• facebook
  • whatsapp
  • telegram

పీజీ వైద్య పరీక్ష పర్యవేక్షకులకు వెసులుబాటు

ఈనాడు, హైదరాబాద్‌: పీజీ వైద్యవిద్య పరీక్షల్లో పర్యవేక్షకుల నియామకాలపై భారతీయ వైద్య మండలి(ఎంసీఐ) వెసులుబాటు కల్పించింది. తప్పనిసరి పరిస్థితుల్లో ఒకే ఆరోగ్య విశ్వవిద్యాలయ పరిధిలోని వేర్వేరు కళాశాలల నుంచీ పర్యవేక్షకులను నియమించుకోవచ్చంది. నిబంధనలను సడలిస్తూ మే 22 న ఉత్తర్వులు జారీచేసింది. జూన్‌ 30 నాటికి పీజీ వైద్యవిద్య పరీక్షల నిర్వహణను విశ్వవిద్యాలయాలు పూర్తిచేయాల్సిందేనని ఆదేశించింది. పీజీ వైద్యవిద్య పరీక్షలకు ఇతర వర్సిటీల నుంచి పర్యవేక్షకుల(ఎక్స్‌టర్నల్‌ ఎగ్జామినర్స్‌)ను నియమిస్తుంటారు. ప్రస్తుతం  కొవిడ్‌ ప్రబలుతున్నందున.. ఇతర రాష్ట్రాల ఎగ్జామినర్లను తీసుకోవడం సాధ్యం కాదు కాబట్టి పర్యవేక్షకుల నియామకాల్లో తాము సూచిస్తున్న 4 ప్రత్యామ్నాయాల్లో ఒకదాన్ని ఎంచుకోవాలంది. ఈ వెసులుబాటు ఈ ఒక్క సంవత్సర పీజీ వైద్యవిద్య పరీక్షలకు మాత్రమే వర్తిసుందని ఎంసీఐ స్పష్టంచేసింది.
ప్రత్యామ్నాయాలివి..
* రాష్ట్రంలో మరో ఆరోగ్య విశ్వవిద్యాలయం ఉంటే.. ఆ విశ్వవిద్యాలయం నుంచి ఇద్దరు పరీక్ష పర్యవేక్షకులను నియమించుకోవచ్చు. వీరిద్దరూ కచ్చితంగా పరీక్ష కేంద్రానికి హాజరవ్వాలి. ఉదాహరణకు తెలంగాణలో కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఉండగా, నిమ్స్‌ స్వతంత్ర సంస్థగా పనిచేస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో నిమ్స్‌ ఆచార్యులను కాళోజీ వర్సిటీ పరిధిలోని కళాశాలల్లో పరీక్షలకూ.. అక్కడి వారిని నిమ్స్‌ పరిధి పరీక్షలకూ పరస్పరం నియమించుకోవచ్చు.
* ఇద్దరిలో ఒకరిని రాష్ట్రంలోని ఇతర యూనివర్సిటీ నుంచి, మరొకరిని ఇతర రాష్ట్రాలకు సంబంధించిన విశ్వవిద్యాలయం నుంచి నియమించుకోవచ్చు. అయితే రాష్ట్రంలోని విశ్వవిద్యాలయ పర్యవేక్షకుడు పరీక్ష కేంద్రానికి హాజరు కావాలి. ఇతర రాష్ట్రానికి చెందిన పర్యవేక్షకుడు దృశ్యమాధ్యమంలో సమీక్షించాలి.
* ఒకవేళ ఒక రాష్ట్రంలో ఒకే విశ్వవిద్యాలయం ఉండి, మరో ఆరోగ్య విశ్వవిద్యాలయం లేని పరిస్థితులుంటే.. ఇద్దరిని ఇతర రాష్ట్రాలకు చెందినవారినే నియమించుకోవాలి. వారిద్దరూ దృశ్య మాధ్యమంలో పరీక్షను పర్యవేక్షించాలి.
* ఒక ఆరోగ్య విశ్వవిద్యాలయం పరిధిలో పలు వైద్యకళాశాలలుంటే.. ఒక కళాశాల ఆచార్యులను మరో కళాశాల పరీక్షలకు ఎక్స్‌టర్నల్‌ పర్యవేక్షకులుగా నియమించుకోవచ్చు. ఆ ఇద్దరూ తప్పక పరీక్ష కేంద్రానికి హాజరవ్వాలి.