• facebook
  • whatsapp
  • telegram

‘ప్రైవేట్’లోనూ తెలుగు అమలయ్యేలా చూడండి

* హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం
ఈనాడు, అమరావతి: రాష్ట్రంలోని ప్రైవేట్, అన్‌ ఎయిడెడ్‌ పాఠశాలల్లో తెలుగు మాధ్యమాన్ని అమలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ ప్రజాహిత వ్యాజ్యం(పిల్‌) హైకోర్టులో దాఖలైంది. విద్యాహక్కు చట్టంలోని సెక్షన్‌ 29, ఏపీ విద్యా చట్టం సెక్షన్‌ 7, ఆంగ్ల మాధ్యమంపై తాజాగా హైకోర్టు ఇచ్చిన తీర్పును పరిగణనలోకి తీసుకోవాలని అందులో కోరారు. గరీబ్‌ గైడ్‌ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షురాలు భార్గవి దాఖలు చేసిన ఈ వ్యాజ్యంపై హైకోర్టు మే 14 న‌ విచారణ జరిపింది. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలు సమర్పించాలని పేర్కొంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి, కేంద్ర మానవవనరులశాఖ ముఖ్యకార్యదర్శికి నోటీసులు జారీచేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌ సోమయాజులు, జస్టిస్‌ కె.లలితతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది. తదుపరి విచారణను వారం రోజులకు వాయిదా వేసింది. పిటిషనర్‌ తరఫు న్యాయవాది డీవీ రావు వాదనలు వినిపిస్తూ..వచ్చే విద్యా సంవత్సరానికి ఒకటో తరగతి నుంచి 8వరకు జరిగిన ఆంగ్ల మాధ్యమంలో ప్రవేశాలను నిలువరించాలని కోరారు. ఆ వాదనల్ని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం వివరాలు సమర్పించాలని ప్రతివాదుల్ని ఆదేశించింది.

  • Tags