• facebook
  • whatsapp
  • telegram

10, 12వ తరగతుల పరీక్షలకు లాక్‌డౌన్‌ నుంచి మినహాయింపు

కేంద్ర మంత్రి అమిత్‌ షా వెల్లడి
ఈనాడు, దిల్లీ: లాక్‌డౌన్‌ నిబంధనల నుంచి పది, పన్నెండో తరగతి పరీక్షల నిర్వహణకు మినహాయింపు ఇస్తున్నట్టు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా వెల్లడించారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాలకు సమాచారం ఇచ్చినట్టు తెలిపారు. ఈ మేరకు ఆయన మే 20న ట్వీట్‌ చేశారు. ‘‘పెద్ద సంఖ్యలో ఉన్న విద్యార్థుల చదువులను దృష్టిలో ఉంచుకుని లాక్‌డౌన్‌ నిబంధనల నుంచి 10, 12 తరగతుల పరీక్షల నిర్వహణకు మినహాయింపు ఇవ్వాలని నిర్ణయించాం. విద్యార్థులను దూరం దూరంగా కూర్చోబెట్టి పరీక్షలు రాయించాలి.  అందరూ తప్పనిసరిగా మాస్కులను ధరించాలి’ అని మంత్రి పేర్కొన్నారు.
కంటెయిన్‌మెంట్‌ కేంద్రాల్లో పరీక్షలు వద్దు
కంటెయిన్‌మెంట్‌ జోన్లలోని కేంద్రాల్లో 10, 12 తరగతుల పరీక్షలను నిర్వహించరాదని కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్‌ భల్లా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు లేఖ రాశారు. పరీక్ష కేంద్రాల వద్ద థర్మల్‌ పరీక్షలు నిర్వహించాలని, శానిటైజర్లను అందుబాటులో ఉంచాలని సూచించారు. పరీక్ష కేంద్రాలకు విద్యార్థులు చేరుకునేందుకు బస్సులు వేయాలని సూచించారు.