• facebook
  • whatsapp
  • telegram

దివ్యాంగులకు ఆన్‌లైన్‌ పాఠాలు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో దివ్యాంగుల గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో వచ్చే విద్యాసంవత్సరానికి తీసుకోవాల్సిన చర్యలపై దివ్యాంగ సంక్షేమ శాఖ కార్యాచరణ సిద్ధం చేస్తోంది. బధిరులు, అంధులు, ఇతర దివ్యాంగ విద్యార్థులకు అవసరమైన పరికరాలు సమీకరించి, ఆన్‌లైన్‌ బోధనకు పాఠ్యాంశాలు రూపొందించేందుకు కసరత్తు మొదలుపెట్టింది. పాఠశాలలు, కళాశాలల ప్రిన్సిపాళ్లతో దివ్యాంగుల సంక్షేమ శాఖ సంచాలకురాలు బి.శైలజ, సహాయ సంచాలకులు వరప్రసాద్‌ మే 15న ఆన్‌లైన్‌ సమావేశం నిర్వహించారు. వచ్చే ఏడాదికి తీసుకోవాల్సిన చర్యలు, జాగ్రత్తలపై రెండు ప్రత్యేక బృందాలను నియమించినట్లు డైరెక్టర్‌ శైలజ తెలిపారు. వినికిడి లోపమున్న విద్యార్థులకు వీడియో పాఠాలు, దృష్టి లోపమున్న వారికి ఆడియో పాఠాలు అందుబాటులోకి తీసుకురానున్నట్లు చెప్పారు. దృష్టి లోపమున్న విద్యార్థుల కోసం సెన్సర్‌లతో కూడిన పరికరాలు, కళాశాలలు - పాఠశాలల్లో ప్రత్యేక శానిటైజేషన్‌ ఏర్పాట్లు చేయాల్సిన అవసరముందన్నారు. విద్యార్థులు, సిబ్బందికి మాస్కులు, శానిటైజర్ల పంపిణీపై చర్చించారు.

  • Tags