• facebook
  • whatsapp
  • telegram

‘కన్వీనర్‌’ కోటా ప్రవేశాలకు ఒప్పుకోం

* యాజమాన్యాల అసోసియేషన్‌
ఈనాడు, అమరావతి: పీజీ వైద్య, దంత వైద్య విద్యలో ఒకే తరహా ఫీజుల విధానాన్ని అమలుచేయాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రైవేట్‌ మెడికల్‌ అండ్‌ డెంటల్‌ కళాశాలల యాజమాన్యాల అసోసియేషన్‌ డిమాండ్‌ చేసింది. లేనిపక్షంలో కన్వీనర్‌ కోటాలో విద్యార్థులను చేర్చుకోబోమని వెల్లడించింది. ఈ విషయమై ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి లేఖ రాసినట్లు సోమవారం తెలిపింది. ఇంజినీరింగ్‌, పాలిటెక్నిక్‌ విద్యలో కన్వీనర్‌, యాజమాన్య కోటా కింద ఒకే ఫీజు విధానాన్ని అమలు చేస్తున్నారని పేర్కొంది. అధిక శాతం రాష్ట్రాల్లో 85% సీట్లను ఒకే తరహా ఫీజుతో, మిగిలిన 15% సీట్లను ఎన్నారై కోటా కింద అధిక ఫీజులతో భర్తీ చేస్తున్నారని పేర్కొంది. 2018-2019 ఆర్థిక సంవత్సరంలో అన్ని రకాల ఖర్చులను, న్యాయస్థానాల ఆదేశాలను ఏపీ ఉన్నత విద్య, నియంత్రణ పర్యవేక్షణ కమిషన్‌ పరిగణనలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. విజ్ఞప్తులపై సానుకూలంగా స్పందించకుంటే ప్రభుత్వంతో కుదిరిన సీట్ల నిష్పత్తి కేటాయింపు ఒప్పందం నుంచి వైదొలుగుతామని చెప్పింది.