• facebook
  • whatsapp
  • telegram

జులైలో ట్రిపుల్‌ ఐటీ విద్యార్థులకు పరీక్షలు

* ట్రిపుల్‌ఐటీ డైరెక్టర్‌ గోపాలరాజు
నూజివీడు, న్యూస్‌టుడే: రాజీవ్‌ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం పరిధిలోని ట్రిపుల్‌ ఐటీల తుది పరీక్షలు జులైలో నిర్వహించనున్నట్లు కృష్ణా జిల్లా నూజివీడు ట్రిపుల్‌ ఐటీ డైరెక్టర్‌ ఆచార్య ఎస్‌ఎస్‌ఎస్‌వీ గోపాలరాజు తెలిపారు. లాక్‌డౌన్‌ సమయంలో ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించగా..95 శాతం మందే హాజరయ్యారని, నెట్‌ తదితర సమస్యల వల్ల మిగిలిన విద్యార్థులు పాల్గొనలేకపోయారని చెప్పారు. సిలబస్‌ దాదాపు పూర్తయిందన్నారు. ఆన్‌లైన్‌ తరగతులకు హాజరుకాని వారికి ప్రత్యేక తరగతులు నిర్వహించి విద్యా సంవత్సరం కోల్పోకుండా చూస్తామన్నారు. పరీక్షలు ఏ విధానంలో నిర్వహించాలనే విషయమై అధికారులు సమాలోచనలు చేస్తున్నారని చెప్పారు. కులపతి ఆచార్య కేసీ రెడ్డి ఆలోచన మేరకు క్యాంపస్‌లోనే బ్యాచ్‌ల వారీగా పరీక్షలు నిర్వహించే అవకాశం ఉందన్నారు. ఉద్యోగ అవకాశాలు కోల్పోకుండా ఇంజినీరింగ్‌ చివరి సంవత్సరం విద్యార్థులకు, బ్రాంచ్‌లు కేటాయించాల్సిన నేపథ్యంలో పీయూసీ-2 విద్యార్థులకు తొలుత పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. కొత్త విద్యా సంవత్సరం తరగతులు ఆగస్టు 1 నుంచి ప్రారంభమవుతాయన్నారు. సెప్టెంబరు తర్వాతే కొత్త విద్యార్థులకు తరగతులు ప్రారంభమవుతాయని చెప్పారు.