• facebook
  • whatsapp
  • telegram

‘పీజీ మెడికల్‌ డిప్లొమా సీట్ల సరెండర్‌’ కేసులో స్టే

* కేంద్రం, ఎంసీఐ తదితరులకు సుప్రీం నోటీసులు
ఈనాడు, దిల్లీ: పీజీ మెడికల్‌ డిప్లొమా సీట్ల సరెండర్‌ విషయంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే విధించింది. 2020-21లో ఇన్‌సర్వీస్‌ అభ్యర్థులకు ప్రాధాన్యం ఇచ్చే పీజీ డిప్లొమా సీట్లను సరెండర్‌ చేయడానికి ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్‌ కళాశాలలకు అనుమతిస్తూ జులై 12, 2018న మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా(ఎంసీఐ) నిర్ణయం తీసుకుంది. దీనిపై కొన్ని వైద్యకళాశాలలు తెలంగాణ హైకోర్టుకు వెళ్లగా ఈ నెల 7న ఎంసీఐ ఉత్తర్వులను నిలిపివేసింది. దీన్ని సవాల్‌ చేస్తూ కామినేని, ఎంఎన్‌ఆర్‌, ప్రతిమ మెడికల్‌ కళాశాలలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. ఈ పిటిషన్‌ను  జస్టిస్‌ శాంతనుగౌడార్‌, జస్టిస్‌ ఆర్‌.సుభాష్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం మే 15న విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరఫు సీనియర్‌ న్యాయవాది కేవీ విశ్వనాథన్‌, న్యాయవాది అల్లంకి రమేశ్‌లు వాదనలు వినిపిస్తూ.. హైకోర్టులో కేసుకు తమకు ఎలాంటి సంబంధం లేదన్నారు. రాష్ట్ర కౌన్సెలింగ్‌ కటాఫ్‌ తేదీ మే 13 అని, సెంట్రల్‌ కౌన్సెలింగ్‌ మే 31తో పూర్తవుతుందని తెలిపారు. హైకోర్టులో తదుపరి విచారణ జూన్‌ 1కి వాయిదా వేసిన నేపథ్యంలో 2020-21 సంవత్సరానికి గాను తెలంగాణలోని మెడికల్‌ కళాశాలలకు కేటాయించిన 18 పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ సీట్లు వృథా అవుతాయన్నారు. ఈ విషయంలో ధర్మాసనం జోక్యం చేసుకొని న్యాయం చేయాలని అభ్యర్థించారు. వాదనల అనంతరం తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధించిన ధర్మాసనం.. హైకోర్టులో పిటిషనర్‌, కేంద్రం, ఎంసీఐ, రాష్ట్ర ప్రభుత్వం, నేషనల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌, నిమ్స్‌, గాంధీ ఆసుపత్రులు, బసవతారకం అమెరికన్‌ క్యాన్సర్‌ ఆసుపత్రి తదితరులకు నోటీసులు జారీ చేస్తూ విచారణను వాయిదా వేసింది.

  • Tags