• facebook
  • whatsapp
  • telegram

ఆంగ్ల మాధ్యమానికే ఎస్‌సీఈఆర్టీ సిఫార్సు

* 59 పేజీల నివేదిక ఆమోదిస్తూ ఉత్తర్వులిచ్చిన ప్రభుత్వం
ఈనాడు, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో 1-10 తరగతి వరకు విడతల వారీగా ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టేందుకు రాష్ట్ర విద్య పరిశోధన, శిక్షణ మండలి (ఎస్‌సీఈఆర్టీ) సిఫార్సు చేసింది. ప్రాథమిక విద్యలో ఆంగ్ల మాధ్యమంపై 59 పేజీల నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. ఈ సిఫార్సులను ఆమోదిస్తూ ప్రభుత్వం మే 13న‌ రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. కన్నడ, ఒరియా, తమిళం, ఉర్దూ మాధ్యమాలు కొనసాగుతాయని, వీటిలో ఎవరైనా ఆంగ్ల మాధ్యమం కావాలంటే సమాంతరంగా నిర్వహించవచ్చని ఎస్‌ఈఆర్టీ సూచించింది. 53,947 మంది తెలుగు మాధ్యమాన్ని కోరుకున్నందున వారి కోసం మండలానికో పాఠశాల చొప్పున 672 తెలుగు మాధ్యమ పాఠశాలలు ఏర్పాటు చేయాలని సూచించింది. వారు ఉంటున్న ప్రాంతం నుంచి పాఠశాలకు వచ్చేందుకు రవాణా సదుపాయం కల్పించాలని, ఏడాదికి విద్యార్థికి రూ.6వేలు చెల్లించాలని పేర్కొంది. ఇందుకు రూ.32 కోట్లు వ్యయం కానున్నట్లు ఎస్‌సీఈఆర్టీ సిఫార్సుల్లో వెల్లడించింది. ఎస్‌సీఈఆర్టీ నివేదిక, పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ సిఫార్సుల అమలుకు సుప్రీంకోర్టు ఆదేశాల కోసం ఎదురుచూడాల్సి ఉంటుందని వెల్లడించింది. ‘అక్షరాస్యత క్షీణించడానికి బోధన మాధ్యమంతో సంబంధం లేదు. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం పెట్టిన తర్వాత పదోతరగతిలో తెలుగు మాధ్యమంలో చదువుతున్న విద్యార్థుల కంటే ఆంగ్ల మాధ్యమంలో చదువుతున్నవారు బాగా రాణిస్తున్నారు. తల్లిదండ్రులు ఆంగ్ల మాధ్యమాన్ని కోరుకుంటున్నందున ఆంగ్ల మాధ్యమం విజయవంతమయ్యేందుకు అన్ని చర్యలు తీసుకోవాలి’ అని తన సిఫార్సుల్లో పేర్కొంది.

  • Tags