• facebook
  • whatsapp
  • telegram

ఉమ్మడి ప్రవేశపరీక్ష కేంద్రాల్లో ఐసొలేషన్‌ ల్యాబ్‌లు

* జ్వరం, కరోనా లక్షణాలు ఉన్నవారికి ప్రత్యేక ఏర్పాటు
* పరీక్షల నిర్వహణకు విధానాలు సూచించిన టీసీఎస్‌ ఆయాన్‌
ఈనాడు, అమరావతి: ఎంసెట్‌ సహా ఉమ్మడి ప్రవేశపరీక్షల్లో జ్వరం, కరోనా లక్షణాలు ఉండే విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఐసొలేషన్‌ ల్యాబ్‌ ఏర్పాటు చేసేందుకు టీసీఎస్‌ ఆయాన్‌ సంస్థ ప్రతిపాదించింది. ఉమ్మడి ప్రవేశ పరీక్షలను ఈ  సంస్థ నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్రాల వద్ద ఏర్పాటు చేయనున్న సదుపాయాలను వెల్లడించింది. ఈ పరీక్షలన్నింటినీ ఆన్‌లైన్‌లోనే నిర్వహిస్తారు. కరోనా కారణంగా ఉమ్మడి ప్రవేశ పరీక్షల నిర్వహణకు టీసీఎస్‌ ఆయాన్‌ కొన్ని విధానాలను ప్రతిపాదించింది.
ప్రతిపాదనలు ఇలా..
* పరీక్ష కేంద్రంలో విద్యార్థుల మధ్య ఆరు అడుగుల దూరం ఉంటుంది. ఇందుకు గది సామర్థ్యంలో 50 శాతం సీట్లనే కేటాయిస్తారు. ఈ విధానంలో పరీక్షలు జరిగే రోజులు పెరుగుతాయి.
* పరీక్షల సమయానికి కరోనా వైరస్‌ వ్యాప్తి తగ్గుతుందని భావిస్తే వందశాతం సామర్థ్యంతో పరీక్షకు అనుమతి ఇస్తారు. విద్యార్థుల మధ్య సాధారణ దూరం పాటిస్తూనే పరీక్షలు నిర్వహిస్తారు.
* జ్వరం, కరోనా లక్షణాలు ఉన్న విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఐసొలేషన్‌ ల్యాబ్‌ ఉంటుంది. మొత్తం విద్యార్థుల్లో 5శాతం మందికి వీటిని ఏర్పాటు చేస్తారు. ఈ గదిలో విద్యార్థుల మధ్య ఆరు అడుగుల దూరం ఉంటుంది.
కేంద్రాల వద్ద సదుపాయాలు..
* పరీక్ష కేంద్రాల విద్యార్థుల రద్దీని నియంత్రించేందుకు వాలంటీర్లను ఏర్పాట్లు చేస్తారు.
* ప్రతి ఒక్కరికీ ప్రవేశద్వారం వద్ద థర్మల్‌ స్క్రీనింగ్‌ నిర్వహిస్తారు. హాల్‌టిక్కెట్లపై ఉండే బార్‌కోడ్‌ను అక్కడే స్కానింగ్‌ చేస్తారు.
* ఇన్విజిలేటర్లు మాస్కులు, గ్లౌజ్‌లు ధరించాలి.
* శానిటైజర్లను అందుబాటులో ఉంచుతారు.
* సీసీటీవీ రికార్డింగ్‌, ప్రతి కంప్యూటర్‌పై వెబ్‌ కెమెరా ఏర్పాటు చేస్తారు.
ఐసొలేషన్‌ ల్యాబ్‌ వద్ద..
* జ్వరం, కరోనా లక్షణాలు ఉండే విద్యార్థుల కోసం ఏర్పాటు చేసే ఐసొలేషన్‌ ల్యాబ్‌ వద్ద పీపీఈ కిట్లతో వాలంటీర్లను ఏర్పాటు చేస్తారు.
* విద్యార్థులకు 3 పొరల మాస్కులు, గ్లౌజులు ఇస్తారు.