• facebook
  • whatsapp
  • telegram

తగ్గిన పీజీ వైద్య విద్య కన్వీనర్‌ కోటా ఫీజులు!

ఈనాడు, అమరావతి: పీజీ వైద్య విద్య ఫీజులు తగ్గాయి. ఏపీ ఉన్నత విద్య, నియంత్రణ పర్యవేక్షణ కమిషన్‌ కొత్త ఫీజుల వివరాలను ప్రభుత్వానికి తెలియజేసింది. పీజీ క్లినికల్‌ డిగ్రీ (ఎండీ, ఎంఎస్‌) కన్వీనర్‌ కోటా కింద కనిష్ఠంగా రూ.4.5 లక్షల నుంచి గరిష్ఠంగా రూ.5.5 లక్షల మధ్య ఖరారు చేసినట్లు తెలిసింది. వైద్య కళాశాలలు సమర్పించిన వార్షిక ఆదాయ, వ్యయ వివరాల నుంచి ఈ ఫీజులను కమిషన్‌ ఖరారు చేసింది. 2017లో కన్వీనర్‌ కోటా కింద ఫీజును రూ.6.90 లక్షలుగా ఖరారు చేశారు. ఆ తర్వాత ప్రతి ఏటా ఫీజుల పెంపు వల్ల ప్రస్తుతం (2019-20) రూ.7.5 లక్షల వరకు చేరింది. అప్పట్లో అన్ని కళాశాలలకు ఒకే తరహాలో ఫీజులు ఖరారు చేశారు. ఇప్పుడు ఈ ఫీజు బాగా తగ్గింది. ‘బి’ కేటగిరీలోనూ 2017లో ఫీజు రూ.24.20 లక్షలుగా ఖరారు చేయగా, ఆ తర్వాత ఇదీ పెరిగింది. తాజాగా వీటిలోనూ తగ్గుదల ఉన్నట్లు తెలిసింది.