగిన జాగ్రత్తలతో అనుమతిస్తూ విచారణను ధర్మాసనం 3 వారాలకు వాయిదా వేసింది.
ఇంటర్‌ మూల్యాంకనానికి 4,350 మంది హాజరు
ఈనాడు, హైదరాబాద్‌: ఇంటర్‌ జవాబుపత్రాల తొలిరోజు మూల్యాంకనంలో 4,350 మంది పాల్గొన్నారు. మే 12న‌ రాష్ట్రవ్యాప్తంగా 12 కేంద్రాలు, వాటికి అనుబంధంగా 22 ప్రత్యేక భవనాల్లో మూల్యాంకనం మొదలుకాగా 76 శాతం మంది అధ్యాపకులు హాజరయ్యారని ఇంటర్‌బోర్డు కార్యదర్శి జలీల్‌ తెలిపారు. మొదటిరోజు ఆంగ్లం, సంస్కృతం, గణితం, పౌరశాస్త్రం సబ్జెక్టుల మూల్యాంకనమే ప్రారంభించారు. మూల్యాంకన కేంద్రాలకు అధ్యాపకులు రావడానికి ప్రధాన మార్గాల్లో స్థానిక రవాణాను అందుబాటులో ఉంచామని జలీల్‌ చెప్పారు. అధ్యాపకులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించాక అనుమతించామని తెలిపారు.

 

  • Tags