• facebook
  • whatsapp
  • telegram

జులై 20 నాటికి ప్రైవేట్‌ కళాశాలల అనుమతులు పూర్తి

ఈనాడు, హైదరాబాద్‌: వచ్చే విద్యా సంవత్సరానికి(2020-21) ప్రైవేట్‌ జూనియర్‌ కళాశాలల అనుబంధ గుర్తింపు కోసం యాజమాన్యాలు జూన్‌ 10వ తేదీ వరకు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ మేరకు ఇంటర్‌బోర్డు మే 17న నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఆలస్య రుసుంతో జులై 8 వరకు దరఖాస్తులు తీసుకుంటామని, తర్వాత అంగీకరించమని బోర్డు స్పష్టం చేసింది. మొత్తం 9 సెక్షన్లకు మాత్రమే అనుమతి ఇస్తారు. అదనపు సెక్షన్లు కావాలంటే అదనపు వసతి సమకూర్చాలంది. మొత్తం అనుమతి పొందిన కళాశాలల జాబితాను జులై 20వ తేదీ నాటికి వెబ్‌సైట్లో ఉంచుతామంది. నిబంధనల ప్రకారం ఆయా ధ్రువపత్రాలతోపాటు అగ్ని మాపకశాఖ నుంచి నిరభ్యంతర ధ్రువపత్రం తప్పనిసరిగా ఉండాలని, లేకుంటే అనుమతి నిరాకరిస్తామని బోర్డు స్పష్టం చేసింది.
‘పది’ ఫలితాల తర్వాత ఇంటర్‌ తరగతులు
హైకోర్టు అనుమతి ఇస్తే జూన్‌ రెండో వారంకల్లా పది పరీక్షలు పూర్తి చేయాలని విద్యాశాఖ భావిస్తోంది. జూన్‌ నెలాఖరు లేదా జులై మొదటి వారంలో ఫలితాలు వెలువడతాయని అంచనా. తర్వాత ఇంటర్‌ మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభిస్తామని కార్యదర్శి జలీల్‌ తెలిపారు. రెండో ఏడాది తరగతులు అంతకంటే ముందు ప్రారంభిస్తామన్నారు.

  • Tags