• facebook
  • whatsapp
  • telegram

ఈసారి పరీక్ష కేంద్రాల వద్ద తనిఖీ ఉండదు

ఈనాడు, హైదరాబాద్‌: పదో తరగతితో పాటు ఇతర రాష్ట్ర, జాతీయ ప్రవేశ పరీక్షల కేంద్రాల వద్ద ఈసారి సిబ్బంది విద్యార్థులను తనిఖీ చేయరు. కరోనా ప్రబలిన నేపథ్యంలో వైరస్‌ బారిన పడకుండా విద్యార్థులు భౌతిక దూరం పాటించడం తప్పనిసరి. అందుకే అత్యవసరమైతే తప్ప పరీక్ష కేంద్రంలో ఏ వస్తువునూ విద్యార్థులు తాకరాదని, సిబ్బంది సైతం విద్యార్థులను, వారి హాల్‌టికెట్‌ను సైతం ముట్టరాదని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ(ఎయిమ్స్‌) ఇటీవల జాతీయ పరీక్షల మండలి(ఎన్‌టీఏ), జేఈఈ మెయిన్‌, అడ్వాన్స్‌డ్‌, సీబీఎస్‌ఈ అధికారులకు, టీసీఎస్‌ అయాన్‌ ప్రతినిధులకు సూచించింది. బయోమెట్రిక్‌ హాజరు విధానం వద్దని పేర్కొంది. ఈ మార్గదర్శకాలను జేఈఈ మెయిన్‌, అడ్వాన్స్‌డ్‌, నీట్‌ తదితర జాతీయ ప్రవేశపరీక్షలతో పాటు రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో జరిగే ఎంసెట్‌, ఇతర ప్రవేశ పరీక్షల్లోనూ అమలు చేయనున్నారు. ఇదే విధానాన్ని పది పరీక్ష కేంద్రాలకూ వర్తింపజేయనున్నారు.  పరీక్ష కేంద్రంలోకి వెళ్లేటప్పుడు విద్యార్థులు చిట్టీలు(కాపీలు) తీసుకెళకుండా జేబులను తనిఖీ చేయడం ఎలా అన్న ప్రశ్న తలెత్తింది. దీనిపై ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు సత్యనారాయణరెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థులు కొన్నేళ్లుగా చిట్టీలు తీసుకొచ్చే పరిస్థితి లేదన్నారు. ఈసారి వారిని తనిఖీ చేయటానికి బదులు కాపీయింగ్‌ జరగకుండా ఇతరత్రా నిఘా పెంచుతామని తెలిపారు.