• facebook
  • whatsapp
  • telegram

డిగ్రీ, పీజీ కోర్సులకు ఒకే పరీక్షల షెడ్యూల్‌

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో డిగ్రీ, పోస్టుగ్రాడ్యుయేషన్‌(పీజీ) కోర్సులకు ఒకే పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేసేందుకు ఉన్నత విద్యామండలి కసరత్తు చేస్తోంది. జూన్‌ మొదటి వారానికి ఈ షెడ్యూల్‌ కొలిక్కి రానుంది. ప్రస్తుతం విశ్వవిద్యాలయాలు వేటికవి తమ సమయానికి అనుకూలంగా పరీక్షలు నిర్వహిస్తుండగా.. ఈసారి ఉమ్మడి షెడ్యూల్‌ను ఇవ్వనున్నాయి. లాక్‌డౌన్‌ కారణంగా డిగ్రీ, పీజీ పరీక్షలు వాయిదా పడ్డాయి. పరీక్షల నిర్వహణకు విశ్వవిద్యాలయాల నిధుల సంఘం(యూజీసీ) ఇటీవల కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. వీటిని అనుసరిస్తూ అన్ని వర్సిటీల కళాశాలలు, అనుబంధ కళాశాలలకు కలిపి ఒకే పరీక్షల షెడ్యూల్‌ను రూపొందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. జులై మొదటి వారం నుంచి పరీక్షలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. డిగ్రీ పరీక్షలతోపాటే పీజీ పరీక్షలు నిర్వహిస్తారు. ఆగస్టులో మూల్యాంకనం చేపట్టనున్నారు. డిగ్రీ రెండు, మూడు ఏడాదిలోకి వచ్చే విద్యార్థులకు ఆగస్టులో తరగతులు ప్రారంభిస్తారు. కొత్తగా ప్రవేశాలు పొందిన(మొదటి సంవత్సరం) విద్యార్థులకు సెప్టెంబరులో తరగతులు మొదలవుతాయి.