• facebook
  • whatsapp
  • telegram

సగం సీట్లు భర్తీకాని ఇంజినీరింగ్‌ కళాశాలల్లోనే తనిఖీ

ఈనాడు, హైదరాబాద్‌: గత రెండు మూడేళ్లుగా సగం, అంతకన్నా తక్కువ సీట్లు భర్తీ అయిన ఇంజినీరింగ్‌ కళాశాలలనే ఈ దఫా తనిఖీ చేయాలని జేఎన్‌టీయూహెచ్‌ సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఏటా జరిగే ఎంసెట్‌ కౌన్సెలింగ్‌లో ఏయే కళాశాలల్లో ఎన్ని సీట్లకు అనుమతి ఇవ్వాలన్నది తేల్చేందుకు విశ్వవిద్యాలయం మార్చి నుంచి తనిఖీలు ప్రారంభిస్తుంది. కరోనా కారణంగా ఈ సారి ఆ ప్రక్రియ సాధ్యం కాలేదు. వచ్చే విద్యా సంవత్సరానికి(2020-21) జూన్‌ 15 నాటికి అనుమతులు ఇస్తామని ఏఐసీటీఈ పేర్కొంది. విశ్వవిద్యాలయాలు మాత్రం జూన్‌ 30వ తేదీ నాటికి అనుబంధ గుర్తింపు ఇచ్చే ప్రక్రియ పూర్తిచేయాలని గడువును నిర్దేశించింది. ఈ క్రమంలో మొత్తం కళాశాలలను తనిఖీ చేసే పరిస్థితి, సమయం ఉండకపోవచ్చని భావించిన వర్శిటీ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. వర్శిటీ పరిధిలో 162 అనుబంధ ప్రైవేటు కళాశాలలు ఉండగా.. సగం సీట్లు నిండనివి 50 వరకు ఉన్నట్టు సమాచారం.

  • Tags