• facebook
  • whatsapp
  • telegram

పుస్తకంలో ఒకటి.. కీలో మరొకటి

* ఇంటర్‌ ప్రథమ ఆంగ్లం జవాబుల్లో వైరుధ్యాలు
ఈనాడు, హైదరాబాద్‌:  ఇంటర్‌ ప్రథమ సంవత్సరం ఆంగ్లం సబ్జెక్టు పాఠ్యపుస్తకంలో ఒకరకంగా జవాబులు.. జవాబుపత్రాల మూల్యాంకనం సందర్భంగా ఇచ్చిన కీలో మరోరకంగా ఉండటంతో విద్యార్థులు మార్కులు కోల్పోనున్నారు. ఆరు ప్రశ్నల్లో వైరుధ్యాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. గ్రామర్‌కు సంబంధించి ప్రశ్నలను పాఠ్యపుస్తకం నుంచే ఇచ్చారు. అందులో జవాబులకు భిన్నంగా ఇంటర్‌ బోర్డు కీలో ఇచ్చారని, మార్కులు వేసేటప్పుడు ఈ కీని మాత్రమే పరిగణనలోకి తీసుకొని మార్కులు ఇస్తారని, దానివల్ల పాఠ్యపుస్తకాల్లో ఉన్న దాన్ని రాస్తే 4.5 మార్కులు కోల్పోతారని అధ్యాపకులు చెబుతున్నారు. కొన్ని మూల్యాంకన కేంద్రాల్లో ఈ విషయాన్ని కీ రూపొందించిన నిపుణుల దృష్టికి తీసుకెళ్లారు. పాఠ్యపుస్తకంలో ఉన్న జవాబులు రాసిన వారికీ మార్కులు ఇస్తున్నట్లు వరంగల్‌ మూల్యాంకనంలో పాల్గొన్న అధ్యాపకుడు ఒకరు తెలిపారు.
ఇంటర్‌బోర్డు రహస్యం
పరీక్షల సమయంలో ఆంగ్లం సబ్జెక్టుతో పాటు కామర్స్‌ తదితర పలు సబ్జెక్టుల్లో తప్పులు దొర్లాయి. ఏ సబ్జెక్టులో ఎన్ని మార్కులు కలుపుతారో అన్నది ఇంటర్‌బోర్డు ఇప్పటివరకు స్పష్టం చేయలేదు. ఎందుకు అంత రహస్యంగా ఉంచుతుందో అర్థం కావడం లేదని కొందరు అధ్యాపకులు ప్రశ్నిస్తున్నారు. బహిరంగంగా చెబితే విద్యార్థులు ఆందోళన చెందకుండా ఉంటారని వారంటున్నారు.