• facebook
  • whatsapp
  • telegram

పెంచిన రుసుంలో 50-60% చెల్లించాలి

* మిగిలిన మొత్తానికి బాండు సమర్పించాలి
* పాత ఫీజుకు ఇది అదనం
* పీజీ మెడికల్‌ కోర్సుల రుసుముల పెంపుపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు
ఈనాడు, హైదరాబాద్‌: పీజీ మెడికల్‌ కోర్సులకు పెంచిన ఫీజుల్లో పిటిషనర్లలో ‘ఎ’ కేటగిరీవారు 50 శాతం, బి (సబ్‌ కేటగిరీ1) వారు మేనేజ్‌మెంట్‌ కోటాలో 60 శాతం చెల్లించాలంటూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. మిగిలిన మొత్తాలకు విద్యార్థులు ఆయా కాలేజీల పేరుతో బాండ్లు సమర్పించాలంది. ఈ బాండ్లు కోర్టు తుది తీర్పునకు లోబడి ఉంటాయని స్పష్టం చేసింది. 2016లో జారీ చేసిన జీవో 29 ప్రకారం పాత ఫీజులకు ఇది అదనం అని స్పష్టం చేసింది. కరోనా నేపథ్యంలో తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితితోపాటు కాలేజీలను దృష్టిలో ఉంచుకుని మధ్యేమార్గంగా ఈ మధ్యంతర ఉత్తర్వులిస్తున్నట్లు కోర్టు పేర్కొంది. పీజీ మెడికల్‌ కోర్సుల ఫీజులను పెంచుతూ ఏప్రిల్ 14న ప్రభుత్వం జారీ చేసిన జీవో 20ను సవాలు చేస్తూ డాక్టర్‌ సుదీప్‌శర్మ మరో 120 మంది పిటిషన్‌ దాఖలు చేసిన విషయం విదితమే. దీనిపై మే 20న ప్రత్యేక ధర్మాసనం విచారణ చేపట్టింది. పీజీ మెడికల్‌ కోర్సుల్లో కన్వీనర్‌ కోటాతోపాటు మేనేజ్‌మెంట్‌ కోటా కింద సీటుకు 150 నుంచి 550 శాతం ఫీజు పెంచారని పిటిషనర్ల తరఫు న్యాయవాది సామా సందీప్‌రెడ్డి చెప్పగా.. నిర్వహణ వ్యయం పెరిగిందని, విద్యార్థులకు రూ.48 వేల దాకా ఉపకారవేతనం చెల్లించాల్సి వస్తోందని మెడికల్‌ కాలేజీల తరఫున సీనియర్‌ న్యాయవాదులు వాదించారు. వాదనలు విన్న ధర్మాసనం  ఫీజులను ఏ అంశాల ప్రాతిపదికన టీఏఎఫ్‌ఆర్‌సీ పెంచిందో తెలుసుకోవడానికి తగిన కారణాలు తమ ముందు లేవని, ప్రభుత్వ జీవోలో కూడా వెల్లడించలేదంది. ఈ పరిస్థితుల్లో నిర్ణయం తీసుకోలేమంది. ప్రభుత్వం, టీఏఎఫ్‌ఆర్‌సీ, ప్రైవేటు కాలేజీలు కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను 4 వారాలకు వాయిదా వేసింది.